పిల్లల పెంపకం
రచన :
డాక్టర్ .
చిలకమర్తి దుర్గాప్రసాదరావు .
పిల్లల్ని
పెంచడం ఒక కళ. అది పిల్లుల్ని పెంచడమంత తేలిక కాదు . ఈ
విషయంలో ఒక్కొక్కప్పుడు మనుషులకంటే జంతువులే చాల నయమనిపిస్తుంది . ఎందుకంటే జంతువులు సహజవాతావరణంలో పెరుగుతాయి.
మనుషులు తాము సృష్టించుకున్న కృత్రిమమైన వాతావరణంలో
పెరుగుతారు. అదీ రెంటికి తేడా . అన్నిటికంటే ముందుగా ఒక విషయాన్ని మనం అందరు గమనించాలి . అదేంటంటే పిల్లలు చైతన్యం గల
ప్రాణులు . చైతన్యం వేరు, జడం వేరు . ఉదాహరణకి, ఒక కుర్చీ, లేదా బీరువా, మనం పెట్టిన
చోటే కదలకుండా ఉంటాయి . ఎలా పెడితే అలాగే ఉంటాయి . వాటితో మనకి ఎటువంటి ఇబ్బంది
ఉండదు . కాని పిల్లలు వేరు. వారు చైతన్యం గల వాళ్ళు . మనం అనుకున్నట్లు
ఉండరు, వాళ్లకు తోచినట్లు ఉంటారు . ఈ విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకుంటే
పిల్లల్ని పెంచడం కొంచెం సులభం ఔతుంది. పిల్లల్ని
పెంచే విషయంలో మన పూర్వీకులు కొన్ని
మార్గదర్శక సూత్రాలను నిర్దేశించారు .
“ రాజవత్పంచ
వర్షాణి, దశవర్షాణి దాసవత్,
ప్రాప్తే
తు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్ “ అన్నారు
పిల్లల్ని
ఐదేళ్ళ వరకు మహారాజును చూసినట్లుగా చూడాలి . మగపిల్లవాడైతే మహారాజులాగా ,
ఆడపిల్లయితే మహారాణి లాగ చూడాలి . అంటే వాళ్ళనేమీ అనకూడదు . వాళ్ల మనసు నొప్పి౦చ
కూడదు. వాళ్ళు ఆ వయస్సులు చాల అల్లరి చేస్తారు . అది మనం భరించాలి . అల్లరి
చెయ్యడం ఆరోగ్య లక్షణం , మందకొడిగా ఉండి, అల్లరి
చెయ్యకపోవడం అనారోగ్య లక్షణం . అప్పుడు డాక్టర్ కి చూపించాలి . కొంత మంది మా
పిల్లలు అసలు అల్లరి చెయ్యరు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు . వాళ్ళను చూసి జాలి
పడాలే తప్ప మనమేమీ చెయ్యలేం . ఇక అల్లరి వేరు, పేచీ వేరు . ఈ తేడా తెలుసుకోవడం చాల
ముఖ్యం . ఒక్కొక్కప్పుడు ఆ అల్లరిని లేదా పేచీని భరించలేని పరిస్థితి ఏర్పడితే
అల్లరిని దారి మళ్లించాలి. ఉదాహరణకి మనం భరించలేని అల్లరి చేస్తున్నప్పుడు , పేచీ పెట్టి
ఏడుస్తున్నప్పుడు “ ఒరేయ్ ! ఇలా, రా ! ఈ పుస్తకాలు లెక్కపెట్టు, మన ఇంట్లో
ఎన్ని ఫేను లున్నాయో లెక్కపెట్టు” అని అడిగితే అంతా మరిచిపోతాడు . లేకపోతే చేతిలో
ఒక వస్తువు పెట్టుకుని చెయ్యి మూసేసి ‘ఇందులో ఏముందో చెప్పు’ అంటే అన్ని
మరిచిపోతాడు . అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా
పిల్లలందరూ ముచ్చటపడే ఆట ఒకటుంది . అదే౦టంటే దాగుడు మూతలు . చిన్నపిల్లలు ఎక్కడ
ఉన్నా, ఏ దేశానికి చెందిన వారైనా, తాము ఇతరులకు కనిపించకుండా దాక్కో గలగడాన్ని చాల
గొప్పగా భావిస్తారు . అందువల్ల మనం మొగం మీద గుడ్డ కప్పుకుని నువ్వు ఎక్కడున్నావని
వెదుకుతున్నట్లు నటిస్తే పిల్లలు అన్ని మరిచిపోయి మళ్లా ఉత్సాహంగా ఉంటారు .
మరో
ముఖ్యమైన విషయం ఒకటుంది . పిల్లల్ని ఎప్పుడు ఏదో మాట్లాడిస్తో ఉండాలి. వాళ్ళు
సమాధానం చెప్పగలిగినా, చెప్పలేక పోయినా, మనం మాట్లాడిస్తూనే ఉండాలి .
ఒక వస్తువును చూపించి అది ఏమిటి ?ఇది ఏమిటి? అని అడుగుతూ ఉండాలి . ఒక ప్రఖ్యాత విద్యావేత్త మాటల్లో చెప్పాలంటే
The
most important thing you can do for your children is to talk to them, even when
they are too young to answer (Joanna Moorhead).
ఇక
మూడో విషయ౦ ఏ౦టంటే, వాళ్ళు మనల్ని ఏమి అడిగినా, ఎంత విసిగి౦చినా విసుక్కోకుండా మనం
అన్నిటికీ ఓపికగా సమాధానం చె ప్పాలి.
పిల్లల్ని తల్లిదండ్రులు ఐదేళ్ళ
వరకు మహారాజులా పెంచాలి . ఆ తరువాత పదేళ్ల పాటు చాల కట్టు దిట్టంగా క్రమశిక్షణలో
పెంచాలి . ఇక పదహారవ ఏడూ రాగానే మిత్రునివలె చూడాలి అన్నారు .
పుట్టినది
మొదలు ఐదవ ఏటివరకు పసితనం . వారికేమి తెలియదు . అందువల్ల వారిని ఏమీ అనకూడదు . అల్లారు ముద్దుగా పెంచాలి, మొద్దుగా
కాదు . కొట్టడం , తిట్టడం లా౦టివేమి చెయ్యకూడదు. అల్లరి చేస్తోంటే నివారించకూడదు .
ఇక ఆరవ
ఏటి నుండే అసలు కథ మొదలౌతుంది. అది తెలిసీ తెలియని వయస్సు .
మా
మిత్రులు బాలబంధు నరసింహారావుగారు అని
ఒకాయన ఉండేవారు . ఆయన Inspector of schools గా పని
చేసేవారు . ఆయన నాతో ఎప్పుడూ Children are born good but, bread
bad అంటూ ఉండేవారు . ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తోంది . పెద్దవారే పిల్లల్ని చెడగొడుతున్నారు. ఉదాహరణకి వాళ్లకి తినడానికి ఏదో పెట్టి,
నువ్వు ఎవరు చూడకుండా ఇక్కడే తినెయ్యి , బయటకు తీసికెల్లకు, వాల్లందరూ అడుగుతారు
అంటాం .
ఆ
మాటలు వాళ్ళను ఎంతో ప్రభావితం చేస్తాయి . ఏదీ ఎవరికీ పెట్టకుండా మనం ఒక్కళ్ళమే
తినెయ్యాలనే , సంకుచితమైన మనస్తత్వానికి
అవి దారితీస్తాయి. అలాగే బయట ఎప్పుడైనా,
ఏదైనా ఒక సంఘటన జరుగుతున్నప్పుడు దానికి మన
పిల్లవాడు స్పందించినప్పుడు “నీకెందుకు? నువ్వు నోరు మూసుకుని కూర్చో , బయటికి వెళ్ళకు, అని కట్టడి చేస్తాం . ఈ విధంగా వాళ్ళల్లో సహజంగా ఉన్న స్పందించే
తత్త్వాన్ని మనం ఆపేస్తున్నాం . అప్పటికది
చిన్న విషయమే కావచ్చును గానీ అది పెద్దయ్యాక వాళ్ళల్లో ఉదాసీనతా భావాన్ని
పెంచుతుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు
స్పందించరు.
అందువల్ల
చిన్నప్పటి నుంచే వాళ్లకు పరస్పరం ఇచ్చి, పుచ్చుకునే ఆలోచనలు కలిగించాలి. ఏది మంచో
, ఏది చెడో, తెలుసుకునే లాగా చెయ్యాలి. అంతే కాకుండా మనం ఎవరికంటే ఎక్కువ కాదని, మన కంటే
ఎవరు తక్కువ కాదని పిల్లలకు తెలియ జెయ్యాలి .
కులం, గోడలకు , మతం, మందిరాలకు పరిమితం చెయ్యాలి. మత దురభిమానం , జాత్యహంకారం పిల్లల మనస్సులో ప్రవేశించకుండా
జాగ్రత్తపడాలి . ఆ రెండు ఉన్నవాళ్లు ఎవరూ
సమాజంలో బాగుపడిన దాఖలాలు లేవు . ఒకవేళ
తాత్కాలికంగా వారు లాభం పొందినా తరువాత వారు పొందే నష్టం అంతవరకు పొందిన లాభం
కంటే చాల ఎక్కువ. మనం వాళ్ళ అభిరుచులను
గమనిస్తూ ఉండాలి, వాళ్లకి మన అభిప్రాయాలను రుద్దకూడదు .
వారికి
మంచిని మంచి గాను; చెడును చెడు గాను గ్రహించే వివేకం నేర్పాలి .
ఎన్నడు
భయపెట్ట కూడదు. ధైర్యం , సాహసం అలవాటు చెయ్యాలి. వారికి ఎన్నడు నిరుత్సాహకరమైన
మాటలు చెప్పకూడదు . ఉత్సాహకరం గానే వారితో మాట్లాడాలి .
వాళ్ళు
ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనం ఎప్పుడు కట్టడి చెయ్య కూడదు. మన, ప్రమేయం ఎంత తక్కువగా ఉంటే వారు అంత గొప్పగా పెరుగుతారు
. వాళ్ళ అభిరుచుల ప్రకారం వారిని పెరగనివ్వాలి. మన సంకుచితమైన అభిప్రాయాలను వారిపై
రుద్ద కూడదు. వారు ఎప్పుడైనా, తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు మాత్రమె మనం
కలుగజేసుకోవాలి. మిగిలినదంతా మన ప్రవర్తనద్వారానే వారికి ఆదర్శంగా మెలగడం నేర్పాలి . వారు ఎప్పుడు మన
ప్రవర్తననే ఆదర్శంగా తీసుకుంటారు . వాళ్ళ ముందు మనం చాల జాగ్రత్తగా నడుచు కోవాలి. మనం
రామాయణం చదివితే మనకు ఒక విషయం తెలుస్తుంది. దశరథుడు కూడా రామునికి భయపడి అతని
ముందు చాల జాగ్రత్తగా మెలిగే వాడట. కాబట్టి
పిల్లలకు ఆరు నుంచి పదిహేను వరకు చాల ప్రధానమైన దశ . ఈ దశలో వారు సక్రమంగా ఉంటే
వాళ్ళ గురించి ఆలోచించవలసిన పనిలేదు. ఆ తరువాత వాళ్ళని మిత్రుల్లాగ చూడాలి . అడిగినప్పుడు మంచి మంచి
సలహాలిస్తూ ముందుకు నడిపిస్తే చాలు . అందుకే అన్నారేమో ప్రాప్తేతు షోడశే
వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అని .
సర్వకాల
సర్వావస్థలలోనూ ఒక్కటి మాత్రం తప్పకుండా పాటించాలి .
మంచిని
మంచి గాను, చెడును చెడు గాను, ఖచ్చితంగా చెప్పాలి . అంతేగాని మొహమాటానికో, భయంతోనో
తప్పును ఒప్పు గాను , ఒప్పును తప్పు గాను
చెప్పకూడదు . ఒకవేళ వారు తాత్కాలికంగా మనమాట
వినకపోయినా తరువాత తెలుసుకుంటారు. ఒక వేళ
మనం తప్పును తప్పుగా ఖండించి చెప్పకపోతే ఆ తరువాత మనల్ని తిట్టుకుంటారు . పరాయి
వాడైనా మంచి చేస్తే అతనిని మెచ్చుకునే లాగా,
తనవాడైనా చెడు చేస్తే విమర్శించే లాగ కట్టు దిట్టంగా పెంచితే మనం పిల్లలకు
న్యాయం చేసినట్లే . ఈ విషయంలో నేటి మన కన్నా మన
పూర్వీకులు చాల నయం . ఇక ఏ కారణం చేతనైనా పిల్లవాణ్ణి
తల్లి మందలిస్తే తండ్రి పిల్లవాణ్ణి వెనకేసుకు రావడం
గాని, తండ్రి మందలిస్తే తల్లి వెనకేసుకు
రావడం గాని జరుగ కూడదు. అలాగే జరిగితే క్రమశిక్షణ లోపిస్తుంది . ఇక పిల్లల పెంపకం విషయంలో తండ్రి కంటే తల్లి
బాధ్యతే ఎక్కువ . మనం మహనీయులుగా భావించే
వివేకానందుడు , శివాజీ , గాంధీ వంటి
మహనీయులు తమ అభివృద్ధికి వారి తల్లులే కారణమని సగర్వంగా చెప్పుకున్నారు
.
<><><>
No comments:
Post a Comment