Wednesday, June 29, 2016

తిన్నని భక్తిమార్గమే తిన్ననైన భక్తిమార్గం

   తిన్నని భక్తిమార్గమే తిన్ననైన భక్తిమార్గం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
క ప్రాంతానికి సంబంధించిన కొన్ని విశ్వాసాలు, ఆచారాలు, కార్యకలాపాలసముదాయమే సంస్కృతిగా పరిగణి౦చవచ్చు. ఒక జాతి యొక్క జీవనవిలువల సముదాయమే సంస్కృతి. ఈ ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు పుట్టాయి. కొన్ని నశించాయి, మరికొన్ని సాంకర్యం పొందాయి. కాని ఆవిర్భవించిననాటి నుండి నేటి వరకు ఇతర సంస్కృతుల ప్రభావానికి లోనుగాక తన ఉనికిని కాపాడుకు౦టూ అవిచ్ఛిన్నంగా నిలిచిన సంస్కృతి గిరిజనసంస్కృతి మాత్రమే అని చెప్పుకోవచ్చు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండడం వల్ల ఆదానప్రదానాలకు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సంస్కృతి తన ఉనికిని యథాతథంగా  నిలుపుకోగలిగింది. కాబట్టి ఎటువంటి సాంకర్యదోషాలు అంటకుండ స్వచ్ఛ మైన, అవిచ్ఛిన్నమైన సంస్కృతంటూ ఏదైనా ఒకటి ఉందంటే అది గిరిజన సంస్కృతి మాత్రమే అని చెప్పక తప్పదు.
ఆంధ్రసాహిత్యంలో గిరిజనసంస్కృతిని చాల విస్తృతంగా వర్ణించిన ఘనత దక్కించుకున్న వారిలో ధూర్జటి మహాకవి ఒకడు. ఆయన స్వయంగా గమనించిన విశేషాలన్నీ తన కావ్యంలో వర్ణించి మనకందించిన మహనీయుడు. ఆయన రచించిన కాళహస్తి మాహాత్మ్యం కొండ జాతివారగు చెంచుల వస్త్రధారణ, ఆభరణ విశేషాలు, పంటలను రక్షించే విధానాలు, ప్రసవసమయంలో అనుసరించే వైద్యరీతులు, ఇతరసమయాల్లో అవలంబించే వైద్యవిధానాలు , చెంచుల క్రీడావిశేషాలు, కాటిఱేని జాతరలు , వినోదవిశేషాలు , వేటాడే విధానాలు , వేటకుపయోగి౦చే వివిధపరికరాలు మనకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఇవన్నీ ఆయన నిశితమైన పరిశీలనకు నిదర్శనాలు. ఇక భక్తి విషయానికొద్దాం. ధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆయన భక్తిమార్గాన్ని ప్రశంశిస్తూ తన శతకంలో ఇలా అంటాడు.
సాలె పురుగు ఏ వేదం చదివింది ? పాము ఏ శాస్త్రం తిరగేసింది? ఏనుగు ఏ విద్య అభ్యసించింది? తిన్నడు ఏ మ౦త్రం పఠి౦చాడు.  మోక్షానికి చదువులు ముఖ్యమా ! కాదు నీ పాదపద్మములు సేవి౦చడమే తరణోపాయం అని ఆయన ఈక్రింది మాటల్లో వివరించాడు.
  
ఏ వేదంబు పఠి౦చె లూత, భుజగం బేశాస్త్రముల్  సూచె, తా
నేవిద్యాభ్యసన౦బొనర్చెకరి, చె౦చేమంత్రమూహించె, బో
ధావిర్భావ నిధానముల్  చదువులయ్యా ! కావు నీపాద స౦
సే వాసక్తియె గాక  జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

                  అద్వైతసిద్ధాంత ప్రవర్తకులైన శ్రీ శంకరభగవత్పాదులు  ఈ భక్తిమార్గాన్ని విశేషంగా ప్రశంసి౦చడంతో బాటు ఆటవికుడగు కోయతిన్నని భక్తికి పెద్దపీట వెయ్యడం కూడ ఒక విశేషం . వారి మాటల్లోనే చూద్దాం :

మార్గావర్తితపాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే 
గ౦డూషా౦బునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే      
కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే
భక్తి: కిం న కరోత్యహో! వనచరో భక్తావతంసాయతే

 మార్గంలో నడిచే కాలిచెప్పు శివనిర్మాల్యాన్ని తొలగించే కుంచె అయిందట . పుక్కిట పట్టిన నీరు అభిషేకజలం ఐందట. కొంచెం తిని ఎంగిలి చేసిన మాంసం భగవంతునకు సమర్పించిన నైవేద్యమైనదట. ఆహా ! భక్తికి సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. అనాగరికుడైన ఆ వనచరుడు భాక్తాగ్రగణ్యుడయ్యాడని అభివర్ణించారు. ధూర్జటి ఈ భక్తిని శ్రుతివ్యవహారేతర భక్తిగా పేర్కొన్నాడు. అదేంటో చూద్దాం.
అది పొత్తపినాడు అనే ప్రాంతం . కిరాతులకు ఆటపట్టు . అందులో ఉడుమూరు అనే పల్లె ఉంది. అక్కడ పుట్టాడు తిన్నడు. తోటిపిల్లలతో ఎన్నో ఆటలాడాడు . ఆటలాడే వయస్సులోనే వేటాడే విధానాలన్ని క్షుణ్ణ౦గా నేర్చుకున్నాడు. ఒకనాడు సహచరులైన తోటి ఆటవికులతో వేటకు బయలుదేరాడు . వేటాడి వేటాడి అలసిపోయాడు. ఒక బొగడచెట్టు క్రింద ఒళ్ళు మఱచి నిద్రపోయాడు.  శివుడు కలలో కన్పించాడు . తనను ఆరాధించమని హితవు చెప్పాడు. తిన్ననికి మెళుకువ వచ్చింది. ఒక అడవిపందిని వెంటాడుతూ చాలదూరం పోయి ఒకచోట శివలింగాన్ని చూశాడు. ఆలనా పాలన లేక ఒంటరిగా పడియున్న శివుణ్ణి చూసి జాలిపడ్డాడు. ఇలా ప్రార్ధించాడు. ఏమయ్యా ! సామి ! కొండల్లో పులులు సింహాలు సంచరించే ఈ దట్టమైన అడవిలో జువ్విచెట్టు క్రింద  ఎందుకిల్లుకట్టుకుని ఉ౦టున్నావు. నీకాకలేస్తే అన్నం ఎవరు పెడతారయ్యా? ఇక్కడుండొద్దు మాఊరొచ్చై అని అంటాడు :

ఓ సామీ ! యిటువంటి కొండదరిలోనొంటి౦ బులుల్ సింగముల్
గాసిం బెట్టెడుకుట్ర నట్టడవిలో గల్జువ్వి క్రీనీడనే
యాసం గట్టితివేటిగట్టనిలు నివాకొన్న చో ( గూడునీ
ళ్లే సుట్టంబులు దెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా!

అన్నాడు -   అంతే గాక మా ఊళ్లో      లేళ్ళు దుప్పులు పందులు వేటాడి
బాగా వండుతారు. పిట్టల్ని కూడా వండుతారు. నువ్వు మారు మాటాడకుండా మా ఊరు రావయ్యా సామీ అని దీనంగా ప్రార్థించాడు ఎన్నో రకాల ధాన్యాలతో నీకు పాయసం చేసి పెడతానంటాడు. పట్టుతేనే, పుట్టజున్ను , తొఱ్ఱతేనే మొ|| ఎన్నో మధురమైన పదార్థాలు నీకు సమర్పిస్తాను రమ్మని వేడుకుంటాడు. ఆ ప్రా౦తాల్లో లభించే రకరకాల పండ్ల పేర్లు చెప్పి అవన్నీ నీకు సమర్పిస్తాను  రావయ్యా అని పరిపరి విధాల ప్రార్థిస్తాడు అంతే గాక ఓంటరితనంలో ఉండే ఇబ్బందులు వవరించి సుఖంగా జీవించాలంటే తన ఊరికి రమ్మని కోరతాడు .

ఇల్లో ముంగిలియో యనుంగు చెలులో యీ డైన చుట్టంబులో
యిల్లాలో కొడుకో తరింపవశమే యే పోడుముల్లేక మా
పల్లెంగోరినవెల్లనుం గలవు  తెప్పల్ గాగ నీకిచ్చెదన్
చెల్లంబో ! యిక ఒంటి ను౦డకటు విచ్చేయంగదే! లింగమా !

అని పరిపరి విధాల ప్రార్థి౦చినాశివుడు తన మాట వినకపోయే సరికి సంతప్త హృదయుడై శివుని  వీడిరానని తన మిత్రులతో ఖచ్చితంగా చెప్పేస్తాడు . వారు చేసేది లేక తమతమ  ఇండ్లకు  చేరుకుంటారు . శివుడు చాల కాలంనుంచి ఆకలితో ఉన్నాడు అతనికి ఆహారం పెట్టాలనే  ఉద్దేశంతో ఎన్నో జంతువులను వేటాడి కమ్మగా వండి , దొప్పల్లో అమర్చి తీసుకువచ్చి తినమని పట్టుబడతాడు. ఎంత కోరినా  శివుడు తినడు . తిన్నడు ప్రాణత్యాగానికి సిద్ధమౌతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై  ఆరగిస్తాడు . ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి.                               
ఒకనాడు శివార్చకుడొకడు ఆ ప్రదేశానికి  వస్తాడు. మలినమైన శివలింగాన్ని , అపరిశుభ్రంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూచి వెత చెందుతాడు . దానికి కారణం వివరించమని లేకపోతె కూడు నీళ్ళు మానేసి కృశించి మరణిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై తిన్నని భక్తితత్పరతను శివార్చకునకు తెలియచెప్పదలచి అతన్ని శివలింగం వెనుక దాగి యుండమని ఆదేశిస్తాడు.
 మరునాడు యథాప్రకారం తిన్నడు శివుని చేరి నిర్మాల్యాన్ని చెప్పుకాళ్ళతో తొలగించి పుక్కిట పట్టి తెచ్చిన నీటితో శివుని అభిషేకించి , ఆకులు, అలములు అమర్చి తాను కాల్చి తెచ్చిన మాంసపుముక్కలను తినమని అందిస్తాడు . ఎంతసేపటికి శివుడు తినడు. తిన్నడు తాను సమర్పించిన ఆహారం శివుడు ఎందుకు తినడం లేదు అని పరిపరి విధాలఆలోచిస్తాడు   ఏమయ్యా ! సరిగ్గా కాలలేదా, లేతగా అనిపిస్తున్నాయా , ఓకవేళ మాడిపోయాయా, కమ్మగాలేవా, రుచిగా లేవా  , ఇచ్చినవి  సరిపోలేదా లేక తినడం చేతగాకనా ! ఎందుకుతినడం లేదయ్యా అని పరిపరివిధాల వాపోయాడు .
కాలవో   క్రొవ్వవొ  మాడం 
గాలెనొ చవిగావొ   కమ్మగావో నీకు౦ 
చాలవొ అలవడవో తిన
వేలా కరకుట్లు పార్వతీశ్వర చెపుమా!
 కొంత సేపటికి  శివుని కంటి వెంట నీరు కారుతూ  ఉండడం గమనిస్తాడు. అప్పుడు తిన్నడు శివునికందించిన వైద్యసేవలు గిరిజనుల వైద్య విధానాన్ని మనకు తెలియ జేస్తున్నాయి.

కోక పొట్లం బావిగొని నూది  మెత్తుచు
              కషణోష్ణ కరభభాగమున గాచి
నెత్తితంగేడాకు మెత్తి , రేచకినిమ్మ
            పంటి నీరున నూఱి పట్టు వెట్టి
తెల్లదింటెన పువ్వు తెచ్చి తద్రసమిది
          కలివెపువ్వులు కోసి వలచి పిడిచి
పేరిన నేయి వెట్టి , పెరుగు వత్తులు వైచి
             చనుబాలతో రాచి సంకు చమిరి
విన్న మందులు మరియు తా కన్న మందు
లడిగి తెచ్చినమందులా యడవిమందు
లెన్ని చేసిన మానక యి౦దుమౌళి
కన్ను తొడబడి నెత్తురు కారుటయును

ఈ పద్యంలో నేత్ర రుగ్మత పోగొట్టడానికి కావలసిన  మందులన్ని  First Aid తోసహా పొందుపరచ బడ్డాయి.  కాని తిన్నడు చేసిన వైద్యమ౦తా బూడిదలో పోసిన పన్నీరులాగ, ఏటిలో పిసికిన చింతపండులాగ నిరుపయోగమైపోయింది .
అపుడు తిన్నడు చాల సూక్ష్మంగా ఆలోచించి కంటికి కన్నె తగిన మందని గ్రహించాడు. తనకన్ను పెరికి శివునకు అమర్చాడు. శివుడు ఇంకా పరీక్షించ దలిచాడు .  రెండవకంటిలో కూడ దోషం చూపించాడు . తిన్నడు తన రెండవ కంటిని కూడ నూడబెరికి శివున కమర్చదలచి  స్వామి ! నాకున్నవి రెండే కళ్ళు . ఒక వేళ నీ మూడవ కంట రక్తం కారితే నాప్రాణాలు సమర్పించడం తప్ప నేనేమీ చేయలేను అంటూ రెండవ కనుగ్రుడ్డు పెకలిస్తూ ఉ౦డగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడుగగా తిన్నడు తుచ్ఛమైన ధన, కనక, వస్తు, వాహనాలను కోరక శాశ్వతమైన శివసాయుజ్యాన్నే కోరుకోడం  శివుడు పునరావృత్తిరహితమైన ఆత్మధామాన్ని ప్రసాదించడం జరుగుతుంది.
గిరిజనులు మాయామర్మములెరుగని పసిపిల్లల్లాంటివారు. వారి సంస్కృతి స్వచ్ఛమైంది, సుందరమైంది, ఆదర్శప్రాయమై౦ది. తమ మనుగడకు దోహదం చేసే ప్రకృతిని భక్షి౦చకుండ కంటికి రెప్పలా రక్షిస్తూ, పుడమితల్లిపై ఆధిపత్యం చెలాయి౦చకుండ ఆమె అడుగులకు మడుగులొత్తుతూ , సహజవనరులను తమకొక్కరికే కాకుండా అందరికి అందిస్తూ ప్రకృతితో పాటు సహజీవనం చేసే ఈ గిరిజనులే అసలుసిసలైన పుడమితల్లి అనుంగు బిడ్డలు. తాము బ్రతుకుతూ తోటి వారిని బ్రతికించే వారి జీవనవిధానం అందరికి ఆదర్శం కావాలి. వారి సంస్కృతిని ఆకళింపు చేసుకుందాం అనుసరిద్దాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం . ప్రకృతివైపరీత్యాలను నివారించుకుందాం . మానవప్రగతికి బ౦గారుబాటలు నిర్మి౦చుకుందాం.