Wednesday, October 29, 2025

అనుభవాలు జ్ఞాపకాలు -13

 

అనుభవాలు జ్ఞాపకాలు -13

రచన: డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు


నేను ఆగ్రాలో ఉంటున్నప్పుడు ఒకసారి మా మేనకోడలు చి||సౌ||లలిత  మా ఇంటికి  వచ్చింది . అది డిసెంబరు నెల. మా అమ్మాయి, తను ఎక్కడికైనా తీసికెళ్ళమని నన్ను అడిగారు. ‘మథుర’ అప్పటికే చాల సార్లు చూడడం జరిగింది . ‘ఫతేపూర్సిక్రీ’ కూడ ఐపోయింది . ఇక అతి చేరువలో  ఒకటే మిగిలి ఉంది. అదే భరత్ పూర్ .    మన దేశంలో ఈ పట్టణానికి  ఒక ప్రత్యేకత ఉంది. శీతకాలంలో అంటే తీవ్రమైన చలికాలంలో కొన్ని వందల, వేల వలస పక్షులు తమ ప్రాంతాల్లో  ఉండే   చలికి తట్టుకోలేక  చైనా, రష్యా ,  సైబీరియా మొదలైన అతి శీతల ప్రాంతాలనుంచి ఇక్కడకు వచ్చి తలదాచుకుంటాయి. కొన్నాళ్లు అంటే కొన్ని నెలల పాటు  ఇక్కడ ఉండి చలి తగ్గుముఖం పట్టగానే తిరిగి వెళ్లి పోతాయి . కొన్ని పక్షులు కొల్లేరు కూడ చేరతాయి . ఇక్కడ మనదేశంలో  వాటికి ఆశ్రయం కల్పించి రక్షిస్తారు. నేను కృష్ణాజిల్లాలో చాల  సంవత్సరాలు పనిచేసినా అటు ‘కొల్లేరు’ గాని, ఇటు ‘మంగినపూడి’ బీచికి గాని ఎన్నడు వెళ్లలేకపోయాను. అవకాశం దొరకలేదు. ఆ సంగతలా ఉంచుదాం. ఇక కుటుంబ సమేతంగా బయలుదేరి  ‘భరత్ పూర్’ చేరుకున్నాం . కొన్ని వందల, వేల వలస పక్షులకు సహజమైన  ఆ వాసాలు మనకు అక్కడ కనిపిస్తాయి . అవి ఆనందంగా సంచరిస్తూ మనకు కనువిందు చేస్తాయి. కిలకిలారావాలతో వీనులవిందు కూడ సమకూరుస్తాయి . ఒకసారి అక్కడ ప్రవేశించిన వారికి వెంటనే తిరిగి రావాలని అనిపించదు. ఎంతసేపు ఉన్నా సమయం తెలియదు . రకరకాల పక్షులు ఉంటాయి కాబట్టి  ఎన్ని సార్లు చూసినా ఏవేవో ఎన్నడూ చూడనివి,  కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి. మన వారు వాటిని ప్రేమతో ఆహ్వానిస్తారు. అవి వెళ్లిపోతుంటే బాధతో సాగనంపుతారు. అక్కడ ఉన్నంత సేపు నాకు మాత్రం ఎందుకో ‘సర్వం పక్షిమయం జగత్’ అనిపించింది.

ఎన్నో జ్ఞాపకాలు మనస్సులో చోటు చేసుకున్నాయి . ముఖ్యంగా నేను ఒకప్పుడు హిందు పత్రికలో చదివిన రెండు ఉత్తరాలు మనస్సులో మెదిలాయి . మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ  ఆనాటి పాకీస్థాన్ అధ్యక్షులు జనరల్ జియా ఉల్ హక్ గారెకి ఒక ఉత్తరం వ్రాస్తూ  అయ్యా! కొన్ని వందల వలస పక్షులు కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి  ప్రయాణం చేసి మా దేశంలోకి వస్తున్నాయి. అవి మీ దేశం మీదుగా వస్తాయి . మీరు దయ జేసి వాటికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా చూడండి అని ఆ ఉత్తరంలోని సారాంశం . ఆ నాడు మనకు వారికి ఇంతకంటే మెరుగైన సత్సంబంధాలు ఉండేవి . ఆయన వెంటనే సమాధానం వ్రాశారు. అమ్మా! మీ లేఖ అందింది. వాస్తవానికి మా దేశంలో పక్షుల వేట నిషేధం .  ఇక మీరు ప్రత్యేకంగా మమ్మల్ని అభ్యర్థించడం వలన వాటి గమనానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇతోధికంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటాము అని ఉత్తరం వ్రాశారు. ఈ రెండు ఉత్తరాలను హిందూపత్రిక ప్రచురించింది . నేను ఆ ప్రాంతంలో తిరుగుతున్నంత సేపు ఇవి నా మనస్సులో చోటు చేసుకున్నాయి.                   

                                       <><><>

 

No comments: