Friday, December 20, 2019

రసజ్ఞత


రసజ్ఞ

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ఇతరపాపఫలాని శతాని వా
విలిఖ తాని సఖే చతురానన
అరసికాయ కవిత్వనివేదనం
శిరసి మా లిఖ మా లిఖ మా లిఖ

ఒక కవి, బ్రహ్మకు ఇలా మొరపెట్టుకుంటున్నాడు
ఓ చతురానన ! నా నొసటి మీద ఎన్నో పాప ఫలాలు వ్రాయి . నాకు ఎటువంటి అభ్యంతరం లేదు . అవన్నీ నేను భరిస్తాను . కాని రసికుడు కాని వాడికి నా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్య పరిస్థితిని నాకు కలిగించకు .
ఇది కాళిదాసు పద్యంగా చెబుతారు . ఇది కాళిదాసు పద్యం అయినా కాకపోయినా ఆ విషయం ప్రస్తుతానికప్రస్తుతం .

సాధారణంగా నిత్యజీవితంలో మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం . ఎన్నో నాటకాలు, సినిమాలు చూస్తూ ఉంటాం .  పుస్తకాలు చదువుచున్నంత  సేపు  నాటకాలు,  సినిమాలు చూస్తున్నంత సేపు అపరిమితమైన ఆనందాన్ని పొందుతాం . మనం చదివేవి , చూసేవి  అన్ని మనకు  రోజు జీవితంలో  ఎదురయ్యేవే కొత్తవేం కాదు . అవన్ని మనకు ఆనందం కలిగించవు  గాని అవే  పుస్తకాల్లో చదివినా తెరపై చూసినా  ఎంతో ఆనందం కలుగుతుంది . దీనికి కారణ౦ ఏమిటా అని ఆలోచిస్తే అవన్నీ అనుకరణలు, కల్పనలే అని తెలుస్తుంది . అందుకే imitation begets pleasure అన్నారు పెద్దలు. మనం అన్ని చూస్తూ ఉంటాం కవి మాత్రం చూసిన దాన్ని అక్షరబద్ధం చేస్తాడు . రసరాగ రంజితం చేస్తాడు . అందుకే దర్శనాద్వార్ణనాచ్చాథ  రూఢా లోకే కవి శ్రుతి: అన్నారు .
అంతే  కాకు౦డ  కవి సృష్టిలో అంతా ఆనందమయమే .
బాహ్య ప్రపంచంలో దు:ఖాన్ని కలిగించేవి, సంతోషాన్ని కలిగించేవి అని రెండు విధాలుగా ఉంటాయి . కాని  ఎటువంటివైనా సరే  కవి చేతిలో పడితే అవి ఆనందాన్నే కలిగిస్తాయి. ఒక వస్తువు అందంగా ఉన్నా , అసహ్యంగా ఉన్నా, భయంకరంగా ఉన్నా  , ప్రశాంత౦గా ఉన్నా , ఉన్నతమైన దైనా , నీచమైన దైనా ,  కవి కలం నుండి వెలువడితే అది రసపుష్టమై రమణీయంగానే కనిపిస్తుంది . అందుకే నాటకాల్లోను, సినిమాల్లోనూ  ఎన్నో విషాద సన్నివేశాలను మనం చూస్తున్నా అవి ఆనందానికే దారితీస్తాయి . ఇదే విషయం
     
రమ్యం జుగిప్సిత ముదార మథాపి నీచం
ఉగ్రం ప్రసాది గహనం వికృతం చ వస్తు
యద్వాప్యవస్తు కవిభావక భావ్య మానం
తన్నాస్తి యన్న రసభావముపైతి లోకే

అన్న ధనంజయుడనే   ఆలంకారికుని మాటల వల్ల మనకు తెలుస్తోంది ..
సాధారణంగా మనలో చాల మంది నదీతీరాలను ఆ నదుల్లో ప్రతిబింబించిన సూర్యబింబాన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం . మనం ఆనంది౦చడంతోనే  సరిపెట్టుకుంటాం . కవి అలా కాదు ఆ దృశ్యాన్ని అక్షర బద్ధం చేస్తాడు . ఒక కవి ఆ దృశ్యానికి స్పందించి ఎవరో గోదావరిలో ఎర్ర సిరా కలిపినారు అని  వర్ణించాడు . ఎంత అద్భుతం ఈ కల్పన.  గోదావరిలో సిరాకలపడ మేంటి? అని ఆలోచిస్తే స్వారస్యం తెలియదు . ఇది అర్థం చేసుకోడానికి  సహృదయత కావాలి. యేషాం కావ్యాను శీలనాభ్యాసవశాద్విశదీభూతే మనోముకురే వర్ణనీయతన్మయీభవనయోగ్యతా తే సహృదయ సంవాదభాజా: సహృదయా: అని మన పెద్దలు చెప్పారు . అంటే కొందరికి అనేక కావ్యాలు చదవడంవల్ల వల్ల  మనస్సు అనే అద్దం స్వచ్ఛంగా తయారవుతుంది . అపుడు ఏవిధంగా ఎదురుగా కనిపించే బొమ్మ అద్దంలో ప్రతిబింబిస్తు౦దో  అలాగే కవి వర్ణించే ప్రతిపాత్ర మనోభావాలు అతని హృదయంలో ప్రతిబింబిస్తాయి . అట్టివాడే సహృదయుడు . రసాస్వాదనకు అర్హుడు .
ఉదాహరణకు మనం ఒక సినిమా చూస్తూ ఉంటాం . అది సినిమా అని తెలుసు. ఆ నటుడు డబ్బుతీసుకుని నటిస్తున్నాడని కుర మనకు తెలుసు . హాలులో కరెంటు పొతే ఒక్క తెరమాత్రమే మిగులుతుందని తెలుసు కాని చూస్తున్నంత సేపు మనం పాత్రలతో లగ్నమై అనేక మనోభావాలకు లోనవుతాం . ఇదే సహృదయత . ఇటువంటి సహృదయత కలవారే నాటకమైనా సినిమా అయినా చూచి ఆనందించడానికి అర్హులు . కొంతమంది కి అది ఉండదు . వాళ్లకి సినిమా చూసే అర్హతలేదు డబ్బులున్నాయి కాబట్టి చూస్తున్నారు. అది వేరే విషయం . ధర్మదత్తుడనే  ఆలంకారికుడు రసతరంగిణి అనే గ్రంథంలో ఇలా అంటారు
సవాస నానాం  సభ్యానాం
              రసస్యాస్వాదనం భవేత్
నిర్వాస నాస్తు  రంగాంతే
              కాష్ఠ కుడ్యాశ్మ సన్నిభా:
వాసనారూపమైన సంస్కారం గల సహృదయుడే రసాస్వాదనకు అర్హుడు . అది లేని వారు కర్ర , రాయి , గోడలతో సమానులు . అని దాని అర్థం . రసికుడ కాని వాడు ఇంచుమించుగా అటువంటి వాడే . వాడు సినిమాహాలులో ఉండే కుర్చీతో సమానం . వీడు ticket కొని సినిమా చూస్తున్నాడు , కుర్చీ టికెట్టు లేకుండా చూస్తోంది . అదొక్కటే తేడా . అటువంటి వాడు కవిత్వాన్ని, మరిదేన్నీ ఆస్వాదించలేడు, ఆనందించలేడు . వాడికి కవిత్వం వినిపించడమంటే చెవిటివాని ముందు శంఖం ఊదడమే.   
                                 <><><><><>




No comments: