Sunday, March 14, 2021

శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారి కవి నిందాస్తుతులు-1 (Ironical praise of some Telugu poets)

 

శ్రీ మల్లంపల్లి  వీరేశ్వరశర్మ గారి

కవి   నిందాస్తుతులు-1

(Ironical praise of some Telugu poets) 

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

 .

మా గురుదేవులైన శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు సంస్కృతాంధ్ర ఆంగ్లభాషలలో గొప్ప పండితులు. మహాత్ముని విదేశవస్తుబహిష్కరణకుప్రభావితులై ఇంట్లో ఉన్న విదేశీ వస్త్రాలతో బాటుగా ఆంగ్లభాషను కూడా విడిచి పెట్టేశారు .      మహాకవి , ఉత్తమోత్తమ అధ్యాపకులున్ను. వారు ఎన్నో ప్రాచ్య విద్యాకళాశాలల్లో(oriental colleges) అధ్యాపకునిగా  పనిచేశారు . వరంగల్లు లోని S.V.S.A కళాశాలలో PRINCIPAL గా కూడ పనిచేశారు. ఆంధ్రజాతీయకళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయం మొదలైన గొప్ప విద్యాసంస్థలలో Member Of Council కౌన్సిల్ సభ్యుని గాను Member of Senate సెనేట్ సభ్యునిగానూ , Member of Academic Council  అకడమిక్ కౌన్సిల్ సభ్యుని గాను  ఎన్నో హోదాలలో  భాషాసేవ చేశారు . మల్లంపల్లి వారిది పండిత వంశం . తాతముత్తాతల నాటి నుండి ఎంతోమంది గొప్ప కవులుగా పండితులుగా ప్రసిద్ధి పొందారు . మా గురుదేవులు మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు బహు గ్రంథకర్త .  ఎన్నో ఖండకావ్యాలు వెలయించి హరితకవి అనే పేరు పొందారు. .ఉత్తరనైషధం  రచించి అభినవ శ్రీనాథ అనే బిరుదు పొందారు . ఉత్తమమనుసంభవం  రచించి అభినవపెద్దన గా పేరొందారు . కాంచీఖండం  రచించి ఆంధ్రకాంచీఖండచతురానన అనే బిరుదు కైవశం చేసుకున్నారు.  తెలుగువ్యాకరణాన్ని అనితరసాధ్యమైన రీతిలో బోధించి అభినవ సూరి అని ప్రశంస లందుకున్నారు .

వారి శిష్యులలో ప్రముఖులు, భీమవరం D.N.R కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన శ్రీ N.V.K సుబ్బరాజు గారు  సూరి మఱపించి అభినవ సూరియైన భర్గరూపగురుల కభివందనములు  అని వారిని ప్రశంసించడం ఇందుకు నిదర్శనం . 

ఇక సంస్కృత , తెనుగుసాహిత్యాల్లో వారు చదువని గ్రంథం ఇంచుమించుగా లేదని చెప్పొచ్చు . నేను పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరసంస్కృతకళాశాలలో చదువుతున్నప్పుడు మాకందరికి  వ్యాకరణం, సాహిత్యం బోధించేవారు . వ్యాకరణాన్ని సాహిత్యంలాగా ఆసక్తికరంగా బోధించడం వారి ప్రత్యేకత. ఇక సాహిత్యవిషయానికొస్తే సాహిత్యానికి సంబంధించిన ఆయా అంశాలు చెప్పేటప్పుడు  తన్మయులై స్వయంగా రసప్రవాహంలో ఓలలాడుతూ విద్యార్థులను కూడ ముంచెత్తేశేవారు. ఒక్కొక్కప్పుడు ఆవేశంతో కవులను తిట్టేస్తూ ఉండేవారు. గురువుగారూ! వాళ్ళని  ఎందుకు తిడుతున్నారని అడిగితే ఏం చెయ్యమంటావురా!  వారు రచించిన ఆయా పద్యాలు చదివి రసోద్రేకాన్ని ఆపుకోలేక తిడుతున్నాను వాళ్ళు అంతబాగా వ్రాయాలా నన్ను ఇంతగా ఏడిపిoచాలా అనేవారు. అప్పుడప్పుడు క్లాసులో పాఠాలు చెబుతున్నప్పుడు కూడ రాసోద్రేకాన్ని ఆపుకోలేక కన్నీరు కార్చేవారు .  ఒక్కొక్క కవిని ఉద్దేశించి ఒక్కొక్క పంక్తి చెబుతూ ఉండేవారు . అవన్నీ కొంతమంది  వెంటనే వ్రాసుకునే వాళ్ళ౦ . అవన్నీ చాల గమ్మత్తుగా, సహజసుందరంగా ఉండేవి . నేను కాలాంతరంలో కొన్ని పంక్తులు మర్చిపోయాను . వారి కుమార్తె మా సోదరి, శ్రీమతి కాళహస్తీశ్వరి నేను మఱచిపోయిన పంక్తులు నాకు అందించారు . అవన్నీ ఒక చోటికి చేర్చి అందరికి అందించే నా ఈ సాహసానికి నన్ను మన్నించగోరెదను.    వారు ఆయా కవులపై చేసిన  నిందలకు తాత్పర్యం ప్రశంసలే గాని నిందమాత్రం కాదని  భావించాలి  . వారు వెలువరించిన అభిప్రాయాలు ఆయా కవుల కావ్యాలను చదవడానికి పాఠకులను పురిగొలుపుతాయనే ఆశాభావంతో వాటిని మీ ముందుంచుతున్నాను .   

ఆది కవి నన్నయ్య ను గురించి చెబుతూ ...

 “చిన్ననాడే పోయె నన్నయ్య మతిచెడి

అడవిలో పడి యంతునయిపు లేడు” అంటారు . నిజమే ఆయన కలం అరణ్య పర్వం తోనే ఆగిపోయింది . నన్నయగారి మరణాన్ని వర్ణిస్తూ ఆంధ్ర పురాణ కర్త శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఏమన్నారో తెలుసుకుందాం .

ఆగినదల్ల  నన్నయ మహాఋషి గంటమె కాదు సాదు వీ

చీగతిచాతురీ మధురుచి ప్రచురోత్తమ గౌతమీ ధునీ

వేగమె యాగి పోయె నని పించి రసజ్ఞుల డెందముల్ పిపా

సాగళిలతంబులై పరవశత్వము నందె నమందవేదనన్ .  

ఆయనకు తిక్కన అంటే చాల ఇష్టం . ఒక సారి అన్నారు . నాకు ఏ కోరిక లేదురా ! మరల జన్మంటూ ఉంటే తిక్కన గారి భారతం చదువుకోడానికే జన్మిo చాలి అనేవారు . అందువల్ల ఆయన మీద ప్రేమతో  రెండు పాదాలు వ్రాశారు .

 

తిక్క శంకరయ్య తిక్కన్న చెడగొట్టెపదియేను పర్వముల భారతంబు

తిక్కశంకరయ్య తిక్కనగారికి కీచక విరహంబు గీతులాయె

ఇక ఎఱ్ఱన్నగారిని ఏమంటున్నారో చూడండి .

ఎఱ్ఱన్న ఎంతటి వెఱ్ఱి పప్పయొ గాని సంధించెనిద్దఱి సందు దూరి

కేతన ధర్మపన్నాలు వల్లిoచాడట. ఆయన ‘విజ్ఞానేశ్వరీయం’ లో ధర్మ పన్నాలు వల్లిoచాడట   

ఉదాహరణకి కొన్ని కొన్ని సందర్బాలలో భార్యను విడిచి పెట్టినా తప్పులేదని చెబుతూ  “ఎపుడుం గూతులంగన్న “ అంటాడు . ఎప్పుడు కూతుళ్లనే కంటే ఆమెను వదిలేయచ్చట . ఇదేం అన్యాయం. కూతుర్ని కనడం , కొడుకుల్ని కనడం మన అధీనంలో లేదు . అందులోనూ స్త్రీకి అసలు ప్రమేయమే లేదు . అందుకే అన్నారేమో ....  

“కేతన్న యొక బుడ్డ కేతిగాడు౦ బోలెధర్మపంనాలేడ్చి తగుల బెట్టె” అని

 

to be continued

 

 

No comments: