Wednesday, June 27, 2012

బాలరాముని పసిడిపలుకులు


బాలరాముని పసిడి పలుకులు
Dr.Chilakamarthi DurgaPrasadaRao
91+9897959425

చిన్న పిల్లలు భగవంతునికి ప్రతిరూపాలు. వారి చేష్టలు మాటలు అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల మాటలు ముత్యాల మూటలు. అర్థంకాని అస్పష్టమైన మాటలైన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల చేత ముద్దుముద్దుగా మాట్లాడించి ఆనందిస్తూ ఊంటారు. ఎందరో కవులు ఇటివంటి సంఘటనలల్ని ఆధారం చేసుకుని ఎన్నో అందమైన పద్యాలు వాశారు. మచ్చుకు ఒకటి చూద్దాం.
రాముడు చాల చిన్నవాడు. మాటలు ఎలాగో కూడబలుక్కుని మెల్లమెల్లగా మాట్లాడుతున్నాడు. ఒకసారి కౌసల్య అటువంటి రాముని ముద్దు మాటలు వినాలనుకుంది. దగ్గరకు పిలిచింది. పిలవగానే దగ్గరకొచ్చి నిలబడ్దాడు. నాన్నా! నీపేరేమిట్రా అంది. వెంటనే రాముడు అని చెప్పాలనుకున్నాడు. కాని నోరు తిరగలేదు. అందుకే 'లాములు' అన్నాడు. అదిసరేగాని మీనాన్న గారి పేరేమిటని అడిగింది. దశరథ మహారాజు అనాలని ప్రయత్నం. కాని ' దాచాతమాలాలు' అన్నాడు. అది సరే గాని నాపేరు చెప్పరా అంది. వెంటనే అమ్మగాలు అన్నాడు. నాపేరు అమ్మ కాదురాబాబు కౌసల్య అంది. కౌసల్య అనడానికి రాముడు ప్రయత్నం చేస్తున్నాడు. కాని అనలేక పోతున్నాడు. సాధారణంగా పిల్లలు తామనుకున్నది చెయ్య లేనప్పుడు ఏడుపు మొదలెడతారు . అంతే రాముడు ఏడవడం మొదలెట్టాడు. పసివాడి ఏడుపు తల్లి వినలేక పోయింది.ఆమె గుండె చెరువై పోయింది. నాపేరు కౌసల్య కాదులేరా బాబూ అమ్మే అని ఆవిడ తన బిడ్డను దగ్గరకు చేరదీసి ముద్దుపెట్టు కుందట.-
ఇంతటి రసవత్తరమైన భావాన్ని తనలో ఇముడ్చుకున్న శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్షం లోని పద్యాన్ని స్వయంగా చదివి ఆనందించండి. ఇదిగో ఆ పద్యం.
తానో 'లాములు' తండ్రిపేరెవరయా ?'దాచాతమాలాలు'
లేనాపేరన అమ్మగాలనగ నోలిందల్లి కౌసల్య తం
డ్రీ!నాగాననబోయి రాకకనులన్నీర్వెట్ట గౌసల్యనే
గానేకానులె 'అమ్మ' నే యనిప్రభుంగౌసల్యముద్దాడెడున్.

Friday, June 22, 2012

కవిత


కారణం తెలుసుకో తమ్ముడూ! జీవితం మలచుకో అమ్మడూ!
చిలకమర్తి .దుర్గాప్రసాదరావు
దేశానికి వెన్నెముకా! ఓ సోదర కార్మికా!
గిడ్డంగులనెన్నెన్నో నింపుతున్నావు గాని
బిడ్డలచిఱు పొట్టల్ని నువ్వు నింపలేకపోతున్నావ్
ఎన్నెన్నో కట్టడాల్ని నిర్మిస్తున్నావుగాని
తలదాల్చగ గూడు లేక తల్లడిల్లి పోతున్నావ్
పట్టుబట్టలెన్నెన్నో గుట్టలుగా నేస్తున్నా
కట్టగుడ్డలేక నువ్వు కరువువాచి పోతున్నావ్
కారణం తెలుసుకో తమ్ముడూ! జీవితం మలచుకో అమ్మడూ!
శక్తియుక్తులెన్నున్నా అక్షరజ్ఞానంసున్నా
అందుకే ఈ దైన్యం
అందుకే ఈ హైన్యం
పనిముట్టుతో బాటె నువ్వు పలకా బలపం పట్టు
హలంపట్టు చేత్తోనే కలం కూడ పట్టుకో
పుస్తకాన్ని చేతబట్టు
మస్తకాన్ని పదును పెట్టు.




నేటి భారతం
చిలకమర్తి .దుర్గాప్రసాదరావు
.
చెడు అనకుము చెడు వినకుము
చెడు కనకుమటంచు నొక్కిచెప్పిన గాంధీ
చెడుచేయకంచు చెప్పెనె!
చెడుచేయగనేల మాకు సిగ్గున్నెగ్గున్
.
తెల్లదొరలేగ నిప్పుడు
నల్లదొరలె దేశమందు నయవంచకులై
కొల్లంగొట్టు దేశము
తెల్లదొఱలె నయమటంచు దెలిపిరి మనకున్
.
అమ్ముడు వోవని వస్తువు
ఇమ్మహి గనపడదు నిక్కమిది నమ్మవలెన్
సొమ్మొక్కటున్న ఈ దే
శమ్మున గొనలేని వస్తుజాలము గలదే!
.
కులము మతమ్మను రెండే
కొలమానములిపుడు కావుగుణములు మరి యీ
కులమతవైషమ్యము గొ
డ్డలి పెట్టుగ దేశ మంతటను వ్యాపించెన్
.
బ్రతి కున్న వాని కంటెను
మృతిచెందినవాడె చాలమేలనిపించే
స్థితి నేడున్నది ఈదు:
స్థితినిర్మూలనమె దేశ సేవయనదగున్.

ఒక్క వ్రేలు చూపి ఒరులను నిందింప వెక్కిరించు నిన్ను మూడు వ్రేళ్లు(వేయి వ్రేళ్లు)


ఒక్క వ్రేలు చూపి ఒరులను నిందింప
వెక్కిరించు నిన్ను మూడు వ్రేళ్లు( వేయి వ్రేళ్లు)
డాక్టర్.చిలకమర్తి దుర్గాప్రసాద రావు

మనం ఎంత గొప్ప వాళ్లమైనా కావొచ్చు గాని ఇతరుల్ని కించపరిస్తే అది మనకు ముప్పు తెచ్చి పెడుతుంది. ఒక్కొక్కప్పుడు మన అస్తిత్వానికే ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఆత్మశ్లాఘ ఎంత ప్రమాదమో పరనింద అంతకంటే ఎక్కువ ప్రమాదం.అందువల్ల మనం ఎంత ఉన్నతంగా ఉన్నామో అంత అణకువగా కూడ ఉండడం నేర్చు కోవాలి. లేకపోతే సమాజమే మనకి గొప్ప గుణ పాఠం చెబుతుంది. ఇతరుల్ని కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి.
ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్శ్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత ఐశ్వర్యం లేదు డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. లక్ష్మికి అనుకోకుందా పార్వతిని ఓ ఆట పట్టిం చాలనే ఆలోచన కల్గింది.
"భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది. మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది. శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది. పార్వతి కి ఈ ప్రశ్న చాల బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుందిగాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి. ఎంచెప్పాలి? కొంచెం ఆలోచించింది.
"సుతను బలిమఖే " అంది.
'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం. ఆసమాధానం వినేసరికి లక్ష్మికి తలతిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు తనభర్త శ్రీమహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే. 'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది. లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది.
తాండవం క్వాద్య భద్రే! అనడిగింది. అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం. మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది.
మన్యే బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు. ' మా ఆయనే కాదు మీఆయన కూడ నాట్యం చేస్తాడు. ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం. పార్వతి సమాధానం ఇంత పదునుగా ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో కుడగట్టుకుంది. ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది.
క్వనుచ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసింది. మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం. లక్ష్మి కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరంలేదు. 'మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం . పార్వతి చాల నొచ్చు కుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు. పార్వతి మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. వెంటనే అంది.
నైవ జానే వరాహం అని.
ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు" అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. ఈసారి జాగ్రత్త్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది.
బాలే! కచ్చిన్న దృష్ట : జరఠ వృషపతి: ? అనడిగింది. 'మీ వాహనం అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. 'మాది గరుడ వాహనం విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాం. మీరు నేల పై తిరుగుతారు. మీ వాహనం ముసలి ఎద్దు. అది కదల్లేదు మెదల్లేదు' అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే వెంటనే అందుకుంది.
"గోప ఏవాస్య వేత్తా " అంది. 'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా? పో మీఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది. మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది.
నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ. ఇందులో నిందగాని వెక్కిరింపుగాని ఏమాత్రంలేవు. ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఇందులో నీతి ముఖ్యం గాని ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు
వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన సంభాషణ మనందరిని రక్షించుగాక అని చమత్కరించాడోకవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి.
భిక్షార్థీ స క్వ యాత: ?సుతను బలిమఖే " తాండవం క్వాద్య భద్రే ?
మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశు:? నైవ జానే వరాహం
బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతి:? గోప ఏవాస్య వేత్తా
లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయో: త్రాయతాం న:
..........................................................................................................................


 

Saturday, June 9, 2012

యోచనతో యాచన

-->
యోచనతో యాచన

యాచన అనేది చాల నీచమైన పని.ఎంతటి గొప్పవాడైనా యాచించడం వల్ల చాల చులకనైపోతాడు. సర్వవ్యాపకుడైన శ్రీమహావిష్ణువు కూడ మూడడుగుల నేల యాచించడం కోసం వామన మూర్తిగా మారిపోవడం అందరికి తెలిసిందే. కాని సమాజంలో కొంతమంది అదే వృ త్తిలో ఉంటారు. వారికది తప్పనిపించదు. పైపెచ్చు దాన్ని గొప్పగా సమర్థించుకుంటారు . ఎంత గొప్పగాసమర్థించుకుంటారంటే మనం కూడ దాన్ని కాదనలేం. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన చమత్కారశ్లోకం పరిశీలిద్దాం.
ఒక యాచకుడు చక్రవర్తి దగ్గరకు వెళ్లి , “భిక్షాం దేహి!” అన్నాడు. వాణ్ణిచూస్తే రాజుకు చాల కోపమొచ్చింది.ఎందుకంటే వాడు మంచి వయస్సులో ఉన్నాడు ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. "ఏమయ్యా! అడుక్కోవడం నీకు చిన్నతనంగా లేదా ! సిగ్గనిపించడంలేదా !” అని ప్రశ్నించాడు రాజు. ఆ యాచకునికి తాను చేస్తున్నపని సమర్థించుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఎంత చమత్కారంగా సమాధానం చెబుతున్నాడో స్వయంగా చూడండి.
ఓ రాజా! నేను శివభక్తుణ్ణి, అడుక్కునేవాణ్ణి ఏమాత్రంకాను. నాస్వామిలో సగభాగం విష్ణుమూర్తి తీసుకుపోయాడు. తనలో కలుపుకుని హరిహర నాథునిగా ప్రసిద్ధికెక్కాడు.రెండవ సగభాగాన్ని పార్వతీ దేవి లాక్కు పోయింది.ఇక ప్రపంచంలో శివుడే లేకుండా పోయాడు .ఇక ఆయన్ని ఆశ్రయించుకున్నవారందరికి ఏఆధారం లేకుండా పోయింది.వేచి వేచి విసిగి వేసారిన గంగ, చివరకు సముద్రాన్ని చేరుకుని సుఖంగా ఉంది. చంద్ర వంక ఇంకా ఆకాశంలో వేళ్లాడుతోనే ఉంది.కంఠాభరణంగా ఉండే పాము పాక్కుంటూ భూలోకానికి పోయింది. ఇంకా శివునికి మూడు గుణాలున్నాయి.మొదటిది సర్వజ్ఞత్వం అంటే అన్నిటినీ తెలుసు కోగలిగే శక్తి. రెండోది అధీశ్వరత్వం . అంటే లోకానికి ప్రభువు కాగలగడం . ఆ రెండూ దిక్కులేనివై పోయి చివరికి నీలాంటి యోగ్యుడైన మహాపురుషుని ఆశ్రయించాయి. అందుకే నువ్వు ఈశ్వరుని వలే సర్వజ్ఞుడివీ లోకాధి నాధుడవు అయ్యావు. ఇక ముచ్చటగా మూడో లక్షణం ఉందే అది మరేదోకాదు. అడుక్కోవడం. ఏ దిక్కూలేని ఆ దిక్కుమాలినలక్షణం అన్ని దిక్కులూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ చివరికి ఈ దిక్కుమాలిన నన్ను ఆశ్రయించింది. రాజా! నన్నేం చెయ్యమంటారు చెప్పండి” అన్నాడు.
రాజుకు వాడు చేస్తున్నపని నచ్చక పోయినా వాడి యుక్తి, చెప్పిన తీరు, పరోక్షంగా తనపై కురిపించిన ప్రశంసలు బాగా నచ్చాయి.ఏదో కొంత ముట్ట జెప్పి పంపించాడు.
ఇంతచమత్కారాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ శ్లోకాన్ని తిలకించండి.

अर्धं दानववैरिणा गिरिजयाप्यर्धं हरस्याहृतं |
देवेत्थं भुवनत्रये स्मरहराभावे समुन्मीलति ||
गंगा सागरमंबरं शशिकला शेषश्च पृथ्वीतलं |
सर्वज्ञत्वमधीश्वरत्वमगमत्त्वां मां च भिक्षाटनम् ||
(अप्पय्यदीक्षित:)


అర్ధం దానవవైరిణా గిరిజయాప్యర్ధం హరస్యాహృతం
దేవేత్థం భువనత్రయే స్మరహరాభావే సమున్మీలతి
గంగా సాగరమంబరం శశికళా శేషశ్చ పృధ్వీతలం
సర్వజ్ఞత్వమధీశ్వరత్వమగమత్త్వాం మాం చ భిక్షాటనం

(సంస్కృత భాషలో ఇటువంటి అద్భుతమైన శ్లోకాలు లక్షల కొలదీ ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఒక జీవితానికి సరిపోయే ఆ నందాన్ని పంచి ఇవ్వగలవు .కాబట్టి ఇది చదివిన పాఠకులందరు సంస్కృత భాషనేర్చుకునే ప్రయత్నం చెయ్యాలని కోరుతూ......)

Friday, June 8, 2012

అర్థాలు-అంతరార్థాలు


అర్థాలు-అంతరార్థాలు

 
కవుల ఆత్మీయత తమకావ్యాల్లో ప్రతిబింబించడం చాల సహజమైన విషయం. కవి తన అభిరుచులు ఆవేదనలు వ్యక్తం చెయ్యాలనుకుంటే అతనికి రచనల ద్వారా తప్ప మరొక మార్గం లేదు. మహాకవుల్లో చాల మంది తమ అభిరుచులను ఆవేదనలను సందర్భానుసారంగా వ్యక్తం చేసుకోవడం తెలుగు సాహిత్యంలో పలుచోట్ల కనిపిస్తో ఉంటుంది. పాండురంగమాహాత్మ్యాన్ని రచించిన శ్రీ తెనాలి రామకృష్ణ కవికి కూడ ఈ అవసరం వచ్చింది.
తెనాలి రామకృష్ణకవి కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరని సాంప్రదాయానుయాయులు నమ్ముతునారు. కాని అది సత్యం కాదని చారిత్రకుల నిర్ణయం.
తెనాలిరామకృష్ణ కవి తన పాండురంగమాహాత్మ్యాన్ని విరూరి వేదాద్రి మంత్రికి అంకితం చేశాడు. ఆయన రాయలకంటే చాల తరువాతకాలానికి చెందిన వాడు కావడం వల్ల తెనాలి రామకవి కూడ రాయలకంటే చాల అర్వాచీనుడని భావించడంలో తప్పేమీ లేదు. ఒకవేళ తెనాలి రామకృష్ణకవి రాయలకు సమకాలికుడే అనుకున్నా రాయలకు తన కావ్యం అంకితమిచ్చేటంత వయస్సు గలవాడు కాకపోవచ్చును. కాకుంటే తనకావ్యాన్ని రాయలకు కాక వేరొక్కరికి అంకితం చెయ్యవలసిన అగత్యం గాని, అవసరం గాని తెనాలి రామకవికి పట్టదు. ఏదియేమైన తన కావ్యాన్ని రాయలకు అంకితం చెయ్యలేకపోయానే అనే ఆవేదన తెనాలి రాముని హృదయం లో గూడుకట్టుకుని ఉంది. అది చాల స్పష్టం గా పాండురంగమాహాత్మ్యం లోని ఈ పద్యంలో వ్యక్తమౌతోంది.
గంగాసంగమమిచ్చగించునె మదింగావేరి దేవేరిగా
నంగీకారమొనర్చునే యమునతోనానందముంబొందునే
రంగత్తుంగతరంగహస్తములనారత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖించెనేని గుణభద్రా! తుంగభద్రానదీ!
ఇది తుంగభద్రానదిని వర్ణిస్తూ కవి చెప్పిన పద్యం. ఓ తుంగభద్రానదీ! సముద్రుడు నీసంగమసుఖాన్ని పొంది యున్నచో గంగానదీ సంగమాన్ని కూడ ఇష్టపడేవాడు కాదు.కావేరీనదిని భార్యగా అంగీకరించేవాడు కాదు. యమునానదితో ఆనందించేవాడు కాదు. ఇది బాహ్యార్థం.
ఇచ్చట 'గంగా' పదంచే అల్లసాని వారి "మనుచరిత్ర" సూచింపబడుతోంది. 'కావేరీ' పదంచే రాయల వారు స్వయంగా రచించిన "ఆముక్తమాల్యద" స్ఫురిస్తోంది. 'యమునా' పదంచే ముక్కుతిమ్మన గారి "పారిజాతాపహరణం" వ్యక్తమౌతోంది. అలాగే 'తుంగభద్రా' పదంచే రామకృష్ణకవి"పాండురంగమాహాత్మ్యం " ప్రకటమౌతోంది. ఆయా కావ్యాల్లో ఆయానదుల వర్ణన గాని లేక కథతో ఏదోవిధమైన సంబంధం ఉండడం వల్ల ఈ ఊహకు అవకాశం కలుగుతోంది. ఉదాహరణకు మనుచరిత్ర కథ గంగానదికి నిలయమైన హిమాలయాల్లో ప్రారంభమయింది. అలాగే పారిజాతాపహరణకథ యమునానది ఒడ్డున, ఆముక్తమాల్యద కథ కావేరీతీరాన, పాండురంగమాహాత్మ్యకథ తుంగభద్రానదీ తీరాన చోటుచేసుకున్నాయి.
దీన్ని బట్టి సముద్రుని వంటి ఆ రాయలు తాను రచించిన పాండురంగమాహాత్మ్యం స్వీకరించి యుండినచో పెద్దనగారి మనుచరిత్రను ఇష్టపడేవాడు కాదు. తానేస్వయంగా వ్రాసిన ఆముక్తమాల్యదను లెక్కపెట్టేవాదుకాదు. ముక్కుతిమ్మనగారి పారిజాత సౌరభాన్ని కూడ ఆఘ్రాణించి ఆనందించేవాడుకాదు. కాని ఆయనకు తనకావ్యాన్ని అంకితంచేసే అదృష్టం దక్కలేదనే తెనాలి రామకృష్ణుని ఆవేదన ఈ పద్యంలో ధ్వనిస్తోందని భావించడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం.

Thursday, June 7, 2012

యాచన కన్న యోచన మిన్న


శివుడు ఆది భిక్షువు. ఆయన ఎంత గొప్ప వాడైనా భిక్షాటన తలవంపు పనే. ఆయనకు తలవంపు అనిపించకపోయినా ఆయన భార్య పార్వతికి అది చిన్నతనంగానే తోచింది. అవును మరి మగడు బిచ్చగాడైతే అది మగువకు తలవంపేగదామరి. ఎలాగైనా ఆయన్ని మాన్పించాలి .ఎంతో ఆలోచించింది. ఎలా నచ్చచెప్పాలో చివరికి నిర్ణయించుకుంది. ఎంతగొప్ప సలహా ఇచ్చిందో చూడండి.
"ఏవండీ! మీరు ముందుగా శ్రీరాముని దగ్గరకు వెళ్లండి. కొంతభూమి ఇమ్మని అడగండి.ఆయన కాదనడు. తప్పకుండ ఇస్తాడు. మీ మిత్రుడు కుబేరుడు ఉన్నాడు కదా!ఆయనదగ్గరకు వెళ్లి విత్తనాలు తెచ్చు కోండి. ఇంక బలరాముడి దగ్గరకెడితే నాగలి దొరుకుతుంది. యమధర్మరాజు దగ్గరకు వెళ్లండి. దున్నపోతును అడిగి తెచ్చుకోండి. మీ దగ్గర ఒక ఎద్దు ఉండనే ఉంది కదా. ఆ రెండూ నాగలికి రెండు ప్రక్కలా కట్టడానికి సరిపోతాయి. మీదగ్గరున్న త్రిశూలం నాగలి కర్రుగా పనికొస్తుంది. ఇక నీళ్ల బెడద లేనేలేదు. ఎందుకంటే ఆయన నెత్తిపై గంగ ఉండనేఉంది కదా! (గంగ తన సవతి కాబట్టి పార్వతి ఈ విషయం ప్రస్తావించకపోయినా ఇది అందరికి తెలిసిన విషయమే). నేనే స్వయంగా అన్నం వండి మీకు తెస్తూ ఉంటాను. మన అబ్బాయి కుమారస్వామి దున్నపోతును ఎద్దును మేపుకొస్తాడు.ఎందుకో గాని
మీరు రోజు బిచ్చమెత్తుతుంటే నాకు ఎంతో తలవంపుగా ఉంది. నేను చాల బాధపడుతున్నాను.అందువల్ల మీరు నేటి నుండి ఆ పని మాని వ్యవసాయం పని మొదలు పెట్టండి " . అని చెప్పే పార్వతి పలుకులు మనందరిని రక్షించుగాక అని ఒక కవి అద్భుతమైన శ్లోకం రచించాడు.
రామాద్యాచయ మేదినీం ధనపతేర్బీజం బలాల్లాంగలం
ప్రేతేశాన్మహిషం తవాస్తి వృషభ: ఫాలం త్రిశూలంతవ
శక్తాహం తవచాన్నదానకరణే స్కందోస్తి గో రక్షణే
ఖిన్నాహం తవభిక్షయా కురు కృషిం గౌరీ వచ: పాతు న:
ఈ శ్లోకం కష్టపడి పనిచెయ్యడంలో ఉండే సంతృప్తినీ ,హుందాతనాన్ని సూచిస్తోంది. ఈ నాడు సమాజంలో ఏ పని పాట లేకుండ ఏదో విధంగా కాలం గడుపుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇతరుల సంపాదనపై ఆధారపడి సమయం వెళ్లబుచ్చుతున్నవాళ్లు కూడ కోకొల్లలుగా కనిపిస్తారు. అలాగే అర్థం లేని ఆర్భాటాలకోసం తమ భర్తల్ని అక్రమసంపాదనకు పురిగొల్పే భార్యామణులు కూడ లేకపోలేదు. అలాగే తమ భార్యల మాటలకులోనై అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడి జైలు పాలైన వాళ్లు కూడ మనకు తెలియని విషయం కాదు. పార్వతి ఈ శ్లోకం ద్వారా తనభర్తకిచ్చే సందేశం అందరికి ఆదర్శం కావాలి. స్త్రీలోకమంతా పార్వతి లాగ తమ భర్తల్ని మంచి సలహాలతో మంచి మార్గంలో నడిపిస్తే సమాజంలో సుఖశాంతులకు ఎటువంటి లోటు ఉండదు.

యాచన కన్న యొచన మి


Dr.Chilakamarti DurgaPrasadaRao
3/106, Premnagar, Dayalbagh, AGRA-282005
9897959425
శివుడు ఆది భిక్షువు. ఆయన ఎంత గొప్ప వాడైనా భిక్షాటన తలవంపు పనే. ఆయనకు తలవంపు అనిపించకపోయినా ఆయన భార్య పార్వతికి అది చిన్నతనంగానే తోచింది. అవును మరి మగడు బిచ్చగాడైతే అది మగువకు తలవంపేగదామరి. ఎలాగైనా ఆయన్ని మాన్పించాలి .ఎంతో ఆలోచించింది. ఎలా నచ్చచెప్పాలో చివరికి నిర్ణయించుకుంది. ఎంతగొప్ప సలహా ఇచ్చిందో చూడండి.
"ఏవండీ! మీరు ముందుగా శ్రీరాముని దగ్గరకు వెళ్లండి. కొంతభూమి ఇమ్మని అడగండి.ఆయన కాదనడు. తప్పకుండ ఇస్తాడు. మీ మిత్రుడు కుబేరుడు ఉన్నాడు కదా!ఆయనదగ్గరకు వెళ్లి విత్తనాలు తెచ్చు కోండి. ఇంక బలరాముడి దగ్గరకెడితే నాగలి దొరుకుతుంది. యమధర్మరాజు దగ్గరకు వెళ్లండి. దున్నపోతును అడిగి తెచ్చుకోండి. మీ దగ్గర ఒక ఎద్దు ఉండనే ఉంది కదా. ఆ రెండూ నాగలికి రెండు ప్రక్కలా కట్టడానికి సరిపోతాయి. మీదగ్గరున్న త్రిశూలం నాగలి కర్రుగా పనికొస్తుంది. ఇక నీళ్ల బెడద లేనేలేదు. ఎందుకంటే ఆయన నెత్తిపై గంగ ఉండనేఉంది కదా! (గంగ తన సవతి కాబట్టి పార్వతి ఈ విషయం ప్రస్తావించకపోయినా ఇది అందరికి తెలిసిన విషయమే). నేనే స్వయంగా అన్నం వండి మీకు తెస్తూ ఉంటాను. మన అబ్బాయి కుమారస్వామి దున్నపోతును ఎద్దును మేపుకొస్తాడు.ఎందుకో గాని
మీరు రోజు బిచ్చమెత్తుతుంటే నాకు ఎంతో తలవంపుగా ఉంది. నేను చాల బాధపడుతున్నాను.అందువల్ల మీరు నేటి నుండి ఆ పని మాని వ్యవసాయం పని మొదలు పెట్టండి " . అని చెప్పే పార్వతి పలుకులు మనందరిని రక్షించుగాక అని ఒక కవి అద్భుతమైన శ్లోకం రచించాడు.
రామాద్యాచయ మేదినీం ధనపతేర్బీజం బలాల్లాంగలం
ప్రేతేశాన్మహిషం తవాస్తి వృషభ: ఫాలం త్రిశూలంతవ
శక్తాహం తవచాన్నదానకరణే స్కందోస్తి గో రక్షణే
ఖిన్నాహం తవభిక్షయా కురు కృషిం గౌరీ వచ: పాతు న:
ఈ శ్లోకం కష్టపడి పనిచెయ్యడంలో ఉండే సంతృప్తినీ ,హుందాతనాన్ని సూచిస్తోంది. ఈ నాడు సమాజంలో ఏ పని పాట లేకుండ ఏదో విధంగా కాలం గడుపుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇతరుల సంపాదనపై ఆధారపడి సమయం వెళ్లబుచ్చుతున్నవాళ్లు కూడ కోకొల్లలుగా కనిపిస్తారు. అలాగే అర్థం లేని ఆర్భాటాలకోసం తమ భర్తల్ని అక్రమసంపాదనకు పురిగొల్పే భార్యామణులు కూడ లేకపోలేదు. అలాగే తమ భార్యల మాటలకులోనై అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడి జైలు పాలైన వాళ్లు కూడ మనకు తెలియని విషయం కాదు. పార్వతి ఈ శ్లోకం ద్వారా తనభర్తకిచ్చే సందేశం అందరికి ఆదర్శం కావాలి. స్త్రీలోకమంతా పార్వతి లాగ తమ భర్తల్ని మంచి సలహాలతో మంచి మార్గంలో నడిపిస్తే సమాజంలో సుఖశాంతులకు ఎటువంటి లోటు ఉండదు.

నోరుంటే తలకాస్తుంది


Dr. Chilakamarti Durgaprasada Rao
3/106, Premnagar, Dayalbagh,AGRA 282005
9897959425
అవి ఒక మహారాజు రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్న రోజులు. దేశం సుభిక్షంగానే ఉంది. అయినా ఒక వ్యక్తి తనకుల వృత్తియైన దొంగతనాన్ని వదిలిపెట్ట కుండా చేస్తూనే ఉన్నాడు. అతని పేరు భుక్కుండుడు. యథాప్రకారం దొంగతనం చేస్తూ ఒకరోజు మారువేషంతో నగరంలో తిరుగుతున్న రాజుకు పట్టుబడ్డాడు. ఆనాడు దొంగతనానికి మరణదండన ఒకటే శిక్ష. అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి.
మరణ సమయం దగ్గరయ్యే కొద్ది అతనిలో భయం పెరుగుతోంది. ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్నాడు. ఆ రోజుల్లో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ప్రతి వాడికి చదువు కొద్దో గొప్పో సాహిత్య జ్ఞానం ఉండేవి. కొంతమందికి కవిత్వంకూడ అబ్బేది.
అతనిలో ఈ రెండూ తగుమాత్రం గా ఉన్నాయి. రాజును మెప్పించడానికి కావలసిన ప్రతిభాపాటవాలు లేకపోయినా బ్రతికి బయట పడడానికి కావలసిన తెలివితేటలున్నాయి. మరునాడు శిక్ష పడుతుందనగా ఆ రాత్రంతా ఆలోచించాడు. ఎలాగో ఒకపద్యం అల్లగలిగాడు. రాత్రి గడిచింది. శిక్ష అమలు కాబోతోంది. 'చివరి కోరికేమైనా ఉంటే కోరుకో' అన్నారు శిక్షనమలు పరిచే రాజభటులు. 'రాజుగార్ని చూడాలి ఇదే నాచివరి కోరిక' అన్నాడు. వెంటనే రాజు దగ్గరికి తీసికెళ్లారు వాణ్ణి. వాడు రాజుతో 'రాజా! మీరు కవితాప్రియులు. అంతేగాక స్వయంగా కూడ కవులు. అందువల్ల నేను వ్రాసిన ఒక చిన్న కవిత వినండి. మీకు వినిపించాక నేను హాయిగా మరణిస్తాను' అన్నాడు. రాజు 'సరే వినిపించు' అన్నాడు. వాడు తాను రాత్రంతా ఆలోచించి అల్లిన కవితను ఇలా వినిపించాడు. దానిసారాంశం ఇది.
ఓ మహారాజా! ట్టి అనే మహాకవి మరణించాడు. భారవి అనే మహాకవి కూడ మరణించాడు. భిక్షువు అనే మరో కవి చనిపోయి చాలకాలమయింది. ఆ తరువాత భీమసేనుడు అనే మరో కవి కూడ చచ్చిపోయాడు. నా పేరు భుక్కుండుడు. ఇది మీకు తెలిసిందే. నాతరువాత ఈదేశాన్ని పాలించే భూపతి మీరే ఉన్నారు. మహారాజా! ఈ సారి ఎందుకో యమధర్మరాజు "" గుణింతంలో తిరుగుతున్నాడు సుమండీ!( నేడు నేను మరణిస్తే నాతరువాత టిక్కట్టు మీదే సుమా అని అంతరార్థం)
రసికుడైన రాజుకి అంతా అర్థమయింది. వాడి తార్కికమైన ఆలోచనకి భయపడ లేదుగాని చమత్కారానికి ఎంతో ఆనందించాడు. తత్ఫలితంగా శిక్షను రద్దుచేశాడు. వాడు కూడ రాజు ప్రోత్సాహంతో దొంగతనానికి స్వస్తి చెప్పి కావ్య రచనకు శ్రీకారం చుట్టాడు. ఇంతకీ
వాణ్ణి కాపాడిన ఆ మనోహరమైన శ్లోకాన్ని తిలకించండి.
భట్టిర్నష్ట: భారవిశ్చాపి నష్ట:
భిక్షుర్నష్ట: భీమసేనశ్చ నష్ట:
భుక్కుండోహం భూపతిస్త్వం హి రాజన్!
భబ్భావళ్యామంతకస్సన్నివిష్ట: