Sunday, April 12, 2026

-: అభినందన:- (అక్షరసుమాంజలి) డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

-: అభినందన:-

(అక్షరసుమాంజలి)

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.


          మానవుడు తన జీవితకాలంలో సాధించవలసిన వాటిని పురుషార్థములని పిలుస్తారు. అవి ధర్మం , అర్థం, కామం,  మోక్షం అని నాలుగు. వాటిలో ముందున్న మూడు మనం ఆచరించేవి, నాలుగోది మనం పొందేది. ఇక మోక్షం అంటే ఈ జన్మ మరణ రూపమైన  సంసారచక్రం నుంచి  బయటపడడమే.

ఈ మోక్ష సాధనకు కర్మ, భక్తి , జ్ఞానం మొదలైన ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో భక్తి మార్గం చాల సులభమైనది, గొప్పదీ అవుతోంది . అందుకే శ్రీ శంకరులు “మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ” అన్నారు. నారదభక్తిసూత్రాలలో ‘సా త్వస్మిన్ పరమప్రేమరూపా’ అని భక్తికి నిర్వచనం చెప్పారు . సాధకునకు  భగవంతుని యందు గల పరమ ప్రేమయే భక్తి అని ఆ మాటలకర్థం.  ఇక “కలౌ సంస్మరణాన్ముక్తి: అని చెప్పడం ద్వారా ఈ కలియుగంలో  కేవలం భగవన్నామ స్మరణ చేతనే ముక్తి పొంద వచ్చునని  తెలుస్తోంది.  అటువంటి భగవద్భక్తులకు చేయూతగా ఎన్నో స్తుతి కావ్యాలున్నాయి. వాటిలో సోదరి శ్రీమతి పర్వతనేని

శ్రీసత్యగారు రచించిన ‘స్తుతికదంబం’ అనే సంస్కృత గ్రంథం పేర్కొన దగినది. నేను ఈ  గ్రంథాన్ని స్థాలీపులాకన్యాయంగా పరిశీలించాను. ఇది సర్వ దేవతా స్తుతి రూపమైనది . ఇందులో సుమారు  120 శ్లోకాలున్నాయి . రచయిత్రి సమస్త దేవీ దేవతలను  ఇందులో మనసార స్తుతించారు. వాగ్దేవతా స్తుతితో ఈ గ్రంథం మొదలైంది. గ్రంథమంతా అనుష్టుప్ ఛందస్సుతో సాగింది. ఇంచుమించు దేవతామూర్తులందరినీ వీరు ప్రస్తుతించడం చెప్పుకోదగిన విశేషం  .  అంతేగాక  ప్రతి శ్లోకానికి అర్థం చేకూర్చడం వల్ల ఇది పాఠకులకు చాల మేలు చేకూర్చే విధంగా ఉంది.   భగవద్ధ్యానమే సర్వ సౌభాగ్యాలను కలిగిస్తుందని వివరించే పదవ శ్లోకంలోను, 82 శ్లోకంలోనూ  భక్తియొక్క వైశిష్ట్యాన్ని, భక్తిలో గల కొన్ని ముఖ్యమైన  భేదాలను , ఉపాయాలను వివరించడం కనిపిస్తోంది. ఇక ఆయా దేవీ దేవతలను కేవలం స్తుతించడమే కాకుండా  వారి గుణ గణాలను కూడ ప్రశంసించడం ఒక ప్రత్యేకత. ఉదాహరణకు37, 39, 87మొ|| శ్లోకాలలో రాముని గుణ గణాలు మరికొన్ని శ్లోకాలలో కృష్ణుని  గుణ గణాలు పేర్కొన్నారు . ఇక తృప్తి వివేకం వల్లనే కలుగుతుంది గాని , సంపదల వలన  కలుగదని;     తనకు వివేకాన్ని ప్రసాదించమని భగవంతుని  వేడుకోవడం కవయిత్రి మానసిక పరిణతికి ఒక దర్పణంగా కనిపిస్తోంది(23)  .     అలాగే  47 వ శ్లోకంలో ‘నిగమాగమవేద్యం’ అని హరిని స్తుతించడం ద్వారా “ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య: వేదాంత కృద్వేదవిదేవ చాsహం” అనే గీతావాక్యాన్ని స్మరించేలా చేసింది .  తోయజాక్షీం  తోయజాస్యాం తోయజాం తోయజోద్భవామ్

తోయజాలంకృత పదాం వందే తాం తోయజార్చితామ్ అనే (100) శ్లోకం కవయిత్రి ప్రతిభకు ఒక ఉదాహరణ . ఇంద్రియాలను అదుపులో ఉంచడం ద్వారా స్థిరమైన చిత్తాన్ని ప్రసాదించమని భగవంతుని పదే పదే కోరడం ద్వారా వైరాగ్యం పట్ల రచయిత్రికి గల ప్రగాఢమైన అభిరుచి తేటతెల్లం ఔతోంది . కావ్యంలో అక్కడక్కడ ఒకటిరెండు ఛంద: పరమైన దోషాలున్నా అవి  గమనానికి  ఆటంకాలు కావు .

19 వ శ్లోకం లో శివానీ అనే పదాన్ని ప్రయోగించడం ఆశ్చర్యంగా అనిపించింది  . ఈ గ్రంథం భక్తులకు సమస్త దేవతలపట్ల  పరమ ప్రేమను రేకెత్తించే విధంగా ఉంది .    ఇక ఇది భగవద్భక్తులందరికి నిత్య పారాయణ గ్రంథంగా ఉపయోగ పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అమూల్యమైన  గ్రంథాన్ని రచించి, భగవద్భక్తులకు కరదీపికగా అందించి, భక్తి మార్గాన్ని బలోపేతం చేసే    బంగారు బాటను నిర్మించిన సోదరి శ్రీసత్యగారు అభినందనీయురాలు. వారిని మనసార అభినందిస్తూ, ఈ గ్రంథంపై నాలుగు మాటలు వ్రాయడానికి నాకు అవకాశం  కలుగజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియ జేసుకుంటూ   ......

చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

Thursday, January 1, 2026

Masters of Advaita- Vedanta 1. Ashtavakra

 

Masters of Advaita- Vedanta

1.    Ashtavakra

అష్టావక్రుడు

అష్టావక్రుడు ఒక మహర్షి. ఈయన సుజాత కహోలుల పుత్రుడు. ఉద్దాలకుని కుమార్తె యొక్క బిడ్డ . శ్వేతకేతుని అక్క కొడుకు . వదాన్యుని అల్లుడు. సుప్రభకు భర్త. ఉద్దాలకుడనే ఋషి   తన శిష్యుడైన కహోలునకు తన  కుమార్తె యగు  సుజాతను ఇచ్చి వివాహం చేశాడు . సుజాత గర్భం ధరించింది . సుజాత గర్భంలో అగ్నిలా వెలుగొందుతున్న శిశువు అందరివలె  శిష్యుల మధ్యలో చదువుతున్న తన తండ్రి కహోలుని గమనించాడు .ఈ కహోలుని అధ్యాపనను ఆక్షేపించాడు . అది గమనించి కోపించిన ఉద్దాలకుడు తన మనుమని ‘నువ్వు గర్భంలో ఉండే నన్ను ఆక్షేపిస్తున్నావు కాబట్టి నువ్వు అష్టావక్రుడవు అవుతావని శపించాడు . అందువల్ల పుట్టుకతోనే వంకరగా పుట్టి  అష్టావక్రుడుగా పేరు పొందాడు. కొంత కాలానికి అష్టావక్రుని తండ్రి కహోలుడు తన భార్య ప్రేరణతో ధనం సంపాదించడానికి జనకుని నగరంలో ప్రవేశించి, అక్కడ ద్వారపాలకుని చేతిలో  వాదనలో ఓడిపోయి అవమానంతో నీటిలో మునిగి చనిపోయాడు. తన తండ్రి మరణ వార్తను తల్లి ద్వారా తెలుసుకున్న అష్టావక్రుడు మేనమామ సహాయంతో జనకుని నగరంలో ప్రవేశించి వాదంలో ద్వారపాలకుని, జనకుని కూడ ఓడించి సమంగ అనే మరో పేరు గల మధుబిలమనే పవిత్ర నదిలో స్నానం చేసి తన శారీరక వక్రతను పోగొట్టుకుని, వదాన్యుని కుమార్తె యగు  సుప్రభ అను కన్యను పెండ్లి చేసుకున్నాడని మహాభారత కథను బట్టి మనకు తెలిస్తోంది. .  

ఈయన రచించిన గ్రంథం ‘అష్టావక్రగీత’ . ఇందులో 20 అధ్యాయాలున్నాయి . బ్రహ్మము  యొక్క అద్వితీయత్వప్రతిపాదనమే   ఈ గ్రంథ సారాంశం . ఈ గ్రంథానికి విశ్వేశ్వరుడు రచించిన  దీపిక,  పూర్ణానందతీర్థులు, ముకుందముని, భాసురానందులు రచించిన మరో మూడు,    మొత్తం నాలుగు వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ గ్రంథానికి  ఎంతో ప్రాముఖ్యం ఉంది.

<><><>