7. మన్వాది స్మృతులలో అద్వైతవిషయాలు.
(పోలకం శ్రీ సుందరశాస్త్రి వర్యులు)
అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
ధర్మం మోక్షప్రాప్తికి ప్రధానసాధనం
కాబట్టి స్మృతులు ఆత్మజ్ఞానానికి
సంబంధించిన ఎన్నో విషయాలు ప్రాస్తావికంగా వివరించాయి. ఆత్మస్వరూప సాక్షాత్కారమే
అన్ని ధర్మాలలో ప్రధానమైనదని పేర్కొన్నాయి.
మనుస్మృతి యొక్క ఉపక్రమ - ఉపసంహారాలు
ఆత్మజ్ఞానమే అత్యున్నతమైన మోక్షసాధననమని వివరించాయి.
యోగమార్గం ద్వారా ఆత్మను తెలు తెలుసుకోవడమనేది అన్ని ధర్మాల్లో కెల్ల ఉత్తమ ధర్మమని మనుస్మృతి
పేర్కొంది. (1-8)
‘ నేను అన్ని జీవులలోను ఆత్మరూపంగా ఉన్నాను, అన్ని జీవులు ఆత్మరూపంగా నాలో ఉన్నాయి అని అంతట ఏకత్వాన్ని
దర్శించడం వల్ల భక్తుడు ఆత్మ(బ్రహ్మ) సాక్షాత్కారాన్ని పొందగలడని తెలిపింది. అదియే స్వారాజ్య సిద్ధి అని వివరించింది. ఆత్మ
స్వయం ప్రకాశకం కావడం వల్ల (స్వయం రాజతే ఇతి స్వరాట్ ) ఆత్మలాభమే స్వారాజ్యసిద్ధి.
జడం తనను తాను తెలుసుకోలేదు, ఇతర పదార్థాలను తెలుసుకోలేదు. మనస్సు ఇతరవస్తువుల్ని
తెలుసుకుంటుoదిగాని
తనను తాను తెలుసుకోలేదు. ఇక ఆత్మ
విషయానికొస్తే అది అన్నిటినీ తెలుసుకుంటుంది తనను కూడ
తాను తెలుసుకుంటుంది. అందుకే “ఆత్మన్యేవాత్మానం పశ్యేత్” అన్నారు. అందుకే
ఆత్మదర్శనాన్ని స్వారాజ్యసిద్ధి అని కూడ పిలుస్తారు. ధర్మశాస్త్రాలు ధర్మాన్ని నిర్వచిస్తూ పది
లక్షణాలు చెప్పాయి. అందులో ‘విద్య’ అనే పదం ఉంది. ఆ పదానికి ధర్మశాస్త్ర వ్యాఖ్యాత
కుల్లూకుడు ఆత్మజ్ఞానమని నిర్వ చించాడు. మనువు, బ్రహ్మ ఈ జగత్తుకు కర్త కాబట్టి
ఆత్మజ్ఞానమే అన్ని ధర్మాల కంటే ప్రధానమైన దన్నారు. బ్రాహ్మణుడు ధర్మాచరణ ద్వారా ఆత్మజ్ఞానరూపమైన
మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి విప్రుని ధర్మానికి అవతారంగాను , ప్రతిరూపంగాను
వర్ణించాడు.
అద్వైత సిద్దాంతంలో ప్రధానసూత్రమైన
మోక్షప్రాప్తికి ధర్మమే ప్రధాన సాధనమని, వేదాధ్యయనం , తపస్సు, జ్ఞానం, ఇంద్రియ
నిగ్రహం , అహింస , గురుసేవ మొదలైనవి మోక్షానికి సాక్షాతత్సాధనాలుగా చెప్పడం విశేషం
(12-83, 12-85)
కర్మ నివృత్తిద్వారా
పంచభుతాలను అతిక్రమించవచ్చుననే మాటలు అద్వైత
సిద్ధాంతాన్నే సమర్ధించేవిగా కనిపిస్తున్నాయి .
యాజ్ఞవల్క్యస్మృతికి
వ్యాఖ్యానమైన ‘మితాక్షరి’లోని ప్రాయశ్చిత్తకాండ ప్రారంభంలో ముందుగా జీవేశ్వరాభేదవాదం కనిపిస్తోంది(1/34).
యతిధర్మ ప్రకరణంలో (1౦8-110)
ఆత్మజ్ఞానమే పునర్జన్మనివృత్తికి
కారణమని చెప్పబడింది..
ఆత్మజ్ఞానాన్ని చెప్పడం
కోసం స్వీకరించిన ఘటాకాశ, ప్రతిబింబవాదాలన్నీ అద్వైత
తత్వాన్నే సమర్ధిస్తున్నాయి.
గ్రంథసమాప్తిలో ‘ నేను ఆత్మ ఆత్మను ఎలా సృష్టిస్తోంది? ఆత్మకు త్రిగుణాలతో ఎలా సంబంధం ఏర్పడుతుంది? ఆత్మశరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది?
జీవునిగా ఎలా అవతరిస్తుంది? సంసారమనే చక్రంలో ఎలా
పరిభ్రమిస్తుంది? అనే విషయాలు వివరించాను. దీన్ని బట్టి జీవుడు ఈశ్వరుడు
ఒకరేనని తెలుస్తోంది. కాబట్టి ఈ శాస్త్రం యొక్క సారాంశం ఈశ్వరుడు జీవుడు ఒకటేనని
బోధించడమే అని వివరిస్తుంది.
విష్ణుసంహితలో
(అధ్యాయం -96) విష్ణువు భూదేవితో ఈ శరీరం క్షేత్రమని అది తెలుసుకున్న వాడు క్షేత్రజ్ఞుడని
చెపుతూ ఓ దేవీ ! నన్ను అన్ని
క్షేత్రాలలోను నెలకొన్న క్షేత్రజ్ఞునిగా తెలుసుకో అంటాడు.
క్షేత్ర -
క్షేత్ర జ్ఞానమే మోక్షమార్గానికి ప్రధాన సాధనమని వివరించాడు. నిర్గుణోపాసన గురించి
వివరిస్తూ నిర్గుణోపాసన చేయలేని వారికి సగుణోపాసన
శ్రేయస్కరమని వివరించింది. జ్ఞానమే మోక్షసాధనమని నిర్ధారణ చేసింది .
నిర్గుణోపాసన
గురిం చి వివరిస్తూ సగుణోపాసన అనేది నిర్గుణోపాసన చేయలేని వారికి విధింపబడినదని వివరిస్తుంది.
గ్రంథ పరిసమాప్తిలో జ్ఞానం బ్రహ్మ సాక్షాత్కారానికి
సాధనమని చెప్పడం ద్వారా అద్వైత సిద్ధాంతభావాలను వేలువరించి నట్లుగా తెలుస్తోంది.
దక్ష స్మృతి ‘ఎవడు సమస్తాన్ని మనకంటే అభిన్నంగా చూస్తాడో వాడే బ్రహ్మజ్ఞాని’ అని చెపుతోంది.
మనస్సును
కర్మబంధనాలనుండి విముక్తి చెయ్యడం, క్షేత్రజ్ఞుని పరమాత్మగాభావించడం ఉత్తమమైన
యోగసాధన అని వివరించింది. మనసును సమస్తకర్మబంధములనుండి తప్పించి క్షేత్రజ్ఞునివైపునకు మరల్చడమే ఉత్తమమైన
యోగసాధనగా పేర్కొంది. ఈ విధంగా దక్షస్మృతి ధర్మాన్ని నిర్వచించడంలో అద్వైత భావాలనే
సమర్ధించిందని చెప్పవచ్చు .
శంఖసంహిత కూడ
ఇరువది ఐదవ తత్వమైన పురుషుడు లేదా ప్రత్యగాత్మ (జీవాత్మ ) పరమాత్మకంటే భిన్నుడు
కాడనే జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుందని వెల్లడించింది.
<*><*><*><*><*>
No comments:
Post a Comment