Tuesday, April 9, 2013

నూతన తెనుగు సంవత్సర శుభాకాంక్షలు


ఉగాది శుభాకాంక్షలు
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
ఉత్పలమాల:
అంత వసంతమొప్పె నుదయాచలమందరుణుండు ప్రాచ్యది
క్కాంతనవారవిందమున క్రాలెడు కుంకుమ రీతి దోచె శా
కుంతములెల్లవీడె తమ గూండ్ల కొలంకులు తాము పద్మినీ
కాంతుని బిల్చురీతి నును గాడ్పుల బంపె కరంబు వేడ్కతోన్.
ఉత్పలమాల:
భూవలయంబులోని నలుపుం దొలగించెను స్వీయకాంతి ధా
రావళి చీకటుల్గిరి గుహాలయసీమలకేగె మేఘముల్
ఆవిరియయ్యె గాన వినయంబున కాకకులంబు సూర్యునిం
గావు మటంచు వేడుకొనెనా! యను భాతిగ 'కావు కావ'నెన్
సీసము:
భూలోకజనపాపపుణ్యముల్దెలియ శ్రీ
పతిపంప వచ్చిన ప్రతినిధియన
మైనాకుగననేగి మఱలెడు హిమశైల
రాత్సుతాధృతశిరోరత్నమనగ
పాతాలలోకాధిపతి శంభునర్చింప
గైకొన్న సౌవర్ణకలశమనగ
విరహిణీజనతాపహరణార్థమై వైద్య
గురువొసంగెడు రత్నగుళికయనగ

తేటగీతి: వారినిధిలోననున్న బంగారముబడ
బానలంబున కఱగి ముద్దయ్యెననగ
రమ్యమైనట్టి రత్నదర్పణము రీతి
భానుడుదయించె దేదీప్యమానుడగుచు.
తేటగీతి:
అట్టి భానుండు సర్వలోకైక హితుడు
పావనంబగు విజయాఖ్యవత్సరమున
భూజనులనెల్ల నిత్యము బ్రోచుగాక
ఆయురారోగ్యభోగభాగ్యములొసంగి.
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

No comments: