Thursday, June 7, 2012

యాచన కన్న యోచన మిన్న


శివుడు ఆది భిక్షువు. ఆయన ఎంత గొప్ప వాడైనా భిక్షాటన తలవంపు పనే. ఆయనకు తలవంపు అనిపించకపోయినా ఆయన భార్య పార్వతికి అది చిన్నతనంగానే తోచింది. అవును మరి మగడు బిచ్చగాడైతే అది మగువకు తలవంపేగదామరి. ఎలాగైనా ఆయన్ని మాన్పించాలి .ఎంతో ఆలోచించింది. ఎలా నచ్చచెప్పాలో చివరికి నిర్ణయించుకుంది. ఎంతగొప్ప సలహా ఇచ్చిందో చూడండి.
"ఏవండీ! మీరు ముందుగా శ్రీరాముని దగ్గరకు వెళ్లండి. కొంతభూమి ఇమ్మని అడగండి.ఆయన కాదనడు. తప్పకుండ ఇస్తాడు. మీ మిత్రుడు కుబేరుడు ఉన్నాడు కదా!ఆయనదగ్గరకు వెళ్లి విత్తనాలు తెచ్చు కోండి. ఇంక బలరాముడి దగ్గరకెడితే నాగలి దొరుకుతుంది. యమధర్మరాజు దగ్గరకు వెళ్లండి. దున్నపోతును అడిగి తెచ్చుకోండి. మీ దగ్గర ఒక ఎద్దు ఉండనే ఉంది కదా. ఆ రెండూ నాగలికి రెండు ప్రక్కలా కట్టడానికి సరిపోతాయి. మీదగ్గరున్న త్రిశూలం నాగలి కర్రుగా పనికొస్తుంది. ఇక నీళ్ల బెడద లేనేలేదు. ఎందుకంటే ఆయన నెత్తిపై గంగ ఉండనేఉంది కదా! (గంగ తన సవతి కాబట్టి పార్వతి ఈ విషయం ప్రస్తావించకపోయినా ఇది అందరికి తెలిసిన విషయమే). నేనే స్వయంగా అన్నం వండి మీకు తెస్తూ ఉంటాను. మన అబ్బాయి కుమారస్వామి దున్నపోతును ఎద్దును మేపుకొస్తాడు.ఎందుకో గాని
మీరు రోజు బిచ్చమెత్తుతుంటే నాకు ఎంతో తలవంపుగా ఉంది. నేను చాల బాధపడుతున్నాను.అందువల్ల మీరు నేటి నుండి ఆ పని మాని వ్యవసాయం పని మొదలు పెట్టండి " . అని చెప్పే పార్వతి పలుకులు మనందరిని రక్షించుగాక అని ఒక కవి అద్భుతమైన శ్లోకం రచించాడు.
రామాద్యాచయ మేదినీం ధనపతేర్బీజం బలాల్లాంగలం
ప్రేతేశాన్మహిషం తవాస్తి వృషభ: ఫాలం త్రిశూలంతవ
శక్తాహం తవచాన్నదానకరణే స్కందోస్తి గో రక్షణే
ఖిన్నాహం తవభిక్షయా కురు కృషిం గౌరీ వచ: పాతు న:
ఈ శ్లోకం కష్టపడి పనిచెయ్యడంలో ఉండే సంతృప్తినీ ,హుందాతనాన్ని సూచిస్తోంది. ఈ నాడు సమాజంలో ఏ పని పాట లేకుండ ఏదో విధంగా కాలం గడుపుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇతరుల సంపాదనపై ఆధారపడి సమయం వెళ్లబుచ్చుతున్నవాళ్లు కూడ కోకొల్లలుగా కనిపిస్తారు. అలాగే అర్థం లేని ఆర్భాటాలకోసం తమ భర్తల్ని అక్రమసంపాదనకు పురిగొల్పే భార్యామణులు కూడ లేకపోలేదు. అలాగే తమ భార్యల మాటలకులోనై అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడి జైలు పాలైన వాళ్లు కూడ మనకు తెలియని విషయం కాదు. పార్వతి ఈ శ్లోకం ద్వారా తనభర్తకిచ్చే సందేశం అందరికి ఆదర్శం కావాలి. స్త్రీలోకమంతా పార్వతి లాగ తమ భర్తల్ని మంచి సలహాలతో మంచి మార్గంలో నడిపిస్తే సమాజంలో సుఖశాంతులకు ఎటువంటి లోటు ఉండదు.

No comments: