Saturday, January 16, 2016

నన్నయ్య వృత్తౌచిత్యం
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
నాటివరకు రాతిపలకలపైన, రాగిపలకలపైన పడియున్న ఆంధ్ర సరస్వతికి కావ్యకంచుకాన్ని తొడిగిన కీర్తి నన్నయ్య గారికే దక్కింది. ఆయన ఆంధ్ర కవిత్వవిశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడున్ను.
ఆయన మహాభారతావతారికలో తన కవితారీతులను వివరిస్తూ -
సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకలితార్థయుక్తి లో
నారసి మేలునానితరులక్షరరమ్యత నాదరింప నా
నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెను౦గునన్ మహా
భారతసంహితారచనబంధురుడయ్యె జగద్ధితంబుగన్ 
అని చెప్పడం వల్ల ఆయన కవితలో ప్రసన్నకథాకలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థసూక్తినిధిత్వ౦ అనే లక్షణాలున్నాయని తెలుస్తో౦ది. ఇక ఆయన కవితలో ఉన్న మరో విశేషం వృత్తౌచిత్యం . అంటే ఏ సందర్భంలో ఏ వృత్తం ప్రయోగించాలో  ఆ సందర్భంలో ఆ వృత్తాన్ని   ప్రయోగి౦చడం. సంగ్రహంగా కొన్ని పరిశీలిద్దాం.
ఉదంకోపాఖ్యానంలో ఉదంకుడు సర్పరాజులను స్తుతించే ఘట్టంలో కవి ఉత్పలమాల, చంపకమాలలను ప్రయోగించడం ఒక విశేషం. ఉత్పలాలు ఉదంకుని భక్తిని,  చంపకాలు పాములకు వాటిపట్ల గల అనురక్తిని సూచిస్తున్నాయి. అలాగే దుష్యంతుడు కణ్వమహాముని ఆశ్రమంలో ప్రవేశించే ఘట్టంలో కవి మానిని, కవిరాజవిరాజితం అనే రెండు వృత్తాల్లో ఆశ్రమవర్ణన చేశారు.
మానిని:
 ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు   ఠావుల జొంపములం
బూచిన మంచి యశోకములన్ సురపొన్నల (బొన్నల గేదగులం
గాచి బెడంగుగ ( బండిన యా సహకారములం గదళీ తతులం
జూచుచు వీనులకిoపెసగెన్ వినుచున్ శుకకోకిల సుస్వరముల్.
కవిరాజవిరాజితం:
చనిచనిముందటనాజ్యహవిర్ధృతసౌరభధూమలతాతతులం 
బెనగొని మ్రాకులకొమ్మలమీద నపేతలతాంతములైనను బా
యని మధుపప్రకరంబుల(జూచి జనాధిపుడంత  నెఱిoగె తపో
వనమిది యల్లదె దివ్యమునీంద్ర నివాసము దానగునంచునెడన్

ఈ రెండు వృత్తాలు వాడడం ద్వారా దుష్యంతుడు అభిమానవతి (మానిని) యైన ఒక యువతిని చూస్తాడని, ఆమె సామాన్యయువతి కాదని పక్షి రాజులచే పోషి౦పబడిందని (కవిరాజవిరాజిత) సూచితమౌతోంది. అంతే కాకుండా మరో విశేషముంది . మానిని లోని మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే కవిరాజవిరాజితం అవుతుంది. దీని ద్వారా ఒక్కరిద్దరౌతున్నారనే సూచన కూడ కనిపిస్తోంది.  
అదే విధంగా ఆదిపర్వం పంచమాశ్వాసంలో పాండురాజు, మాద్రి ఏకాంతంగా నివసిస్తున్న వనప్రదేశాన్ని నన్నయ్య గారు రెండు లయగ్రాహి వృత్తాల్లో వర్ణించారు. అవేంటో చూద్దాం :    
* కమ్మని లతాంతములకుమ్మొనసివచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ములెసగం జూ
తమ్ములలసత్కిసలయమ్ములసుగంధి ముకుళమ్ములను నానుచుముదమ్మొనరవాచా
లమ్ములగు కోకిలకులమ్ముల రవమ్ము మధురమ్మగుచువిన్చె ననిశమ్ము సుమనో భా
రమ్ముల నశోకనికరమ్ములును చంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్ ( ఆది /పంచమ/138)
చందనతమాలలతలందు నగరుద్రుమములందు గదళీవనములందు లవలీ మా
కందతరుషండములయందు ననిమీలదరవిందసరసీవనము లందు వనరాజీ
సందళితపుష్పమకరందరసముం దగులుచుందనుపు సౌరభమునొంది  జనచిత్తా  నందముగ బ్రోషితులడెందములలoదురగమందమలయానిలమమందగతివీచెన్ ( ఆది/పంచమ--139)
సాధారణంగా లయగ్రాహి వృత్తం అంత ప్రసిద్ధమై౦దేమీ కాదు. ఒక వేళ ప్రసిద్ధి కలదే అయినా, నన్నయగారికి ఆవృత్తం చాల ఇష్టం అనుకున్నా ఆయన  ఒక వృత్తంలో వర్ణన చేయవచ్చు . లేదా మూడో నాలుగో లేదా ఆపైన మరెన్నో   వృత్తాల్లో వర్ణి౦చొచ్చు. కాని ఆయన కేవలం రెండు మాత్రమే స్వీకరించారు . అదే విశేషం . లయగ్రాహి అంటే నాశనాన్ని కలిగించేది . ఇక్కడ ఈ రెండు లయగ్రాహివృత్తాలు అతిత్వరలో సంభవి౦చబోయే పాండురాజ, మాద్రుల మరణాన్ని సూచిస్తున్నాయి .      
ఇక కౌరవులు, పాండవులు గురుదక్షిణార్థం ద్రుపదుణ్ణి పట్టుకోడానికి వెళ్లి నప్పుడు వారి సమరోత్సాహాన్ని ఉత్సాహవృత్తంలో నన్నయ మహాకవి వర్ణించారు.
ఉత్సాహవృత్తం:
ఏల దీనినెడయు జేయ నీ క్షణ౦బ యేగి పాం
చాలు బట్టి తెత్తమధిక శౌర్య లీలమెరయగా
బోలుననుచు బెరిగి రాజపుత్రులరిగి యార్చి పాం
చాలుపురము ముట్టికొనిరసంఖ్యబలసమేతులై ( ఆది /౬/౬౫).


ఈ వ్యాసంలో స్థాలీపులాకన్యాయంగా కొన్ని అంశాలే పొందు పరిచాను . మిగిలినవి చదువరులు స్వయంగా నన్నయ్యగారి సాహిత్యాన్ని చదివి గ్రహి౦చగలరు.  

No comments: