Saturday, September 12, 2015

వారణాశివాస! వందనంబు

                                  వారణాశివాస! వందనంబు

                                                          చిలకమర్తి వేంకటసూర్యనారాయణ

1 .  బొందిలోని గాలి పోయెడు సమయాన
     నిన్ను నాదు మదిని నిలువుమనుచు
     ముందె వేడుకొందు  ముక్కంటి! విశ్వేశ!
     వారణాశివాస! వందనంబు

2.  కంటిలోన నిప్పు కంఠాన గరళంబు
    జాటజూట మందు చందమామ
   మెడలు నాగుతోడ మెరయు విశ్వేశ్వర!
   వారణాశివాస! వందనంబు

౩. వెండికొండ చలికి వెఱచి వేడిని గోరి
   కడుపవిత్రమైన కాశికేగి
   వల్లకాటిలోన వసియించు విశ్వేశ!
   వారణాశివాస! వందనంబు.

4.  నిన్ను మదిని నిలిపి నిశ్చల భక్తితో
   కరము జాపగానె కనికరించి
  తరుగులేని సిరిని దయతోడ నందించు
  వారణాశివాస! వందనంబు.

5.  శిరము నందు చేయి చేరినతోడనే
    మరణమొందునట్టి వరము పొంది
  నిన్నె చంపజూచు నిర్దయు బ్రోచిన
   వారణాశివాస! వందనంబు.

6.  మరణకాలమందు మనసున నీవుండి
    తిరిగి జన్మలేని దివ్యమైన
    మోక్షమిచ్చి బ్రోవు ముక్కంటి! విశ్వేశ!
    వారణాశివాస! వందనంబు

 7 . నిన్నె పతిగనెంచి నిశ్చలప్రేమతో
     తపము చేసినట్టి  తరుణి జేరి
    నిష్ఠురముగ శివుని నిందించి మురిసిన
   వారణాశివాస! వందనంబు.
 
8.   శమను శాపమరసి సరగున కంపించి
      కావుమనుచు నిన్ను కౌగలింప
     తిరిగి జన్మ లేని దివ్యధామంబిడిన
     వారణాశివాస! వందనంబు.

9.  నీదు దీక్ష చెరుప నిర్భయంబుగ వచ్చి      
    శరము విసరు వాని సంహరించి
    సతి తలొంచి  వేడ సరగున బ్రతికించు
    వారణాశివాస! వందనంబు.

1o. నిన్నె చిత్తమందు నిలుపుచు నిరతంబు
    జపము చేయు దివ్య శక్తినొసగి
   కనికరించి నన్ను గావుమా విశ్వేశ!
   వారణాశివాస! వందనంబు

No comments: