Wednesday, March 1, 2023

11. న్యాయశాస్త్రంలో అద్వైతభావాలు

 

11.   న్యాయశాస్త్రంలో అద్వైతభావాలు

(ఆచార్య కింకరులు)

అనువాదం :- డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

న్యాయదర్శనం ప్రవర్తకులు  గౌతమమహర్షి. వాత్స్యాయనుడు ,  భరద్వాజుడు, వాచస్పతి, ఉదయనాచార్యులు మొదలైనవారు  ఎన్నో అమూల్యమైన  గ్రంధాలు రచించి ఈ దర్శనాన్ని పరిపుష్టం చేశారు.  ఇక   కణాదమహర్షి వైశేషిక దర్శన ప్రతిపాదకులు. ఈ వైశేషిక దర్శనాన్ని ప్రశస్తదేవుడు, శ్రీ హరి మొదలైన పండితులు తమ అమూల్యమైన వ్యాఖ్యానాలతో   పరిపుష్టం చేసి బలోపేతంగా తీర్చిదిద్దారు. విషయపరంగా ఈ రెండు దర్శనాలకూ స్వల్పమైన భేదాలున్నప్పటికి తాత్త్వికపరంగా చెప్పుకోదగిన పెద్ద భేదం లేదు . వాద,వివాదాలకోసం  కొన్ని సిద్ధాంతాలు  ద్వైతాన్ని ప్రతిపాదించినా శాస్త్ర తాత్పర్యం మాత్రం అద్వైతం గానే  గోచరిస్తుంది . గౌతమ మహర్షి  “తత్త్వ జ్ఞానాన్నిశ్రేయసాధిగమ:” అని ప్రతిజ్ఞ చేసి “దు:ఖ జన్మ ప్రవృత్తిదోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాదపవర్గ:” అని రెండో సూత్రంలో సంసారం  మిథ్యాజ్ఞాన మూలకమని సాంసారికదు:ఖం  మిథ్యాజ్ఞాననివృత్తి వలన సాధ్యమని చెప్పడం అద్వైత సిద్ధాంతభావాలతో సామ్యం కలిగి ఉంది.

 ఉదయనాచార్యులవారు ‘ఆత్మతత్వవివేకం’లో జ్ఞానానికి జ్ఞానప్రతిపాదితమైన వస్తువునకు మధ్య ఎటువంటి భేదం లేదని పేర్కొన్నారు. ఈ నియమం  బ్రహ్మసాక్షాత్కార విషయంలో కూడ వర్తిస్తుంది .

ఉదయనాచార్యులవారు తమకిరణావళిలో ” మోక్షం లభించిన తరువాత అజ్ఞానం నశిస్తే ఆత్మ ఒక్కటే నిలిచి ఉంటుంది అనే మాట వేదాంత సమ్మతమే అయితే గనుక వారితో మాకు ఎటువంటి వివాదం లేదన్నారు.

                      <><><><><>

No comments: