Wednesday, June 10, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-6 రచన:- శ్రీ శంకరాచార్యులు

 

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-6

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

 

1.      ప్రశ్న :- కా సురక్ష్యా ? మనం దేనిని జాగ్రత్తగా రక్షించుకోవాలి?

సమాధానం :-కీర్తి:, పతివ్రతా, నిజబుద్ధిశ్చ

కీర్తిని. స్త్రీల పాతివ్రత్యాన్ని , మన వ్యక్తిత్వాన్ని   జాగ్రత్తగా రక్షించుకోవాలి?

2.      ప్రశ్న :- కా కల్పలతా లోకే ?

లోకంలో ఏది కల్పలత వంటిది ?

సమాధానం :- సచ్ఛిష్యాయ అర్పితా విద్యా

మంచి శిష్యునకు నేర్పని విద్య కల్పవృక్షము వంటిది . మంచి శిష్యునకు బోధించిన విద్య కల్పవృక్షంలా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. కణ్వుడు, తన ప్రమేయం లేకుండా శకుంతల గాంధర్వ విధిలో  దుష్యంతుని వివాహం చేసుకున్న సందర్భంలో కణ్వుడు ఆమెను చేరి ఆమెను ఆశీర్వదిస్తూ  అమ్మా! “సుశిష్య పరిదత్తా విద్యేవాsశొచనీయా సంవృత్తా” అంటాడు.  అమ్మా ! మంచి శిష్యునకు బోధించిన విద్యలా నీ గురించి నేను విచారించవలసిన పనిలేదు అని ఆ మాటలకర్థం.       

3.       ప్రశ్న :- కో అక్షయ వటవృక్ష: స్యాత్ ?

సమాధానం :-విధివదత్తమపాత్రం దానం యత్

విధిలేక అపాత్రునకు ఇచ్చిన విద్య వటవృక్షం వంటిది .

వటవృక్షం తన నీడలో ఏ చెట్టును ఎదుగ నివ్వదని ప్రతీతి . వాడా ! వాడొక వటవృక్షం లాంటి వాడండీ! అంటారు . అంటే వాడు ఎవరినీ ఎదుగనివ్వడని తాత్పర్యం. విద్య అందరికీ పంచాలి. “కేతుం కృణ్వన్నకేతవే” అంటుంది వేదం.  ఒక విద్యావంతుడు మరొకరిని విద్యావంతునిగా చెయ్యాలని అర్థం . అది మంచి వానికి విద్య నేర్పినప్పుడే సాధ్యపడుతుంది.    ఇక అన్నదానాత్పరం దానం విద్యాదానమితి స్మృతమ్

అన్నేన క్షిణికా తృప్తి: యావజ్జీవం చ విద్యయా అన్నారు పెద్దలు . అన్నం పెట్టడం కన్నా విద్య నేర్పించడం చాల ఉత్తమం, అన్నం వల్ల కలిగే తృప్తి క్షణికమైనది . ఇక విద్యవల్ల కలిగే సంతృప్తి శాశ్వతమైనది. అందుకే కాబోలు  Instead of giving a fish to a person daily, it is better to teach how to catch fish అంటారు Jesus Christ ఒక సందర్భంలో.   

4.      ప్రశ్న :- కిం శాస్త్రం సర్వేషాం ?

అందరకు ఏది శాస్త్రము ?

సమాధానం :- యుక్తి: అ ఒక సూది బెజ్జం నుంచి ఒక ఒంటెను పంపించడం సులభమౌతుందేమో గాని  ఒక ధనవంతుని ఉన్నతలోకానికి పంపటం సాధ్యమూ  కాదని భావం . ఒక సూది బెజ్జం నుంచి ఒక ఒంటెను పంపించడం సులభమౌతుందేమో గాని  ఒక ధనవంతుని ఉన్నతలోకానికి పంపటం సాధ్యమూ  కాదని భావం .

నగా హేతుబద్ధమైన ఆలోచనయే శాస్ర్తం    

5.      ప్రశ్న :- మాతా చ కా?

అందరికీ తల్లి ఎవరు?

సమాధానం :-ధేను: గోవు అందరికీ తల్లి .

6.      ప్రశ్న :- కిం ను బలం ? అందరికీ ఏది బలము?

సమాధానం :-యద్ధైర్యం. ధైర్యమే అందరికీ బలం.

7.      ప్రశ్న :- కో మృత్యు: ?

ఏది మరణంతో సమానమైనది?

సమాధానం :-యదవధానరహితత్త్వం

అవధాన రాహిత్యమే మృత్యువుతో సమానమైనది . మనిషి ఎల్లప్పుడు అన్ని విషయాల్లోనూ జాగరూకతతో ఉండాలి . ఏమరుపాటు పనికి రాదు.  అది మృత్యువుతో సమానం .

8.      ప్రశ్న :-  కుత్ర విషం ?

ఎక్కడ విషం ఉంటుంది?

 సమాధానం :- దుష్ట జనే దుష్టుని యందు ఉంటుంది.

తలనుండు విషము ఫణికిని

వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్

తలతోక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విసము గదరా సుమతీ !   

9.      ప్రశ్న :- కిమిహాశ్చర్యం భవేత్ ?

ఏది చాల ఆశ్చర్య కరమైనది ?

సమాధానం :-ఋణం నృణాం

మానవునికి అప్పులు , కర్మలు చాల ఆశ్చర్య కరమైనవి. చేసే కొద్దీ పెరుగుతాయి. ఆనందంతో చేస్తాం. తీర్చేటప్పుడు ఏడుస్తాం .  చెయ్యడం  చాల సులభం బయటపడటం ఎంతో కష్టం . అప్పులు చాల  ప్రమాదకరమైనవి. ఐహికంగాను, ఆధ్యాత్మికంగాను రెండు విధాల ఇవి ప్రమాదకరమే, ప్రగతి నిరోధకారకమే. ఋణం తీరితే గాని స్వేచ్ఛ లేదు, కర్మలు  క్షయం కాకుండ మోక్షం రాదు.  Debt is a bottomless ocean.

10. ప్రశ్న :- కిమభయం ఇహ?

ఈ లోకంలో మనకు అభయం ఇచ్చేది ఏది ?  

సమాధానం :- వైరాగ్యం. వైరాగ్యమే మనకు అభయం చేకూరుస్తుంది. భర్తృహరి వైరాగ్యశతకంలో భోగే రోగభయం అనే శ్లోకంలో మనం భోగాలు అనుభవిస్తున్నామనుకుంటే, రాబోయే కాలంలో రోగాలు  వస్తాయేమో  అన్న భయం.  మంచి కులంలో పుట్టేమనుకుంటే, కులం నుంచి వెలివేయబడతామేమో అన్న భయం; ధనం ఉంటే రాజులు tax రూపంలో వశపరచు కుంటారేమో అన్న భయం; ఇపుడు చాల ఉన్నత స్థితిలో ఉన్నామనుకుంటే రేపు దైన్యం కలుగుతుందేమో అన్న భయం. మనం బలవంతులం అనుకుంటే శత్రువులు ముట్టడిస్తారేమో అని భయం. ఈ విధంగా  చెప్పుకొస్తు ఈ ప్రపంచంలో అన్నీ భయంతో కూడు కొన్నవే, వైరాగ్యమొక్కటే  అభయాన్ని ఇస్తుంది అంటారు.

 

11. ప్రశ్న :- భయమపి కిం ?

                ఏది భయం కలిగిస్తుంది?

సమాధానం :- విత్తమేవ సర్వేషాం. అందరికి ధనమే భయాన్ని కలిగిస్తుంది.

అందుకే Jesus Christ కూడ ఒక సందర్భంలో  It is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God

 అంటారు. ఒక సూది బెజ్జం నుంచి ఒంటెను పంపించడం సులభం ఔతుందేమో గాని  ఒక ధనవంతుని ఉన్నత లోకానికి పంపటం సాధ్యమూ  కాదని భావం . ఇక్కడ ముముక్షువునకు ధనంతో బంధం పనికి రాదని అది ప్రతిబంధకమని వారి అభిప్రాయంగా మనం భావించవచ్చు. 

12. ప్రశ్న :- కా దుర్లభా నరాణామ్ ?

మానవులకు ఏది దుర్లభము ?

సమాధానం :-హరిభక్తి: మానవులకు పరమేశ్వరుని యందు భక్తి కలిగియుండడమే దుర్లభము.

  

13. ప్రశ్న :- పాతకం చ కిమ్ ? పాతకమంటే ఏమిటి ?

సమాధానం :- హింసా. ఇతరులను శారీరకంగాను , మానసికంగాను హింసించడమే పాతకం  .  వేదం ‘అహింసా పరమో ధర్మ:’ అంటుంది. అహింసను మించిన ధర్మం మరొకటి లేదు. జైన మతం మరో అడుగు ముందుకు వేసి కేవలం హింసించక పోయినంత మాత్రాన   సరి పోదు, వాటిని ఆదుకోవడం కూడ మన కర్తవ్యం అంటుంది.

ఈ సందర్భంలో సంత్ కబీర్ దాసు చెప్పిన ఒక మాట ప్రస్తావించడం అప్రస్తుతం కాదు.

“దుర్బల కో న  సతాయియే జాకీ మోటా హాయ్... సార భస్మ హో జాయ్”.

నువ్వు నీ కంటే బలహీనుని ఎన్నడు బాధ పెట్టకు. వాడు బలహీనుడైనా, వాడి ఊపిరి (ఉసురు) చాల బలమైనది . గిన్నెలకు  మాట్లు వేసే వాని దగ్గర ఉండే ప్రాణం లేని కొలిమి తిత్తి నుండి వచ్చే గాలి ఇనుమును కరిగిస్తోంది. ఇక ప్రాణమున్న అభాగ్యుని ఉసురు నీ వంశాన్ని దహిస్తుంది,  జాగ్రత సుమా ! అంటారు .                   

14. ప్రశ్న :- కో హి భగవత్ప్రియ: స్యాత్ ?

ఎవడు భగవంతునకు ప్రీతిపాత్రుడు?

సమాధానం :-యోsన్యం న ఉద్వేజయతి, అనుద్విగ్న:

ఇతరులను ఇబ్బంది పెట్టనివాడు, ఇతరులవలన ఎటువంటి ఇబ్బందులు పడనివాడు .

ఈ ప్రపంచంలో భక్తులు రెండు విధాలుగా ఉంటారు. మొదటి వాడు దేవుని ఇష్టపడేవాడు , రెండోవాడు దేవుని ప్రేమకు పాత్రుడయినవాడు, అంటే దేవుని చేత ప్రేమించబడే వాడు. గీతలో 12 అధ్యాయం భక్తి యోగం చాల గొప్పది.   మహాత్మా గాంధీ ప్రతిరోజూ గీత పూర్తిగా చదివే వారు. ఒక్కొక్కప్పుడు సమయం లేకపోతే 12వ అధ్యాయం తప్పని సరిగా చదివేవారు. అందులో పరమాత్ముడు తనకు ఇష్టమైన భక్తుల లక్షణాలను స్పష్టంగా వివరించడం మనం గమనిస్తాం .

గీతలో  యస్మాన్నోద్విజతే లోక: లోకాన్నోద్విజతే చ య: అని చెప్పడం గమనార్హం .

15. ప్రశ్న :- కస్మాత్ సిద్ధి: ?

సిద్ధి దేని వలన కలుగుతుంది?

సమాధానం :-తపస: తపస్సు వలన సిద్ధి కలుగుతుంది

16. ప్రశ్న :- బుద్ధి: క్వను?

       బుద్ధి ఎక్కడ ఉంటుంది ?

సమాధానం :-భూసురే బ్రాహ్మణుని యందు ఉంటుంది.

నన్నయగారు మహాభారతంలో బ్రాహ్మణుని లక్షణాలు వివరిస్తూ ఇలా అంటారు.  

ఉ || భునుతకీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడనె పుట్టు నుత్తమ

       జ్ఞానము, సర్వభూత హితసంహితశక్తియు, నాత్మశుద్ధియున్,

      మాన మద ప్రహాణము, సమత్వము, సంతతయోగవిద్యను

      ష్ఠానము, చిత్తశాంతియు, దృఢవ్రతముం, గరుణాపరత్వమున్

      1. నుత్తమ జ్ఞానం 2. సర్వ భూతముల పట్ల దయ 3. ఆత్మ శుద్ధి  

4. గర్వం లేకపోవడం 5. అందరి పట్ల సమ భావన 6. ఎల్లప్పుడూ యోగ విద్యను

అనుష్ఠానం చేయడం 7. చిత్త శాంతి 8. దృఢమైన  దీక్ష 9. కరుణ అనేవి బ్రాహ్మణుని సహజ లక్షణాలు, అంటే పుట్టుకతో వచ్చేవి . కాబట్టి ఈ నవ లక్షణాలు కలిగి ఎటువంటి అవలక్షణాలు లేనివాడే బ్రాహ్మణుడు . 

17. ప్రశ్న :- కుతో బుద్ధి:?

బుద్ధి దేని వలన కలుగుతుంది ?

సమాధానం :-వృద్దోపసేవయా . గురువులను , పెద్దలను సేవించడం వలన.   

18. ప్రశ్న :- కే వృద్ధా: ? ఎవరు  వృద్ధులు ?

       సమాధానం :-యే ధర్మ తత్త్వజ్ఞా:

ఎవరు ధర్మం యొక్క స్వరూపాన్ని సమగ్రంగా తెలుసుకుని ఆచరిస్తారో వారు తత్త్వజ్ఞులు . అసలు ముందుగా ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం .

धृति: क्षमा दमोsस्तेय: शौचमिन्द्रियनिग्रह: |

धीर्विद्या सत्यमक्रोध: दशकं धर्मलक्षणम्   ||  

ఇది ధర్మ స్వరూపం . धृति: అంటే దేహేంద్రియాలను దృఢముగా ఉంచుకోడానికి చేసే ప్రయత్నం.क्षमा అంటే ఆకర్షణలకు, అవరోధములకు చలించకుండా ఉండడం.   दम: అంటే అంతరింద్రియ(మనో) నిగ్రహం, अस्तेय: అంటే ఇతరుల ద్రవ్యాన్ని అపహరించక పోవడం , शौचम् అంటే శరీర, మనస్సుల పవిత్రత, इन्द्रियनिग्रह: అంటే ఇంద్రియాలను మనస్సును అదుపులో పెట్టుకోవడం, धी: అంటే బుద్ధికుశలత , विद्या అంటే వేదార్థ పరిజ్ఞానం, सत्यम् అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం .अक्रोध: మనం కోరుకున్నది జరుగకపోయిన, లేదా విఘాతం కలిగినా కోపం పొందక పోవడం . ఇవి స్థూలంగా ధర్మం యొక్క లక్షణాలు . ఇవి ఆచరించే వాడే ధర్మాత్ముడు.   ఆచరణయే ముఖ్యం తెలుసుకోవడం కాదు. మహాభారతంలో దుర్యోధనుడు . జానామి ధర్మం నచమే ప్రవృత్తి: జానామ్యధర్మం నచ మే నివృత్తి . నాకు ధర్మం తెలుసు కాని ఆచరించను; అధర్మం తెలుసు కాని మానను అంటాడు. ఏం ప్రయోజనం ?  

<><><> 

No comments: