Wednesday, March 1, 2023

13. సాంఖ్య-యోగదర్శనాలలో అద్వైతభావాలు

 

13. సాంఖ్య-యోగదర్శనాలలో అద్వైతభావాలు

(s.సుబ్రహ్మణ్యశాస్త్రి)

అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు  

సాంఖ్యదర్శన ప్రవర్తకుడు కపిలమహర్షి. ఈశ్వర కృష్ణుడు రచించిన సాంఖ్యకారికలు సాంఖ్య దర్శనానికి అతి ప్రాచీన గ్రంథంగా పేరు     పొందింది. సాంఖ్యసిద్ధాంత ప్రతిపాదితుడైన ఆత్మరూపమైన పురుషుడు  నిత్య ముక్తుడని ,ఎటువంటి బంధాలు లేనివాడని , స్వతంత్రుడని  చెప్పడంలో  అద్వైత సిద్ధాంత భావాలు కనిపిస్తున్నాయి.

శ్రీమద్భాగవతంలోని  కపిలమహర్షి బోధలు  అద్వైత భావాలతోనిండి యున్నాయి.

ఇక యోగ దర్శన ప్రవక్త పతంజలి మహర్షి . యోగ సూత్రాలకు మూలం, పునాది  హిరణ్యగర్భుడయిన బ్రహ్మ . పతంజలిమహర్షి  యోగ సూత్రాలను మనకు అందించారు. వేద వ్యాసుని వంటి మహనీయుడు ఈ సూత్రాలు వ్యాఖ్యానించాడు. మనస్సును నియంత్రించడం ద్వారా  (చిత్త వృత్తి నిరోధం) అద్వైతాత్మ సాక్షాత్కారాన్ని కలిగించడమే యోగ శాస్త్రం యొక్క పరమ ప్రయోజనం. యోగ శాస్త్ర పరమావధి,యోజనం కూడ అద్వైతమే.  వ్యాసంలో ఈ విషయాలు విస్తృతంగా చర్చించడం జరిగింది. 

<*><*><*>

 

 

11. న్యాయశాస్త్రంలో అద్వైతభావాలు

 

11.   న్యాయశాస్త్రంలో అద్వైతభావాలు

(ఆచార్య కింకరులు)

అనువాదం :- డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

న్యాయదర్శనం ప్రవర్తకులు  గౌతమమహర్షి. వాత్స్యాయనుడు ,  భరద్వాజుడు, వాచస్పతి, ఉదయనాచార్యులు మొదలైనవారు  ఎన్నో అమూల్యమైన  గ్రంధాలు రచించి ఈ దర్శనాన్ని పరిపుష్టం చేశారు.  ఇక   కణాదమహర్షి వైశేషిక దర్శన ప్రతిపాదకులు. ఈ వైశేషిక దర్శనాన్ని ప్రశస్తదేవుడు, శ్రీ హరి మొదలైన పండితులు తమ అమూల్యమైన వ్యాఖ్యానాలతో   పరిపుష్టం చేసి బలోపేతంగా తీర్చిదిద్దారు. విషయపరంగా ఈ రెండు దర్శనాలకూ స్వల్పమైన భేదాలున్నప్పటికి తాత్త్వికపరంగా చెప్పుకోదగిన పెద్ద భేదం లేదు . వాద,వివాదాలకోసం  కొన్ని సిద్ధాంతాలు  ద్వైతాన్ని ప్రతిపాదించినా శాస్త్ర తాత్పర్యం మాత్రం అద్వైతం గానే  గోచరిస్తుంది . గౌతమ మహర్షి  “తత్త్వ జ్ఞానాన్నిశ్రేయసాధిగమ:” అని ప్రతిజ్ఞ చేసి “దు:ఖ జన్మ ప్రవృత్తిదోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాదపవర్గ:” అని రెండో సూత్రంలో సంసారం  మిథ్యాజ్ఞాన మూలకమని సాంసారికదు:ఖం  మిథ్యాజ్ఞాననివృత్తి వలన సాధ్యమని చెప్పడం అద్వైత సిద్ధాంతభావాలతో సామ్యం కలిగి ఉంది.

 ఉదయనాచార్యులవారు ‘ఆత్మతత్వవివేకం’లో జ్ఞానానికి జ్ఞానప్రతిపాదితమైన వస్తువునకు మధ్య ఎటువంటి భేదం లేదని పేర్కొన్నారు. ఈ నియమం  బ్రహ్మసాక్షాత్కార విషయంలో కూడ వర్తిస్తుంది .

ఉదయనాచార్యులవారు తమకిరణావళిలో ” మోక్షం లభించిన తరువాత అజ్ఞానం నశిస్తే ఆత్మ ఒక్కటే నిలిచి ఉంటుంది అనే మాట వేదాంత సమ్మతమే అయితే గనుక వారితో మాకు ఎటువంటి వివాదం లేదన్నారు.

                      <><><><><>

10. వ్యాకరణ శాస్త్రంలో అద్వైత సిద్ధాంత భావాలు

 

10.    వ్యాకరణ శాస్త్రంలో అద్వైత సిద్ధాంత భావాలు

  కాళి.  రంగాచార్యులు  గారు& మధురా కృష్ణమూర్తి శాస్త్రి గారు

అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దురాప్రసాదరావు

వ్యాకరణశాస్త్రం షడంగాల్లో ఒకటి .  వేదమునకు  శిక్ష , వ్యాకరణం , ఛందస్సు , నిరుక్తం  , జ్యోతిషం , కల్పం అనేవి  మొత్తం ఆఱు అంగాలు. ఈ వ్యాకరణ శాస్త్రం  వేద వాక్యం యొక్క అర్థాన్ని చక్కగా వివరించడం కోసమే ఏర్పడింది .  వ్యాకరణ కర్తలు వేదవాక్యార్థాన్ని వివరించడంతో బాటుగా    శాస్త్ర పరమావధి అద్వైతమే  అని స్పష్టంగా వివరించారు

నందికేశ్వరుడు మహేశ్వర సూత్రాలు వివరిస్తూ అకారమును  సర్వవ్యాపకమైన నిర్గుణ పరబ్రహ్మగాను , ఈశ్వరునిగాను   భావించాడు.  అది చిత్కళ యగు ఇకారముతో కలసి   జగత్తుగా  పరిణమించిందని వివరించాడు . అకారం సర్వవ్యాపకమైన పరమేశ్వరుడు . మాహేశ్వరసూత్రాల్లో మొదటి సూత్రంలోని  మొదటి అక్షరం ‘అ’ ఆఖరి సూత్రంలోని అక్షరం ‘హ’ కలిస్తే అహం ఔతుంది.  అకారం జ్ఞాన స్వరూపం .ఇకారం చిత్కళ. అకారం సర్వ వ్యాపకం . ఇకారం జగత్కారణం . అవి  విష్ణు శివ స్వరూపాలు . దీన్ని బట్టి నిర్గుణ బ్రహ్మ జగత్కారణంగాను ఇ జగత్తుగాను భావించడం చేత  హరిహరులకు మధ్య భేదం లేదని తెలుస్తోంది.  

న్యాయ రక్షామణి లో కొన్ని వాక్యాలు వైయాకరణుల స్ఫోట సిద్దాంతానికి వేదాంత వేద్యమైన  బ్రహ్మకూ ఏటువంటి భేదం లేదని  చెప్పడం ద్వారా వ్యాకరణ శాస్త్రానికి అద్వైత సిద్ధాంతానికి ఎన్నో పోలికలు కనిపిస్తు న్నాయి.

వ్యాకరణ వేత్త లైన హరి, పాణిని  మొదలైన వారి అభిప్రాయం ప్రకారం మాహేశ్వర  సూత్రాలలో   మొదటిదైన వృద్ధిరాదైచ్ సూత్రంలోని వృద్ధి పదం బ్రహ్మ తత్వాన్ని సుచిస్తూ అద్వైత బ్రహ్మ సిద్ధాంతాన్ని బోధిస్తోంది. వార్తికకారుడైన  వరరుచి కాత్యాయనుల వాక్యాలు విశ్లేషిస్తే అద్వైత వేదాంత విషయాలు గోచరిస్తాయి.

 వీరు  కూడ బ్రహ్మమే ప్రపంచానికి కారణభూత మని శివునకు విష్ణువునకు బేధం లేదని పేర్కొన్నారు.

అకారము జ్ఞానమని ఇకారము చిత్కళ రెండూ విష్ణు శివస్వరూపములని అభిప్రాయపడ్డాడు

మహాభాష్య కారుడు పతంజలి అద్వైత సిద్దాంతం , మా౦ డూక్యోపనిషత్తులోని వాక్యాల పట్ల తన ఆదరగౌరవాలను వ్యక్తం చేశారు.  

స్ఫోట  వాదాన్ని వివరించిన న్యాయరక్షామణి  స్ఫోటసిద్దాంతానికి,  బ్రహ్మవాదానికి ఎటువంటి భేదం  లేదని కేవలం నామమాత్ర భేదమేనని అభిప్రాయపడింది

సర్వదర్శన సంగ్రహ కర్త  విద్యారణ్యుడు వ్యాకరణశాస్త్రాన్ని పాణిని దర్శనంగా పేర్కొనడం వ్యాకరణ శాస్త్రానికి  అద్వైత సిద్ధాంతానికిగల ఏకత్వాన్ని  తెలియజేస్తోంది.

<><><><><> 

 

 

 

9. భగవద్గీతలో అద్వైతభావాలు

 

9.  భగవద్గీతలో అద్వైతభావాలు

శ్రీ మండలీక వేoకటేశ్వరశాస్త్రి గారు

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

శ్రీమద్భగవద్గీత యొక్క ప్రాముఖ్యమేమిటంటే అది స్వయంగా శ్రీ కృష్ణ భగవానుని నోటి నుండి వెలువడింది. ఇక గీతాశాస్త్ర విషయంలో పండితకంలో  ఎన్నో పరస్పర భిన్నాభిప్రా యాలున్నాయి. కొంతమంది ఆచార్యులు జ్ఞాన పారమ్యాన్ని, మరి కొంతమంది భక్తిపారమ్యాన్ని ఇంకా కొంతమంది కర్మపారమ్యాన్ని  సమర్ధించారు. ఇంతకీ ఆ భగవద్గీత మనకు ఏమి బోధిస్తోంది?

వాస్తవానికి మోహపరవశుడైన అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మ  ఎదుట ఎన్నో సందేహాల్ని,  సమస్యల్ని వెలిబుచ్చాడు. శ్రీకృష్ణుడు వాటికి సరైనా సమాధానాలు  ఇవ్వడం జరిగింది. భగవానుని  సృష్టిలో మానవుడు ఒక అంశ. మమైవాsoశో జీవలోక జీవభూత: సనాతన: అని గీతావాక్యం .   ఇక మానవునికి కావలసిన అవసరాలన్నీ అందించగలిగే గొప్ప గ్రంథం భగవద్గీత. “నత్వేవాహం జాతునాసం”

“మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ”మొదలైన మాటల్లో జీవాత్మ యొక్క సత్యత్వాన్ని ఇంద్రియాలు , భౌతిక వస్తువుల యొక్క అశాశ్వతత్వాన్ని వివరించాడు.  

నాsసతో విద్యతే భావ: నాsభావో విద్యతే సత:”  మొదలైన శ్లోకాల్లో మిథ్యాజ్ఞానం వల్లకలిగే అనర్థం వర్ణించబడింది. ఈ విధంగా ఆత్మాsనాత్మల స్వభావాన్ని విశ్లేషించి “అవినాశి తు  త్వం విద్ధి” అనే వాక్యాలద్వారా జీవాత్మ యొక్క శాశ్వతత్వం ప్రతిపాదించడమైనది .  భగవానుడు ఈ విధంగా జీవాత్మ, పరమాత్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించారు. అంతేగాక  అధిష్ఠానజ్ఞానం కలుగగానే ఆరో పితం  అసత్యమని తెలుస్తుందనే  సత్యం ఈ మాటల్లో వ్యక్తమౌతోoది. ఏడవ అధ్యాయంలో “జ్ఞానం తేsహం సవిజ్ఞానం” మొదలైన శ్లోకాల ద్వారా ప్రపంచానికి ఆధారభూతమైన ఆత్మ సర్వవ్యాపి అని “ఇదం శరీరం కౌంతేయ” మొదలైన వాక్యాల్లో దృక్- దృశ్య వివేకం ప్రతిపాదించి అన్ని శరీరాల్లో ఉండే ఆత్మ ఒక్కటేనని , ఉపాధిభేదం వల్ల అది భిన్నంగా కనిపిస్తోందని, ఆన్ని క్షేత్రాల్లో ఉండే  ఆ క్షేత్రజ్ఞుడు తాను మాత్రమే అని  సహేతుకంగా వివరించడం విశేషం . జ్ఞానాజ్ఞానాల తారత్మాన్ని విశ్లేషిస్తూ  జ్ఞానం, అజ్ఞానాన్ని నిర్మూ లిస్తుందని, అసలు అజ్ఞాననివృత్తియే జ్ఞానమని అది   ఆత్మసాక్షాత్కారరూపమేనని , ఆత్మసాక్షాత్కారం కలిగినవాడు  జీవన్ముక్తుడే అని తెలియజేస్తుంది.

ఇక అద్వైతసిద్ధాంతముఖ్యలక్షణమైన , జ్ఞానం వల్ల  ముక్తి కలుగడమని ,  అది బ్రహ్మావగతి రూపమని ఎంతోమంది జ్ఞాన తపస్సుతో తనను  చేరుకున్నారని వివరించాడు. ఈ వ్యాసంలో మరెన్నో విషయాలు పొందు పరచబడ్డాయి వాటిని వ్యాసవిస్తరభీతితో వదలడమైనది.

<><><><> 

 

 

 

8. ధర్మసుత్రాల్లో అద్వైత భావాలు

 

8. ధర్మసుత్రాల్లో అద్వైత భావాలు

{మహామహోపాధ్యాయ చిన్నస్వామి శాస్త్రిగారు}

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 ఆపస్తంబుడు తన ధర్మ  సూత్రాల్లో “ఆత్మ లాభాన్న పరం విద్యతే కించిత్”  అనే సూత్రం ద్వారా  ఆత్మలాభం కంటే  ఉన్నతమైనటువంటి లాభం మరేదీ లేదని పేర్కొన్నాడు . ఆత్మ నిత్యం కాబట్టి ఆత్మలాభం పొందడానికి   అజ్ఞానాన్ని  తొలగించుకోవడమే  మార్గం . హరదత్తాచార్యులవారు ఈ విషయంలో ఒక కథను దృష్టాంతంగా ప్రస్తావించారు. ఒక రాజకుమారుడు కొంతమంది ఆటవికులచే  పెంచబడి, పెరిగి  పెద్దవాడయ్యాడు. తనను ఆటవికునిగానే  భావించు కుంటున్నాడు .

ఎప్పుడైతే ఒక వ్యక్తి  ద్వారా తాను ఆటవికుడను కానని రాజకుమారుడనని  తెలుసుకుంటాడో అప్పుడు అతని లో ఉండే భ్రాంతి తొలగిపోతుంది  ఈ కథను శ్రీ భగవత్పాదులు కూడ బృహదారణ్యక ఉపనిషత్తులో  ప్రస్తావించడం మనం  గమనిస్తాం.

 

 

ఓమితి బ్రహ్మ బ్రహ్మవా ఏష జ్యోతి :

య ఏష తపతి ఏష వేదో య ఏష తపతి వేద్యమేవైతత్

య ఏష తపతి ఏవమేవైష ఆత్మానం తర్పయతి

ఆత్మనే నమస్కరోతి ఆత్మా బ్రహ్మ ఆత్మా జ్యోతి:

ఓం అనే అక్షరం బ్రహ్మ అది జ్యోతి స్వరూపం . ఆ జ్యోతిని ప్రకాశంపచేసేది వేదం. ప్రకాశం కలుగ జేసేవాడు వేద్యుడు. ఆత్మ (తనకే) ఆత్మకే నమస్కరిస్తుంది. ఆత్మయే  బ్రహ్మ  ఆత్మయే జ్యోతి. (బోధాయన సూత్రం) అన్నము బ్రహ్మ ఆ అన్నాన్ని సమర్పించేవాడు భుజించేవాడు   కూడ బ్రహ్మమే మొదలైన భావాలు  జీవ,బ్రహ్మల ఏకత్వాన్ని  ప్రతిపాదిస్తున్నాయి

 

><(*)<*>{*}<>