Sunday, September 27, 2015

You can laugh if you wish

You can laugh if you wish

1.    క స్కూల్ లో ప్రధానాధ్యాపకులు( Head-Master) బోర్డు మీద The teacher is going to meet the classes today అని వ్రాయించారు. కొంతమంది అల్లరి పిల్లలు ఆయన చూడకుండా c అనే అక్షరం చెరిపేశారు.  అపుడు The teacher is going to meet the (c) lasses today అని బోర్డులో కనిపిస్తోంది . ఆయన చాల బాధపడ్డారు . ఎందుకంటే lasses అంటే కన్నెపిల్లలని అర్థం. వెంటనే ఆయన servant ని పిలిచి L అనే అక్షరం కూడ చెరిపించేశారు. The teacher is going to meet the (l) asses today అది చూసిన పిల్లలు తమను గాడిదలు చేసిన ఆయన ప్రతిభకు ఒక ప్రక్క ఆనందిస్తూ మరోప్రక్క  లోపల్లోపలే ఏడుస్తూ కూర్చున్నారు.
2.    ర్త (భార్యతో) ఏమే ! నీతో ఒక విషయం చెప్పాలని ఎప్పట్నించో  అనుకుంటున్నాను . చెబితే ఏమి అనుకోవుగదా!
భార్య :- నేనేమి అనుకోను చెప్పండి .  
భర్త:- భయమేస్తో౦దే నీతో చెప్పడానికి .      
  భార్య :- పరవాలేదు చెప్పండి . నేనేమనుకోనన్నానుగా.
  భర్త:- ఏం లేదు .పక్కింటి మీనాక్షి నాకు రోజు కల్లోకొస్తోంది.
  భార్య:- ఓహో! అదా! దానికేముందండి. ఆమె ఒంటరిగానే కల్లోకొస్తోంది కదూ!
  భర్త:- ఔనే! నీకెలా తెలుసు. 
  భార్య:- వాళ్లాయన నాకు రోజూ కల్లోకొస్తున్నాడు.
3.    టీచర్:- ఒరే  రామూ! humanitarian అంటే ఎవరు?
రాము:- మనుషుల్ని తినేవాడండి.
      టీచర్:- ఛీ వెధవా !తప్పురా
      రాము:- ఎందుకు తప్పండి? vegetarians అంటే కాయగూరలు తినేవాళ్లైనప్పుడు humanitarians అంటే మనుషుల్ని తినేవాళ్లే కదండి.

టీచర్:- ఆ(   

Tuesday, September 22, 2015

The pseudo student of a pseudo teacher (బండగురో: మొండి శిష్య: )

The pseudo student of a pseudo teacher           (బండగురో: J మొండి శిష్య: J  )

Dr.Ch. Durga Prasada Rao
        
యథా రాజా తథా ప్రజా: అన్నారు పెద్దలు. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడ అలాగే ఉంటారని అర్థం . ఈ నియమం అన్నిటికి వర్తిస్తుంది. తండ్రి  ఎలా ఉంటే కొడుకూ అలాగే ఉంటాడు. గురువెలా ఉంటే శిష్యుడు అలాగే ఉంటాడు. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖకవి నీలకంఠ దీక్షితులు కలివిడంబనం  అనే తన అధిక్షేపకావ్యంలో(satirical poetry) కొంతమంది కుహనా గురువులు మరియు వారి శిష్యుల లక్షణాలను చాల చక్కగా వర్ణించాడు .

వాచ్యతాం సమయోతీత:   స్పష్టమగ్రే భవిష్యతి
ఇతి పాఠయతాo గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే?

చదువు. నాకు టైము ఐ పోయింది. నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ముందు ముందు అదే అర్థం అవుతుంది అని పాఠాలు బోధి౦చే వారికి అసలు కష్టం ఏముంటుంది?  ఇక ఇటువంటి కుహనా గురువులకు వారి అదృష్టం కొద్ది కొంతమంది శిష్యులు దొరుకుతారు. ఇక వాళ్ళ సంగతి చూద్దాం.

అగతిత్వమతిశ్రద్ధా  జ్ఞానాభాసేన తృప్తతా
త్రయ: శిష్యగుణాహ్యేతే మూర్ఖాచార్యస్య  భాగ్యజా:
         
ఆ చుట్టుప్రక్కల మరో అధ్యాపకుడు ఎవరు  లేని వారు, అనవసర విషయాల పట్ల విపరీతమైన శ్రద్ధ కనబరిచేవారు, ఏమి తెలియకపోయినా తనకున్న మిడి మిడి జ్ఞానంతోను లేక తప్పుడు జ్ఞానంతోనూ చాల చాల  సంతృప్తి పడే వారు శిష్యులుగా వారికి దొరుకుతారట       
Nilakanthadikshita, who lived in 16th century, was a great poet and also a well versed scholar. He wrote a satirical work, Kalividambanam. In this work, he wonderfully depicts the characteristics of some pseudo teachers and students.

वाच्यतां समयोsतीत: स्पष्टमग्रे भविष्यति
इति पाठयतां ग्रन्थे काठिन्यं कुत्र वर्तते?

 “Read quickly. There is no time. If you don’t understand now it will be understood to you in course of time” Thus teach some teachers. They can teach every subject and find no difficulty in teaching any subject because they will not explain any thing.  It is their methodology of teaching.

अगतित्वमतिश्रद्धा ज्ञानाभासेन तृप्तता
त्रय: शिष्यगुणाह्येते  मुर्खाचार्यस्य भाग्यजा:    

Of the good fortune, the teacher of the above kind gets a student who has no other go except accepting him to be his teacher as there is no any other teacher in and around; over politeness and who is satisfied  with the wrong knowledge he possesses. Such disciples are available to pseudo teachers by their good fortune alone.  This was the situation even in 16th century. What to say about the present day to day situation.




  









Wednesday, September 16, 2015

వృధా చెయ్యకు దేన్నీ (waste nothing)

వృధా చెయ్యకు దేన్నీ
waste nothing
శ్రీమతి. చిలకమర్తి లక్ష్మీకుమారి
ఎం.ఏ
   
నిషి తనకున్న వనరులు, కోరికలమధ్య జీవిస్తూ ఉంటాడు. ఎటొచ్చీ వనరులు పరిమితం, కోరికలు మాత్రం అనంతం. ఉన్న వనరులు  వృథా చేయకుండా ఉంటే ఆ వనరులే ఒక  నాటికి ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు డబ్బు,  బట్టలు మొ||  ఇలా మాట్లాడ్డంలో అసలు ఉద్దేశ్యమేoటంటే ఏ వస్తువులు  మనం వృధా చేస్తామో  అవి అవసరసమయాల్లో మనకి  దొరక్కుండా పోతాయి.  అవి నీరు, కాలం, శక్తి, ఆలోచన మొదలైనవి ఏవైనా కావచ్చు. ఆవి వృధా చెయ్యకపోతే  మనకు, మిగతా వారికి కూడ ఉపయోగపడతాయి. సాధారణoగా మనం ఏయే పదార్థాలు వ్యర్థం చేస్తున్నామో ఒక్క సారి ఆలోచిద్దాం.
1.     మొదటిది నీరు  
రోజు మనం లేచిన వెంటనే ఉపయోగించేది నీరు. మనలో చాలమంది నీటిని వృధా చేస్తూ ఉంటారు. పూర్వం నూతులున్న రోజుల్లో  నీరు తోడుకుని వాడుకునే  వారు.  శ్రమ విలువ తెలుసుకుని పొదుపుగా వాడకునే వారు   ఈ కాలంలో కుళాయిలు వచ్చాయి. మనం వాటిని వదిలేసి  ఎంతో నీటిని వృధా చేస్తున్నాం . అందువల్ల నీటి కొరత మనకు ఎదురౌతోoది.   అలాగే కొంతమంది కుళాయి దగ్గర  బకెట్టు పెట్టి  వెళ్లి పోతారు. కొంతమంది  అది నిండినా వెంటనే కట్టకుండా వదిలేస్తారు. ఒక్క చుక్కే కదా అనుకుంటే ఆ చుక్కలన్నీ కలిస్తే ప్రవాహం ఔతు౦ది
2.  రెండోది గ్యాసు
 అలాగే కొంతమంది గ్యాస్ ని  వృధా చేస్తూ ఉంటారు. ష్టవ్వు  మీద  పాలు  పెట్టి  మరిచిపోవడం వలన గ్యాసూ,  దాంతో పాటు పాలు కూడ వృధ అవడం అటుంచి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది.

3 మూడోది విద్యుచ్ఛక్తి    
ఇది కూడ మనం దుర్వినియోగం చేస్తున్నాం . కొంతమంది   బయటికి వెళ్లేటప్పుడు, ఫ్యాన్లు,  లైట్లు  కట్టకుండా వెళ్లిపోతూ ఉంటారు. అలాగే పొరుగూరు వెళ్లేటప్పుడు ఫ్రిజ్  కట్టకుండా వదిలివేయడం  జరుగుతూ ఉంటుంది. మనం  అవసరానికి వినియోగించుకోడం తప్పు కాదు,  కాని జాతీయ వనరులను వృధాచేయడం ఖచ్చితంగా  తప్పు.

4. నాల్గోది నిత్యావసర వస్తువులు
నిత్యావసరవస్తువుల  విషయానికొస్తే మహిళలు కొంతమంది కలసి బజారుకెళ్ళి వస్తువులు కొంటూ ఉంటారు. అక్కడ అందరితో కలసి వెళ్ళడం వల్ల  మిగిలిన వాళ్లని చూసి వాళ్ళు కొన్నారని వీళ్ళు వీళ్ళు కొన్నారని వాళ్ళు అవసరం లేని వస్తువులు కూడ కొనడం జరుగుతోంది. దీని వల్ల  ఒక్కొక్క ఇంట్లో రెండేసి  మిక్సీలు, నాలుగేసి  టి . వి. లు   అలా వస్తువులు పేరుకుపోతున్నాయి. దానివల్ల  ఉన్న ఇల్లు చాలక మరో పెద్ద  ఇల్లు మారవలసిన పరిస్థితులు  కూడ ఎదురౌతున్నాయి.
5. ఐదోది బట్టలు 
మనం బట్టలు కూడ అవసరానికి మించే కొంటున్నా౦. ఫ్యాషన్ల  పేరుతో కనబడిందల్లా కొంటున్నాం. ఫ్యాషన్లు క్షణక్షణం మారుతూనే ఉంటాయి. వాటికి లొంగిపోతే జీవితంలో క్రుంగిపోతాం.  ప్యారిస్ నగరంలో ఒకమ్మాయి చెవి జూకాలు కొనుక్కుని ఇంటికి వేగంగా పరిగెత్తుకుంటు పోతోంది. కొంతమంది ఆమెనాపి ఎ౦దుకంత తొ౦దరగా పరిగెడుతున్నావ్ ? అనడిగారు . ఆమె రొప్పుకుంటూ ఏంలేదు ఇప్పుడే జూకాలు కొనుక్కున్నాను. ఇంటికి వెళ్లేటప్పడికి ఫ్యాషన్ మారిపోతుందని భయంతో పరిగెడుతున్నాను అందట. ఇక బట్టల విషయానికొస్తే ఫ్యాషన్ పేరుతో మనం అవసరానికి మించి కొంటున్నాం . కొన్ని  కట్టుకోకుండానే పెట్టెల్లో పెట్టి బంధిస్తున్నాం. కొన్ని ఒక్కసారే కట్టి వదిలేస్తున్నాం .      
6.  ఆరోది స్టేషనరీ
       పిల్లలు నోట్సు  పుస్తకాలు చాల వాడతారు. ఆ పుస్తకాల్లో  1 లేదా 2 కాగితాలలో వ్రాసి వదిలివేస్తారు. చాల  కాగితాలు వృధా అవుతున్నాయి. అ౦దువల్ల ఒక పుస్తకాన్ని వాడే ముందు ఒక చెట్టును గుర్తుకు తెచ్చుకోవాలి. పొదుపుగా వాడుకోవాలి  ఇక పెన్నులు పెన్సిళ్ళు సంగతి చెప్పనక్కర లేదు .
 7. ఏడోది కాలం
ఇది అతి ముఖ్యమైంది. మిగిలినవి ఎలాగైనా సంపాది౦చుకోవచ్చు.  గడిచిన కాలాన్ని మాత్రం తిరిగి సంపాదించుకోలే౦. అ౦దుకని కాలం  చాల విలువైoదిగా భావించాలి.  అందరూ కలసి పని చేయడం వల్ల, చేయవలసిన పనులన్నీ ఒక చోట వ్రాసుకుని  క్రమబద్ధంగా పని చేయడం వల్ల  తక్కువకాలంలోనే ఎక్కువ పనులు పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది. 
    8. ఎనిమిదోది ఆహారపదార్థాలు
నేటి సమాజంలో ముఖ్యoగా ఆహారపదార్ధాలను వ్యర్ధం చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. ఏ పదార్థాన్నైనా వృథా చెయ్యడం పాపం. ఇక ఆహారపదార్థాలు వృధ చేయడం మహాపాపమే అవుతుంది .ఎందుకంటే అది పండించిన రైతును అవసరమున్న వ్యక్తిని ఇద్దరిని  దోచుకోడమే అవుతోంది.  ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైన  వినియోగించుకొనే హక్కు ఉంది కానీ వ్యర్ధపరిచే హక్కు లేదు. మనలో కొంతమంది ఫేషను పేరుతోనో, గొప్ప కోసమో, తినలేకో, వడ్డించిన వస్తువులను వదిలివేస్తారు.  రైతు ఎంతకష్టపడితే ఒక గింజ వస్తుందో గ్రహించాలి. అలాగే కొన్ని పెద్ద పెద్ద హోటళ్లల్లోవ్యర్దమయ్యే పదార్థాలతో ఒక గ్రామాన్ని పోషించొచ్చు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొన్ని  ఇతరదేశాల్లో ఆహారపదార్థాలు వ్యర్థం చేస్తే  జరిమానా వేస్తారు. అటువంటి చట్టాలు మన దేశంలో కూడ అమలు లోకి రావాలి.  కొన్ని దేశాల్లో ముందు రోజు తయారు  జేసిన, పాడైపోని  ఆహార పదార్థాలు కూడ అందుబాటులో ఉంచుతారట.
ఈ వ్యాసంలో కొన్ని అంశాలు మాత్రమే చెప్పడం జరిగింది . ఇవి గాక  పెట్రోలు మొ|| మరెన్నో అంశాలున్నాయి. ఇక నీరు మొ|| వాటిని  పొడుపు చెయ్యడం వల్ల  నీరు  డబ్బుతో  కొనుక్కునే దుస్థితిని నివారించ వచ్చు. డబ్బు ఆదా చేయడo  వల్ల అవసరానికి అవి ఉపయోగపడతాయి. ఇక చిన్న పిల్లలకి కూడ ఏది వృథా చేయ కుండ  పొడుపు చెయ్యడం  నేర్పాలి. simple living అలవాటు చయ్యాలి.  వ్యక్తి గతమైనపొదుపు, సమష్టి పొదుపు  వలన సంఘానికి లాభం కలుగుతుంది. కరెంటు, గ్యాసు, బట్టలు ఇతరవస్తువులు చివరికి ఆలోచనలు కూడ పొదుపు చెయ్యడం వల్ల జాతీయసంపదలు వృద్ది  చేసుకునే  అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వృధా  చెయ్యడం పాప౦ చెయ్యడమే అవుతుంది. వృధా చెయ్యడం అరికడదాం . దేశాభివృద్ధికి పాటుపడదాం.  



పచ్చివడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి

పచ్చివడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి
చిలకమర్తి దుర్గాప్రసాద రావు

దేవతల్లో చాల నిరాడంబరంగా ఉండే వ్యక్తి  బహుశా ఎవరైనా ఉంటే  వాళ్ళంతా  వినాయకుని తరువాతే వస్తారు. ఆయన ఎటువంటి ఆడంబరం  లేని నిరాడంబరుడు .
అల్ప సంతోషి. ఎవరేదిచ్చినా పుచ్చుకుంటాడు. ఎలా కొలిచినా మెచ్చు కుంటాడు. ఎవరెన్ని వేలాకోళాలు చేసినా సరిపెట్టుకుంటాడు. ఇక  పూజకు కావలసిన సామగ్రి , పూజావిధానం చాల సింపుల్ గా  అందరికి అందుబాటులో ఉంటాయి. భక్తి ముఖ్యం .
మట్టిముద్ద ఆకులు అలములు చాలు . షోడశోపచారాలు  అవసరం  లేదు .
 ఆయన అల్పసంతోషి  అని ముందే చెప్పుకున్నా౦. ఆ విషయాన్ని మహాకవి
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎంత చక్కగా వర్ణించారో చూడండి .
        
లడ్దూ జిలేబి హల్వాలె అక్కరలేదు
              బియ్యపు౦డ్రాళ్లకే   చెయ్యి సాచు
వలిపంపు పట్టు దువ్వలువతో పనిలేదు
              పసుపుగోచీకె సంబ్రాలు పడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు
              పొట్టి  గుంజిళ్లకే పొంగిపోవు
కల్కి తురాయీలకై   తగాదా లేదు
              గరిక పూజకె తలకాయనొగ్గు

పంచకళ్యాణి కై  యల్క పాన్పులేదు
ఎలుక తత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండి పట్టు లేదు
పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి

ఆయన్ని ఆరాధిద్దాం. నిరాడంబర జీవనానికి నాంది పలుకుదాం












      

Saturday, September 12, 2015

వారణాశివాస! వందనంబు

                                  వారణాశివాస! వందనంబు

                                                          చిలకమర్తి వేంకటసూర్యనారాయణ

1 .  బొందిలోని గాలి పోయెడు సమయాన
     నిన్ను నాదు మదిని నిలువుమనుచు
     ముందె వేడుకొందు  ముక్కంటి! విశ్వేశ!
     వారణాశివాస! వందనంబు

2.  కంటిలోన నిప్పు కంఠాన గరళంబు
    జాటజూట మందు చందమామ
   మెడలు నాగుతోడ మెరయు విశ్వేశ్వర!
   వారణాశివాస! వందనంబు

౩. వెండికొండ చలికి వెఱచి వేడిని గోరి
   కడుపవిత్రమైన కాశికేగి
   వల్లకాటిలోన వసియించు విశ్వేశ!
   వారణాశివాస! వందనంబు.

4.  నిన్ను మదిని నిలిపి నిశ్చల భక్తితో
   కరము జాపగానె కనికరించి
  తరుగులేని సిరిని దయతోడ నందించు
  వారణాశివాస! వందనంబు.

5.  శిరము నందు చేయి చేరినతోడనే
    మరణమొందునట్టి వరము పొంది
  నిన్నె చంపజూచు నిర్దయు బ్రోచిన
   వారణాశివాస! వందనంబు.

6.  మరణకాలమందు మనసున నీవుండి
    తిరిగి జన్మలేని దివ్యమైన
    మోక్షమిచ్చి బ్రోవు ముక్కంటి! విశ్వేశ!
    వారణాశివాస! వందనంబు

 7 . నిన్నె పతిగనెంచి నిశ్చలప్రేమతో
     తపము చేసినట్టి  తరుణి జేరి
    నిష్ఠురముగ శివుని నిందించి మురిసిన
   వారణాశివాస! వందనంబు.
 
8.   శమను శాపమరసి సరగున కంపించి
      కావుమనుచు నిన్ను కౌగలింప
     తిరిగి జన్మ లేని దివ్యధామంబిడిన
     వారణాశివాస! వందనంబు.

9.  నీదు దీక్ష చెరుప నిర్భయంబుగ వచ్చి      
    శరము విసరు వాని సంహరించి
    సతి తలొంచి  వేడ సరగున బ్రతికించు
    వారణాశివాస! వందనంబు.

1o. నిన్నె చిత్తమందు నిలుపుచు నిరతంబు
    జపము చేయు దివ్య శక్తినొసగి
   కనికరించి నన్ను గావుమా విశ్వేశ!
   వారణాశివాస! వందనంబు

Thursday, September 10, 2015

ఎక్కడున్నావెక్కడున్నావెంకనబాబు ఎక్కడున్నా ఒక్క తూరి ఇలా రా సామి

ఎక్కడున్నావెక్కడున్నావెంకనబాబు
ఎక్కడున్నా ఒక్కతూరి ఇలా రా సామి
(అమాయకుడి ఆర్తగీత౦)
(కవిత)
చిలకమర్తి వేంకట సూర్యనారాయణ
          నరసాపురం

 ఎక్కడున్నా వెక్కడున్నావెంకనబాబు
ఎక్కడున్నా ఒక్కతూరి ఇలా రా సామి
ఎక్కడున్నా వెక్కడున్నావెంకనబాబు
ఎక్కడున్నా ఒక్కతూరి ఇలా రా సామి

1. ఏ దిక్కూ లేనోణ్ణి  నిన్నె మదిని నిలిపినోణ్ణి
   అమ్మ తోడు నీకాడ ఆబద్దం ఆడనయ్య
      మొక్కు లిచ్చు కుందారని ముందె  ఒచ్చి నిలబడ్డా
       ఎండతగులకుండ నన్ను ఏగంగా పంపుసామి        ||ఎక్కడున్నా||

2. నీదయతో వచ్చినావు నిన్నరేతిరీనింది
    పసందైన జున్ను వండి పట్టుకు నిలుచుంటినిచట
   అమ్మలతో దిగివచ్చి కమ్మగ విందారగించు
   నీవు ముందు తినకుండ నేనెవ్వరికెట్టనయ్య
   ఆ సంగతి నీకెరుక ఆలస్యం చెయ్య బోకు  ||ఎక్కడున్నా||

3.  కడుపుమాడుతున్న గాని కళ్లు తిరుగుతున్న గాని
     కదలకుండ  మెదలకుండ కనిపెట్టుకు కూకున్నా
    ఆలస్యం సేయబోకు ఆకలికేనాగలేను
    ఇప్పటికే కళ్ళుతిరిగి ఏమీ కనబడుటలేదు ||ఎక్కడున్నా||

4 . ఎనకెప్పుడొ ఏనుగొకటి ఎండ దెబ్బకాగలేక
    నీళ్లు తాగు దారని ఒక నదిలోదిగి  నిలబడితే
    దాగియున్న ఎదవ మొసలి దానికాలట్టుకుంటె
   బలముతోటి కొన్నాళ్లు పోరాడి అలసి పోయి
   తిండిలేక నీరసించి తేజముడిగి ఏడుస్తూ
   కంఠమెత్తి  కావుమనుచు  గట్టిగ  నిను  కేకేస్తే
  గబగబ పరుగెత్తుకెళ్లి  కాచినాడవంట మున్ను
  ఆ కతలే మున్ను నాకు మాతాతలు  చెబుతుంటే

  మురిసిపోయి నాడె నిన్ను మదిలో నిలిపేసుకున్న || ఎక్కడున్నా ||

కాళిదాసుకవిత్వం – లోకానికే ఆదర్శం

కాళిదాసుకవిత్వం లోకానికే ఆదర్శం
                                                     డా|| చిలకమర్తి దుర్గాప్రసాద రావు

సంస్కృతసాహిత్యనిర్మాతలలో వాల్మీకివ్యాసుల తరువాత అత్యున్నతస్థానాన్ని సంపాదించిన కవి కాళిదాసు. ఈయన  కవికులగురువుగా   ప్రసిద్ధి పొందాడు. ఆయన  దేశాకాలాదులు నేటికిని పండితలోకంలో వివాదాస్పదాలుగానే మిగిలి పోయాయి. కాళిదాసు ఏ దేశకాలాలకు చెందినవాడైనా ఆయన తన కావ్యాల ద్వారా అందించిన ఆదర్శాలు సార్వదేశికాలు సార్వకాలికాలున్నూ. అందుకే ఆయన నాటినుండి నేటివఱకు అందరి  హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు.

కావ్యం యశసేsర్ధకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితతయోపదేశయుజే  

అని కావ్యప్రయోజనాల గురించి   మమ్మటుడనే ఆలంకారికుదు  చెప్పియున్నాడు.  కావ్య౦ వల్ల కీర్తి, ధన౦, వ్యవహారజ్ఞాన౦, అమంగళపరిహార౦, ఆనంద౦, ఉపదేశ౦ మొ|| ప్రయోజనాలున్నాయి. కాళిదాసు ‘మేఘసందేశం’ ‘ఋతుసంహార౦’ అనే రెండు ఖండకావ్యాలు;  రఘువంశ౦’ ‘కుమారసంభవ౦ అనే రెండు మహాకావ్యాలు; ’మాళవికాగ్నిమిత్ర0 ‘విక్రమోర్వశీయ0’ ‘అభిజ్ఞానశాకుంతల0’ అనే  మూడునాటకాలు రచించాడు. కాళిదాసును మనం జాతీయకవిగా ఆరాధిస్తున్నాం. ఆయన భారతీయసంస్కృతిలోని అత్యుత్తమమైన ఆదర్శాలను తన కావ్యాలద్వారా ప్రకటించిన మహనీయుడు. మానవుడు మహనీయునిగా మారడానికి  ఆచరిoపవలసిన యుత్తమధర్మాలను తాను ఎంచుకున్న పాత్రల ద్వారా లోకానికి అందించిన ఆదర్శకవి.  భారతీయసంస్కృతి అనే సౌధానికి మూలస్తంభాలైన  అహింస, సత్యం, దానం, తపస్సు మొ|| వాని యౌన్నత్యాన్ని కావ్యరూపంలో మనకందించిన కవికులగురువు. కాళిదాసు చిత్రించిన నాయకులందరు సేవాతత్పరత, కార్యదక్షత, కర్తవ్యనిష్ఠ,  పరాక్రమం, సహనం మొ || ఉత్తమగుణాలు కలవారు . ఆయన నాయికలుగా వర్ణించిన స్త్రీమూర్తులందరు  పరమపతివ్రతలు, సౌశీల్య౦, సహన౦, కార్యదక్షత, పట్టుదల కలిగిన ఆదర్శనారీమణులు. కాళిదాసు అపారమైన లోకానుభవ౦ గల కవి. ఈ విషయాన్నే  మేము వనాల్లో నివసించే  తాపసులమైనప్పటికి లోకవ్యవహారాలన్నీ  బాగా తెలిసినవార౦ అని కణ్వుని పాత్రద్వారా ప్రకటించుకున్నాడు. ఆయన  కావ్యాల్లో  అలౌకికధర్మాలతో బాటుగా లౌకికధర్మాలు కూడ చాల కనబడతాయి. మొత్తంమీద భారతీయసంస్కృతిని ఇంత చక్కగా ప్రదర్శించి ప్రపంచానికoదించిన  కవి  కాళిదాసు తప్ప మరొకరు లేరనడం అతిశయోక్తికాదు. ఆయన మనకందించిన శకుంతల స్త్రీలోకానికే తలమానికమై పాశ్చాత్యులహృదయాలను కూడ  యుర్రూతలూగించడంతో ఆ నాటకం అనువాదం యొక్క అనువాదం యొక్క అనువాదాన్ని  చదివిన  “Gothe” అనే జర్మన్ పండితుడు తన ఆనందాతిశయాన్ని ఇలా వ్యక్తం చేశాడు.

Wouldst thou the young year’s blossoms,
Wouldst thou the fruits of the later year
Wouldst thou what charms and enraptures,
Wouldst thou what feasts and nourishes,                
Wouldst though the heaven and the earth,
With one word comprehend
I name thee Sakuntala   and then has all been said.
                                     
అసలు మూల గ్రంథాన్ని చదివితే ఇంకా ఎటువంటి అనుభూతిని పొంది ఉండేవాడో మనం ఊహించలేం. కాళిదాసు రఘువంశచక్రవర్తుల గుణగణాలను వర్ణిస్తూ భారతీయుల ఆశ్రమధర్మవ్యవస్థను ప్రదర్శించారు. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం.
శైశవేsభ్యస్త విద్యానాం   యౌవనే విషమైషిణాo
వార్ధకే మునివృత్తీనాం    యోగేనాంతే తనుత్యజాం
      ఆ రఘువంశరాజులు బాల్యంలో చక్కగా విద్యాభ్యాసం చేసేవారు, యౌవనంలో భోగాలనుభవించేవారు, వార్ధక్యంలో మునివృత్తిలోనుండి చివరకు యోగమార్గంలో శరీరాన్ని త్యజించేవారు. అలాగే త్యాగం చెయ్యడానికే ధనం కూడబెట్టేవారు. సత్య౦ కొరకే మిత౦గా మాట్లాడేవారు. కీర్తికొరకే శత్రువులను జయించేవారు. సత్సంతాన౦ పొందడం కోసమే గృహస్థాశ్రమ౦ స్వీకరించేవారు.
             ప్రతి వ్యక్తి ఆకారానికి తగిన తెలివితేటలు, తెలివితేటలకు తగిన పరిశ్రమ, పరిశ్రమకు తగిన పని పనికి  తగిన ఫలసిద్ధి కలవారై ఉండాలని  రఘువంశ రాజుల వర్ణన ద్వారా  తెలియజేశాడు.
     ఆకారసదృశః  ప్రజ్ఞః ప్రజ్ఞయా  సదృశాగమః
      ఆగమై: సదృశారంభః  ఆరంభసదృశోదయః         
కాళిదాసు రఘువంశరాజుల పరిపాలన విధానాన్ని వర్ణిస్తూ ఆ దిలీప మహారాజు ప్రజలను సన్మార్గప్రవర్తకులుగా జేయడం వల్ల, అన్న పానాదులచే పోషించడం  వల్ల, ప్రజలందరకి తానే తండ్రి వంటి వాడయ్యాడు. ఇంకవారి వారి తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చినవారు గానే మిగిలిపోయారని వర్ణించడం  వల్ల ప్రజలందరి విద్యాదాన, పోషణ, రాక్షణాదిభారం  ప్రభుత్వమే వహించేదనే విషయం తెలుస్తోంది. అంతేగాక రాజులకు తమ సౌఖ్యం కన్న ప్రజాసంక్షేమమే ముఖ్యమని పలుమార్లు  నొక్కిచెప్పడం గమనించొచ్చు.
        కాళిదాసు ధీరుల లక్షణాన్ని వివరిస్తూ వికార హేతౌ సతి విక్రియంతే యేషాం న చేతాంసి త ఏవ ధీరా: అంటాడు. అనగా చిత్తచాoచల్యo కలగడానికి అన్నివిధాల అవకాశం ఉన్నప్పటికి ఎవరి మనస్సు  ఎటువంటి ప్రలోభాలకు లోనుగాకుండ  నిశ్చలంగా ఉంటుందో అట్టి వారే ధీరులని ఆయన యభిప్రాయ౦. పార్వతి వంటి జగదేకసుందరి సమీప౦లో ఉన్నా ఎటువంటి  చిత్తచాంచల్యానికి లోనుగాని  ఈశ్వరుని ధీరత్వ౦  వర్ణిస్తూ కవి పలికిన మాటలివి. వశిష్టుడు, కణ్వుడు మొ|| మహామునులు ఆశ్రమాల్లో ఉండి తపస్సు చేస్తుంటే దిలీపుడు, దుష్యంతుడు మొ|| చక్రవర్తులు ఎటువంటి ప్రలోభములకు లోనుగాక రాజ్యమనే  ఆశ్రమంలో ఉండి పరిపాలన అనే తపస్సుకొనసాగిస్తున్న గొప్ప రాజయోగులు.
       కాళిదాసు వర్ణించిన నాయికలు స్త్రీలోకానికే ఆదర్శనారీమణులు. తన సౌoదర్య౦తో ఈశ్వరుని ఆకర్షింపలేని పార్వతి, తన బాహ్యసౌoదర్యాన్ని నిందించుకొని, యీశ్వరుని పొందడానికి తపస్సొకటే సాధనమనితలచి తీవ్రమైన  తపస్సు చేసి, శివుని వివాహమాడి౦ది. పార్వతి ద్వారా స్త్రీలకు బాహ్యసౌ౦దర్యం కన్న సహన౦, సౌశీల్య౦ మొ|| గుణాలతో నిండిన   అంతస్సౌందర్య౦  ముఖ్యమని సూచించాడు.
అభిజ్ఞానశాకుంతలoలో శకుంతలను  అత్తవారింటికి సాగనంపేటప్పుడు కణ్వుడు తన కూతురు శకుంతలకు చేసిన ఉపదేశ౦ మొత్త౦  స్త్రీజాతికే గొప్ప సందేశం.
     ఓ శకుంతలా! నువ్వు అత్తమామలకు అలాగే పెద్దవారికి సేవలు చెయ్యి. సవతులయెడ స్నేహభావ౦తో మసులుకో. ఎప్పుడైనా నీభర్త నీ పై కోపిస్తే నువ్వు  తిరిగి అతని యెడ  కోప౦ చూపించకు. సేవకుల యెడ దయాదాక్షిణ్యాలతో మసలుకో. నీ సంపదలు చూసుకుని గర్వపడకు. లోకంలో ఈ విధoగా నడచుకొన్న స్త్రీలే గృహిణులని అనిపిoచుకుoటున్నారు. అట్లు ప్రవర్తిoచనివారు వంశానికి మానసిక వ్యాధి వంటి  వారౌతున్నారు. కాళిదాసు చేతిలో  శకుంతల ఒక ఉదాత్తవ్యక్తిత్వాన్ని ధరించి సీత సరసన స్థానాన్ని సంపాదించుకుంది. ఆయన చిత్రించిన నాయికలు ఆదర్శప్రేమమూర్తులు.  
        మేఘసందేశ౦లో కర్తవ్యవిముఖుడైన ఒక యక్షుడు తన యజమాని కుబేరునిచే శపింపబడి ఒక సంవత్సరకాల౦ రామగిర్యాశ్రమ౦లో ప్రియావియోగదు:ఖ౦ అనుభవిస్తూ ఉంటాడు.  ఆ యక్షుడు అలకాపట్టణ౦లో ఉన్న తన ప్రియురాలికి సందేశo అందించడానికి  ఒక మేఘాన్ని ప్రార్ధిస్తాడు. అతడు మేఘుని ప్రార్దిస్తూ ఓ మేఘమా! నువ్వు మేఘాల్లో ఉత్తమవంశానికి చెందిన వాడవు. ఇంద్రునికత్యంతసన్నిహితుడవు. నేను విధివశాన  నా ప్రియురాలికి దూరమయ్యాను. నా సందేశ౦ ఆమెకు తెలియ జెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను. లోక౦లో  ఒక నీచుని ప్రార్ధించి కార్య౦ సాధించుకోడం కన్నా  ఉత్తముని ప్రార్ధించి లేదనిపించుకోవడం   మేలు కదా ! అంటాడు.

జాతం వంశే భువనవిదితే పుష్కరావార్తకానాం
జానామి త్వాం ప్రకృతిపురుషం కామరూపం మఘోనః
తేనార్దిత్వం త్వయి విధివశాద్దూర బంధుర్గతోsహం
యాంచా మోఘా వరమధిగుణే నాధమే లబ్ధకామా

ఈ మాటలద్వారా కవి ఎట్టివానికైన కర్తవ్య౦ విస్మరిoచడం  తగదని, ఉత్తముని ఆశ్రయించి లేదనిపించుకున్నా మంచిదేగాని నీచజనులను ఆశ్రయించరాదని ఉపదేశించాడు. ఇచ్చట నీచాశ్రయ౦ న కర్తవ్యం కర్తవ్యం మహాదాశ్రయం అనే సూక్తి  కాళిదాసు మాటల్లో వ్యక్తమైంది.
       శాకుంతల౦లో రాజముద్రగల ఉంగరాన్ని అమ్ముతున్న ఒక జాలరిని ఇద్దరు రాజభటులు బంధిస్తారు. ఆ ఉంగర౦ తనకెలా వచ్చిందని అతన్ని  ప్రశ్నిస్తారు. ఆ జాలరి తాను శక్రావతారతీర్ధ౦లో చేపలు పట్టుకుని  జీవిoచే జాలరినని అంటాడు. అది విని   ఆ రక్షకభటులలో ఒకడు జాలరితో ఆహా! నీ వృత్తి యెంత పవిత్రమై౦ది! అని ఆక్షేపిస్తాడు. అపుదు ఆ జాలరి రాజభటునితో అయ్యా! మనిషికి జీవనోపాధిగా ఏ వృత్తి విధిoపబడునో ఆవృత్తి నిoదిoపదగినదే యయినప్పటికి దాన్ని విడిచిపెట్టకూడదు. యజ్ఞాల్లో పశువుల్ని చంపే  దారుణకర్మకు పాల్పడుతున్న  శ్రోత్రియబ్రాహ్మణుడు దయార్ద్రహృదయుడేగదా! అందరు అతన్ని గౌరవిస్తున్నారు కదా! అని అంటాడు. కాళిదాసు ఈ మాటలద్వారా సహజం కర్మ కౌoతేయ ;స దోషమపి న త్యజేత్ అను గీతాచార్యుని అభిప్రాయాన్ని  వ్యక్తీకరించాడు. కాబట్టి మానవుడు తన జీవనోపాధికై చేపట్టే వృత్తుల్లో హెచ్చుతగ్గులు లేవని మనిషి గొప్పదనం గుణాలనుబట్టి నిర్ణయిoచాలి గాని వృత్తిని బట్టి గాదని కాళిదాసు మనకిచ్చిన సందేశం.

సహజం కిల యద్వినిందితం న ఖలు తత్కర్మ వివర్జనీయo
పశుమారణకర్మదారుణో హ్యనుకంపామృదురేవ శ్రోత్రియ:

   సుఖదుఃఖాలనేవి మానవజీవితంలో  భాగాలని, అవి చక్రంలోని రేకుల వలె పైకి క్రిందకి తిరుగుతూ ఉంటాయని మనిషికి సుఖదు:ఖాలు శాశ్వతం కావని సుఖదుఃఖాత్మకమైన ఈ జీవిత౦లో సుఖాలకు  పొంగిపోక, దు:ఖాలకు కృoగిపోక ద్వoద్వాతీతుడుగా ఉండాలని  కాళిదాసు సూచించినాడు.

కస్యాత్యంతం సుఖముపనతం దు:ఖమేకాంతతో వా
నీచైర్గచ్ఛత్యుపరి చ దశాః చక్రనేమిక్రమేణ (మేఘసందేశము)

అంతేగాక మనిషి గొప్పదనం అతని గుణగణాలవల్లనే గాని వయస్సు బట్టి కాదని న ధర్మవృద్ధేషు వయస్సమీక్ష్యతే అనే మాటల  ద్వారా కాళిదాసు వెల్లడించాడు. మనిషికి  క్షణికమైన ఈ శరీరం కంటె శాశ్వతమైన కీర్తియే ముఖ్యమని  కర్తవ్యపాలనలో శరీరాన్ని విడిచి పెట్టడానికి కూడ వెనుకాడరాదని దిలీపుని పాత్రద్వారా తెలియజేశాడు.

  ఏ కాంతవిధ్వంసిషు మద్విధానాం
    పిండేష్వనాస్థా ఖలు భౌతికేషు   (రఘువంశం )

         ఇక దండనీతిని గూర్చి చెబుతూ  శామయేత్  ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జునః అంటాడు. అనగా దుర్మార్గుని దుర్మార్గ౦తోనే అణచివెయ్యాలిగాని  మంచితన౦ పనికిరాదని  అభిప్రాయం.
 కాళిదాసు తన కావ్యాల్లో స్వీకరించిన ఇతివృత్తం  ఉన్నతశ్రేణికిచెందిన వారిదే అయినా ఆవ్యక్తుల ద్వారా  అందించిన యాదర్శాలు సర్వజనసామాన్యాలు , సహృదయసమ్మతాలు, ఆచరణ సాధ్యాలు ఔతున్నాయి. ఇటువంటి మానవజనకళ్యాణదాయకమైన ఉపదేశాలు ఆయన కావ్యాల్లో కోకొల్లలుగా కన్పిస్తాయి. ఆయన కవిత ప్రత్యక్షర రమణీయం,  ప్రజాసందేశమహనీయం. గ్రంధ విస్తరభీతిచే మచ్చుకు కొన్ని  మాత్రమే పేర్కొనడం జరిగింది. తక్కిన విశేషాల్ని పాఠకులు స్వయంగా పరిశీలించి  తెలిసికోగలరు.
ఈ విధ౦గా స్వల్పమైన పాత్రలద్వారా అనల్పమైన మానవతాధర్మాలను అందించిన కాళిదాసును జాతీయకవిగా, భారతీయసనాతనధర్మ ప్రవర్తకునిగా  గౌరవించడం ఆయన ఆశయాలను ఆచరించడం భారతీయుల మైన మన యందరి కనీసబాధ్యత.