Sunday, March 14, 2021

శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారి కవి నిందాస్తుతులు -2 (Ironical praise of some Telugu poets)

 

శ్రీ మల్లంపల్లి  వీరేశ్వరశర్మ గారి

కవి   నిందాస్తుతులు -2

(Ironical praise of some Telugu poets)


డాక్టర్. చిలకమర్తి దుర్గా ప్రసాద రావు  

 ఇతిహాసయుగం నుంచి సరాసరి  శ్రీనాథయుగానికొద్దాం. శ్రీనాథుడు సామాన్యుడు కాడు. బ్రాహ్మీదత్తవరప్రసాదుడు, ఉరుప్రజ్ఞావిశేషోదయాజిహ్మస్వా౦తుడు, ఈశ్వరార్చన కళాశీలుడు,     బ్రహ్మాండాది మహా పురాణ చయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిధి . మా గురుదేవులు  శ్రీనాథుని కూడా విడిచి పెట్టలేదు . ఆయన గురించి ఇలా అంటారు .

 నైషధంబంతయు నాశనంబొనరించె.

శ్రీ నాధునకు సిగ్గు సెరము లేదు

ఈ విషయం కొంచెం ముచ్చటించు కుందాం . హంస తనకు నలమహారాజుతో గల సన్నిహిత సంబంధాన్ని దమయంతికి  చెబుతూ “ ఓ దమయంతీ ఆ నలుడు అంత: పురస్త్రీలతో కామక్రీడల్లో విహరించి అలసిపోయి ఉండగా ఎప్పుడు అతని సమీపంలోనే ఉ౦డే  నేను నా రెక్కలతో విసిరి అతని శ్రమను పోగొట్టేదాన్ని అని అతనితో తనకున్న అత్యంత సన్నిహితత్వాన్ని వివరిస్తుంది . ఈ విషయాన్ని మూలనైషధకారుడు భట్టహర్షుడు   “ తo వీజయామ: స్మరకేళి కాలే”  అని వర్ణిస్తే శ్రీనాథుడు పెద్ద గొప్పగా  “వీతునతనికి వైశాఖ వేళలందు” అని మార్చాడు .  వేసవికాలంలో వీచడానికి సాన్నిహిత్యం అవసరం లేదు , డబ్బు పడేస్తే ఎవరైనా విసురుతారు . 

 ఇక ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని  వారి దగ్గరకొద్దాం.  అల్లసానివారు తన మనుచరిత్రలో---  వరూధిని,  ప్రవరాఖ్యుని ముద్దుపెట్టుకోడానికి ప్రయత్నించగా పరమఛాందసుడు ,  కొంచెం కూడ రసికతలేని   ఆ ప్రవరుడు ఆమెను త్రోసేసి, అక్కడున్న మడుగులో  స్నానం చేసి తన మంత్ర బలంతో ఇంటికి చేరుకున్నాడట . ఆ ప్రవరాఖ్యుని రసికతా  రాహిత్యాన్ని , పెద్దనగారి పెద్దరికాన్ని విమర్శిస్తూ  ...

   “ పెద్దన్న ఎంతటి దద్దమ్మయో గాని

ప్రవరాఖ్యు నొక గోత (బాఱనూకె”  అన్నారు

ఇక పింగళి సూరనంటే మా గురువుగారికి పరమప్రీతి. తాను కళాపూర్ణోదయాన్ని తలపించే ఒక కావ్యాన్ని వ్రాస్తున్నానని అనేవారు . అదేమై౦దో మాకు తెలియదు . సరే! ఆ సంగతలా ఉంచుదాం.  ఇక సూరన రచించిన కళాపూర్ణోదయకావ్యంలో కథ ఎక్కడో మధ్యలో మొదలౌతుంది . ఆ విషయాన్ని ఆలంబనగా చేసుకొని ఆక్షేపణగా ...

 “ తలతోక తెలియని తలతిక్క కథ వ్రాసె

పింగళి సూరన్న వెంగళప్ప”

అన్నారు . ఇక ముక్కు తిమ్మన గారి  విషయాని కొద్దాం.  సంసారంలో భార్యాభర్తల మద్య వివాదం సర్వసాధారణం .  ఒకొక్కప్పుడు చిలికి చిలికి గాలివాన అయినట్లుగా వాదం ముదురుతుంది . గుద్దుకోడం, తన్ను కోడం కూడ జరగొచ్చు . అటువంటి సమయాల్లో సంయమనం అవసరం. Woman వెనుక man లాగ She వెనుక he లాగ మగవాడు ఎంత వెనుకబడి ఉన్నా పెళ్ళాం తన్నితే తిరగబడాలి లేదా సద్దుకుపోవాలి అంతే గాని మెచ్చుకోవడం, సముదాయించడం సమంజసం కాదు. ప్రస్తుత విషయానికొస్తే  శ్రీకృష్ణుని సత్యభామ తన్ని౦ది . గట్టిగానే తన్ని ఉ౦టు౦దనుకుందాం. ఎడమ కాలితో మరీ తన్నింది . ముక్కు తిమ్మన ఆ విధంగా తన్నడాన్ని మృదువుగా “ వామ పాదంబున౦ దొలగంద్రోచె లతాంగి  అంటాడు. ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకని   అందుకే అన్నారేమో పెద్దలు . అప్పుడు తన్నులు తిన్న కృష్ణుడు ఆమెపై కోప్పడ లేదు సరికదా ఆమెతో “ ఓ దేవి! నా శరీరంలో ఏర్పడిన పులకలనే ముళ్ళు గుచ్చుకుని నీ పాదం ఎంత నొచ్చుకుందో కదా!” అని ఆమెను సముదాయించాడు.     మత్తనుపులకాగ్రకంటకవితానము తాకిన నొచ్చు నంచు నే ననియెద  నల్క మానవు కదా!  యిక నైన నరాళ కుంతలా! అంటాడు . అందుకే మా గురువుగారు   పెండ్లాము తన్నితే భేషు భేషన్నాడు ముక్కు తిమ్మన్నకు బుద్ధి లేదు”  అన్నారు

మరొక కవి తెనాలి రామకృష్ణుడు. ఆయన సామాన్యుడు కాదు . చిచ్చర పిడుగు. ఆయన ‘పాండురంగ మాహాత్మ్యం’ అనే అద్భుతమైన కావ్య౦  రచించాడు. శ్రీ రామ కృష్ణుని పాండు రంగ మాహాత్మ్యంలో  నిగమశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకుడు౦టాడు. వాడు నేతిబీరకాయ లాంటివాడు. నేతిబీరకాయలో నెయ్యి లేనట్లే అతనిలో ఎటువంటి వేదవిద్యావాసనలు లేవు, పైగా పచ్చి త్రాగుబోతు , తిరుగుబోతున్ను . పెళ్ళిచేస్తే దార్లోకొస్తాడేమో అనే ఆశతో అతని అక్కక ఒక అందమైన అమ్మాయినిచ్చి వివాహం చేయిస్తుంది .  కనకపు సింహాసనం పై కూర్చోబెట్టినా కుక్క కుక్కే . వాడిలో ఎటువంటి మార్పు లేదు .

అక్క బ్రతిమలాడితే ఒకసారి ఎప్పుడో ఇంటికొచ్చాడు. అక్క తలంటి , భోజనం పెట్టి , భార్య చెంత పడుకో పెట్టింది . వాడు తేనె పూసిన కత్తి . నిద్ర నటి౦చాడు. అర్ధ రాత్రి ఎప్పుడో లేచాడు . ఇంట్లో ఉన్న నగలన్ని మూటగట్టుకు పోయాడు. ప్రొద్దుటే లేచి చూసుకుంటే ఏముంది ? ఇల్ల౦తా  గుల్లైంది . అపుడు నిగమశర్మ అక్క తన నగలన్నీ పోయినందుకు బాధ పడలేదట . ఒక్క   ముక్కుపుడక పోయినందుకు హృదయ విదారకంగా ఏడ్చిందట . ఈ విషయాన్నే   

 ముక్కఱకేడ్పి౦చె నక్కను చివరకు

రామలింగడు కొక్కె రాయి గాడు”   అన్నారు శర్మ గారు. ఇక్కడ ఎన్ని నగలు పోయినా వాటికోసం ఏడవకు౦డా కేవలం ముక్కు పుడక కోసమే ఎందు కేడ్చి౦దంటే అది పుట్టి౦టివారిచ్చిన కానుక . ఆడువారికి చాల విలువైంది , అందుకే ఆమె   బాధ పడింది. ఈ సందర్భంలో పరిహాస పూర్వకంగా శ్రీ శర్మగారు “ముక్కఱకేడ్పి౦చెనక్కను చివరకు

రామలింగడు కొక్కెరాయి గాడు”  అన్నారు .

ఇక తెనాలి వారి నుంచి ఆ యన దృష్టి భట్టుమూర్తిపై  పడింది. భట్టుమూర్తి ఒక శ్లేషకావ్యాన్ని( వసుచరిత్ర)  ఒక ద్వ్యర్థి కావ్యాన్ని (హరిశ్చంద్ర నలోపాఖ్యానం ) , ఒక అలంకార శాస్త్ర గ్రంథాన్ని ( నరసభూపాలీయం )     మనకందించిన మహనీయుడు. ఆయన   రచించిన కావ్యాల్లో శ్లేష ఎక్కువగా ఉంటుంది . శ్లేష వేరు ద్వ్యర్థి వేరు . అనేక అర్థాలు౦డే పదాలతో విన్యాసం చెయ్యడం శ్లేష. గ్ర౦థమంతా ఆములాగ్ర౦. రెండర్థాలు రాబట్టడం ద్వర్థి .     ఇవి ప్రతిభా పాండిత్యం గలవారికే సాధ్యం . అయినా  శ్రీ శర్మ గారు  

“ శ్లేష కవనం బేడ్చి చెడగొట్టె కావ్యంబు

భట్టు మూర్తి గాడు వట్టి శు౦ఠ” అని మృదువుగా హేళన చేశారు .

ఇక సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయల సంగతి చూద్దాం . ఆయన ఆముక్త మాల్యద అనే ప్రబంధాన్ని మనకందించారు . అది ఎంత చదివినా ఒక పట్టాన అర్థం కాదు. కవుల రచనల్ని మూడు విధాలుగా విమర్శకులు విభజించారు . ఒకటి ద్రాక్షాపాకం, అంటే  చదవగానే అర్థమై ఆనందాన్ని కలిగించేది . ( వాల్మీకి రామాయణం )  కొంచెం కష్టపడి అర్థం చేసుకోవలసినవి కదళీపాకం కాళిదాసుని రచనలు. ఇక భారవి రచన కిరాతార్జునీయం , భట్టహర్షుని నైషధం వంటివి అంత కంటే క్లిష్టమైనవి , అవి నారికేళ పాకానికి సంబంధించినవి . ఇక రాయల వారిపాకం గచ్చకాయ పాకమాట , అందులోనూ ఇనుప గుగ్గిళ్ళు సంధి౦ చారట . అర్థం చేసుకోవడం ఎంత కష్టమో! అందుకే         

 రాయలవార్గచ్చ కాయపాకములోన

ఇనుప గుగ్గిళ్ళు సంధించినారు”  అని హేళన చేశారు.  

ఇక సాహిత్యంలో కొన్ని అచ్చ తెనుగు కావ్యాలున్నాయి . పొన్నే కంటి తెలగణ యయాతిచరిత్ర,   కూచిమంచి తిమ్మకవి నీలాసు౦దరీపరిణయం మొదలైన కావ్యాలు కొన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు . అచ్చతెనుగు జన వ్యవహారానికి చాల దూరంలో ఉంది. ఒక్కొక్కప్పుడు అచ్చతెనుగు పదం వాడితే తప్పుగా కూడ కనబడుతుంది. ఉదాహరణకి అన్నం పెట్టమ్మా అనడానికి బదులు కూడు పెట్టమ్మా అంటే మనమే సహి౦చ లే౦ . రంధ్రం అనడానికి బదులు ఎవరైనా బొక్క అంటే మనం సహించే స్థితిలో లేము. అదీ నేటి అచ్చ తెనుగు స్థితి . నేనొక సారి అచ్చతెలుగు పదాలతో ఒక పద్యం వ్రాస్తే దానికి వివరణ కూడ  నేనే ఇచ్చుకోవలసి వచ్చింది. పద్యం చూడండి .

శా||  చుట్టుంగైదువు జోదు పట్టిని వెసన్ సొంపాఱగా బూదెయౌ

నట్టుల్ సేసిన పోటరంబు వెస మూడౌ తొల్లి జేజే గమిన్

మట్టింగల్పిన నీ మగంటిమి  దల౦పన్నబ్బురంబౌ జగా

జెట్టీ!  నీకివె యేటికోళ్ళు గొనుమా శ్రీరామలి౦గే శ్వరా! 

 ఇక అక్కడక్కడ అచ్చ తెనుగు పద్యాలు౦టే పరవాలేదు గాని గ్రంథమంతా అచ్చతెనుగు పద్యాలైతే అర్థం చేసుకోవడం కష్టమే .  దీన్ని దృష్టిలో ఉంచుకుని...    

  “ కూచిమంచి వారు కోటికి తలయొగ్గి

పిచ్చపిచ్చగ వ్రాసెనచ్చతెనుగు”  అని ఆక్షేపించారు .

 ఇక కంకంటి పాపరాజు ఉత్తరరామాయణం రచించాడు. సీతావియోగ ఘట్టాన్ని అంత అద్భుతంగా రచించిన కవి తెనుగుసాహిత్య చరిత్రలో మరొకరు లేరు. ఆ ఘట్టం చదువుతున్నంత సేపు కన్నీరు మున్నీరై ప్రవహిస్తుంది . అటువంటి పాపరాజును ప్రేమతో  ముద్దు ముద్దుగా విమర్శిస్తూ ...

 కంకంటి పాపన్న ఎంకి పాటలుగాక

రామాయణం బేల వ్రాయవలయు? ”  అన్నారు. 
ఇక ఆంధ్ర సాహిత్యంలో తొట్టతోలుతటి జంటకవులు  నంది మల్లయ్య  ఘంట సింగయ్య కవులు . వీరిద్దర్లో ఒకరైన సింగయ్య ముక్కు తిమ్మనకు మేన మామగా ప్రసిద్ధులు . వారిద్దరు కలసి   కృష్ణమిశ్రుడు సంస్కృతంలో రచించిన ‘ప్రబోధ చంద్రోదయం’ అనే కావ్యాన్ని తెనిగించారు. వరాహపురాణాన్ని కూడ తెనిగించారు. వారిని ఆక్షేపిస్తూ ...

  పందిపురాణమా పలికిరిద్దరు గూడి

నందిమల్లయ్య సింగయ్య కవులు”
 అన్నారు శ్రీ శర్మగారు.   ఇక పిల్లలమర్రి పినవీర భద్రుడు అనేకవి “వాణి నా రాణి” అని గర్వంగా చాటుకున్నాడు . అంత గొప్పలు చెప్పుకున్న ఆయన ‘శృ౦గార శాకుంతలం’ అనే గ్రంథం రచించాడు . అదొక సాధారణ కావ్యం అని కవి తనను గురించి చాల గొప్పగా చెప్పుకున్నాడని ఆక్షేపిస్తూ...     

 వాణి నా రాణన్న వాడెంత ఘనుడోయి

             వీరన్న తానేమి వెలగబెట్టె అని ప్రశ్నించారు      

ఈ విధంగా మాగురుదేవులు ఆ యా కవుల కావ్యాల్ని సునిశిరంగా పరిశీలించి అందంగా ఆక్షేపిoచారు.  ఇవన్నీ ఆయా కవులపట్ల వారికుండే అభిమానాన్ని , ఇష్టాన్నీ  సూచిస్తాయిగాని ఆక్షేపణలు కానే కావు . ఇది చదివిన చదువరులు ఆయా కావ్యాల్ని ఆమూ లాగ్రం చదివి ఆనందిoచగలిగితే మాగురుదేవుల రచన,  నా ఈ ప్రయత్నం సఫలమైనట్లే .

జయంతి తే సుకృతిన: రససిద్ధా: కవీశ్వరా:

నాస్తి యేషాం యష: కాయే జరామరణజం భయం    

                                      <><><>

శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారి కవి నిందాస్తుతులు-1 (Ironical praise of some Telugu poets)

 

శ్రీ మల్లంపల్లి  వీరేశ్వరశర్మ గారి

కవి   నిందాస్తుతులు-1

(Ironical praise of some Telugu poets) 

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

 .

మా గురుదేవులైన శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు సంస్కృతాంధ్ర ఆంగ్లభాషలలో గొప్ప పండితులు. మహాత్ముని విదేశవస్తుబహిష్కరణకుప్రభావితులై ఇంట్లో ఉన్న విదేశీ వస్త్రాలతో బాటుగా ఆంగ్లభాషను కూడా విడిచి పెట్టేశారు .      మహాకవి , ఉత్తమోత్తమ అధ్యాపకులున్ను. వారు ఎన్నో ప్రాచ్య విద్యాకళాశాలల్లో(oriental colleges) అధ్యాపకునిగా  పనిచేశారు . వరంగల్లు లోని S.V.S.A కళాశాలలో PRINCIPAL గా కూడ పనిచేశారు. ఆంధ్రజాతీయకళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయం మొదలైన గొప్ప విద్యాసంస్థలలో Member Of Council కౌన్సిల్ సభ్యుని గాను Member of Senate సెనేట్ సభ్యునిగానూ , Member of Academic Council  అకడమిక్ కౌన్సిల్ సభ్యుని గాను  ఎన్నో హోదాలలో  భాషాసేవ చేశారు . మల్లంపల్లి వారిది పండిత వంశం . తాతముత్తాతల నాటి నుండి ఎంతోమంది గొప్ప కవులుగా పండితులుగా ప్రసిద్ధి పొందారు . మా గురుదేవులు మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు బహు గ్రంథకర్త .  ఎన్నో ఖండకావ్యాలు వెలయించి హరితకవి అనే పేరు పొందారు. .ఉత్తరనైషధం  రచించి అభినవ శ్రీనాథ అనే బిరుదు పొందారు . ఉత్తమమనుసంభవం  రచించి అభినవపెద్దన గా పేరొందారు . కాంచీఖండం  రచించి ఆంధ్రకాంచీఖండచతురానన అనే బిరుదు కైవశం చేసుకున్నారు.  తెలుగువ్యాకరణాన్ని అనితరసాధ్యమైన రీతిలో బోధించి అభినవ సూరి అని ప్రశంస లందుకున్నారు .

వారి శిష్యులలో ప్రముఖులు, భీమవరం D.N.R కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన శ్రీ N.V.K సుబ్బరాజు గారు  సూరి మఱపించి అభినవ సూరియైన భర్గరూపగురుల కభివందనములు  అని వారిని ప్రశంసించడం ఇందుకు నిదర్శనం . 

ఇక సంస్కృత , తెనుగుసాహిత్యాల్లో వారు చదువని గ్రంథం ఇంచుమించుగా లేదని చెప్పొచ్చు . నేను పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరసంస్కృతకళాశాలలో చదువుతున్నప్పుడు మాకందరికి  వ్యాకరణం, సాహిత్యం బోధించేవారు . వ్యాకరణాన్ని సాహిత్యంలాగా ఆసక్తికరంగా బోధించడం వారి ప్రత్యేకత. ఇక సాహిత్యవిషయానికొస్తే సాహిత్యానికి సంబంధించిన ఆయా అంశాలు చెప్పేటప్పుడు  తన్మయులై స్వయంగా రసప్రవాహంలో ఓలలాడుతూ విద్యార్థులను కూడ ముంచెత్తేశేవారు. ఒక్కొక్కప్పుడు ఆవేశంతో కవులను తిట్టేస్తూ ఉండేవారు. గురువుగారూ! వాళ్ళని  ఎందుకు తిడుతున్నారని అడిగితే ఏం చెయ్యమంటావురా!  వారు రచించిన ఆయా పద్యాలు చదివి రసోద్రేకాన్ని ఆపుకోలేక తిడుతున్నాను వాళ్ళు అంతబాగా వ్రాయాలా నన్ను ఇంతగా ఏడిపిoచాలా అనేవారు. అప్పుడప్పుడు క్లాసులో పాఠాలు చెబుతున్నప్పుడు కూడ రాసోద్రేకాన్ని ఆపుకోలేక కన్నీరు కార్చేవారు .  ఒక్కొక్క కవిని ఉద్దేశించి ఒక్కొక్క పంక్తి చెబుతూ ఉండేవారు . అవన్నీ కొంతమంది  వెంటనే వ్రాసుకునే వాళ్ళ౦ . అవన్నీ చాల గమ్మత్తుగా, సహజసుందరంగా ఉండేవి . నేను కాలాంతరంలో కొన్ని పంక్తులు మర్చిపోయాను . వారి కుమార్తె మా సోదరి, శ్రీమతి కాళహస్తీశ్వరి నేను మఱచిపోయిన పంక్తులు నాకు అందించారు . అవన్నీ ఒక చోటికి చేర్చి అందరికి అందించే నా ఈ సాహసానికి నన్ను మన్నించగోరెదను.    వారు ఆయా కవులపై చేసిన  నిందలకు తాత్పర్యం ప్రశంసలే గాని నిందమాత్రం కాదని  భావించాలి  . వారు వెలువరించిన అభిప్రాయాలు ఆయా కవుల కావ్యాలను చదవడానికి పాఠకులను పురిగొలుపుతాయనే ఆశాభావంతో వాటిని మీ ముందుంచుతున్నాను .   

ఆది కవి నన్నయ్య ను గురించి చెబుతూ ...

 “చిన్ననాడే పోయె నన్నయ్య మతిచెడి

అడవిలో పడి యంతునయిపు లేడు” అంటారు . నిజమే ఆయన కలం అరణ్య పర్వం తోనే ఆగిపోయింది . నన్నయగారి మరణాన్ని వర్ణిస్తూ ఆంధ్ర పురాణ కర్త శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఏమన్నారో తెలుసుకుందాం .

ఆగినదల్ల  నన్నయ మహాఋషి గంటమె కాదు సాదు వీ

చీగతిచాతురీ మధురుచి ప్రచురోత్తమ గౌతమీ ధునీ

వేగమె యాగి పోయె నని పించి రసజ్ఞుల డెందముల్ పిపా

సాగళిలతంబులై పరవశత్వము నందె నమందవేదనన్ .  

ఆయనకు తిక్కన అంటే చాల ఇష్టం . ఒక సారి అన్నారు . నాకు ఏ కోరిక లేదురా ! మరల జన్మంటూ ఉంటే తిక్కన గారి భారతం చదువుకోడానికే జన్మిo చాలి అనేవారు . అందువల్ల ఆయన మీద ప్రేమతో  రెండు పాదాలు వ్రాశారు .

 

తిక్క శంకరయ్య తిక్కన్న చెడగొట్టెపదియేను పర్వముల భారతంబు

తిక్కశంకరయ్య తిక్కనగారికి కీచక విరహంబు గీతులాయె

ఇక ఎఱ్ఱన్నగారిని ఏమంటున్నారో చూడండి .

ఎఱ్ఱన్న ఎంతటి వెఱ్ఱి పప్పయొ గాని సంధించెనిద్దఱి సందు దూరి

కేతన ధర్మపన్నాలు వల్లిoచాడట. ఆయన ‘విజ్ఞానేశ్వరీయం’ లో ధర్మ పన్నాలు వల్లిoచాడట   

ఉదాహరణకి కొన్ని కొన్ని సందర్బాలలో భార్యను విడిచి పెట్టినా తప్పులేదని చెబుతూ  “ఎపుడుం గూతులంగన్న “ అంటాడు . ఎప్పుడు కూతుళ్లనే కంటే ఆమెను వదిలేయచ్చట . ఇదేం అన్యాయం. కూతుర్ని కనడం , కొడుకుల్ని కనడం మన అధీనంలో లేదు . అందులోనూ స్త్రీకి అసలు ప్రమేయమే లేదు . అందుకే అన్నారేమో ....  

“కేతన్న యొక బుడ్డ కేతిగాడు౦ బోలెధర్మపంనాలేడ్చి తగుల బెట్టె” అని

 

to be continued