ప్రశ్నోత్తర రత్నమాలికా Part-5
రచన:- శ్రీ శంకరాచార్యులు
సంక్షిప్త వివరణ :- డాక్టర్.
చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం .
ఇందులో కొంతమంది శిష్యుల ప్రశ్నలకు శ్రీ శంకరభగవత్పాదుల వారి
సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి
కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే
వారు ఉత్తమ పౌరులుగా తయారౌతారు అనడంలో
ఎటువంటి సందేహం లేదు.ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ
ప్రార్థన.
1. ప్రశ్న :- కుత్ర విధేయో వాస: ?
మానవుడు
ఎక్కడ నివసించాలి ?
సమాధానం :- సజ్జన నికటే, అథవా కాశ్యాం . మంచివారు
నివసించే ప్రదేశంలో , లేకుంటే కాశీ నగరంలో
2. ప్రశ్న :- క: పరిహార్యో దేశ: ? ఏ
దేశాన్ని విడిచిపెట్టాలి ?
సమాధానం :-పిశునయుక్తో, లుబ్ధభూపశ్చ. నీచబుద్ధి
కలిగిన జనులు , లోభియైన రాజు ఉన్న దేశాన్ని విడిచిపెట్టేయాలి.
3. ప్రశ్న :- కేన అశోచ్య: పురుష: ?
ఎటువంటి మానవుడు జీవితంలో ఎట్టి దు:ఖమును
పొందడు?
సమాధానం :- ప్రణతకళత్రేణ, ధీరవిభవేన. అనుకూలవతి
యైన భార్య , స్థిరమైన సంపదలు గల మానవుడు జీవితంలో ఎట్టి దు:ఖమును పొందడు.
4. ప్రశ్న :- ఇహ భువనే క: శోచ్య:
? ఈ లోకంలో ఎవడు శోచనీయుడు?
సమాధానం
:-సత్యపి విభవే న యో దాతా . సంపదలున్నప్పటికీ ఎవరికీ దానం చేయని వాడు చాల
దౌర్భాగ్యుడు. వాడి విషయంలో మనం చాల జాలిపడాలి.
5. ప్రశ్న :- కిం లఘుతాయా: మూలం? మనిషి ఏ
కారణ చేత చాల చులకన ఐ పోతున్నాడు ?
సమాధానం :-ప్రాకృత పురుషేషు యాంచా. నీచమైన
వారిని యాచించడం వలన మనిషి చాల చులకన ఐ పోతున్నాడు
6. ప్రశ్న :- రామాదపి క: శూర: ? ఎవడు రాముని కన్న
గొప్ప శూరుడు ? సమాధానం :- స్మరశర
నిహతో న య: చలతి. ఎవడు మన్మథ బాణాలకు కూడ ప్రభావితం కాడో అటువంటి వాడు రాముని
కన్న గొప్ప శూరుడు .
7. ప్రశ్న :- కిమహర్నిశమనుచింత్యం?
మనం రాత్రింబగళ్ళు దేని గురించి ఆలోచిస్తూ ఉండాలి?
సమాధానం :- భగవచ్చరణం న సంసార: భగవంతుని
చరణాల గురించి మాత్రమె ఆలోచించాలి. సంసారం గురించి కాదు.
8. ప్రశ్న :- చక్షుష్మన్తోsపి అంధా: కే స్యు:? కళ్ళు ఉన్నప్పటికీ
గ్రుడ్డివారు ఎవరు? సమాధానం :- యే నాస్తికా: మనుజా:
ఎవరికి, భగవతుని పట్ల విశ్వాసం ఉండదో వారు కళ్ళు
ఉన్నప్పటికీ గ్రుడ్డి వారు. సాధారణం భగవంతుని నమ్మని వారిని నాస్తికులు అంటాం .
కాని అది సరి కాదు. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించకపోవడమే నాస్తికత్వం. జైనులు, బౌద్ధులు లొకోత్తరచరిత్ర గల మహనీయులను
అంగీకరించినప్పటికీ వేదాలను కాదనడం వల్ల
వారు నాస్తికులు . ఇక పూర్వమీమాంసా శాస్త్రం ఈశ్వరుని పట్ల ఉదాసీనభావం
కలిగినదైనప్పటికి, వేదాన్ని అంగీకరించడం వల్ల వారు ఆస్తికులే.
9. ప్రశ్న :- క: పంగురిహ ప్రథిత:?
ఈ లోకంలో ఎవడు కుంటివాడు ?
సమాధానం :-వ్రజతి చ యో వార్థకే తీర్థం.
ఎవడు, వార్ధక్యంలో తీర్థయాత్రలు చెయ్యొచ్చులే అని అనుకుంటాడో అలా అనుకునే వాడు; అంత వరకు వేచి
యుండే వాడున్ను.
10. ప్రశ్న :- కిం తీర్థమపి చ ముఖ్యం ? ఏ
తీర్థం లేదా ఏ పుణ్య క్షేత్రం చాల ముఖ్యమైనది ?
సమాధానం :- చిత్తమలం యన్నివర్తయతి.
ఏది దర్శన మాత్రం చేతనే మన మనస్సులో ఉండే మాలిన్యం తొలగిస్తుందో అదే
అసలు సిసలైన పుణ్యక్షేత్రం. (కేవలం మన జేబుల్లోని డబ్బుల్ని మాత్రమే కాజేసేది
కాదు).
11. ప్రశ్న :- కిం స్మర్తవ్యం పురుషై: ?
మానవుడు ఎల్లప్పుడూ ఏది స్మరించాలి? సమాధానం :- హరి
నామ సదా న యావనీ భాషా. ఎల్లప్పుడూ హరి నామ స్మరణమే చెయ్యాలి , కాలక్షేపం కోసం
అందరితో అనవసరమైన కబుర్లు కాదు .
12. ప్రశ్న :- కో హి న వాచ్య: సుధియా?
బుద్ధిమంతుడైన వాడు ఎటువంటి మాటలు పలుకరాదు.
సమాధానం :- పరదోషశ్చ, అనృతం తద్వత్
బుద్ధిమంతుడైన వాడు ఇతరులను దూషించే మాటలు అలాగే
అసత్యములు పలుకరాదు.
13. ప్రశ్న :- కిం సంపాద్యం మనుజై: ?
మానవులు ఏది సంపాదించుకోవాలి ?
సమాధానం :-విద్యా , విత్తం, బలం , యశ:, పుణ్యం
మానవులు విద్యను , ధనాన్ని, బలాన్ని కీర్తిని ,
పుణ్యాన్ని సంపాదించుకోవాలి
14. ప్రశ్న :- క: సర్వ గుణ వినాశీ ?
ఏది సమస్త గుణాలను నశింప చేస్తుంది ?
సమాధానం :-లోభ:
లోభం అంటే దురాశ. అది సమస్తగుణాలను నశింప చేస్తుంది .
15. ప్రశ్న :- శత్రు: చ క: ? ఎవడు
శత్రువు ?
సమాధానం :-కామ:
కామ: అంటే కోరిక అదే మనకు గొప్ప శత్రువు.
16. ప్రశ్న :- కా చ సభా పరిహార్యా? ఎటువంటి
సభను మనం విడిచి పెట్టెయ్యాలి.
సమాధానం :- హీనా యా వృద్ధసచివేన
ఏ సభలో జ్ఞానవృద్ధులయిన మంత్రులు ఉండరో అటువంటి
సభను మనం విడిచి పెట్టెయ్యాలి.
17. ప్రశ్న :- ఇహ కుత్ర అవహిత: స్యాత్
మనుజ: కిల?
మనిషి ఎక్కడ
చాల జాగ్రత్తగా వ్యవహరించాలి. సమాధానం :- రాజసభాయాం
రాజసభలలోను , రాజ కార్యాల పట్ల చాల జాగ్రత్తగా
వ్యవహరించాలి.
18. ప్రశ్న :- ప్రాణాదపి కో రమ్య: ?
ప్రాణంకంటే ముఖ్యమైనది, అందమైనది ఏది?
సమాధానం :- కులధర్మ:, సాధుసంగశ్చ
కుల ధర్మము, సజ్జన సాంగత్యమూ; ఈ
రెండు ప్రాణం కన్నా ఎంతో మిన్న.
No comments:
Post a Comment