Saturday, June 9, 2012

యోచనతో యాచన

-->
యోచనతో యాచన

యాచన అనేది చాల నీచమైన పని.ఎంతటి గొప్పవాడైనా యాచించడం వల్ల చాల చులకనైపోతాడు. సర్వవ్యాపకుడైన శ్రీమహావిష్ణువు కూడ మూడడుగుల నేల యాచించడం కోసం వామన మూర్తిగా మారిపోవడం అందరికి తెలిసిందే. కాని సమాజంలో కొంతమంది అదే వృ త్తిలో ఉంటారు. వారికది తప్పనిపించదు. పైపెచ్చు దాన్ని గొప్పగా సమర్థించుకుంటారు . ఎంత గొప్పగాసమర్థించుకుంటారంటే మనం కూడ దాన్ని కాదనలేం. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన చమత్కారశ్లోకం పరిశీలిద్దాం.
ఒక యాచకుడు చక్రవర్తి దగ్గరకు వెళ్లి , “భిక్షాం దేహి!” అన్నాడు. వాణ్ణిచూస్తే రాజుకు చాల కోపమొచ్చింది.ఎందుకంటే వాడు మంచి వయస్సులో ఉన్నాడు ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. "ఏమయ్యా! అడుక్కోవడం నీకు చిన్నతనంగా లేదా ! సిగ్గనిపించడంలేదా !” అని ప్రశ్నించాడు రాజు. ఆ యాచకునికి తాను చేస్తున్నపని సమర్థించుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఎంత చమత్కారంగా సమాధానం చెబుతున్నాడో స్వయంగా చూడండి.
ఓ రాజా! నేను శివభక్తుణ్ణి, అడుక్కునేవాణ్ణి ఏమాత్రంకాను. నాస్వామిలో సగభాగం విష్ణుమూర్తి తీసుకుపోయాడు. తనలో కలుపుకుని హరిహర నాథునిగా ప్రసిద్ధికెక్కాడు.రెండవ సగభాగాన్ని పార్వతీ దేవి లాక్కు పోయింది.ఇక ప్రపంచంలో శివుడే లేకుండా పోయాడు .ఇక ఆయన్ని ఆశ్రయించుకున్నవారందరికి ఏఆధారం లేకుండా పోయింది.వేచి వేచి విసిగి వేసారిన గంగ, చివరకు సముద్రాన్ని చేరుకుని సుఖంగా ఉంది. చంద్ర వంక ఇంకా ఆకాశంలో వేళ్లాడుతోనే ఉంది.కంఠాభరణంగా ఉండే పాము పాక్కుంటూ భూలోకానికి పోయింది. ఇంకా శివునికి మూడు గుణాలున్నాయి.మొదటిది సర్వజ్ఞత్వం అంటే అన్నిటినీ తెలుసు కోగలిగే శక్తి. రెండోది అధీశ్వరత్వం . అంటే లోకానికి ప్రభువు కాగలగడం . ఆ రెండూ దిక్కులేనివై పోయి చివరికి నీలాంటి యోగ్యుడైన మహాపురుషుని ఆశ్రయించాయి. అందుకే నువ్వు ఈశ్వరుని వలే సర్వజ్ఞుడివీ లోకాధి నాధుడవు అయ్యావు. ఇక ముచ్చటగా మూడో లక్షణం ఉందే అది మరేదోకాదు. అడుక్కోవడం. ఏ దిక్కూలేని ఆ దిక్కుమాలినలక్షణం అన్ని దిక్కులూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ చివరికి ఈ దిక్కుమాలిన నన్ను ఆశ్రయించింది. రాజా! నన్నేం చెయ్యమంటారు చెప్పండి” అన్నాడు.
రాజుకు వాడు చేస్తున్నపని నచ్చక పోయినా వాడి యుక్తి, చెప్పిన తీరు, పరోక్షంగా తనపై కురిపించిన ప్రశంసలు బాగా నచ్చాయి.ఏదో కొంత ముట్ట జెప్పి పంపించాడు.
ఇంతచమత్కారాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ శ్లోకాన్ని తిలకించండి.

अर्धं दानववैरिणा गिरिजयाप्यर्धं हरस्याहृतं |
देवेत्थं भुवनत्रये स्मरहराभावे समुन्मीलति ||
गंगा सागरमंबरं शशिकला शेषश्च पृथ्वीतलं |
सर्वज्ञत्वमधीश्वरत्वमगमत्त्वां मां च भिक्षाटनम् ||
(अप्पय्यदीक्षित:)


అర్ధం దానవవైరిణా గిరిజయాప్యర్ధం హరస్యాహృతం
దేవేత్థం భువనత్రయే స్మరహరాభావే సమున్మీలతి
గంగా సాగరమంబరం శశికళా శేషశ్చ పృధ్వీతలం
సర్వజ్ఞత్వమధీశ్వరత్వమగమత్త్వాం మాం చ భిక్షాటనం

(సంస్కృత భాషలో ఇటువంటి అద్భుతమైన శ్లోకాలు లక్షల కొలదీ ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఒక జీవితానికి సరిపోయే ఆ నందాన్ని పంచి ఇవ్వగలవు .కాబట్టి ఇది చదివిన పాఠకులందరు సంస్కృత భాషనేర్చుకునే ప్రయత్నం చెయ్యాలని కోరుతూ......)

No comments: