బద్ధకం
పూర్వకాలంలో ఒక రాజుండేవాడు. ఆయన తన ఆస్థానంలో పండితుల్ని కవుల్ని గాయకుల్ని పోషిస్తూ ఉండేవాడు. వాళ్లతో బాటుగా బద్ధకస్థుల్ని కూడ పోషించాలనే కోరిక ఎందుకో ఆయనకు కలిగింది. ఒకళ్లో ఇద్దరో లేక ముగ్గురో తప్ప ఎవరుంటారులే వాళ్లని పోషించడం పెద్ద కష్టం కాదులే
అనుకున్నాడు పాపం . చాటింపు కూడ వేయించాడు . కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. వందలకొద్దీ దరఖాస్తులు పెట్టుకున్నారు . అందరికి ఇవ్వడం సాధ్యం కాదు. ఎవర్ని ఎంపిక చెయ్యాలో ఎవర్ని ఎంపిక చెయ్య కూడదో ఆయనకు తెలియలేదు. ఎందుకంటే దానికెటువంటి నియమనిబంధనలు ముందుగా ఆయన పొందుపరచి ఉంచలేదు. అందువల్ల వచ్చిన వాళ్లందరిని చేర్చుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఆస్థానమంతా ఇంచుమించు వీళ్లతోనే నిండిపోయింది. పండితుల కన్న, కవులకన్న, కళాకారులకన్న బద్ధకస్థుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. ఆయనకిదొక పెద్ద సమస్యగా మారింది. ఏమీ చెయ్యలేక తన బాధ మంత్రికి విన్నవించుకున్న్నాడు. మంత్రి రాజుతో మహారాజ! మీరేమీ కంగారుపడకండి అసలైన బద్ధకస్థులెవరో నేను తేలుస్తాను అన్నాడు . ఎలా నిర్ణయించగలవయ్యా అందరూ బద్ధకస్థులుగానే ఉన్నారు నిర్ణయించడం అంతతేలిక కాదు అన్నాడు మహారాజు.
. మీకెందుకు అలా చూస్తో ఉండండి. మీ సమస్య నేను క్షణంలో పరిష్కరిస్తాను అన్నాడు మంత్రి. మరునాడు వాళ్లందరికి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు. బద్ధకించకుండ అతికష్టం మీద అందరూ హాజరయ్యారు. సభ కిక్కిరిసిపోయి ఉంది. వేదికపై మహారాజు కూర్చున్నారు. మంత్రి సభనుద్దేశించి ప్రసంగిస్తూ " ఓ బద్ధకవరేణ్యులార! మీకందరికి నమస్కారం. ఈ రోజు మన మహారాజు ఒక అమూల్యమైన వజ్రాల హారాన్ని మీకు
బహూకరిండానికి ఈ సభ ఏర్పాటు చేశారు. కావలసిన వారు చేతులెత్తండి " అన్నాడు. అంతే అందరు చేతులెత్తేశారు ఒక్కడుతప్ప. వాడు కుర్చీలో కూర్చుని కునుకుపాట్లు పడుతున్నాడు. మంత్రి స్వయంగా వాడి దగ్గరకెళ్లి హారం చూపించి ' ఏమయ్యా! మహారాజు ఇంతటి అమూల్యమైన కానుక ఇస్తానంటే చేతులెత్తవు . నీకు అక్కరలేదా " అన్నాడు. దానికి వాడు అతి కష్టంగా "నాకు కావాలి. అక్కరలేకపోవడమేమిటి " అన్నాడు. నువ్వు మరెందుకు చేతులెత్తడం లేదు? అనడిగాడు మంత్రి . చేతులెత్త డానికి బద్ధకంగా ఉంది
అని సమాధానం చెప్పాడు వాడు. చూశారా! మహారాజా! ఇతనే అసలు సిసలైన బద్ధకస్థుడు. మిగిలిన వారినందరిని పంపించెయ్యండి. ఇతన్నే పోషి౦చండి. ఇతడే నిజమైన బద్ధకస్థుడు' అన్నాడు . సమస్య తీరిపోయింది.
సరే ఆ సంగతలా ఉంచుదాం. పూర్వం రోజులు వేరు. బద్ధకస్థులు కూడ ఎలాగోలాగ బ్రతికేసేవారు. కాని ఇప్పటి పరిస్థితులు వేఱు. బద్ధకస్థుడు ఏదీ సాధించలేడు. మానవుని ప్రగతికి ఆఱు అవరోధాలున్నాయని విష్ణుశర్మ పంచ తంత్రంలో పేర్కొనడం మనకందరికి తెలిసిన విషయమే. వాటిలో మొదటిది బద్ధకం. రెండోది పరస్త్రీ వ్యామోహం, మూడోది రోగం, నాలుగోది ఒకే ప్రాంతాన్ని అంటిపెట్టుకుని ఉండిపోవడం, ఐదోది లభించే ధనం సరిపోయినా సరి పోకపోయినా ఎలాగోలాగ
బ్రతికేయడం. ఆఱోది పిరికిదనం.
( ఆలస్యం స్త్రీసేవా సరోగతా జన్మభూమివాత్సల్యం
సంతోషో భీరుత్వం షడ్వ్యాఘాతా: మహత్వస్య )
బద్ధకం రెండు రకాలు . ఒకటి శారీరకం . రెండు మానసికం . శారీరకమైన బద్ధకం కన్నా మానసికబద్ధకం చాల ప్రమాదకరం . ఈ రెండురకాల
బద్ధకాలకు మనిషి దూరంగా ఉంటే ప్రగతి లేకుంటే అధోగతి.
No comments:
Post a Comment