ఆచారాలు
–ఆంతర్యం
డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
1. ఉపవాసం
:- ఉపవాసం అనే పదానికి ఒక విశిష్టమైన అర్థం ఉంది .
‘ఉప’సమీపే
యో వాస: జీవాత్మ పరమాత్మనో:
ఉపవాస:
స విజ్ఞేయ: న తు కాయస్య శోషణం
అని
పెద్దలు చెప్పారు . దీన్ని బట్టి ఉపవాసం అంటే జీవాత్మ, పరమాత్మ సమీపంలో ఉండేటట్లు
చెయ్యడం . ఒక విధంగా ధ్యానంలో ఉండమని
తాత్పర్యం. ఆహారం కడుపునిండా తింటే అది సాధ్యం కాదు కాబట్టి స్వల్పంగా
తీసుకోవడం పరిపాటి. ఆహారం ఎక్కువగా తీసుకున్నవానికి అదేవిధంగా అసలు ఆహారం తిననివానికి యోగం
కుదరదని “నాత్యశ్నతస్తు
యోగోస్తి న చ యోగమనశ్నత:” అనే
మాటల్లో భగవానుడు సెలవీయడం మనకందరికీ
తెలిసిందే . మనం ముందుగా తిండి మానెయ్యడం ఆ తరువాత పదింతలు తినెయ్యడం ఒకే సారి ఈ రెండు తప్పులు చేస్తున్నాము . దైవధ్యానం కన్నా
సాయంకాలం తినబోయే వంటకాలపైనే ధ్యాస ఎక్కువ. దీనివల్ల
పారమార్థిక లాభం శూన్యమే అని చెప్పక తప్పదు. ఇది ఎవరికి వారు తెలుసుకోవాలి . ఎవరూ చెప్పేవిషయం కాదు.
2. జాగరణ
:- ఇక పగలంతా ఉపవాసం రాత్రి జాగరణ . జాగరణ అనే పదం ‘జాగృ’ నిద్రాక్షయే అనే ధాతువు (verbal root) నుంచి
పుట్టింది . నిద్ర తగ్గించుకుని మెలుకువగా ఉండడం ఆ పదానికర్థం . శివరాత్రికి జాగరణ
చేస్తాం . అంటే ఆ పవిత్రమైన రోజున రాత్రిపూట కూడ దైవ ధ్యానంలో గడపడానికి మన
పెద్దలు చెప్పిన మార్గం . కాని రాను రాను మెలుకువగా ఉండడమే జాగరణగా తయారైంది .
రాత్రంతా సినిమాలతోను ,ఆటలతోను గడిపేస్తున్నారు . దీనికి తగ్గట్టుగా ఒక
టిక్కట్టుపై రెండు సినిమాలు మూడు సినిమాలు చూపిస్తున్నారు .
3. కార్తీకవనసమారాధన:- పూర్వం మన సమాజంలో అందరు కలసి ఒక చోట భోజనం
చేసే మంచి సంప్రదాయాన్ని మన పెద్దలు కార్తీకవనసమారాధన పేరుతో ఏర్పరిచారు . అది ఈ
రోజుల్లో చాల విడ్డూరంగా మారిపోయింది . ఏ కులం వాళ్ళు ఆ కులం పేరుతో సంతర్పణలు
మొదలెట్టి సమాజాన్ని వ్యాకుల పరుస్తున్నారు . ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మా నాన్న గారు ఒక
పద్యం వ్రాశారు . ప్రస్తుతం అది ప్రస్తావించడం అప్రస్తుతం కాదు .
పేద ధనిక వర్గ భేదంబు విడనాడి
చేరి యొక్కచో భుజింపవలయు.
వర్ణ భోజనాలు వనభోజనాలౌనె
మరువబోకు చిలకమర్తి మాట .
(కీ || శే || చిలకమర్తి వెంకట సూర్యనారాయణ )
4. న మమ (నాది
కాదు)
నేనొకసారి ఒక
ఆశ్రమానికి వెళ్లాను . స్వామీజీ సమీపంలో ఒక చోట
కూర్చున్నాను . అక్కడ చాల మంది ఉన్నారు . ఒక ధనవంతుడు ఆ స్వామివారి దగ్గరకొచ్చి
నమస్కరించి కొన్ని పండ్లు సమర్పించాడు . అక్కడే కాస్సేపు కూర్చున్నాడు .
ఇంతలో భక్తులు అబిమానులు లేచివెడుతున్నారు. ఆయన ఒక్కొక్క పండు వారి చేతిలో
పెడుతున్నారు. ఈ ధనవంతుడు కూడ లేచి వెళ్ళబోతూ ఆయనకు నమస్క రించాడు. స్వామి ఆయన
చేతిలో కూడ ఒక పండు పెట్టారు . ఆయన ఆ పండ౦దు కుంటూ స్వామి ! ఇదేంటి
నా పండు నాకే ఇస్తున్నారు ? అన్నాడు .
