Saturday, December 7, 2013

వృక్షాయ తస్మై నమ:


వృక్షాయ తస్మై నమ:
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
/౧౦౬, ప్రేమనగర్, దయాల్బాగ్, ఆగ్రా
 
భారతీయసంస్కృతిలో వృక్షానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వృక్షేభ్యో హరికేశేభ్యశ్చ నమోనమ: అని పచ్చని చెట్లను పరమేశ్వరునిగా భావించింది వేదం . "ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష:” అని మొక్కలనుంచి అన్నం, అన్నం నుంచి మనిషి పుడతాడని చెబుతోంది వేదం. నిజమే! మనం తినే అన్నం వీర్యంగా స్త్రీలో ప్రవేశించి మనిషిగా ప్రకటమౌతున్నాడు కదా! . కాబట్టి మనిషి పుట్టడం మొదలు మరణించేంత వరకు ఆ తరువాత కూడ చెట్టుమీదే ఆధారపడ్డాడు.
ఇక బౌద్ధమతం ప్రపంచానికి అందించిన వరం బోధిసత్త్వ సిద్ధాంతం. ఈ బోధిసత్త్వుడు బుద్ధునికంటే కొంచెం తక్కువ. బోధిసత్త్వుడే ఆ తరువాతిజన్మలో బుద్ధుడౌతాడు. కాబట్టి ఇంచుమించు బుద్ధుడే అన్నా అనొచ్చు . ' ప్రపంచంలో ఉన్న జీవులందరి కష్టాలు ఒకేసారి నాకు వచ్చినా నేనుభరిస్తాను వాళ్లంతా సుఖంగా ఉంటే చాలు' అనేది బోధిసత్త్వుని ఆశయం. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే కలికలుష కృతాని యాని లోకే మయి తాని పతంతు విముచ్యతాం హి లోక: అన్నది వారి సిద్ధాంతం. మానవనాగరికతలో ఇంత మహోన్నతంగా ఆలోచించిన వారు బహుశ ఎక్కడ మనకు కనిపించరు.
ఆ సంగతలా ఉంచితే ప్రతివృక్షాన్ని బోధిసత్త్వునితో పోల్చారు మనపెద్దలు.
ఓ వృక్షమా ! నువ్వు సువాసనలతో గాలిని. చిగురుటాకులతో జంతువుల్ని, బెరడుచే మునులను, పువ్వులతో తుమ్మెదల్ని, పండ్లనిచ్చి పక్షుల్ని, నీడనిచ్చి ఎండలో తపించే వారిని, కొమ్మలతో మదపుటేనుగులను సంతోషపెడుతున్నావు. ఈ విధంగా నీశరీరంలో ప్రతిభాగం పరుల సుఖానికే కేటాయింపబడి అంకితం అయ్యింది. నీవు నిజంగా బోధిసత్త్వపదవికి తగినదానవు. నీతో పోలిస్తే ఈ ప్రపంచంలో మిగిలినవారి జీవితం వ్యర్థమే. నీ జీవితమే ధన్యం సుమా! అందుకోవమ్మ శతకోటి వందనాలు.
ఆమోదైర్మరుతో మృగ: కిసలయైర్లంబైస్త్వచా తాపసా:
పుష్పై: షట్చరణా : ఫలై : శకునయ:ఘర్మార్దితా : ఛాయయా
స్కంధై : గంధగజాశ్చ విశ్రమరుజా : శశ్వద్విభక్తాస్త్వయా
ప్రాప్తస్త్వం ద్రుమ! బోధిసత్త్వపదవీం సత్యం కుజాతా : పరే
( వల్లభదేవునిసుభాషితావళి /౮౨౩)
ప్రతి చెట్టు ప్రగతికి మెట్టు. ఇదే మనం తెలుసుకోవలసిన గుట్టు

No comments: