Tuesday, October 7, 2025

దశావతార పరిశీలన డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

                                                                       దశావతార పరిశీలన

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

 

భగవంతుడు విద్యుత్తు లాంటివాడు . అది సూటిగా ఎవరికీ ఉపయోగపడదు. అంతే కాకుండ అది ఉపయోగించుకోవాలని ఎవరు అనుకోకూడదు . ఎందుకంటే   దాన్ని ముట్టుకుంటే చచ్చిపోతాం కూడ. ఇక అవతార పురుషులు విద్యుదుపకరణాల వంటి వారు. ఏ విధంగా విద్యుత్తు తాను  కనిపించకుండానే రేడియో , టి.వి,  మొదలైన  అనేక సాధనాలద్వారా ప్రసరిస్తూ అందరికీ ఉపయోగ పడుతోందో, ఏ విధంగా ఆత్మ అని పిలవబడే చైతన్యశక్తి తాను కనిపించకుండానే ఇంద్రియాలద్వారా అనేకమైన పనులు చేసుకుంటూ పోతోందో,  అదే విధంగా భగవత్తత్వం  ఆయా కాలాల్లో అందరికీ ఉపయోగపడడం కోసం అనేక రూపాల్లో అవతరించడం మనం గమనిస్తాం . “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అనే మాటల్లోని ఆంతర్యం కూడ ఇదే అనుకోవచ్చు . ఇక ఆ రేడియోలో కరెంటు వేరు , ఈ ఫ్యాను లో కరెంటు వేరు అని మనం అనలేం . ఒకే కరెంటుతో  అక్కడ రేడియో మొరుగుతోంది, ఇక్కడ ఫ్యాను తిరుగుతోంది .   అలాగే నేను ఎవర్ని చూస్తున్నానో, ఆయన తోనే మాట్లాడుతున్నాను అనే అనుభవాన్ని విశ్లేషిస్తే అక్కడ  చూసేది కన్ను, మాట్లాడేది నోరు . కన్ను జ్ఞానేంద్రియం , నోరు కర్మేంద్రియం . అవి వేర్వేరు, అవి చేసే పనులు కూడ వేర్వేరు . కానీ ఈ రెండు నేనుతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆ రెండు పనులు చేసేది ఒకటే . అలాగే అవతారాలు వాటి ప్రయోజనాలు వేరైనా అవి ధరించే భగవంతుడు ఒక్కడే అనేది అల్పజ్ఞానం కలవాడికి కూడ అర్థమయ్యే విషయమే.        

ఇక మన సంస్కృతిలో వివరించబడిన   దశావతారాలు జీవ పరిణామ, వికాసాలకు ప్రతీకలని   కొంతమంది భావిస్తున్నారు. . దశావతారాలు  మనకు తెలుసు.

మత్స్య: కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన:

జామదగ్న్యశ్చ రామశ్చ కృష్ణో బుద్ధశ్చ  కల్కి చ 

 

1.          మత్స్యావతారం 2. కూర్మావతారం 3. వరాహావతారం 4. నారసింహావతారం 5. వామనావతారం 6. పరశురామావతారం 7. రామావతారం 8. కృష్ణావతారం

9. బుద్ధావతారం        10. కల్క్యవతారం .

అని పురాణాలు చెపుతున్నాయి. వాటి ప్రయోజనాలు కూడ చెప్పడం జరిగింది.

1. వేదానుద్ధరతే 2. జగన్నివహతే 3. భూగోళముద్బిభ్రతే

4. దైత్యం దారయతే 5. బలిం ఛలయతే  6. క్షత్రక్షయం కుర్వతే

7. పౌలస్త్యం జయతే 8. హలం కలయతే 9. కారుణ్యమాతన్వతే

10. మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతికృతే కృష్ణాయ తుభ్యం నమ:  

అని గీతగోవిందకారుడు కృష్ణస్తుతి చేస్తూ బలరాముని అవతార పురుషునిగా చెప్పేడు. 

 ఆ విషయం అలా ఉంచుదాం .

 ఇక సృష్టిలో ముందు “ఆప ఏవ ససర్జాదౌ”    అనే వైదిక వాక్యాన్ని బట్టి మొట్టమొదట నీరు పుట్టిందని భావించడంలో తప్పులేదు. ముందుగా ఆ నీటి నుంచి చేప పుట్టింది.  ఆ చేప క్రమక్రమంగా పరిణామక్రమంలో కూర్మం అయింది .  చేప కేవలం నీటిలోనే ఉండ గలదు. అది ఉభయ చరం amphibian గా పరిణమించింది .  అదే కూర్మావతారమై  (తాబేలు) ఐయుంటుంది. అది ఉభయచరం. అది నీటిలోను    బయట కూడ జీవిస్తుంది . కాలం గడిచే కొద్దీ  అది వరాహంగా పరిణమించింది. అది నాలుగు కాళ్ళతో కూడిన సంపూర్ణమైన జరాయుజం mammal. జరాయుజం అంటే గర్భాశయం నుంచి పుట్టినది .  ఆ తర్వాత నారసింహావతారం. ఇది  జంతువుకి మనిషికీ ఉండేటటువంటి మధ్యస్థితి. నారసింహావతారం సగం జంతువు, సగం మనిషి . ఆ తర్వాత వామనావతారం . ఇది ఒక పొట్టి మనిషికి ప్రతీక . దాని తర్వాత అవతారం పరశురామావతారం . పరశు అంటే గొడ్డలి . గొడ్డలితో జంతువులను వధించే ప్రాచీన ఆటవిక జాతి మానవులకు వర్తిస్తుందని కొందరు భావించారు.  తర్వాత అవతారం రామావతారం . అది ముందటి అవతారం  కంటే కొంచెం పరిణతి పొందింది. గొడ్డలితో జంతువులు వేటాడాలంటే మనిషి వాటి దగ్గరకు చేరాలి . అది ప్రమాదంతో కూడినది . కానీ బాణం కనిపెట్టడం చేత దూరం నుంచే జంతువులను వధించవచ్చు . ఆ విధంగా అది పరశురాముని  అవతారం కన్నా కొంచెం మేలైన అవతారం. రామావతారం బాణానికి ప్రతీక . ఇక తర్వాత అవతారం కృష్ణావతారం. ఇది  చక్రానికి ప్రతీక . మానవ నాగరికతలో   మానవ ప్రగతికి  చక్రం అనేటటు వంటిది కనిపెట్టడం ఒక పెద్ద మలుపు అని చెప్పక తప్పదు . చక్రం కనిపెట్టాకనే  మానవ వికాసం అంతులేనంత అధికంగా పెరిగింది. కృష్ణావతారం చక్రానికి ప్రతీక అని పెద్దలు  భావించారు. ఒకవేళ బలరామావతారం(హలాయుధుడు) తీసుకున్నా హలం అంటే నాగలి కాబట్టి  అది వ్యవసాయా విర్భావానికి చిహ్నం అనుకోవచ్చు . మానవ నాగరికతలో వ్యవసాయం ఒక మైలు రాయి . ఆ తర్వాత అవతారం బుద్ధావతారం . ఇది బుద్ధి వికాసానికి ఒక ప్రతీక . తర్వాత కల్కి అవతారం. ఇంత వరకు ఒక కొలికికి రాని అవతారం ఇది . దీని గురించి నాకు బొత్తిగా ఏమీ తెలియదు .

ఇక సాంకేతిక దృష్టి వేరు , మత విశ్వాసాలు వేరు . అంతేకాక ఎవరికీ ఏదీ చెప్పలేని పరిస్థితి నేటి సమాజంలో ఉంది . చెప్పడం కూడ అనవసరం , ఎందుకంటే  చెప్పినా ఎవరు నమ్మరు. ఉదాహరణకు చార్లెస్ డార్విన్ (1809- 1882)  మహాశయుని పరిణామ సిద్దాంతం ఉంది.    దాని ప్రకారం ఈ సృష్టి ఒక  పరిణామం . కాని యూదుల (క్రైస్తవమతానికి పూర్వం వారు) మత విశ్వాసం ప్రకారం ఈ సృష్టి ఆఱు రోజుల్లో జరిగిందని చెపుతారు . భగవంతుడు ఆఱు రోజుల్లోనే ఈ ప్రపంచాన్ని సృష్టించి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడని  నమ్ముతారు . దీన్నే subbath-day అంటారు. అందుకే ఆదివారం ఏ పని చేయకూడదని సెలవు దినంగా ప్రకటించడం మనందరికి తెలిసిన విషయమే . కాని  ఈ నాటికీ  ఆ మతవిశ్వాసం వాళ్ళని వదలి పోలేదు. అమెరికాలోని కొన్ని విద్యాలయాల్లో  డార్విన్ పరిణామసిద్దాతవాదం సిలబస్సులో ఉంటుంది . కాని అది పాఠంగా చెప్పకూడదు . ఒకవేళ ఎవరైనా సాహసించి చెపితే యాజమాన్యం వాళ్ళని ఏమీ అనదు . ఆ రోజు వరకు ఇవ్వవలసిన జీతం ఇచ్చేసి వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేస్తుంది. ఈ విధంగా మతం మతం లాగ, శాస్త్రం శాస్త్రం లాగ సాగుతున్నాయి . ఎవరి విశ్వాసాలు వారివి. కొంతమంది రెండు సమన్వయం చేసుకుంటారు. మరికొంతమంది దేనికదే నమ్ముతారు. ‘లోకో భిన్నరుచి:’  అన్నాడు కదా కాళిదాసు.      ఎవరి నమ్మకం వారిది . ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి నేటిది.   

                                                        <><><>

No comments: