Sunday, June 14, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-8 రచన:- శ్రీ శంకరాచార్యులు

 ప్రశ్నోత్తర రత్నమాలికా Part-8

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

122.     ప్రశ్న :- కస్య క్రియా సఫలా?

ఎవరి పనులు ఫలవంతం ఔతాయి?  .

సమాధానం :- య: పున: ఆచారవాన్ శిష్ట:

ఎవడు మంచివాడై,  సదాచార సంపన్నుడుగా ఉంటాడో, అతని పనులన్నీ తప్పక సఫలమౌతాయి . ఇక్కడ ఆచారమంటే మడి, ఆచారం అని కాదు. ఆచరణ అని అర్థం. మన సమాజంలో నూటికి తొంబై మంది నీతులు చెప్పే వారే గాని ఆచరించే వారు చాల తక్కువ. వేదం ఆచరణకు చాల ప్రాధాన్యం ఇచ్చింది . ఏమంటున్నదో స్వయంగా చూడండి.

ఆచారహీనం న పునంతి వేదా: యద్యప్యధీతా: సహ షడ్భిరంగై:

                    ఛందాంస్యేనం మృత్యుకాలే త్యజంతి నీడం శకుంతా ఇవ జాతపక్షా:

ఒక వ్యక్తి ఎన్ని వేదాలు, వేదాంగాలు చదివినా వాటి విలువల్ని ఆచరణలో పెట్టకపోతే అవి అతనిని రక్షించవు. ఏ విధంగా రెక్కలొచ్చిన పక్షి గూడు విడిచిపెట్టి పాఱి పోతుందో అలాగే ఆ వ్యక్తి మరణించిన తరువాత వేదాలన్నీ అతనిని విడిచిపెట్టి పోతాయి. ఆచరణ  లేని జ్ఞానం వ్యర్థం . ఇక గూడు విడిచిపెట్టి  వెళ్ళిన పక్షి మరల ఆ గూటికి చేరదు . తనకు తానే స్వయంగా నిర్మించుకొంటుందని ప్రతీతి .

123.     ప్రశ్న :-  క: శిష్ట: ?

ఎవడు శిష్టుడు/సజ్జనుడు  ?

సమాధానం :-యో వేదప్రామాణ్యవాన్.

ఎవడు, వేదాన్నే ప్రమాణంగా తీసుకుంటాడో అతడే శిష్టుడు/ సజ్జనుడు.

124.     ప్రశ్న :- యో హత: ? ఎవడు హతుడు ?

సమాధానం :-క్రియా భ్రష్ఠ:

ఎవడు తన కర్తవ్యాన్ని విడిచి పెడతాడో,  అతడే హతుడు.   

125.     ప్రశ్న :- కో ధన్య: ?

ఎవడు ధన్యుడు?

సమాధానం :-సన్యాసీ

సన్యాసి చాల ధన్యుడు.

‘అన్ని విడిచిపెడితే, వాడు సన్యాసి; అందరు విడిచి పెడితే వాడు సన్నాసి’ అని సుప్రసిద్ధ పండితులు , అవధాని శ్రీ రావూరి వేంకటేశ్వర్లు గారు ఒక అవధానంలో సన్యాసికి సన్నాసికి మధ్య గల తేడాను చమత్కరించారు.    

126.     ప్రశ్న :- కో మాన్య: ? ఎవడు గౌరవించదగినవాడు.

సమాధానం :-పండిత: సాధు:

                పండితుడైన సజ్జనుడు. కేవలం విద్యావంతుడైనంత మాత్రాన సరిపోదు. శీలం కూడ అవసరం .     శీలం లేని విద్యావంతుడు అందరికన్నా ప్రమాదకారి. అందుకే భర్తృహరి  

‘దుర్జన: పరిహర్తవ్య: విద్యయాsలంకృతోsపి సన్

మణినా భూషిత: సర్ప: కిమసౌ న భయంకర:’   అంటాడు .

దుర్జనుడు విద్యావంతుడైనప్పటికి అతనిని చేర రాదు. పాము తన తలపై విలువైన మణిని ధరించినప్పటికీ అది భయంకరమైనదే కదా!  .  ఇంచుమించు ఇదే భావాన్ని  Shakespeare మహాకవి రచించిన

‘As you like it’ నాటకంలోని ....  Which like the toad, ugly and venomous,

Wears yet a precious jewel in his head...... మొదలైన మాటలు జ్ఞప్తికి తెస్తాయి.

127.     ప్రశ్న :- క: సేవ్య: ?

ఎవడు సేవిపదగిన వాడు? 

సమాధానం :-యో దాతా

దాతృత్వం గల వ్యక్తి సేవింప దగిన వాడు .

Part-23.

128.     ప్రశ్న :- కో దాతా?

దాత అనగా ఎవరు?

సమాధానం :-య:  అర్థిం  తృప్తిమాతనుతే

ఎవడు, తన వద్దకు వచ్చిన అర్థిని /యాచకుని  పూర్తిగా సంతృప్తి పరుస్తాడో అతడే దాత .

129.     ప్రశ్న :- కిం భాగ్యం దేహవతామ్  ?

మానవులకు ఏది అసలైన భాగ్యము ?

సమాధానం :-ఆరోగ్యం.  

మానవులకు ఆరోగ్యమే  అసలైన భాగ్యము.

If money is lost, nothing is lost

If health is lost, something is lost

If character is lost everything is lost. అన్నారు పెద్దలు . అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్  అంటాడు కాళిదాసు . ధర్మ సాధనకు శరీరమే మొట్టమొదటి సాధనము.

130.     ప్రశ్న :- క: ఫలీ ?

ఎవడు మంచి ఫలాలను పొందుతాడు?

సమాధానం :-కృషికృత్

వ్యవసాయం చేసే వాడు మంచి ఫలాలను పొందు తాడు.

ఈ ప్రపంచంలోని అన్ని వృత్తులలో వ్యవసాయమే చాల పవిత్రమైనది, గొప్పదీని . ఇక కృషి అంటే పరిశ్రమ అనే అర్థం కూడ ఉంది. ఏ వృత్తిలోనైనా  అధికమైన పరిశ్రమ చేసినవాడు అన్ని ఫలాలను పొందుతాడు.  

131.     ప్రశ్న :- కస్య న పాపం ?

ఎవరికి పాపం అంటదు.

                 సమాధానం :-జపత:

                 జపం చేసే వానికి పాపం అంటదు. ( కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం) .

132.     ప్రశ్న :- క: పూర్ణ:?

ఎవడు పరిపూర్ణమైన మానవుడు?

 సమాధానం :-య: ప్రజావాన్స్యాత్

సంతానం గల వాడు పరిపూర్ణ మైన మానవుడు ఔతాడు.  

133.     ప్రశ్న :- కిం దుష్కరం నరాణాం?

మానవులకు ఏది చాల కష్టమైన పని ?

సమాధానం :-యన్మనసో నిగ్రహ: సతతం

ఎల్లప్పుడూ మనస్సును అదుపులో పెట్టుకోవడం మానవులకు చాల కష్టమైన పని.

శ్రీ కృష్ణుడంతటి వాడే మనస్సును అదుపులో పెట్టుకోవడం మానవులకు చాల కష్టమైన పని అన్నాడు . కాని అభ్యాసం, వైరాగ్యం వల్ల అది సాధించవచ్చని సలహా చెప్పాడు. అందుకే పతంజలి “అభ్యాస వైరాగ్యాభ్యాం చిత్తవృత్తి నిరోధ: ”  అన్నారు . కాబట్టి మనోనిగ్రహం కష్ట సాధ్యం కావచ్చు నేమో! గాని అసాధ్యం మాత్రం కాదు .    

134.     ప్రశ్న :- కో బ్రహ్మచర్యవాన్ స్యాత్?

ఎవడు బ్రహ్మచారి ?

సమాధానం :- యస్యాస్ఖలితమూర్ధ్వరేతస్క:

అస్ఖలితుడు గాని , ఊర్ధ్వరేతస్కుడు గాని బ్రహ్మచారి ఔతున్నాడు.

సాధారణంగా వివాహం చేసుకోని వాణ్ణి బ్రహ్మచారి అంటారు . అది సరే, కాని  బ్రహ్మణి  చరతి ఇతి బ్రహ్మచారీ అని తాత్త్విక పరమైన అర్థం.  అంటే పర బ్రహ్మమందు మనస్సును  ఎల్లప్పుడూ లగ్నం చేసేవాడు/ లీనమై ఉండే వాడు  అని అర్థం.

ఇక దీనికి సంబంధించినది,  నేను చిన్నప్పుడు చందమామలో చదివిన కథ ఒకటి వివరిస్తాను.

                 ఒకనాడు వసిష్ఠ మహర్షి తన భార్య    అరుంధతిని పిలిచి ఆమెతో “ ఈ రోజు నువ్వు గంగానదికి అవతలి గట్టున ఉన్న అగస్త్య మహర్షికి భోజనం పట్టుకొని వెళ్ళు “ అని చెప్పాడు. ఆమె ఆహారం పట్టుకొని నది దగ్గరకు వెళ్ళింది. ఆ నది పరవళ్ళు తొక్కుకుంటూ చాల వేగంగా ప్రవహిస్తోంది . నదీ ప్రవాహం దాటడానికి వీలుగా లేదు, దాటించే వారు కూడ ఎవరు లేరు . ఆమె ఇంటికి వచ్చి విషయం అంతా చెప్పింది.  అప్పుడు మహర్షి ఆమెతో నిత్య బ్రహ్మచారి పంపించాడని ఆ నదితో చెప్పమని మరలా పంపించాడు . ఆమె తిరిగి వెళ్లి ఆ విషయాన్ని నదికి విన్నవించగానే ఆ నది రెండు పాయలుగా విడిపోయి ఆమెకు దారి ఇచ్చేసింది. ఆమె కాలి నడకన నది దాటి ఆ మహర్షిని చేరుకొని తాను తెచ్చినదంతా ఆయనకు సమర్పించింది . ఆయన కూడ ఒక్క మెతుకు మిగుల్చకుండా పూర్తిగా తినేశాడు. ఆమెతో ధన్యవాదాలు తల్లీ! వెళ్ళిరామ్మా ! అన్నాడు . ఆమె, స్వామీ! నేను ఎలా తిరిగి వెళ్ళగలను? . నది చాల వేగంగా ప్రవహిస్తోంది. అక్కడ దాటించే వారు కూడ ఎవరు లేరు అంది. ఆయన ఓహో అలాగా! దానికేముందమ్మా! నిత్యోపవాసి పంపించాడని చెప్పు , ఆ నది నీకు దారి ఇస్తుంది’  అన్నాడు. ఆమె అలాగే చెప్పింది . నది అలాగే దారి ఇచ్చింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె ప్రశాంతంగా తిరిగి వచ్చినా మనశ్శాంతి లేదు. మా ఆయన ఎల్లపుడు నా తోనే ఉంటూ నిత్య బ్రహ్మచారి ఎలా అయ్యారు . ఇక ఒక్క మెతుకు కూడ మిగుల్చకుండా తినేసిన ఆయన నిత్యోపవాసి ఎలా అయ్యాడో ఈమెకు అర్థం కాలేదు . భర్తను చేరి వినయంగా అన్ని అడిగింది. ఆయన చెప్పాడు. ఎవడు, సర్వకాల, సర్వావస్థలలోను  మనస్సును ఆత్మ(బ్రహ్మ)యందు లయం చేస్తాడో అతడే బ్రహ్మచారి. నేను బాహ్యంగా ఎన్నో లౌకిక కార్యక్రమాలలో పాల్గొంటున్నా, నా మనస్సు ఎప్పుడు అంతర్ముఖం గానే ఉంటుంది. నేను నిత్య బ్రహ్మచారినే. ఇక ఉపవాసం విషయానికొద్దాం. ఉపవాసం అనే పదానికి ఒక విశిష్టమైన అర్థం ఉంది .

ఉపసమీపే యో వాస: జీవాత్మ పరమాత్మనో:

ఉపవాస: స విజ్ఞేయ: న తు కాయస్య శోషణం

 దీన్ని బట్టి ఉపవాసం అంటే జీవాత్మను , పరమాత్మ సమీపంలో ఉండేటట్లు చెయ్యడం . ఒక విధంగా ధ్యానంలో ఉండమని  తాత్పర్యం. ఆహారం కడుపునిండా తింటే అది సాధ్యం కాదు కాబట్టి సాధ్యమైనంత స్వల్పంగా తీసుకోవడం పరిపాటి. ఆహారం ఎక్కవగా తీసుకున్నవానికి; అదే విధంగా అసలు ఆహారం తిననివానికి యోగం కుదరదని  నాత్యశ్నతస్తు  యోగోsస్తి న చ యోగమనశ్నత:  అనే మాటల్లో  భగవానుడు సెలవీయడం మనకందరికీ తెలిసిందే కదా! ఇంకో విషయం  చెపుతాను విను. మనం ఆహారం తీసుకొని వెళ్లినప్పుడు ఆయన స్వీకరించాడు గాని నా భార్య లోపాముద్ర పుట్టింటికి వెళ్ళింది నాకు అన్నం పంపించమని ఎప్పుడు మనల్ని అడగలేదు, నువ్వు గమనిచావా! అన్నాడు . ఆమె తల ఉపింది .  రామాయణంలో “ ఉపవాసపరైకాగ్రా వస త్వం జనకాత్మజే! పతివ్రతాత్వమస్థాయ రామం కృత్వా సదా హృది” అనే మాటలకు ధ్యానం చేస్తూ ఉండమనే తాత్పర్యం .   ఆ సంగతి అలా ఉంచుదాం. ఈ సందర్భంలో మా గురుదేవులు శ్రీ గంటి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఒక విషయాన్ని చెప్పారు . అది ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. నేటికి మన పవిత్ర భారతదేశంలో హిమాలయాల్లో ఎంతో మంది యోగులున్నారు. వాళ్ళ కోసం టాటా - బిర్లా ల వంటి మహానుభావులు కొన్ని ట్రస్టులను ఏర్పాటు చేశారట. ప్రతి రోజు అక్కడ ఉండే యోగులకు ఉచితంగా పాలు, ఆహారం సమకూర్చడం వారి నిత్యకృత్యం . ప్రతి రోజు ఎంతోమంది యోగులు అక్కడకు వస్తూ, పోతూ ఉంటారు. లైనులో మౌనంగా నిలబడి, వారు పెట్టింది తినేసి, వెళ్లి పోతూ ఉంటారు . విచిత్రమేమిటంటే

కొంతమంది రోజూ రావడం లేదట. నెలకో  , రెండు నెలలకో , మూడు నెలలకో  తినాలనిపిస్తే ఒక్కసారి వస్తున్నారట. అక్కడ పని చేసే వారు ఈ  విషయాన్ని బాగా గమనించారు . ఆహా ! ఎంత గొప్ప వారు ఆ యోగులు! . అటువంటి వారికి నిలయమైన మన భారతదేశం చాల ధన్యమైనది. ఇక స్వామి రామ అనే మహనీయుడు My experience with the Himalayan yogis అనే గ్రంథాన్ని  వ్రాశారు. అది చదివితే మరెన్నో విశేషాలు తెలుస్తాయి.          

 ఇక మనలో కొందరు ముందుగా తిండి మానెయ్యడం ఆ తరువాత పదింతలు తినెయ్యడం    ఒకే సారి ఈ రెండు తప్పులు చేస్తున్నారు . దైవ ధ్యానం కన్నా సాయంకాలం తినబోయే వంటకాలపైనే ధ్యాస ఎక్కువ. దీనివల్ల పారమార్థిక లాభం శూన్యమే అని చెప్పక తప్పదు. ఇది ఎవరికి వారు  తెలుసుకోవాలి . ఎవరూ చెప్పే విషయం కాదు. 

             135.     ప్రశ్న :- కా చ పరదేవతా ఉక్తా ?

ఏది పర దేవతగా చెప్పబడున్నది?

సమాధానం :-చిచ్ఛక్తి:

మన శరీరంలో ఉన్న చైతన్య శక్తియే  పర దేవతగా చెప్పబడుతున్నది. మనలో ప్రత్యగాత్మ (జీవాత్మ) రూపంలో ఉన్న చైతన్య శక్తియే పరమ దైవం ..
<><><>

No comments: