Sunday, July 27, 2025

భారతీయ సనాతన ధర్మంలో , అధర్మ భీతి, -పాపభీతి, మాత్రమే ఉన్నాయి గాని దైవ భీతికి స్థానం లేదు

 

భారతీయ సనాతన ధర్మంలో ,  అధర్మ భీతి, -పాపభీతి,  మాత్రమే ఉన్నాయి గాని   దైవ భీతికి స్థానం లేదు .

రచన : డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

భారతీయ సంస్కృతిలో దైవ భీతికి   స్థానం లేదు. దైవం పట్ల ప్రేమ ఉండడమే భారతీయ సంస్కృతి. ఈ ‘దైవ భీతి’ అనే విపరీత ధోరణి  పాశ్చాత్య సంస్కృతుల వలననే  మనకు సంక్రమించింది’   అని  శ్రీ అరవిందుల వారు  చెప్పారు. ఇక అనేక శతాబ్దాల పాటు పరాయి సంస్కృతులతో మిళితమైన మనకు ఈ జాడ్యం అంటుకుంది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, భారతీయ సనాతనధర్మంలో ‘అధర్మభీతి’ ‘పాపభీతి’ మాత్రమే ఉన్నాయి. అందువల్ల,  అధర్మం చెయ్యడానికి , పాపపుపని చెయ్యడానికి మాత్రమే  మనం భయపడాలి గాని;  దేవునికి భయపడ కూడదు . దేవుని ప్రేమించాలి . దేవుడు ప్రేమాస్పదుడు, ప్రేమ స్వరూపుడున్ను .      దీన్ని బట్టి, మనం   చెడ్డ పని చెయ్యడానికి భయపడాలి గాని, దైవానికి భయపడకూడదు. దైవానికి భయపడడం దైవాన్ని కించపరచడమే ఔతుంది.   నిజంగా ఆలోచిస్తే భయపెట్టే వాడు God అవడు, Dog మాత్రమే అవుతాడు .                  

ఇక  మనం, మన చుట్టూ ఉన్న కుటుంబాలను జాగ్రత్తగా పరిశీలిస్తే  పిల్లలకు తల్లి-దండ్రులపై ప్రేమ గల కుటుంబాలే సుసంపన్నంగా ఉన్నాయి , భయం గల కుటుంబాలు తాత్కాలికంగా బాగానే ఉన్నా ఆ తరువాత సర్వనాశనం అయ్యాయి. ప్రేమకు, భయానికి చాల వ్యత్యాసం ఉంది . ప్రేమ సహజమైనది , భయం కృతకమైనది.  ఇదే ప్రేమకు, భయానికి మధ్య గల తేడా . ఇంకా విడమరచి  చెప్పవలసిన అవసరం లేదు. ఆలోచిస్తే అదే తెలుస్తుంది .  ఇక మనకు భయం ఉండవలసింది అధర్మం పట్ల , అంటే తప్పు చెయ్యడానికి భయపడాలి . మనలో చాల మంది కొన్ని తప్పులు స్వయంగా చేస్తారు, కొన్ని తప్పులు ఇతరుల వత్తిడికి భయపడి చేస్తారు .

తప్పు ఏ విధంగానూ, చేయకూడడు అనేది భారతీయధర్మం .

ఇక,  మరో విషయం . సాధారణంగా ఉన్నత వర్గం వారు మంచి పనులు చేస్తారని తక్కువ జాతి వారు అంటే  తక్కువ స్థాయికి చెందినవారు  నీచపు పనులు చేస్తారని అనుకుంటూ ఉంటాం . ఇది కేవలం అపోహ మాత్రమే. ఉన్నతస్థాయికి చెందిన వారిలో చాల నీచులు ; నీచ స్థాయికి చెందిన  వారిలో చాల  ఉన్నతులు ఉంటారనేది వాస్తవం .  

ఈ విషయాన్ని చెప్పడానికి మన సంస్కృత నాటకాలలో ఒక సంఘటన కూర్చబడింది. ఇంత అద్భుతమైన సంఘటన నాకు మరి ఎక్కడా ,  

కనిపించ లేదు.     సంస్కృత సాహిత్యంలో

‘మృచ్ఛకటికం’ అనే ఒక నాటకం ఉంది. అందులో నాయకుడు చారుదత్తుడు . అతని ఊరు ఉజ్జయిని . ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడు , వృత్తి రీత్యా వ్యాపారి . కాని మితిమీరిన తన దానగుణం వల్ల దరిద్రుడౌతాడు. ఆ నగరంలో నే ఒక వేశ్య ఉంటుంది . ఆమె పేరు వసంతసేన.  వృత్తిరీత్యా వేశ్య,  కాని ప్రవృత్తి రీత్యా పతివ్రత. ఆమె,  దైవమందిరాల్లో నాట్యం చేస్తూ ఉంటుంది . ఆమె చారుదత్తుని గుణగణాలు తెలుసుకుని అతనిని ప్రేమిస్తుంది.

ఆ రాజ్యంలో శకారుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు . అతడు,  రాజు యొక్క ఉంపుడుగత్తె తమ్ముడు. ధన మదంతోను , అధికారమదంతోను  అందరినీ బాధించే నీచాతినీచుడు. ఒకసారి అతని,  కన్ను,   వసంతసేనపై పడుతుంది. ఆమెను వేధిస్తూ ఉంటాడు . ఆమె మాత్రం  ఎప్పటి కప్పుడు  అతని బారి నుండి తప్పించుకుంటూ ఉంటుంది .  

ఒకనాడు ఆమె ఒక బండి ఎక్కి వెళ్ళడానికి బదులుగా పొరపాటున మరొక బండి ఎక్కి వెళ్ళడం వల్ల శకారుడు విహరిస్తున్న ఉద్యానం లోనికి వెళ్ళిపోతుంది . అతడు ఆమెను బలాత్కరించడానికి ప్రయత్నిస్తాడు . ఆమె ప్రతిఘటిస్తుంది. తన కోరిక తీరక పోవడంతో ఆమెను చంపెయ్యాలని అనుకుంటాడు . కాని తన చేతికి మట్టి అంటుకోకుండా  తన దగ్గర కట్టు బానిసగా పనిచేసే సేవకుని, ఆ పని చెయ్యమని ఆదేశిస్తాడు . వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇటువంటి అరుదైన, అద్భుతమైన , సంభాషణ మరెక్కడా, నాకు కనిపించ లేదు.

శకారుడు తనలో అను కుంటుటున్నాడు   (ఈ ముసలి నక్కకు తప్పు చెయ్యడం అంటే భయం)  సరే! ఒరేయ్,  స్థావరకా! ఇలా రా ! నీకు బంగారు కడియం చేయిస్తానురా! అంటాడు.

స్థావరకుడు ‘ నేను ధరిస్తాను  అంటాడు.

 

శకారుడు, వాడితో  స్థావరకా! నిన్ను బంగారు సింహాసనం ఎక్కిస్తాను అంటాడు.

స్థావరకుడు,  ‘నేను ఎక్కి కూర్చుంటాను’   అంటాడు.

శకారుడు:  వాడితో  స్థావరకా! స్థావరకా! నీకు ఎంగిలి పెడతాను, అంటాడు.  

స్థావరకుడు, శకారునితో  ‘నేను తింటాను’ అంటాడు.

శకారుడు, వాడితో “ ఒరేయ్! సేవకులందరిలో నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను”  అంటాడు.

స్థావరకుడు,  “నేను అవుతాను”  అంటాడు.

శకారుడు, అతనితో “నేను చెప్పింది నువ్వు చెయ్యాలిరా!” అంటాడు .    

 

స్థావరకుడు,  “ అన్నీ చేస్తాను,

చేయకూడని పని తప్ప”  అంటాడు.

అపుడు శకారుడు,   వాడితో  “ చేయకూడనిదంటు ఏదీ లేదు” అంటాడు .  

స్థావరకుడు,  “ఐతే చెప్పండి చేస్తాను ”  అంటాడు.  

శకారుడు,  వాడితో “ నువ్వు ఈ వసంతసేనను,  చంపెయ్యి”  అని  ఆజ్ఞాపిస్తాడు .

అది విని స్థావరకుడు, “ అయ్యా ! నేను చేసిన పొరబాటు వలన ఈమె వేరే ఎక్కవలసిన  బండి మారి పోయి, ఈ బండి ఎక్కి ఇక్కడకు వచ్చింది . జరిగిందానికి నేను బాధపడుతున్నాను ’  అంటాడు.   

శకారుడు, వాడితో  ‘అరే! నేను, నీకు యజమానినిరా! ’ అంటాడు .

స్థావరకుడు, దానికి సమాధానంగా “ ఔనండి ! మీరు నా శరీరానికి మాత్రమే యజమాని , నా శీలానికి మాత్రం కాదు . ఈ పని చెయ్యడానికి నాకు భయంగా ఉంది  అంటాడు.

శకారుడు, వాడితో ‘నువ్వు నాకు సేవకుడివి కదా!  , నీకు ఎందుకురా భయం?  ఎవరికి  భయపడుతున్నావు ? అంటాడు.

స్థావరకుడు, శకారునితో “నేను పరలోకానికి భయపడుతున్నానండీ” అంటాడు .

పరలోకమా!  అదేమిటి ? ఎలా ఉంటుంది ? అని అడుగుతాడు శకారుడు .

అది, పాప, పుణ్యముల పరిణామరూపమండి! అంటాడు, స్థావరకుడు.

అలాగా!  పుణ్య పరిణామం ఎలా ఉంటుంది ? అని అడుగుతాడు,  శకారుడు.

మీరు, బంగారంతోను  , సకల సంపదలతోను   తులతూగుతున్నారు , ఇదే పుణ్య పరిణామం అంటాడు, స్థావరకుడు

  మరి,  పాప పరిణామం ఎలా ఉంటుంది ? అని అడుగుతాడు,  శకారుడు.

నేను, మీరు పెట్టే నీచమైన ఎంగిలి తింటూ మీకు ఊడిగం చేస్తున్నాను  ఇదే పాప పరిణామం. అందువల్ల నేను తప్పు పని చెయ్యను. అంటాడు స్థావరకుడు.

ఒరేయ్!  నా మాట వినవా అని శకారుడు, వాణ్ణి చచ్చేలా కొడతాడు.

ఈ శరీరం మీదే అని నేను ముందే అన్నానుగా ! నన్ను , కొట్టండి , చంపండి . ఈ పని చెయ్యను గాక చెయ్యను, అని చెపుతూ ఇంకా ఏమంటున్నాడో వినండి .

ఏనాస్మి గర్భదాసో వినిర్మితో భాగధేయ దోషై:

అధికం చ న క్రేష్యామి తతో అకార్యం పరిహరామి. అంటాడు .

అయ్యా ! నేను ఇంతకు ముందు చేసిన పాపాల వలన మీకు కట్టు బానిసగా పుట్టి,  ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువగా పాపాలు  పోగు చేసుకోలేను . అందు వల్ల

ఆమెను  చంపను గాక చంపను  అంటాడు .

ఒక ఉన్నతాధికారి ఎంత ప్రలోభపెట్టినా, భయపెట్టినా ధర్మం తప్పని జాతి మనది. ఇది మన అందరికీ ఆదర్శం కావాలి.

ఎవడైనా తప్పు చేస్తే పాపఫలం అనుభవించ వలసిందే, ఏ దేవుడు, వాణ్ణి రక్షించడు. దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ దేవుని ధర్మాలు. ఒక వేళ  దీనికి విరుద్ధంగా ప్రవర్తించి దుష్టులను కూడ రక్షిస్తే వాడు దైవం కాదు దయ్యమే అవుతాడు .      

               <><><>

 

 

 

 

Why Post Box is normally red in colour?

 

                                                     Why Post Box is normally red in colour?

పోస్టు బాక్స్ ఎర్రగా ఎందుకు ఉంటుంది?

రచన: డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.   

ఒకసారి నా మిత్రుడు  పోస్టు బాక్స్ ఎర్రగా ఎందుకు ఉంటుంది?  అని  అడిగాడు. నేనన్నాను, మన భారత దేశం వైదిక సాంప్రదాయాలు విశ్వసించే దేశం కావడం వల్ల మన వ్యవహారం అంతా వైదికమతానికి, వైదిక సంప్రదాయాలకు  అనుగుణంగా ఉంటుంది.  “సత్యమేవ జయతే” అంటే సత్యమే జయించును అని భారత ప్రభుత్వం , అలాగే “శం నో మిత్ర: శం వరుణ: ” అంటే, ‘సూర్యుడు , వరుణుడు మాకు శుభములు చేకూర్చుగాక’ అనే ఇండియన్ నేవీ సంస్థ , ‘బహుజన హితాయ బహుజన సుఖాయ’ అంటే జనులందరకు హితము, సుఖము కలుగు గాక  అని ఆకాశవాణి ; ‘అహర్నిశం సేవామహే’  అంటే ‘రాత్రిం బవళ్ళు సేవలు చేస్తాం’  అని తంతి తపాలాశాఖ; ‘సత్యం శివం సుందరం’ అని దూరదర్శన్ సంస్థ; ‘వృక్షో రక్షతి రక్షిత:’ అని అటవీశాఖ  ఇవే గాక ఇంకా ఎన్నెన్నో సంస్థలు వేదాలనుండే తమ  ఆదర్శాలను తీసుకున్నాయి, సమర్థవంతంగా పని చేస్తున్నాయి కూడ .  ఇక ఎల్.ఐ.సి. విషయం  తీసుకుందాం. దాని motto ‘యోగక్షేమం వహామ్యహం’  అనే వాక్యం . అది భగవద్గీత నుంచి  తీసుకున్నారు.

అప్రాప్త ప్రాప్తి: యోగ:  ప్రాప్తస్య రక్షణం క్షేమ:  అని ఆ వాక్యానికి అర్థం. అంటే రాకూడనిది రావడం, రావలసినది కూడ రావడం అని మొత్తం మీద అర్థం . ఉదాహరణకు నేను ఒక సంస్థలో ఒక లక్ష రూపాయలకు చీటీ వేసి నెలకు వెయ్యి రూపాయల చొప్పున కడుతూ నాలుగు వాయిదాలు చెల్లించాక చచ్చిపోయాననుకుందాం . ఏ సంస్థ అయినా మా వాళ్లకు నేను కట్టిన నాలుగు వేలే ఇస్తారు . ఇక ఎల్.ఐ.సి. అలా కాదు.  ఈ నాలుగు వేలు, నాలుగు వేలతో బాటు మిగిలిన  తొంబై యారు వేలు కూడ చెల్లిస్తుంది.  

        ఇలా చెప్పుకుంటూ పొతే అదొక మహా గ్రంథం ఔతుంది . ఇక పోస్టు బాక్సు విషయానికి వస్తే  అగ్నిదేవుడు  దేవతలందరికీ  postman లాంటి వాడు . అందుకే “అగ్ని ముఖా వై దేవా:”  అని వేదం అంది. ఇక మనం ఎవరికైనా ఉత్తరం వ్రాస్తే అతని దగ్గరకు పట్టు కెళ్ళి అతని చేతులో పెట్టం , పోస్టు బాక్స్ లో పడేస్తాం . తపాలా శాఖ అధికారులు మనం వ్రాసిన అడ్రస్సును ఆ ఉత్తరాన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పోస్టు మేన్ ద్వారా బట్వాడా చేస్తారు .  అలాగే మనం ‘ఇంద్రాయ స్వాహా ఇంద్రాయ ఇదం న మమ’ అని  ఇంద్ర దేవతాక మైన మంత్రాన్ని  చదివి అగ్నిలో వేస్తే  అది ఎవరికి చేరాలో వారికి అగ్ని చేరుస్తాడని మన విశ్వాసం . చేరుతుందో చేరదో ఖచ్చితంగా  మనకు తెలియదు గాని తప్పకుండా అది మనం జపించిన   మంత్రాన్ని బట్టి ఇంద్రుడు మొదలైన దేవతలకు తప్పకుండ చేరి ఉంటుందని మనం నమ్ముతాం .   పోస్టు బాక్స్ అగ్నికి ప్రతీక . అగ్ని ఎర్రగా ఉంటాడు కాబట్టి పోస్టు బాక్స్ కూడ ఎర్రగా కన్పించేలా చేసి ఉంటారు అన్నాను . వాడు సరేలే! అని తల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు.

              <><><>

 

Thursday, July 24, 2025

'పాదరక్షోపాఖ్యానం' డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 పాదరక్షోపాఖ్యానం

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

ఒక రోజున ఒక కాన్వెంట్ కుర్రవాడు క్లాసుకి చాల ఆలస్యంగా వెళ్ళాడు . టీచర్,  వాడితో  ఎరా !  ఈ రోజు ఎందుకు ఆలస్యం అయింది? అని అడిగారు. వాడు అయ్యా! ఇంట్లో మా అమ్మ, నాన్న  ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు  అన్నాడు.  సరేలేరా! మీ అమ్మ, మీ నాన్న దెబ్బలాటకు నీ ఆలస్యానికి ఏమిటి సంబంధం ? అని అడిగారు .

ఏమీ లేదు సార్ ! నా చెప్పు ఒకటి మా అమ్మ చేతుల్లోను , మరొకటి మా నాన్న చేతుల్లోను ఉండిపోయాయి . నాకు చెప్పుల జత ఒక్కటే ఉంది వారి తగవులాట పూర్తయ్యే దాక రాలేకపోయాను అన్నాడు . 

 

నా మిత్రునికి ప్రతి రోజూ గుడికి వెళ్ళే అలవాటుంది .

రోజుకో చెప్పుల జత పోతూ ఉండేది . అవి పోతూనే ఉండేవి . వీడు గుడికి వెళ్ళడం మానలేదు వెడుతూనే ఉండేవాడు. రోజూ కొత్త చెప్పులే కాబట్టి అవి పోవడం అనివార్యం అయింది .  

ఒకసారి నాతొ ఎలాగరా! ఇలాగైతే అన్నాడు . నేనో సలహా చెప్పాను. ఒరేయ్! ఒక చెప్పు ఒకచోట, మరో చెప్పు దూరంగా ఇంకో చోట పెట్టి చూడరా! రెండోది ఎక్కడ పెట్టావో మాత్రం నువ్వు మరిచి పోకు  అన్నాను. అప్పటినుంచి వాడి పరిస్థితి  కొంత మెరుగు పడింది .

నాకు ఇంకో మిత్రుడు ఉన్నాడు. వాడి గురించి  చెప్పాలంటే ‘చిత్తం శివుని మీద భక్తి  చెప్పుల మీద  అనే సూక్తి వాడికి వర్తిస్తుంది’ అని చెప్పక తప్పదు. ఒకసారి శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించు కుంటున్నాడు . అర్చక స్వామి మీ గోత్రం ఏమిటని అడిగారు . వెంటనే తడుముకోకుండా   చెప్పులు అని చెప్పేశాడు . అర్చక స్వామి,  ఆయనతో బాటుగా అక్కడున్న భక్త బృందం  ఆశ్చర్య పోయారు .  

 

ఒకసారి ఒక కుర్రవాడిని యజమాని తన ఇంట్లోంచి  పంపించేశాడు  . ఎందుకండీ! అలా చేశారు అన్నాను. వాడు చెప్పుతింటల్లేదండీ ! అన్నారు .

నాకేమీ అర్థం కాలేదు . నా మిత్రుడు చెప్పాడు . చెపితే వినడం లేదట అని .

మనం బూట్లు కొనుక్కోవడానికి షాపులోకి వెళతాం.    

అక్కడ యజమాని బూట్లు చూపిస్తారు. మనకు ఒక కాలికి సరిపోయినట్లు , మరో కాలికి కొంచెం బిగువో, లూజో అయినట్లుగా అని పిస్తుంది . అది బూటుల్లో లోపం కాదు కేవలం మన feetల్లో  లోపం . ఆ విషయం షాపు యజమాని మనతో అనడు , అంటే మనకు కోపం వస్తుందని. మనమే అర్థ చేసుకోవాలి. కుడి చేతికి ఎడం చేతికి మనం గమనించలేనంతగా కొంత తేడా ఉన్నట్లే కుడి కాలికి ఎడమ కాలికీ ఎంతో కొంత తేడా ఉండక మానదు.

ఒకాయన నన్ను రామాయణంలో దశరథునికి భరతునికి తేడా ఏమిటని అడిగారు. ఏముంది ? దశరథుడు రాజ్యం  లేకుండా చేస్తే, భరతుడు చెప్పులు కూడ లేకుండా చేశాడు అన్నాను.

ఒకసారి మహాకవి శ్రీ శ్రీ గారు  ఒక సభలో ప్రసంగం చెయ్యడానికి వచ్చారు. ఒక కాలికి ఒక రంగు చెప్పు ; మరో కాలికి మరో రంగు చెప్పు. నాకు చాల ఆశ్చర్యం అనిపించింది . ఎందుకంటే ఆయనకు సభాలో అందరికీ  ఏదో చెప్పాలనే ధ్యాసే గాని తాను వేసుకున్న చెప్పుల మీద ధ్యాస లేదు . అందుకే ఆయన మహాకవి అయ్యారేమో అనిపించింది .

ఒక విధంగా ఆలోచిస్తే మనం కూడు కి గూడుకి కంటే జోడు కే ఎక్కువ ఖర్చు చేస్తున్నామని నాకు అని పిస్తోంది . ఒక్కొక్కరికి పది జతలు , ఇరవై జతలు ఉంటున్నాయి . ఏ వస్తువైనా మనం ఆవసరం మించి అతిగా కొంటే దాని ప్రభావం చాల తీవ్రంగా ఉంటుంది. అందుకే సామాన్యుడు జోళ్లు కొనుక్కోవడం కూడ కష్టంగా మారుతోంది . ఈ విధానం మారాలి .      

ఒకసారి ఒక చిన్నపిల్ల తండ్రిని నాన్నా! నాకు బూతులు కావాలి నాకు బూతులు కావాలి అని పేచీ పెట్టిందట.  దాని కేముందమ్మా అనుకుని సినిమాకు తీసుకు పోయాడట! ఇది కాదు నాన్నా  ఇది కాదు నాన్నా అని ఏడుస్తోందట!. అపుడు వాళ్ళ అమ్మ ఆ పిల్ల మనసులోని మాటలు అర్థం చేసుకుని బూట్లు అని సెప్పిందట.

ఒక అవధానంలో శ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు నేటి సినిమాల గురించి చెప్పమని ఒకరు అడిగినప్పుడు ఈ విషయం చక్కని పద్యంలో చెప్పేరు . పద్యం వినండి.

బూతులు కావలెనని యొక

కూతురు తన తండ్రినడుగ గూతున్సినిమా

 చూతువు రమ్మనె విని సతి

బూతులనగ బూటులనియె మురిపెము తోడన్ .

 

నేటి సినిమాల మీద ఇంత కంటే గొప్పగా ఎవరు చెప్పలేదేమో!

నాకు అనిపిస్తుంది. పూర్వం సినిమాల్లో ఎన్నో అనుభూతులు ,  మరి నేటి సినిమాల్లోనో ఎన్నెన్నో బూతులు అని .    

        

ఒకసారి నేను నా భార్య రైల్లో ప్రయాణం చేస్తున్నాం .

ఒక స్టేషన్ లో  క్రిందకు దిగుదామనుకుంటే ఒక చెప్పు ఎంత వెదికినా కనబడ లేదు. నాకు చాల బాధనిపించింది . రెండు  చెప్పులూ  పోవడం వేరు ఒక చెప్పు పోవడం వేరు . నేను బుద్ధిలో బృహస్పతిని కదా ! ఆ చెప్పు  రైల్లోంచి బయటకు విసిరేశాను. ఇక మా చివరి స్టేషన్ నరసాపురంలో దిగేటప్పుడు సామాను బయటకు తీస్తో ఉంటే  రెండో చెప్పు కనిపించింది . అది కనబడగానే నాకు చాల బాధ కలిగింది . మొదటిది విసిరేసినందుకు కాదు, రెండోది తరువాత కనిపించినందుకు . సరే! ఇక చెప్పుల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే  తప్పదు మీ సమయానికి ముప్పు . ఇంతటితో విరమిస్తాను. సెలవు .         

      

Wednesday, July 23, 2025

ప్రేమశిఖరం ( పద్య నాటకం) ఒక విహంగ వీక్షణాత్మకసమీక్ష.

 

అభినందన మందారమాల

ప్రేమశిఖరం

( పద్య నాటకం)

ఒక విహంగ వీక్షణాత్మకసమీక్ష

నాటకరచయిత:  ‘పద్యనాటక రత్న’ చిటి ప్రోలు వేంకటరత్నం.

సమీక్షకులు: డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

                                           నా మిత్రుడు శ్రీ చిటిప్రోలు వేంకటరత్నం గారు రచించిన ‘ప్రేమశిఖరం’ అనే పద్య నాటకాన్ని ఆమూలాగ్రం చదివేను. ఇది వారి గురువర్యులు శ్రీ వి.వి.యల్ . నరసింహారావు గారు రచించిన ఆనందభిక్షువు కావ్యానికి నాటకీకరణ . శ్రీ వి. వి. యల్ . నరసింహారావు గారు నాకు తెలియక పోయినా సాహిత్యజగమంతటికీ  తెలిసిన ప్రముఖ కవి , పండితులున్ను.

ఇది బౌద్ధసిద్దాంతానికి సంబంధించిన ఇతివృత్తాన్ని స్వీకరించి  రచించిన పద్య నాటకం.

ఇక బుద్ధుని గురించి వేరుగా మనం ప్రపంచానికి చెప్పవలసిన పనిలేదు. ‘విశ్వప్రేమ’ అనే ఒక నీరూపమైన (అంటే రూపం లేని)  భావం మానవరూపాన్ని ధరిస్తే ఆయనే బుద్ధుడు . బోధిసత్త్వుడు బుద్ధుని కంటే ఒక మెట్టు క్రంది వాడు.   కొంచెం తక్కువ .  బోధిసత్త్వుడే మరుసటి జన్మలో బుద్ధుడౌతాడు. అతని ప్రేమ ఎంత గొప్పదో చూడండి .

కలికలుషకృతాని యాని తాని

మయి నిపతంతు విముచ్యతాం హి లోక:

ఇది ఆయన ఆశయం . ఈ ప్రపంచంలో ఉన్న అందరి బాధలు ఒకేసారి నా పైన పడినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు,  నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఈ లోకం మాత్రం సంతోషంగా ఉంటే అది చాలట. ఇది బోధిసత్త్వుని స్వభావమైతే ఇక అంతకంటే ఉన్నతుడైన బుద్ధుని గురించి వేరే చెప్పాలా! మానవ నాగరికతలో విశ్వ ప్రేమకు ఒక మొట్టమొదటి ప్రతిరూపం.

ఈ నాటకానికి మూలకథ ‘ఆనందభిక్షువు ’ అనే మహాకావ్యం . కవి శ్రీ వి. 'వి. యల్ . నరసింహారావు గారు. ఈ నాటకం లోనికి ప్రవేశించే ముందు అశ్వఘోషుడు రచించిన ‘ సౌందరనందం’ గురించి కొంచెం తెలుసుకుందాం.

నందుడు బుద్ధునికి పినతండ్రి కుమారుడు. . ఇంద్రియసుఖముల పట్ల అమితమైన ఆసక్తి కలవాడు . అతని భార్య సుందరి . వారిద్దరి కలయిక విడదీయరానిది . ఒకరిని విడిచి మరొకరు ఒక్క క్షణమైనా ఉండలేని వారు.

నడపుల రాజ హంస, తెలినవ్వుల వెన్నెలవాక, తేనెలూ రెడి నునుపల్కు తేనెపెర, రెమ్మలు వైచు విలాసవల్లి, వ్రే

ల్మిడి హృదయంబు నొచ్చి చను మేలిమి చూపు సుమాస్త్రమైన, య

ప్పడతుక నంద భాస్కరుని పాయగ నోర్వదు ఛాయయుం బలెన్

అంటారు పింగళి కాటూరి కవులు

అతడు సూర్యుడు ఆమె నీడ . వారి యనుబంధం చక్కనిది, చిక్కనిది. ఎంత చక్కనిదో అంత చిక్కనిది , ఎంత చక్కనిదో అంతే చిక్కనిది కూడ. . ఒకనాడు వారిరువురు ఏకాంతంలో ఉండగా బుద్ధుడు భిక్షకై వారి ఇంటికి వెళతాడు. అతని రాకను గమనించలేని తమకంలో వారున్నారు. బుద్ధ భగవానుడు కొంతసేపు నిరీక్షించి వెనుదిరిగి వెళ్లి పోతాడు . ఆ తరువాత వారి పరిచారిక భగవానుని రాకను వారికి విన్నవిస్తుంది. నందుడు జరిగినదానికి తీవ్రమైన  పరితాపం చెందుతాడు . అన్నగారి కాళ్ళపై పడి క్షమాపణ చెప్పుకోడానికి బయలుదేరతాడు . ఆమె క్షణంలో తిగిగి రమ్మని భర్తను కోరుకుంటుంది. నేను ఇప్పుడే నీ కాళ్ళకు  పూసిన  కాలి పారాణి ఆరే లోపుగానే వస్తానని వాగ్దానం చేసి అక్కడ నుండి బయలు దేరతాడు . బుద్ధుడు తన వద్దకు వచ్చిన నందునకు తన శిష్యులద్వారా ధర్మోపదేశం కావిస్తాడు . అంతే! నందుడు ఇక ఇంటికి తిరిగి వెళ్ళడు. ఆ తరువాత సుందరి బుద్ధ భగవానుని చేరుకొని ఆయన అనుమతితో బౌద్ధమతాన్ని స్వీకరింస్తుంది. వారిరువురు సమాజ సేవలో తమ జన్మ పునీతం చేసుకుంటారు .

ఇక ఈ నాటకం నాందీ శ్లోకంలో వైయక్తికమైన ప్రేమకంటే విశ్వవ్యాప్తమైన ప్రేమ గొప్పదని అటువంటి విశ్వప్రేమ గలవారే స్తుతి పాత్రులని విశ్వప్రేమ యొక్క గొప్పదనం కీర్తించబడింది .

ప్రస్తావనలో మాయా , జ్ఞానేంద్రుడు అనే ఇద్దురు వ్యక్తుల  సంభాషణద్వారా మాయ, కల్యాణి అనే ఒక యువతి తాను వివాహం చేసుకోబోయే వరుడు  కారు ప్రమాదంలో మరణించడంచేత ఆమె  చాల శోకంతో  విలపిస్తున్నదని, ఆమె వేరొకరిని వివాహం చేసుకోడానికి ఇష్టపడక  జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉండడానికి నిశ్చయిం చుకున్నదని విని తెలుసుకుని ఇదంతా చూస్తే బుద్ధ భగవానుని మాటలు నిజమనిపిస్తున్నవి  అంటాడు జ్ఞానేంద్రుడు. అంతేకాక ప్రేమ అనేది ఒక వ్యక్తికి పరిమితం కాకుండ విశాలమైన పరిధిలో విశ్వవ్యాప్తం చేస్తే శోకం కలుగదు అనే జ్ఞానేంద్రుని ప్రస్తావన ద్వారా విశ్వప్రేమను బోధించే ప్రేమశిఖరం నాటక ప్రదర్శనకు పునాది కల్పించడం చాల సందర్భోచితంగా ఉంది. ఇది రచయిత ప్రతిభకు ఒక నిదర్శనం .  తరువాత నాటకం ప్రారంభం అవుతుంది .   మొదటి అంకం మొదటి రంగంలో  శ్రావస్తి నగర ప్రజలు ఒకచోట కుర్చుని పిచ్చాపాటి మాట్లాడు కొంటూ ఉంటారు . ప్రకృతి అనే పదునెనిమిది  సంవత్సరాల వయస్సు గల ఒక కడజాతి అమ్మాయి, తప్పిపోయిన తన దూడ కోసం వెతుక్కుంటూ అక్కడకు వస్తుంది. కడజాతి దానికి కళ్ళు నెత్తికెక్కాయని అక్కడి వాళ్ళు ఆమెను నిందిస్తారు. వారిలో ఒకరు పెద్దలారా! కాలం మారింది , ఇప్పుడు వర్ణభేదాలు పనికిరావని చెపుతాడు . వారందరికి బుద్ధుని బోధనలు గుర్తు చేస్తాడు. వారందరూ ఆ బుద్ధదేవుని కూడ నిందిస్తారు. . కొంతసేపటికి వారు నిష్క్రమిస్తారు . ప్రకృతికి తన దూడ యైన ‘గౌరి’ కనిపించగానే ఆనందంతో పరవశిస్తుంది. అంతలో కొంతమంది భిక్షువులు బుద్ధుని బోధనలను ఆలపిస్తూ సంచరిస్తూ ఉంటారు . ఆనందుడనే భిక్షువునకు దాహంతో గొంతు ఎండి పోతుంది. అతను చుట్టూ చూస్తూ అమ్మా! దాహంతో  గొంతు ఎండి పోతున్నది. మంచినీళ్ళు పోయవమ్మా ! అని అడుగుతాడు . సామీ! నేను అంటరానిదాన్ని అంటుంది . ఓ అమాయకురాలా! మానవత్వమ్ము సామాన్యమైన గుణము తక్కుగల భేదములు కల్పితములు చూవె” అని     అమ్మా ! నాకు  దాహం తీర్చు తల్లీ! అని అడుగుతాడు .

ప్రకృతి దాహార్తుడైన ఆనందునకు  దాహం తీరుస్తుంది. వారు వెళ్ళిపోతారు.

మొదటి అంకం రెండవ రంగంలో ప్రకృతి, ఆనందుల పరస్పరాకర్షణ మొదలౌతుంది .

రెండో అంకం మొదటి రంగంలో ప్రకృతి మనస్సులో నిన్నలేని అందమేదో నిదురలేచినట్లౌతుంది . తన తల్లి  యైన శివమానస పై విరహ సంబంధమైన  ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తుంది . శివమానస ఆ ప్రశ్నలకు చాల కంగారు పడుతుంది .

రెండో అంకం రెండవ రంగంలో  ఆమెకు  తన బిడ్డ బౌద్ధ భిక్షువుతో ప్రేమలో పడిందని తెలుస్తుంది .

మూడవ అంకం మొదటి  రంగంలో శివమానస తన పుత్రిక మనస్సు మునీశ్వరునిపై లగ్నమైనదని గ్రహించి ఆమె భవిష్యత్తు తెలుసుకొనుటకు ధ్యానమందిరానికి చేరుకుంటుంది. ఆకాశంలో ఉరుములతో కూడిన వర్షం , వేగంగా ప్రవహించే సెలయేళ్ల ధ్వని విని అమంగళం శంకిస్తుంది. కాని నిశ్చింతగా  ఉండమని బిడ్డకు ధైర్యం చెపుతుంది.

మూడవ అంకం రెండవ రంగంలో శివ మానస స్నానం చేసి, పవిత్రయై పద్మాసనం లో అగ్ని గుండానికి ముందు కూర్చొన్నదై ముందుగా భైరవమంత్రాన్ని జపిస్తుంది . ఆ తరువాత శతరుద్రమంత్రానుసంధానం చేస్తుంది .

నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ: నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమ:

యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధను:

శివ శరవ్యాయా తవ తయా నో రుద్రా మృడయతు  స్వాహా

యా తే రుద్రశివాతనూ రఘోరా పాపకాశినీ

తయాన స్తనువా శన్తమయా గిరిశంతాభి చాకశీ హి స్వాహా

అనే మంత్రాన్ని జపిస్తూ హోమకుండంలో గుగ్గిలం వేస్తుంది.

ఆ తరువాత శరభ గీతికను ఆలపిస్తుంది .

ఆ తరువాత నారసింహమంత్రం జపిస్తుంది. బీజాక్షరాలు జపిస్తూ యంత్ర పూజలు చేస్తుంది . ద్వాదశ చక్రాన్ని నిర్మిస్తుంది . అంజనం వేస్తుంది . ఆ తరువాత గణపతి హోమం చేయిస్తుంది . తన ‘అనామిక’ను ( అంటే ఉంగరం వ్రేలిని ) కోసుకుని ఆ రక్తంలో ఒక శలాకను ముంచి భూర్జపత్రంలో బీజాక్షరాలు  వ్రాస్తుంది. సర్వజనం మే వశం ఆనయ అని ప్రార్థిస్తుంది . చివరగా కొమ్ముబూర ఊదుతుంది. అప్పుడు అంజన పేటికలో ముని కుమారుడు కనిపించినట్లే కనిపించి వెంటనే  మాయమౌతాడు.

అప్పుడు శివమానస, తన కూతురు ప్రకృతితో   ఇతను అంజనానికి అందడు. అని చెప్పి సర్వ సృష్టి ప్రదర్శక సాధనమైన దివ్యదర్పణాన్ని ఇస్తుంది. ఆ ముని ఆత్మ శక్తికి నా మంత్ర శక్తికి పోరాటం జరుగుతోంది . మనం గెలవాలంటే ఇంకా పరిశుద్ధులం కావాలి  అని చెబుతుంది. దీంతో మూడవ అంకం పూర్తవుతుంది.

 

నాలుగో అంకం మొదటి రంగంలో కపిలవస్తుపురంలో మర్రిచెట్టు క్రింద బుద్ధుడు పద్మాసనంలో ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. ఎదురుగా ఆశ్వజిత్తుడు , ఉరువేల కాశ్యపుడు , నందుడు , మౌద్గల్యాయనుడు, రాహులుడు , సారిపుత్రుడు , కూర్చుని ఉంటారు.

బుద్ధుడు వారిలో ఒక్కొక్కరికి వారి వారి స్థాయికి తగినట్లుగా ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు . మనస్సును తన ఇష్టానుసారంగా నడిపించగల యతియే   సమర్థుడని వివరిస్తాడు. స్థిరమైన వివేకం కలవారి హృదయంలో విషయ వాంఛలు ప్రవేశించవని బోధిస్తాడు.

ఎల్లప్పుడు దుష్టమైన ఆలోచనలు చేయు వానికి ఎల్లప్పుడూ దుఃఖాలు వెంటనే ఉంటాయని వివరిస్తాడు.

విషయ సుఖాలపైన ఆసక్తి గల వానిని రాత్రి జల ప్రవాహం గ్రామాన్ని ముంచి వేసిన విధంగా అతనిని సర్వనాశనం చేస్తుందని వివరిస్తాడు. భిక్షువులు అందరు  రాగద్వేషాలను త్రుంచి వేయాలని హెచ్చరిస్తాడు.

ప్రియశిష్యుడైన ఆనందుని కొంచెం దగ్గరకు రమ్మని  ఆదేశిస్తాడు.

ఈ లోపుగా ఉరుములు, మెరుపులతో కూడిన భీకరమైన నాదం  వినిపిస్తుంది. ఆనందుడు తన ప్రమేయం లేకుండానే అక్కడి నుండి నిస్సహాయుడుగా బయటకు లాగివేయ బడతాడు. మిగిలిన శిష్యులు నిబ్బరంగా ఆయన ముందు కూర్చొనే ఉంటారు. బుద్ధుని ఉపదేశ వాక్యాలు శ్రద్ధగా వింటూ ఉంటారు. కొంతసేపటికి ఆనందుడు తిరిగి వచ్చి గురుదేవా! ఏదో ఒక బలమైన శక్తి నన్ను ఎక్కడికో లాక్కు వెళ్ళింది, నేను మీరిచ్చిన ధార్మిక శక్తియందు గల విశ్వాసంతో సకల బంధాలనుండి బయటపడి మరల మీ దగ్గరకు చేరుకోగలిగాను అంటాడు .

అప్పుడు బుద్ధుడు అతనితో నా ధార్మిక శక్తికి నీ యోగశక్తి కూడ తోడైంది అని శిష్యులవైపు చూసి ఆనందుడు తిరిగి వచ్చాడు . మనం భిక్షకు బయలుదేరదాం పదండి అంటాడు. అందరు బయలుదేరారు.

రెండవ రంగంలో  ‘శివమానస’ తన దివ్య దర్పణంలో ఆనందుడు వచ్చినట్లే వచ్చి  తిరిగి బుద్దాశ్రమానికి వెళ్లి పోయాడని తెలుసుకుని మంత్ర రాజమైన మణిభద్రాన్ని ప్రయోగిస్తుంది. అది కూడ నిష్ఫలం కాగా  త్రైపురాకర్షణ మంత్రాన్ని అనుసంధానం చేస్తుంది . ఆనందుడు రావడం తథ్యం అనుకుంటుంది. తల్లీ, కూతురు ఇద్దరు సంతోషిస్తారు .

నాలుగో అంకం మూడో రంగంలో బుద్ధుడు శిష్యులను అందరిని సమావేశ పరచి బ్రహ్మచర్యాన్ని గురించి బోధిస్తాడు .

మనసనెడి చిన్న పడవలో మమత అనెది

నీరు నిండినచో తోడి పారబోసి

బ్రతుకు నదిలోన నిర్వాణ పథము పట్టి

పడవ మునుగని యట్లు పోవలయు నరుడు

అని హెచ్చరిస్తాడు .

ఏ మతానికైనా మౌలిక మైన విలువలు ఆచరించడమే ముఖ్యమని బోధిస్తాడు.

మంచి చెడ్డలు పరిగణింపకయు సతము

బ్రహ్మ చర్యము పూనెడు బౌద్ధ ధర్మ

వేత్త యొక్కడే నిక్కమౌ భిక్షువగును

బిచ్చమెత్తెడు వాడెల్ల భిక్షువగునె?     అని హితబోధ చేస్తాడు.

ఆనందుడు తన దాహాన్ని తీర్చిన ప్రకృతిని ప్రేమతో ఆప్యాయంగా చూశాడని, కాని ఆమె అతనిని అపార్థం చేసుకుందని, ఆమె తల్లి మంత్రికురాలే గాని అమృత హృదయ అని,  తండ్రి లేని కూతురి కోసమే ఇదంతా చేసిందని అంటాడు . బౌద్ధ భిక్షువు ఏ ఒత్తిడికి లొంగ కూడదని హితబోధ చేస్తాడు .

నేపథ్యంలో మెరుపులు, ఉరుములతో కూడిన వడగళ్ళ వాన కురుస్తున్న ధ్వనులు వినిపిస్తాయి . అది ఆనందుని ధార్మిక శక్తికి,  క్షుద్రశక్తికి జరుగుతున్న పోరాటమని బుద్ధుడు వారికి చెపుతాడు.

ఆ క్షుద్రశక్తి ఆనందుని మళ్ళీ లాక్కు పోతుంది. అందరు బుద్ధుని వైపు చూస్తారు. ఆయన మాత్రం చిరునవ్వు కురిపిస్తాడు .

నాలుగో అంకం నాలుగో రంగంలో ఆనందుడు ప్రకృతి ముందు వివశుడై కళా విహీనంగా బోర్లాపడి పోతాడు. ముని శక్తికి ‘శివమానస’ కృశించి నశిస్తుంది. తల్లి మరణంతో ప్రకృతి చాల విలపిస్తుంది .

ఆనందుడు ప్రకృతి వైపు నిరాసక్తంగా చూస్తాడు . ప్రకృతి నిర్లిప్తంగా ఆనందుని వైపు     చూస్తుంది . నేపథ్యంలో బుద్ధుని బోధనలు వినిపిస్తాయి . ఆనందుడు , ప్రకృతి, గౌరి  బుద్ధుని ఆశ్రమం వైపు నడుస్తారు .

ఐదవ అంకంలో బుద్ధుడు, ఆయన ముందు ఆనందుడు మిగిలిన శిష్యులు కూర్చొని ఉంటారు . అందరూ ఆయనకు నమస్కరిస్తారు. ప్రకృతి కూడ స్వామికి నమస్కరిస్తుంది . బుద్ధ శిష్యులు ప్రకృతి ప్రార్థనపై ఆమెకు దు:ఖం, దు:ఖానికి కారణం , దు:ఖ నివారణ , నివారణోపాయం అనే నాలుగు ఆర్య సత్యాలను వివరిస్తాడు . ఆ తరువాత మౌద్గల్యాయనుడు ఆమెతో అమ్మా ! ప్రకృతీ ! జీవితాన్ని మచ్చ లేకుండా చేసుకునే ఎనిమిది దారులున్నాయి అని,

అవి సరైన నడవడి, సరిగా మాట్లాడడం , మంచి ఆలోచనలు పోనివ్వకుండా, చెడ్డ ఆలోచనలు రానివ్వకుండా ఉండడం, ఎవరికీ అపకారం చెయ్యని జీవనోపాధి , స్వచ్ఛమైన జీవితం ఇవేనమ్మా ! అని వివరిస్తాడు .

బుద్ధుడు ప్రకృతితో అమ్మా ! మనుషులందరినీ ప్రేమించడమే అసలు సిసలైన ప్రేమ. ఆనందుని మీద నీ ప్రేమ వ్యక్తికే పరిమితమైనది కాబట్టి అది దు:ఖానికి దారి తీసింది . సర్వ మానవుల్ని ఇంకా  సాధ్యమైతే సర్వ జీవుల్ని ప్రేమించడమే ప్రేమలో శిఖరస్థాయి అంటాడు.

అందరు అదే ప్రేమశిఖరం అని ముక్తకంఠంతో నినదిస్తారు . అందరు నిష్క్రమిస్తారు .

1.      ఇక ఈ నాటకంలో రచయిత పాత్రలకు తగిన భాషను ఉపయోగించడం గొప్ప విశేషం.

2.      నాటకీకరణకు అనుకూలంగా మూల కథకు రసోచితమైన మెరుగులు దిద్దడం ఇంకో విశేషం .

3.      ఆనాడే అంటరానితనం  అనే దురాచారాన్ని వ్యతిరేకించే ఉదార వాదులు కూడ ఉన్నారనే విషయాన్ని ప్రదర్శించడం  మరో విశేషం

4.      అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళు కూడ వేద మంత్రాలను , క్షుద్ర మంత్రాలను కూడ నేర్చుకునే వారని చెప్పడం మరో విశేషం .

5.      క్షుద్రశక్తులకన్న యోగ శక్తి గొప్పదని తెలుస్తోంది.

6.      మతంలోని మౌలికమైన విలువలను ఆచరించడమే ముఖ్యమని వేషధారణ ముఖ్యం కాదని వివరించడం జరిగింది.

7.      కవి శుద్ధమైన తాత్త్విక విషయాలను కూడ హృదయానికి హత్తుకునే విధంగా రసరాగ రంజితం చేసి సమాజానికి అందించగలడని ఈ నాటకం నిరూపణ చేసింది .

8.      బుద్ధుని అభిప్రాయాలను తెలుకోవాలనుకునే వారికి ఈ నాటకం చాల

                       ఉపయోగ పడుతుంది.

9.      ఇవే గాక ఈ నాటకంలో మరెన్నో విశేషాలున్నాయి .

మొత్తం మీద గౌతమబుద్ధుని బోధనలను ఇంత గొప్ప నాటకంగా మలచిన నా మిత్రుడు శ్రీ చిటిప్రోలు వేంకటరత్నం తన గురువు గారి ఋణం తీర్చుకున్నారనడంలో ఎటువంటి  సందేహం లేదు. ఆయనను మనసారా అభినందిస్తూ ....

                                                  చిలకమర్తి దుర్గాప్రసాదరావు

                                                       9897959425

                                             <><><>

 

 

Sunday, July 6, 2025

Unite we stand - Divide we fall by డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

కలిస్తే నిలుస్తాం -విడిపోతే పడిపోతాం

Unite we stand - Divide we fall

ఏకత్వం లోకమోహనం - భిన్నత్వం భయావహం

రచన:

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

9897959425

 

ఏకం విష రసో హంతి శస్త్రేణైకశ్చ హన్యతే

           స రాష్ట్రబంధుం రాజానం హంత్యేకో  భావవిప్లవ:

అన్నారు మన పెద్దలు .

నిజమే!  విషం ఒక వ్యక్తినే చంపుతుంది ఎందు కంటే అది విషమని తెలిశాక దాన్ని తొలగించవచ్చు. అలాగే  కత్తి ఒక్క వ్యక్తిని మాత్రమే చంపగలుగుతుంది. మిగిలినవారు  ఎదిరించి పోరాడతారు లేదా తప్పించుకుని పారిపోతారు. ఇక విప్లవాత్మకమైన భావజాలం మాత్రం దేశాన్ని, ప్రభుత్వాన్ని, రాజును, ప్రజలను అందరినీ నాశనం చేసేస్తుంది. అది పైకి కనబడని పదునైనకత్తి, సులువుగా పసిగట్టలేని సొగసైన విషం . ఇటువంటి విప్లవాత్మకమైన భావజాలం నేటి భారత దేశాన్ని పట్టి, పీడిస్తోంది. ఇటువంటి పైకి కానరాని, సులభంగా పసిగట్టలేని, భావజాలాన్ని నిర్మూలించ గలిగేది ఒక్క విచక్షణ గల బుద్ధి మాత్రమే.

పూర్వం మన భారతదేశం అంగ , వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, సౌవీర, సౌరాష్ట్ర , మహారాష్ట్ర , మగధ , మాళవ, నేపాల, కేరళ, చోళ, గౌడ , మళయాళ , సింహళ , ద్రవిడ , ద్రావిడ, కర్ణాట , నాట , పానాట,  పాండ్య, పులింద , హూణ, దశార్ణ , భోజ, కుక్కురు, కురు, గాంధార, విదర్భ , విదేహ , బాహ్లీక , బర్బర, కేకయ, కోసల, కుంతల, కిరాత, శూరసేన, సేవన, టెంకణ, కొంకణ, మత్స్య, మద్ర, పార్శ్వ, ఘూర్జర, యవన , ఆంధ్ర , సాళ్వ, చేది, సింధుమతి  మొదలైన అనేక  దేశాలతో సర్వాంగ సుందరంగా ఉండేది. అందరిలో నెలకొన్న  సంస్కృతులు , ఆచారాలు, భాషలు,  వేరు వేరుగా ఉన్నా జాతీయభావాలు చెక్కు చెదరలేదు. అందరు కలసిమెలసి ఉండేవారని ప్రాచీన గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆనాటి మనలోని కొంతమంది స్వార్థపరుల వలన విదేశీయులు మనల్ని ఆక్రమించారు. “ ఒప్పుల కుప్పా ఒయ్యారి భామ గా ఉన్న దేశాన్ని అప్పులకుప్ప అయ్యో రామాగా” మార్చేశారు.    ఒక చెట్టును, గొడ్డలి నరకాలంటే అది స్వయంగా ఆ పని చెయ్యలేదు, చెట్టులో   ఒక భాగం,  గొడ్డలిలో దూరితేనే అది సాధ్యపడుతుంది.  అటువంటి కొంతమంది స్వార్థపరుల విషపూరితమైన ఆలోచనలకు జాతి ఎన్నో కష్టనష్టాలు అనుభవించింది. మనం ఎన్ని ఆటు పోటులకు గురి అయినా మన వైదిక ఋషులు అందించిన ధర్మాలు మనల్ని ఒకటిగా  కట్టి పడవేశాయని  నా విశ్వాసం. ఋగ్వేదానికి ఉన్నంత విశాలమైన దృక్పథం మరే గ్రంథానికి లేదని నా నమ్మకం . ఋగ్వేదం

ఆనో భద్రా: క్రతవో యాంతు విశ్వత:” అని కోరింది.

Let noble thoughts come from all sides.  అని మాటలకు అర్థం.

ఇంకా ఏమందో చూడండి .  సంగచ్ఛధ్వం”   అందరు ఒకచోట సమావేశం కండి.  “సంవదధ్వం”,

ఒకరితో ఒకరు మాట్లాడు కొంటూ చర్చించుకోండి,   సం నో మనాంసి జానతాం” ,        ఒకరి మనస్సును మరొకరు తెలుసుకోండి.   దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే “  అంటే

విద్యావంతులు, పెద్దవారైన మీ పూర్వీకులు, ఆచరణ రూపంగా చెప్పిన ధర్మాలను అనుసరించండి .  

   “సమానీవ  ఆకూతి:”  

మీ అభిప్రాయాలు ఒకేవిధంగా ఉండేలాగా ,  సమానా హృదయాని వ: “  మీ హృదయాలు ఒకేవిధంగా ఉండేలాగా,  “సమానమస్తు వో మనో”  మీ మనస్సులు ఒకే విధంగా మెలగండి . 

   ‘యథా వ: సుసహాసతి’   పరస్పర సహకారంతో మెలగండి . ఇది ఋగ్వేదం మనకిచ్చిన సందేశం.

ఋగ్వేదం, పదో మండలం నూట అరవై ఒకటవ మంత్రం.

 

ఆ మొత్తం ఉపదేశాలు మరోసారి విందాం.  

 

1.      Associate you all in public meetings.

2.      Have you all free discussions.

3.      Acquire you all through wisdom.

4.      Follow the footsteps of your learned elders who have shown by their exemplary devotion to duty or dharma.

5.      Let all your actions are according to the dictates of duty.

6.      Don’t injure the feelings of others.

7.      Consider thoroughly before taking any step.

8.      Help and give aid to

 

మంత్రం కూడ మరో సారి విందామా !

           

   संगच्छध्वं ,  संवदध्वं, सं नो मनांसि जानताम् |

   देवाभागं यथा पूर्वे संजानाना  उपासते

   समानीव आकूति:  समाना हृदयानि व: 

   समानमस्तु वो मनो  यथा व: सुसहासति 

 

 

ఇక మనం పరస్పరం విడిపోతే దానివల్ల కలిగే నష్టాన్ని వివరించే ఒక అందమైన ఆంగ్లపద్యం కూడ తెలుసుకుందాం.

 

First, they came for the Jews

I did not speak out

Because I was not a Jew.

ముందుగా కొంతమంది సైనికులు యూదులను చంపడానికి వాళ్ళ  కోసం వచ్చారు. నేనేమీ ప్రశ్నించ లేదు, నాకెందుకులే అనుకున్నాను . ఎందుకంటే  నేను యూదును కాదు  కాబట్టి .  

Next, they came for the communists

But I did not speak out

Because I was not a communist.

 

కొంతకాలం తరువాత వాళ్ళు కమ్యునిష్టుల కోసం వచ్చారు. అప్పుడు కూడ నేను నోరు మెదపలేదు . ఎందుకంటే నేను కమ్యునిష్టును కాదుగా, నాకెందుకులే అనుకున్నాను .

 

Then they came for the trade unionists

And I did not speak out

Because I was not a trade unionist

 

ఆ తరువాత వాళ్ళే ట్రేడ్ యూనియన్ సభ్యులకోసం వచ్చారు . అప్పుడు కూడ నేను మౌనంగానే ఉన్నాను . ఎందుకంటే నేను ట్రేడ్ యూనియన్ సభ్యుడను కాదు కదా,  నాకేమీ పరవాలేదులే అనుకున్నాను.        

Then they came for the Catholics

And I did not speak out

Because I was not catholic

ఇంకా కొంతకాలం గడిచాక వాళ్ళు కేథలిక్కుల కోసం వచ్చారు. నేను కేథలిక్కును కాదు కాబట్టి అప్పుడు కూడ నాకెందుకులే అనుకున్నాను. ఎవర్నీ ప్రశ్నించలేదు .

  

Ten they came for me

And there were no one left

To speak out for me. 

కొంతకాలం తరువాత చివరకు ఒక రోజున వాళ్ళు నా కోసం  వచ్చారు . ఇక నా కోసం మాట్లాడడానికి ఒక్కడు కూడ అక్కడ మిగలలేదు .

 

              ఇక ఒకప్పుడు చవకబారు ఆలోచనలతో,  స్వార్థ బుద్ధితో విదేశీయుల పాలనకు అవకాశం ఇచ్చి    ఎన్నో ఇబ్బందులు పడ్డ మనకు మహాత్ముని నాయకత్వం వలన స్వాతంత్ర్యం లభిస్తే , పటేల్ మహాశయుని వలన ఏకత్వం సిద్ధించింది. దేన్ని సాధించాలన్నా ఏకత్వం అనివార్యం. అందుకే మహాత్మాగాంధి స్వాతంత్ర్యం కోసం అందరిని రాట్నం పుచ్చుకోమన్నారు. హిందువులను  గీత , క్రైస్తవులను  బైబిలు,  మహమ్మదీయులను ఖురాను మిగిలిన మతాల వారిని వారి వారి పవిత్రగ్రంథాలను  పట్టుకొమ్మని చెప్పలేదు . అలాగే చెప్పి ఉంటే  మనం ఇంకా బానిసత్వంతో బాధపడుతూనే ఉండేవాళ్లం. ఒకవేళ మీరందరు కర్ర పట్టుకోండి, లేదా  కత్తి పట్టుకోండి అని చెప్పి ఉంటే స్వతంత్రభారతం దాదాపు స్మశానం గానే మారి ఉండేది .

ఇక అభిప్రాయ భేదాలు మనుషులకే ఉంటాయి . జంతువులకు ఉండవు ఎందుకంటే వాటికి ఒక అభిప్రాయమే ఉండదు కాబట్టి . మనలో అనేక సంప్రదాయాలు , విశ్వాసాలు, ఆచార వ్యవహారాలూ ఉన్నా అంతర్లీనంగా ఏకత్వం ఉంది.

ఒకసారి సమాజాన్ని మానవ శరీరంతో పోల్చి చూద్దాం.  

మన శరీరంలో nervous system , respiratory system , digestive system , circulatory system , excretory    system   వంటి ఎన్నో ఎన్నెన్నో భిన్న భిన్నమైన  సిస్టమ్స్ ఉన్నాయి . వాటి పనులు, వేరైనా లక్ష్యం శరీరాన్ని  ఆరోగ్యవంతంగా ఉంచడమే . ఇంతే గాక మన శరీరంలో కోటానుకోట్ల రక్త కణాలు ఉన్నాయి . అవి వేటి  పని అవి చేసుకుంటూనే  పోతున్నాయి.   అలాగే ఒక సంస్థలో ఎన్నోశాఖలుంటాయి, ఎంతో మంది వ్యక్తులు వివిధమైన బాధ్యతలు కలిగి ఉంటారు . అందరి లక్ష్యం సంస్థ అభివృద్ధి మాత్రమే . అలాగే మనలో ఎన్నెన్ని భేద భావాలున్నా మన దృష్టిమాత్రం,  దేశహితం, సౌభాగ్యం, సార్వభౌమత్వం  మీదే ఉండాలి. అంతేగాని “ ఎవడి కొంప తీతునా”  అనే ఆధునిక అష్టాక్షరీ మంత్రాన్ని ; “మాకారోగ్యం , మాకైశ్వర్యం; మాకు ధనం, మీకు ఋణం” అనే ఆధునిక ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చోకూడదు . ఏది ఏమైనా నేను చెప్పే ఈ రెండు, మూడు  మాటలు నిత్యసత్యాలు. ఇవి  అందరికీ తెలిసినవే. కొత్తవి కావు. ఒకటి,    మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు మంచి, చెడు, ఈ రెండు  తప్ప మరేమీ మన  వెంట రావు.

ఇక రెండోది, మనకంటే గొప్పవాడు ఎవడు లేడు,  అలాగే మనకంటే తక్కువ వాడు కూడ ఎవడు లేడు.

ఇక ముఖ్యమైన మూడోవిషయం. మనకు ప్రపంచంలో భారతీయుడుగానే గుర్తింపు ఉంది . మరో విధంగా గుర్తింపు లేదు. . ఐక్యరాజ్యసమితిలో మన చిరునామా India, also known as Bharat అనే ఉంటుంది. మరో విధంగా ఉండదు అని ఎవరో చెపితే విన్నాను.  భారతీయ సమగ్రతకు సమైక్యానికి మనం కృషి చేద్దాం, బంగారు బాటలు వేద్దాం .       జననీ, జన్మ భూమిశ్చ  స్వర్గాదపి గరీయసీ  అనే మహానినాదాన్ని మారు దశదిశలు మ్రోగేలా చేద్దాం .

నమస్కారం.