Friday, June 8, 2012

అర్థాలు-అంతరార్థాలు


అర్థాలు-అంతరార్థాలు

 
కవుల ఆత్మీయత తమకావ్యాల్లో ప్రతిబింబించడం చాల సహజమైన విషయం. కవి తన అభిరుచులు ఆవేదనలు వ్యక్తం చెయ్యాలనుకుంటే అతనికి రచనల ద్వారా తప్ప మరొక మార్గం లేదు. మహాకవుల్లో చాల మంది తమ అభిరుచులను ఆవేదనలను సందర్భానుసారంగా వ్యక్తం చేసుకోవడం తెలుగు సాహిత్యంలో పలుచోట్ల కనిపిస్తో ఉంటుంది. పాండురంగమాహాత్మ్యాన్ని రచించిన శ్రీ తెనాలి రామకృష్ణ కవికి కూడ ఈ అవసరం వచ్చింది.
తెనాలి రామకృష్ణకవి కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరని సాంప్రదాయానుయాయులు నమ్ముతునారు. కాని అది సత్యం కాదని చారిత్రకుల నిర్ణయం.
తెనాలిరామకృష్ణ కవి తన పాండురంగమాహాత్మ్యాన్ని విరూరి వేదాద్రి మంత్రికి అంకితం చేశాడు. ఆయన రాయలకంటే చాల తరువాతకాలానికి చెందిన వాడు కావడం వల్ల తెనాలి రామకవి కూడ రాయలకంటే చాల అర్వాచీనుడని భావించడంలో తప్పేమీ లేదు. ఒకవేళ తెనాలి రామకృష్ణకవి రాయలకు సమకాలికుడే అనుకున్నా రాయలకు తన కావ్యం అంకితమిచ్చేటంత వయస్సు గలవాడు కాకపోవచ్చును. కాకుంటే తనకావ్యాన్ని రాయలకు కాక వేరొక్కరికి అంకితం చెయ్యవలసిన అగత్యం గాని, అవసరం గాని తెనాలి రామకవికి పట్టదు. ఏదియేమైన తన కావ్యాన్ని రాయలకు అంకితం చెయ్యలేకపోయానే అనే ఆవేదన తెనాలి రాముని హృదయం లో గూడుకట్టుకుని ఉంది. అది చాల స్పష్టం గా పాండురంగమాహాత్మ్యం లోని ఈ పద్యంలో వ్యక్తమౌతోంది.
గంగాసంగమమిచ్చగించునె మదింగావేరి దేవేరిగా
నంగీకారమొనర్చునే యమునతోనానందముంబొందునే
రంగత్తుంగతరంగహస్తములనారత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖించెనేని గుణభద్రా! తుంగభద్రానదీ!
ఇది తుంగభద్రానదిని వర్ణిస్తూ కవి చెప్పిన పద్యం. ఓ తుంగభద్రానదీ! సముద్రుడు నీసంగమసుఖాన్ని పొంది యున్నచో గంగానదీ సంగమాన్ని కూడ ఇష్టపడేవాడు కాదు.కావేరీనదిని భార్యగా అంగీకరించేవాడు కాదు. యమునానదితో ఆనందించేవాడు కాదు. ఇది బాహ్యార్థం.
ఇచ్చట 'గంగా' పదంచే అల్లసాని వారి "మనుచరిత్ర" సూచింపబడుతోంది. 'కావేరీ' పదంచే రాయల వారు స్వయంగా రచించిన "ఆముక్తమాల్యద" స్ఫురిస్తోంది. 'యమునా' పదంచే ముక్కుతిమ్మన గారి "పారిజాతాపహరణం" వ్యక్తమౌతోంది. అలాగే 'తుంగభద్రా' పదంచే రామకృష్ణకవి"పాండురంగమాహాత్మ్యం " ప్రకటమౌతోంది. ఆయా కావ్యాల్లో ఆయానదుల వర్ణన గాని లేక కథతో ఏదోవిధమైన సంబంధం ఉండడం వల్ల ఈ ఊహకు అవకాశం కలుగుతోంది. ఉదాహరణకు మనుచరిత్ర కథ గంగానదికి నిలయమైన హిమాలయాల్లో ప్రారంభమయింది. అలాగే పారిజాతాపహరణకథ యమునానది ఒడ్డున, ఆముక్తమాల్యద కథ కావేరీతీరాన, పాండురంగమాహాత్మ్యకథ తుంగభద్రానదీ తీరాన చోటుచేసుకున్నాయి.
దీన్ని బట్టి సముద్రుని వంటి ఆ రాయలు తాను రచించిన పాండురంగమాహాత్మ్యం స్వీకరించి యుండినచో పెద్దనగారి మనుచరిత్రను ఇష్టపడేవాడు కాదు. తానేస్వయంగా వ్రాసిన ఆముక్తమాల్యదను లెక్కపెట్టేవాదుకాదు. ముక్కుతిమ్మనగారి పారిజాత సౌరభాన్ని కూడ ఆఘ్రాణించి ఆనందించేవాడుకాదు. కాని ఆయనకు తనకావ్యాన్ని అంకితంచేసే అదృష్టం దక్కలేదనే తెనాలి రామకృష్ణుని ఆవేదన ఈ పద్యంలో ధ్వనిస్తోందని భావించడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం.

No comments: