Thursday, June 11, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-7 రచన:- శ్రీ శంకరాచార్యులు

  ప్రశ్నోత్తర రత్నమాలికా Part-7

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

1.      ప్రశ్న :- సంభావితస్య మరణాత్ అధికం కిం ?

                             మరణం కంటే నీచమైనది ఏది?  

                 సమాధానం :- దుర్యశో భవతి.

                       అపకీర్తి మరణం కన్న నీచమైనది. ఈ ప్రపంచంలో కొన్ని దేశాలున్నాయి. వాటి పేర్లు అందరికీ తెలిసినవే . ఆ దేశాలలో పాలకులుగా నియమితులైన వారు ప్రజా పరిపాలన విషయంలో ఎటువంటి తప్పిదం  చేయరు. ఎవరైనా వారిపై దోషం మోపితే చాలు అది నిజమైనా కాక పోయినా  ప్రజలకు మొగం చూపించలేక  ఆత్మహత్య చేసుకుంటారట! ఇదే అపకీర్తి కన్నా మరణమే మిన్న అనే మాటలకు అర్థం . మన దేశ పరిస్థితి వేరు కాళ్ళు పట్టుకు లాగుతున్నా చూరు పట్టుకుని  వ్రేళాడుతూ ఉంటారు.       

2.      ప్రశ్న :- లోకే సుఖీ భవేత్ క:?

           లోకంలో ఎవడు సుఖం పొందుతున్నాడు ?

        సమాధానం :- ధనవాన్.

          లోకంలో  ధనవంతుడు సుఖం పొందుతున్నాడు.

3.      ప్రశ్న :- ధనమపి చ కిం ?

             ధనం అంటే ఏది?

            సమాధానం :-యతశ్చేష్టమ్.

              మనిషి దేని వలన తనకు కావలసినది పొందుతున్నాడో అదే ధనం .

4.      ప్రశ్న :- సర్వసుఖానాం బీజం కిం?

                సమస్త సుఖాలకు ఏది కారణం ?

సమాధానం :- పుణ్యం.

మనిషి పొందే సమస్త సుఖాలకు తానూ చేసుకున్న  పుణ్యమే కారణం.

5.      ప్రశ్న :- దు:ఖమపి కుత: ?

దేని వలన దు:ఖం కలుగుతుంది?

  సమాధానం :-పాపాత్ . పాపం చేయడం వలన దు:ఖం కలుగుతుంది.

6.      ప్రశ్న :- కస్య ఐశ్వర్యం ?

      ఎవరికి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి?

సమాధానం :- య: కిల శంకరమారాధయేత్ భక్త్యా

ఎవడు శంకరుని భక్తితో ఆరాధిస్తాడో అతనికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

శం(సుఖం) కరోతి ఇతి  శంకర: . అంటే సుఖాలను ప్రసాదించే వాడు కాబట్టి ఆయన శంకరుడు . ‘ఈశ’ ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ‘వరచ్’ ప్రత్యయంతో ఈశ్వర శబ్దం ఏర్పడింది .  స్థేశభాసపిసకసో వరచ్ అనే సూత్రం చేత  స్థావర: , ఈశ్వర:, భాస్వర: , పిస్వర: , కస్వర: అనే రూపాలు ఏర్పడతాయి.       

7.      ప్రశ్న :- కో వర్ధతే ?

 ఎవడు నిత్యం వృద్ధి పొందుతూ ఉంటాడు ?

సమాధానం :- వినీత:

వినయం గలవాడు నిత్యం వృద్ధి పొందుతూనే ఉంటాడు. వినయమే  అభివృద్ధికి కారణం.

8.      ప్రశ్న :- కో వా హీయతే ?

            ఎవడు నశిస్తాడు

సమాధానం :- యో దృప్త:

ఎవడు గర్వంతో విఱ్ఱ వీగుతాడో, వాడు తప్పక నశిస్తాడు.

9.      ప్రశ్న :- కో న ప్రత్యేతవ్య: ?

ఎవరిని నమ్మకూడదు ?

సమాధానం :- బ్రూతే యశ్చ అనృతం శశ్వత్

ఎవడు నిరంతరం అసత్యాలు చెపుతాడో అటువంటి వానిని నమ్మకూడదు.

10. ప్రశ్న :- కుత్ర అనృతేsపి అపాపం?

ఏ సందర్భంలో అబద్ధం చెప్పినప్పటికి  ఎటువంటి పాపం అంటదు.

సమాధానం :- యచ్చోక్తం ధర్మ రక్షార్థం.

ఒక్కొక్కప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, నిరపరాధుల్ని రక్షించడం కోసం అసత్యం చెప్పినా పాపం అంటదు.   

11. ప్రశ్న :- కో ధర్మ:?

               ఏది ధర్మము?     

సమాధానం :- అభిమతో య: శిష్టానాం నిజకులీనానాం .

మంచి వారికి, గౌరవప్రదమైన వంశంలో జన్మించిన వారికి ఏది సమ్మతమో అదే ధర్మం.   

ప్రశ్న :- ప్రశ్న :- సాధుబలం కిం ?

మంచి వారికి ఏది బలము ?

సమాధానం :- దైవం

మంచి వారికి దైవమే  బలము.

121    ప్రశ్న :- క: సాధు:?

ఎవడు సాధువు / సజ్జనుడు ?

సమాధానం :-సర్వదా తుష్ట:   

ఎవడు, ఎల్లప్పుడూ సంతృప్తితో ఉంటాడో అతడే సాధువు / సజ్జనుడు.


122.     దైవం కిం ?

ఏది దైవం ?

సమాధానం :- యత్సుకృతం

మనం చేసిన మంచి పని యేదైతే ఉంటుందో అదే  దైవం.

ఈ ప్రపంచంలో చాల మతాలున్నాయి . అన్ని మతాలూ దైవాన్ని నమ్మవు. భారతదేశంలోనే పుట్టిన చాల మతాలు దైవాన్ని నమ్మవు. కాని దైవాన్ని నమ్మని దేశ, విదేశీయ మతాలు కూడ కర్మను నమ్ముతాయి. అందుకే పెద్దలు ‘అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాsశుభమ్’ అన్నారు  కాబట్టి ప్రతి వ్యక్తీ తాను చేసిన పుణ్య, పాపాలకు ఫలితాన్ని తానే అనుభవించి తీరాలి. ఏ దేవుడు రక్షించ లేడు. ఒకసారి తప్పు చేస్తే మరల చెయ్య కుండ కాపాడ గలుగుతాడేమో గాని చేసిన దాన్ని తప్పించ లేడు. ఒక వేళ తప్పు చేసిన వాణ్ణి కూడ రక్షించాలనుకుంటే ఆయన GOD ( Generator Operator  Destroyer) ఎలా అవుతాడు? ఇంకోటేదో ఔతాడు . ఇక మన సనాతన ధర్మంలో దైవ భీతికి చోటు లేదు. అధర్మ భీతికే చోటు ఉంది .  మనం తప్పు చేయడానికి భయపడాలి . దేవునికి కాదు. ఈ దైవ భీతి మనకు ఇతర సంస్కృతుల నుండి సంక్రమించిన దౌర్భాగ్యం . ప్రతి వ్యక్తి తప్పు చెయ్యడానికి మాత్రమే భయపడాలి. ఇక దేనికీ భయపడ కూడదు.  ఒకాయన అన్నాడు. మనం రహస్యంగా చేసిన పనులు దేవునికి ఎలా తెలుస్తాయండి! అని.  నేనన్నాను మనిషి తయారు చేసిన ఒక  చిన్న electronic device   ప్రతి కదలికను గమనిస్తున్నప్పుడు భగవంతుని ఏర్పాటు ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహించ గలమా! అని . ఇక బ్రహ్మసూత్ర వ్యాఖ్యానకర్త శ్రీ వాచస్పతి మిశ్రుల వారు  ఒక సందర్భంలో అంటారు.   మనకు మానవ శరీర నిర్మాణ రహస్యాలే తెలియవు, ఇక సృష్టి రహస్యాలు ఏమి తెలుస్తాయి అని.        

123.     ప్రశ్న :- కా సుకృతి: ?

ఏది మంచి పని  ?

సమాధానం :- శ్లాఘ్యతే చ యా సద్భి:

ఏది  మంచి వారి చేత కొనియాడ బడుతుందో అదే మంచి పని .

124.     ప్రశ్న :- గృహమేధినశ్చ మిత్రం కిం?

ఎవరు గృహస్థునకు మంచి మిత్రుడు ?

సమాధానం :- భార్యయే గృహస్థునకు మంచి మిత్రుడు

125.     ప్రశ్న :- కో గృహీ చ ?

ఎవడు గృహస్థుడు?

సమాధానం :- యో యజతే

ఎవడు, యజ్ఞం మొదలైన క్రియా కలాపాలు నిర్వహిస్తాడో అతడే గృహస్థుడు.

126.     ప్రశ్న :- కో యజ్ఞ: ?

ఏది యజ్ఞము ?

సమాధానం :-య: శ్రుత్యా విహిత: శ్రేయస్కరో నృణాం

ఏదైతే వేదముచే విధింపబడి, సమస్త మానవ లోకానికి మేలు చేకూరుస్తుందో  అదే యజ్ఞం.  

<><><>

No comments: