విశ్వగుణాదర్శచంపువు-సామాజికాధ్యయనం
డా|| చిలకమర్తి దుర్గాప్రసాద రావు
16వ
శతాబ్దానికి చెందిన సంస్కృతకవులలో వేంకటాధ్వరి సుప్రసిద్ధుడు. ఈయన పూర్తి పేరు
శ్రీమదరశాణిపాల వేంకటాధ్వరి. తండ్రి రఘునాథుడు. తల్లి సీత. ఈయన కాంచీనగరవాసి. రామానుజ
మతానుయాయి. వడగలై సంప్రదాయానికి
చెందినవాడు. ఈయన అప్పయ్యదీక్షితుని సోదరుని మనుమడగు నీలకంఠదీక్షితుని సహాధ్యాయి
అగుటచే ఈయన కాలం క్రీ||శ||1637 ప్రాంతంగా నిర్ణయించారు. ఈయన రచించిన విశ్వగుణాదర్శచంపువులో
ఆంగ్లేయుల ప్రస్తావన ఉండడం వల్ల కవి చాల ఆధునికుడని భావించవచ్చు. ఈయన సంస్కృతభాషలో
ఎన్నోకావ్యాలు రచించారు. ప్రస్తుతo అతని
గ్రంథాలలో విశిష్టస్థానాన్ని పొందిన విశ్వగుణాదర్శకావ్యంలో పొందుపరచిన
సామాజికాంశాల గురించి తెలుసుకుందాం.
కావ్యం స్వభావాన్ని బట్టి శ్రవ్యకావ్యం, దృశ్యకావ్యమని రెండు విధాలు.
శ్రవ్యకావ్యం మరల గద్యం, పద్యం, చంపువు
అని మూడు విధాలు. గద్యపద్యముల కలయికయే చంపువు . దండి ‘గద్యపద్యమయం కావ్యం చంపూరిత్యభిధీయతే’ అని చంపూప్రబంధలక్షణాన్ని నిర్వచించాడు. గద్యం అర్థప్రధానమైనది.
పద్యం అర్థరాగోభయప్రథానమైనది. గద్యగతమైన అర్థగౌరవాన్ని, పద్యగతమైన రాగప్రాథాన్యాన్నీ మేళవిస్తే అది అధికచమత్కారయుక్తమౌతుoదని
భావించడమే చoపూప్రబంధరచనకు
కారణమని చెప్పుకోవచ్చు. అంతేగాక ఈ కావ్యం
వర్ణనానుగుణ్యం గల అనేకగద్యపద్యాలతో నిండి
భిన్నరుచులు గల గద్యపద్యపాఠకులిరువురకు ఆనందాన్ని కల్గిస్తుంది .
ఈ గ్రంథంలో 1113 గద్యపద్యాలున్నాయి. ఇందులో సూర్యవర్ణన మొదల్కొని
రాజసేవకవర్ణన వరకు సుమారు ఏబది వర్ణనలున్నాయి. ఈ గ్రంథంలో విశ్వావసువు, కృశానుడు
అనే ఇద్దరు గంధర్వులు చరచారాత్మకమైన ఈ ప్రపంచాన్ని చూడాలనే కోరికతో విమానంలో బయలుదేరతారు. అనేక దృశ్యాలను
చూస్తూ ఉంటారు. కృశానుడు దోషైకదృక్కు. అందువల్ల
అందరిలోనూ అన్నిటిలోనూ తప్పులు వెదుకుతూ ఉంటాడు. విశ్వావసువు గుణగ్రాహి.
అతడు కృశానుడు చేసిన ఆక్షేపణలకు సరైన సమాధానాలిస్తూ అందరిలోనూ, అన్నిటిలోనూ గల సుగుణాలను
ప్రశoసిస్తూ ఉంటాడు. ఈ విధంగా గ్రంథమంతా వారిరువురి
సంభాషణలతో నిండి ఉంటుంది. వారి సంవాదం ద్వారా కవి ఆ నాటి సామాజికపరిస్థితులను, సాంఘిక
ఆచారాలను, భౌగోళిక అంశాలను, తీర్థక్షేత్ర మాహాత్మ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు. ఒకవిధంగా ఈ గ్రంథం
ఆనాటి భారతదేశ సాంఘిక,సామాజిక,భౌగోళికపరిస్థితులకు దర్పణమని చెప్పవచ్చు. ఇంతటి
సామాజికదృక్పథం గల కావ్యం ఆధునిక సంస్కృతకావ్యాల్లో మరొకటి లేదని చెప్పొచ్చు. ఈ
కావ్యం చoపూసాహిత్యచరిత్రలోనే అపూర్వసృష్టి . ఇందులో ఆసేతుహిమాచలo భారతదేశం వర్ణింపబడిoది
కాశి, అయోధ్య, జగన్నాథం, కంచి,
శ్రీరంగం మొ|| పుణ్యక్షేత్రాలు; గంగ, యమున, పినాకిని, కావేరి, తామ్రపర్ణి మొ||
పుణ్యనదులు; బదరిక మొ|| పుణ్యాశ్రమాలు; అంగ, వంగ, కళింగ, ఘూర్జర, ఆంధ్ర,
మహారాష్ట్ర, చోళ, పాండ్య, కర్ణాటదేశాలు; తంజావూరు, కంచి, చెన్నపట్టణం మొ||నగరాలు;
శ్రీ రామానుజ, వేదాంతదేశిక, శఠకోపయతీశ్వరుల పుణ్యకథలు వర్ణింపబడ్డాయి. అంతేగాక అనేక
ప్రాoతాలు, ప్రజలు, ఆచారవ్యవహారాలు, వేషభాషలు, జీవనవిధానం కళ్ళకు కట్టినట్లుగా
వర్ణించాడు కవి. మొత్తంమీద ఈ కావ్యం కవియొక్క అపూర్వలోకానుభవానికి ఒక దర్పణంగా
కనిపిస్తుoది. కవి సమాజoలో అంతర్భాగమే కాబట్టి కావ్యాల్లో
సమకాలీనసామాజికపరిస్థితులు ఎంతో కొంత ప్రతిఫలింపక తప్పదు. అందులోను ఈ కావ్యo యొక్క
ధ్యేయo కేవలo సామాజిక పరిశీలనమే కాబట్టి కవి సమాజాన్ని దర్శించిన తీరు సహజరమణియoగా
కన్పిస్తుంది. సమాజం గుణదోషాలమిశ్రమo. పండితుడైనవాడు గుణాలను స్వీకరించి దోషాలను పరిహరించాలి.
ఈ గ్రంథoలో కవి కృశాను, విశ్వావసువుల సంభాషణద్వారా సమాజంలోని గుణదోషాలను రెంటిని
పరిశీలించాడు. గుణదోషాలనేవి వ్యక్తి యొక్క దృష్టిభేదం వల్ల ఏర్పడినవే గాని
వాస్తవాలు కావనియు, పండితుడైన వాడు గుణపక్షపాతియై దోషముల యెడ ఉదాసీనత వహి౦చాలనేది కావ్యరచనోద్దేశoగా కన్పిస్తుంది.
ఈ కావ్యoలో కవి భూలోకాన్ని
సకలపురుషార్థసాధనానుష్ఠానభూతoగా వర్ణించాడు. దీన్నిబట్టి ధర్మార్థకామమోక్షాలు మానవజీవితప్రధానలక్ష్యాలని
కవి సూచించాడు. కవి కాశీనగరాన్ని వర్ణిస్తూ అందలి పురుషులు షడ్రసోపేతమైన ఆహారాన్ని
భుజిస్తూ, కాముకలగు స్త్రీలతో స్వేచ్ఛగా విహరిస్తున్నారని, వారట్టి దుష్కృత్యాలు చేస్తున్నప్పటికిని
మరణించిన తరువాత శివసాయుజ్యాన్నే పొందుతున్నారని కాశీవాసఫలితాన్ని ప్రశంసించాడు. కర్ణాటదేశo
గురించి చెబుతూ అందలి సన్యాసులు శిఖాయజ్ఞోపవీతాలను, గాయత్రిని త్యజించి, సుఖలాలసులై
పల్లకీలలొ అన్నిదేశాలు సంచరిస్తూ ధనాన్ని
సంపాదిస్తున్నారని, అది యతి ధర్మానికి విరుద్ధమని కృశానుని మాటల్లో వ్యక్తం
చేస్తాడు. విశ్వావసువు దానికి సమాధానoగా
ధర్మసంగ్రహార్ధo దేశాటన చేయడం తప్పు కాదని,
దేశాటనకై పల్లకీలనెక్కడం కూడ దోషo కాదని, భగవత్సమర్పణకై ద్రవ్యార్జన చేయడం కూడ
తప్పు కాదని సమర్థిస్తాడు. అలాగే కవి అయోధ్యానగరాన్ని వర్ణిస్తూ కృశానుని మాటలద్వారా
రాముని గుణముల యందు దోషారోపణచేయగా విశ్వావసువు రాముని పితృభక్తిని, సత్యపరాక్రమత్వాన్ని,
ధర్మతత్పరతను ప్రశంసిస్తాడు. వేరొక సందర్భoలో కవి వైదికమతసంప్రదాయభేదాలను సునిశితoగా
విమర్శించాడు. ఘూర్జరదేశాన్ని వర్ణిస్తూ అచ్చటి యువకులు వాణిజ్యoలో నిపుణులని ప్రశంసించాడు.
మహారాష్ట్రదేశం స్వర్గతుల్యమని పేర్కొన్నాడు. ఆంధ్రదేశo సముద్రo వలె విస్తారమైoదని,
సర్వసమృద్ధమైoదని కీర్తించాడు. .కర్ణాటకదేశాన్ని వర్ణిస్తూ ఆ దేశం అందమైన ఉద్యానవనాలతో
నిండిన నగరములతో కన్నులపండువుగా ఉన్నదని వర్ణిస్తాడు. ఈ విధoగా కావ్యం సమాజంలోని
గుణదోషాలను పేర్కొంటూ దూషణభూషణాత్మకoగా సాగుతుంది.
కవి శేషశైలాన్ని వర్ణిస్తూ ఆ కొండపై నివసించు శ్రీ వేంకటేశ్వరస్వామి, భక్తులు
తమ కోరికలు నెరవేరుటకు మ్రొక్కగా వారి
కోర్కెలను నెరవేర్చి, వారు కానుకలు సమర్పించనిచో భయపెట్టి వడ్డీతో సహా వసూలు చేస్తున్నాడని
కృశానుని మాటలలో విమర్శిస్తాడు. విశ్వావసువు దానికి సమాధానంగా ఆ స్వామి లక్ష్మికి
భర్తయని, సహస్రవసువునకు(సూర్యుడు)నివాసస్థానమని, కువలయపతి(రాజు/చంద్రుడు)కి మఱది యనియు,
ఈవిధoగా స్వామి సర్వసమృద్ధుడైయుండియు భక్తుల ద్రవ్యములను గ్రహించుట వారి
ననుగ్రహించుటకు మాత్రమే అని సమర్ధిస్తాడు. ఈ కావ్యoలో కవి స్థలమాహాత్మ్యాన్ని
వర్ణిస్తూ అనేకస్థలపురాణవిశేషాలను ప్రదర్శించాడు.
కవి సందర్భోచితoగా అనేక
సామాజికధర్మాలను, నియమాలను పేర్కొన్నాడు. సోమరిని గూర్చిచెబుతూ అతడు ఎల్లప్పుడు
ఏపని చేయక, స్త్రీలంపటుడై, ఇంటిలోనే నిద్రపోతూ ఉంటాడని, అట్టివాడు ధనాన్ని
సంపాదించలేడని విమర్శిస్తాడు.
వ్యాపారంతర ముత్సృజ్య వీక్షమాణోవధూముఖo
యో గృహేష్వేవ నిద్రాతి
దరిద్రాతి స దుర్మతి:
కవి ఈ శ్లోకం ద్వారా దారిద్ర్యానికి సోమరితనమే ప్రధానహేతువని స్పష్టం
చేశాడు. ఇతరుల ధనంకోసం ఆశపడేవాడు నాశనమౌతాడని కవి ఈక్రింది శ్లోకం ద్వారా చమత్కరించాడు.
“పరవిత్తజిహీర్షయాప్రవృత్త; పిశునస్తు స్వయమేవ నాశ మేతి
సులభశ్శలభస్య కిం నదాహ: పృధుదీపగ్రసనాయ జ్రుoభితస్య”
కవి అరణ్యాలను వర్ణిస్తూ అవి అనేకపుష్పఫలాదులకు నిలయాలని, ధనవ్యయంలేకుండానే
ఆసంపదలను అనుభవిoచవచ్చని అరణ్యాల్లో నివసించువారి అదృష్టం వర్ణనాతీతమని ప్రశoసించాడు.
దీనివల్ల అడవుల గొప్పదనo వెల్లడి అవుతోంది.
కవి ఆనాటి కొంతమంది
వైద్యులను వర్ణిస్తూ వారు రోగియొక్క అనారోగ్యానికి
కారణం తెలుసుకోలేక సహిoపలేనట్టి కషాయాలతోను, లేహ్యాలతోను, రోగుల పొట్టలు నింపుతూ
యమభటుల వలె ప్రాణాలను, ప్రాణాలతో బాటుగా
ధనాన్ని గూడ అపహరిస్తున్నారని విమర్శించాడు. అంతేగాక ఉపవాసములచే నయమైన రోగాల్ని తమ మందులచే నయమైనట్లుగా చెప్పి నమ్మించి రోగులనుండి
బలవంతoగా ధనం వసూలు చేస్తున్నారని విమర్శించాడు. ఇటువంటి కుహనా వైద్యులు ప్రస్తుతసమాజంలో
కూడ చాల మంది లేకపోలేదు.
కవి ప్రాచీన, ఆధునిక విద్యావిధానాల్లో గల మౌలికమైన
భేదాలను విశ్లేషిస్తూ పూర్వకాలంలో ఉపాధ్యాయులు శిష్యులను చాల కాలం పరీక్షించి,
వారి సేవలనందుకొని, సంతోషంగా విద్య నేర్పేవారని, నేడు ఉపాధ్యాయులు
విద్యార్దులనుండి తమకు కావలసిన ద్రవ్యాన్ని
రాబట్టుకునేఁదుకు అయోగ్యులను కూడ శిష్యులుగా స్వీకరిస్తున్నారని సునిశితంగా
విమర్శించాడు.
సమ్యక్ శిష్యజనం పరీక్ష్య బహుభి: సంవత్సరైరుత్సుకం
శుశ్రూషాభిరుపాదిశన్ ప్రముదితా: పూర్వే భువీతి శ్రుతం
ఆరాధ్యేష్టసమర్పణైరావినతానాచార్య ఏవాదరా
దర్థై: భూరితమై: ప్రసహ్య లభతే శిష్యాన్ శ్రమేణాధునా
వేంకటాధ్వరి ఈ కావ్యంలో ప్రదర్శించిన గుణదోషాలు సార్వకాలికాలు,
సార్వదేశికాలున్ను. సజ్జనుడైన వాడు గుణాలను స్వీకరిoచాలే గాని దోషాల్ని
ఎత్తిచూపరాదని విశ్వావసువు కృశానునితో అంటాడు. అంతేగాక లోకం దోష కలుషితమైనప్పటికి గుణవంతులు
కూడ ఉన్నారని వారే అందరికి ఆదరణీయులని స్పష్టం చేస్తాడు. కృశానుడు విశ్వావసువుతో
తాను చేసిన దోషారోపణ కేవలం గుణ సమృద్ధికే గాని దోషాలనెంచడానికి కాదని, అది సిద్దాంతాన్ని
బలపరచడం కోసం చేసిన పూర్వపక్షం మాత్రమేనని సమాధానం చెబుతాడు.
ఈవిధoగా గ్రంథమంతా మానవసమాజంలోని గుణదోషాల్ని విశ్లేషించి గుణాలకు ఆదర్శమై “విశ్వగుణాదర్శము” అనే సార్థకనామాన్ని పొoదింది.
అంతేగాక ఆదర్శం అంటే అద్దం. అద్దం ఏ విధంగా మనలో గల గుణదోషాలను చూపిoచి దోషాలు సవరించుకోడానికి సహకరిస్తుoదో అదే
విధంగా ఈ కావ్యం సమాజం లోని గుణదోషాలను ఎత్తి చూపడం ద్వారా
దోషాల్ని తొలగించుకోడానికి సహకరిస్తుoదనడంలో ఎటువంటి సందేహం లేదు.
********
No comments:
Post a Comment