దానికి స్వామీజీ
అది నీ పండు ఎలా అవుతుంది ? అని
ప్రశ్నించారు . అదేంటి స్వామి అవి నేను తెచ్చిన పండ్లేగా
నావి కాదంటారేమిటి అన్నాడు అమాయకంగా . ఓహో అలాగా!
అవి నువ్వు నాకు ఇవ్వనంతవరకే నీవి . నాకు ఇచ్చి౦ తరువాత
నీవి కావు పొమ్మన్నారు. కాని
అది ఆయనకు అర్థం కాలేదు . అపుడు ఇలా అన్నారు నాయనా ! ఏ వస్తువైనా మన
దగ్గరున్న౦త సేపే మనది మనం ఎవరికైనా దానం చేశాకా అది మనది కాదు. అది స్వీకరించిన
వారిదే . కాని కొంతమంది కొన్ని వస్తువులు ఇతరులకు దానం చేశాకా ఆ వస్తువులు నావేనని
అందరికి డప్పుకొట్టి చెప్పుకుంటూ ఉంటారు . ఇది అవివేకం .
ఈ నియమం
అన్నిటికి వర్తిస్తు౦ది. అమ్మాయికి పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపించాక కూడ
కొంతమంది ప్రబుద్ధులు అమ్మాయిని ఆసరాగా తీసుకుని వాళ్ళకు సంబంధించిన విషయాల్లో
తలదూరుస్తూ ఉంటారు వాళ్ళపై పెత్తనం , అజమాయిషి
చెలాయిస్తూ ఉంటారు . ఇది చాల తప్పు . అడిగినప్పుడు వారికి మంచి సలహాలిచ్చి ముందుకు
నడిపించడం తప్పులేదు గాని అన్ని విషయాలల్లోనూ తలదూర్చడం మాత్రం సమంజసం కాదు . చాల
వరకు వైవాహిక సంబంధాలు చెడిపోవడానికి ఇదొక ప్రధాన కారణం . కాబట్టి మనం
ఇతరులకిచ్చిన వాటిపై మమకారం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది
5. కాశీనగరదర్శనం
కాశీనగరాన్ని
సందర్శించినవారు తమకిష్టమైన రెండు
వస్తువులను వదిలెయ్యాలనే నియమం మన సంస్కృతిలో ఉంది . దానికి తగ్గట్టుగానే అక్కడకు
వెళ్ళిన వారు తమకు బాగా ఇష్టమైన పండో , కాయో
వదిలేసి వస్తూ ఉంటారు . ఇక జీవితంలో వాటిని ముట్టుకోరు . అంతా బాగానే ఉంది కాని ఈ
నియమం యొక్క ఉద్దేశ్యం ఒకటి, జరుగుతున్నది
మరొకటి . ఇక్కడ రెండు వదలాలి అంటే ‘అహం’కార
, ‘మమ’కారాలు అని అర్థం . ఇవి చాల
ప్రమాదకరమైనవి కాబట్టి వాటిని విడిచి పెట్టాలి . అంతేగాని కాయలూ, పువ్వులూ, పండ్లూ
కావు . అవి వదిలెయ్యడం వల్ల వచ్చే లాభమూ లేదు వదలక పోవడం వల్ల వచ్చే నష్టమూ లేదు .
ఇక
అన్ని దు:ఖాలకు మూలం నేను (అహం) అనే భావన . ‘తాను’ గా
ఉండే ఆత్మను మనం శరీర౦తో తాదాత్మ్యం పొంది౦చి కలగా పులగం చేసి ‘నేను’ అని
వ్యవహరిస్తున్నాం. నిద్రలో అహం
అనే భావన లేదు . ఆత్మ తనకు ‘తాను’ గానే
ఉంది . అందుకే ఏ దు:ఖమూ లేదు . ఈ గొడవంతా మెళుకువ వచ్చాకనే . ‘అహం’ వచ్చిన
వెంటనే ‘మమ’ (నాది)
అనే భావన తనంతట తానే వచ్చేస్తుంది. నేను -- నాది--- సమస్త ప్రపంచం . ఇదీ క్రమం . నిత్యజీవితంలో
మనకు మూడు స్థితులు ఉంటాయి . ఒకటి మెలకువ , రెండు
కల , మూడు నిద్ర. మెలుకువలో సుఖం
, దు:ఖం రెండు ఉన్నాయి .
అలాగే కలలో
కూడ సుఖం, దు:ఖం రెండు
కనిపిస్తున్నాయి . మంచి కలొస్తే సుఖం , పీడకల
వస్తే దు:ఖం . కాని నిద్రలో దు:ఖం లేదు సుఖం మాత్రమే ఉంది . మనకు మూడు
స్థాయిల్లోను సుఖం ఉంది , రెండు
స్థాయిల్లో మాత్రమే దు:ఖం ఉంది అంటే ఉన్నదసలు సుఖమే (ఆనందమే) దు:ఖం తెచ్చి
పెట్టుకున్నది . ఉదాహరణకి ఎవరికైనా ఒక వస్తువు పోయి౦దనుకో౦డి. అయ్యో !
పోయిందే అనుకుంటే దు:ఖం, పొతే పోయిందిలే మరోటి కొనుక్కోవచ్చు అనుకుంటే
సుఖం . ఒక పిల్లవాడు రోడ్డు మీద నుంచొని ఏడుస్తున్నాడు . ఆ దారిన వెడుతున్న ఒకాయన
ఎందుకేడుస్తున్నావయ్యా అని అడిగాడి . దానికి సమాధానంగా నా రూపాయి ఒకటి పడిపోయింది
అందుకే ఏడుస్తున్నాను అన్నాడు . అయ్యో! అలాగా ఇదిగో ఈ రూపాయి తీసుకో అని తన
దగ్గరున్న ఒక రూపాయిని తీసి ఇచ్చాడు . ఆ పిల్లవాడు ఆ రూపాయి తీసుకుని తన జేబులో
వేసుకుని మళ్లీ ఏడవటం ప్రారంభించాడు . దానికా వ్యక్తి మళ్లీ ఎందుకేడుస్తున్నావని
అడిగినప్పుడు అది కూడ ఉంటే నాకు రెండు రూపాయలయయ్యేవి కదా అని వాపోయాడట . సరే ఆ
సంగాతలా ఉంచుదాం . అసలు దు:ఖానికి మూల కారణం అహం. అందుకే ‘అహము
విడిచితే ఆనందమురా’ అన్నారు . ఈ ‘అహం’ రాగానే ‘మమ’ అనేది
వస్తుంది . అందుకే ఈ రెంటిని విడిచిపెట్టమన్నారు మన పెద్దలు . కాయలు , పళ్ళు కాదు .
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలున్నాయి . ఇవి విడమరిచి చెప్పేవాళ్ళు లేరు ఒకవేళ చెప్పినా వినే వాళ్ళు లేరు. నేటి సమాజ స్థితి గతులు వర్ణించే ఒక శ్లోకం ఉంది . అది ప్రస్తావించుకుని ఈ వ్యాసం ముగిద్దాం .
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలున్నాయి . ఇవి విడమరిచి చెప్పేవాళ్ళు లేరు ఒకవేళ చెప్పినా వినే వాళ్ళు లేరు. నేటి సమాజ స్థితి గతులు వర్ణించే ఒక శ్లోకం ఉంది . అది ప్రస్తావించుకుని ఈ వ్యాసం ముగిద్దాం .
ఒక సన్యాసి గంగా నదిలో స్నానం చెయ్యడానికి బయలు
దేరి గంగఒడ్డు చేరుకున్నాడు . ఆయనవద్ద ఒక రాగి చెంబు ఉంది . అది నీటిలో కొట్టుకు
పోతుందేమో అనే భయంతో దాన్ని ఇసుకలో పూడ్చిపెట్టి ఆనవాలు కోసం అక్కడ ఇసుకతో ఒక
లింగం తయారు చేశాడు . ఒక వ్యక్తి అది దూరం నుంచి గమనించాడు . గంగలో స్నానం
చెయ్యాలంటే ఇసుకతో లింగం చెయ్యాలి అనుకున్నాడు . తానూ ఒక లింగం తయారు చేశాడు . అది
గమనించిన వారందరూ కూడ ఎన్నో లింగాలు తయారు
చేశారు . కొంత సేపటికి ఆ సన్యాసి స్నానం చేసి వచ్చి చూస్తే అన్నీ లింగాలే అందులో
ఆయన చేసిన లింగం కనిపించలేదు . ఇలా అనుకున్నాడు .
“ గతానుగతికో
లోక: న లోక: పారమార్థిక:
గంగాసైకత లింగేషు నష్టం మే తామ్రభాజనం”
కాబట్టి “దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి” అనే
విధంగా కాకుండా ఏ పనైనా కొంత ఆలోచించి చేస్తే వ్యక్తికీ , సమాజానికి ,సంస్కృతికి
మేలు కలుగుతుంది . లేక పొతే వినాశనం తప్పదు.
<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>
No comments:
Post a Comment