Wednesday, August 21, 2013

నీకంటే నాలుగాకులెక్కువే చదివాను


నీ కంటే నాలుగాకులెక్కువే చదివా
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
/౧౦౬,ప్రేమనగర్, దయాల్బాగ్ ,ఆగ్రా.
పూర్వం గ్రంథాలు తాటియాకులపై వ్రాసేవారు. అందువల్ల తెలివైన వాళ్లని నాలుగాకులు ఎక్కువ చదివినవాడని అనేవారు. సరే ఆ సంగతలా ఉంచుదాం. శ్రీ కృష్ణునికి చాల మంది భార్యలున్నారనే విషయం మనందరికి తెలిసిందే. గోపికాకృష్ణుల ప్రేమ అమలిన శృంగారానికి ( platonic love) ఒక చక్కని ఉదాహరణ . అందుకే శ్రీ జాషువ కృష్ణుణ్ణి వర్ణిస్తూ :
' పదియాఱువేల గోపస్త్రీలతోగూడి
యపవాదు నెఱుగని యందగాడు' అంటారు.
ఆయనకు అందరు సమానమే అయినా సత్యభామకు కృష్ణుడు తన స్వంతం అనే భావన ఉంది. ఎప్పటికప్పుడు తన చెప్పుచేతల్లో ఉంచుకుని తనచుట్టు తిప్పుకుంటో ఉంటుంది. ఒకనాడు కృష్ణుడు సత్యభామ ఇంటికి తొందరగా వెళ్లవలసి ఉంది. కాని ఎందుకో చాల ఆలస్యమై పోయింది. ఆమె కూడ ఆయన రాకకు వేచి వేచి విసిగి వేసారి పోయింది. అసలే ఆమె కోపంలో దూర్వాసమహర్షికి చెల్లెలని చెప్పుకోవచ్చు. ఆమె కోపం తీవ్రస్థాయికి చేరుకుంది. అతను వచ్చి ఎంత అరిచి గీపెట్టినా తలుపు తీయనే తీయకూడదనే నిర్ణయానికొచ్చేసింది. ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంది. అంతలోనే కృష్ణుడు వచ్చాడు. తలుపు కొట్టాడు. వినిపించినా వినబడనట్లు నటించింది. ఆయన తలుపులు బాదుతూనే ఉన్నాడు. ఆమె సహనం కోల్పోయింది. తలుపు తీయకుండనే లోపలనుంచి
' తలుపుకొడుతున్నదెవరు?
( అంగుళ్యా క: కవాటం ప్రహరతి?) అంది.
వెంటనే 'ఓ కుటిలమైన దానా నేను మాధవుణ్ణి ( కుటిలే మాధవ: ) అన్నాడు. 'మాధవ' అనే పదానికి కృష్ణుడు అనే అర్థంతో బాటు వసంతుడు అనే అర్థం కూడ ఉంది. వసంతుడంటే మన్మథుని స్నేహితుడు చాల తుంటరివాడు. సత్యభామ ఆ అర్థం తీసింది. అయితే నువ్వు వసంతుడువా (కిం వసంత: )అంది. కృష్ణుడు గతుక్కుమన్నాడు. ఎలాగో సంభాళించుకున్నాడు.
వెంటనే కాదు నేను చక్రిని చక్రం ధరించిన వాణ్ణి (నో చక్రీ) అన్నాడు. వెంటనే ఆవిడ అయితే నువ్వు కుమ్మరివాడివా?( కిం కులాల:?) అనడిగింది.

కుమ్మరి వాడి దగర కూడ చక్రం ఉంటుంది కదా ! ఈ సమాధానం ఆయన ఊహించనే లేదు. వెంటనే ఆమెతో 'నేను భూమిని మోసినవాణ్ణి (న హి ధరణిధర: ) గుర్తు పట్లేదా!' అన్నాడు . అవును ఆయన వరాహావతారమెత్తి భూమిని మోయడం జగద్విదితమే కదా ! ఆమె గుర్తుపట్టి తలుపుతీస్తుం దనుకున్నాడు. కాని పని జరగలేదు. ' అయితే రెండునాలుకలున్న పామువా' ( కిం ద్విజిహ్వా ఫణీంద్ర: ) అంది. అవును మరి ఆది శేషువు కూడ భూమిని మోశాడు కదా . అందుకే అలా అంది . సరేలే ఎప్పుడో వరాహావతారసమయంలో జరిగిన విషయం కదా! గుర్తుపట్టి ఉండదు. ఇప్పటి కృష్ణావతారంలో జరిగిన విషయం చెబితే పని జరుగుతుందనుకున్నాడు . ' నేనే, గొప్ప పాముని ( కాళియుని) మర్దించినవాణ్ణి ( నాహం ఘోరాహిమర్దీ) గుర్తుకు రాలేదా అన్నాడు. ఓహో అదా సంగతి అటైతే నువ్వు గరుత్మంతుడివన్న మాట ( కిముత ఖగపతి: ) అంది. నిజమే మరి గరుత్మంతుడు కూడ పాముల్ని చంపుతాడుగా. అలా దెబ్బకొట్టింది. సరే ఈ డొంకతిరుగుడెందుకు. తిన్నగా తన పేరే చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. నేను గరుత్మంతుణ్ణి కాదే, హరిని ( విష్ణువుని) అన్నాడు. ఈసారి తలుపు తీయడం ఖాయం అనుకున్నాడు. కాని అప్పుడు కూడ ఎదురుదెబ్బే తగిలింది. ఈయన దురదృష్టమో అదృష్టమో తెలియదు గాని హరి అనే పదానికి కోతి అనే మరొక అర్థం కూడ ఉంది. వెంటనే సత్యభామ అతనితో ' అటైతే నువ్వు కోతివా ? అంది.

కృష్ణుడు మరేమీ మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు కూడ కృష్ణుని కంటే నాలుగాకులెక్కువే చదివిన సత్యభామనే విజయం వరించింది. ఈ విధంగా సత్యభామ గమ్మత్తైన మాటలకు చిత్తుగా ఓడిపోయిన కృష్ణమూర్తి మనందరిని రక్షించుగాక అని ఒక కవి ఈ అద్భుతమైన శ్లోకం వ్రాశాడు. శ్లోకం కూడ చదవండి మరి.
అంగుళ్యా: : కవాటం ప్రహరతి ? కుటిలే! మాధవ: ,కిం వసంత: ?
నో చక్రీ , కింకులాల: ? నహి ధరణి ధర:, కిం ద్విజిహ్వా ఫణీంద్ర: ?
నాSహం ఘోరాహి మర్దీ , కిముతఖగపతి:? నో హరి:, కింకపీంద్ర: ?
ఇత్యేవం సత్యభామాప్రతివచనజిత: పాతు న: చక్రపాణి: