Monday, May 31, 2021

హృద్యం-తెనుగు పద్యం -5

 

హృద్యం-తెనుగు పద్యం -5

(అమ్మా -నాన్న  నీకప్పగి౦చారు నీదే బాధ్యత)

                                      డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

గత శతాబ్దానికి చెందిన తెనుగు శతక కవులలో  శ్రీ   శరభేo ద్రకవి ఒకరు.  ఆయన శ్రీ కాలళహస్తి శతకాన్ని రచించారు. ఆయన బాణాలస వంశానికి  చెందిన వారు. విశ్వకర్మకుల భూషణుడు . తండ్రి పేరు భద్రయ. ఇందులో 107 పద్యాలున్నాయి. అన్నీ చంపకోత్పలాలే. ఎక్కువ పద్యాలు ఐదు పాదాలతో కూడి ఉన్నాయి.

ఈ శతకాన్ని యస్ .వి. గోపాల్ అండ్ కో.. ఆనంద భారతీ ముద్రాక్షరశాల ( మద్రాసు) లో  1950 లో ముద్రించారు .  ఎన్నో శివపురాణ కథలు ఇందులో మనకు కనిపిస్తాయి.  ఈ శతకం  ఆయన  ప్రతిభకు ఒక దర్పణoగా నిలుస్తోంది . ముందుగా పద్యం . ఈ శతకంలో కొన్ని ముద్రణ దొషాలు కూడ కనిపిస్తున్నాయి.

తత్తర నన్ను గన్న తలిదండ్రులె యెత్తుక ముద్దులాడి నీ

పొత్తున డించి యీశ్వరుడు పోషణ చేయునటంచు గట్టిగా

దత్తము చేసినారు గురుదైవము నిద్దరు నాకు నీవె సా

క్షాత్తు నిజస్వరూపమును గన్నుల జూపుము కాoక్ష దీర సం

రక్షక ! కాళహస్తిబుధరంజిత సాంబశివా!  మహా ప్రభో   !      

 ఓ సాంబశివా ! స్వయంగా నన్ను కన్న నా తలిదండ్రులే  నువ్వే నన్ను రక్షించి , పోషించాలని నన్ను నీకు దత్తత చేసి వెళ్లి పోయారు. అప్పటినుంచి గురువు , దైవo  ఆ రెండు నాకు నువ్వే   కాబట్టి నీ యథార్థ స్వరూపాన్ని సాక్షాత్తుగా  నాకు చూపించు. దైవం , గురువు వీరిద్దరిలో దైవంకన్న గురువు మిన్న అన్నారు పెద్దలు . ఎ౦దుకంటే దైవం గురువును చూపించలేక పోవచ్చు గాని గురువు దైవాన్ని చూపించగలడు. నాకు గురువు దైవం ఈ రెండు నువ్వే కాబట్టి నీ దర్శనం నాకు ప్రసాదించమని ఆవేదనతో చెప్పిన ఈ పద్యం చాల హృదయం గమం .

ఇటువంటి మహాకవుల  భావనల ను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .    

 

Friday, May 28, 2021

హృద్యం-తెనుగు పద్యం -4 (ఒకరికి కుడుములు మరొకరికి ఇడుములు)


  

హృద్యం-తెనుగు పద్యం -4

(ఒకరికి కుడుములు మరొకరికి ఇడుములు)


డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

గత శతాబ్దానికి చెందిన తెనుగు కవులలో  శ్రీ మాధవపెద్ది బుచ్చి సు౦దరరామశాస్త్రి గారొకరు . ఆయన  గొప్ప శివభక్తులు . ఆయన తమ జీవితమంతా కటిక పేదరికంతోను , కష్టాలతోను  గడిపి ఉంటారని ఈ శతకం లోని కొన్ని పద్యాల వల్ల  మనకు తెలుస్తోంది. శివుణ్ణి ఎంత చమత్కారంగా దెప్పి పొడుస్తున్నారో గమనిస్తే కవి గారి ఆవేదన పాఠకుల మనస్సులో మెదిలి గుండె కరిగి నీరై పోతుంది . భక్తీ , ఆవేదన , ఈసడింపు, ఆశాభావం , నిరాశ,  వెక్కిరి౦పులతో కూడిన  ఈ శతకం  ఆయన  ప్రతిభకు ఒక దర్పణoగా నిలుస్తోంది . ముందుగా పద్యం .

 

ఒక లంబోదరుడైన పుత్రకుడు మున్నున్నట్టిదే నీకు చా

లకకాబోలును సృష్టి చేసితివి ఈ లంబోదరుo గూడ తీ

గకు కాయల్  బరువౌన కానీ , కుడుముల్ కల్పించి యవ్వానికే

లొకొ  యివ్వానికి నొక్క మైని యిడుముల్  మోల్పిo తు మృత్జయా !

ఓ శివా నీకు ఒక లంబోదరుడైన పుత్రుడు( వినాయకుడు ) న్నాడు  చాలడా . మరలా మరొక లంబోదరుణ్ణి (నన్ను) సృష్టించావు .  తీగకు కాయలు బరువుకాదు  . నువ్వు ఆయనకు కుడుములు కల్పిమ్చావు నాకు మాత్రం  యిడుములు (కష్టాలు ) మొలిపిస్తున్నావు . ఇదెక్కడి న్యాయం . నువ్వే చెప్పు అన్నాడు .

ఇటువంటి చమత్కారాలని మనం నేటి తరానికి వివరించాలి .  

ఇటువంటి మహాకవుల  భావనల ను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .       

 

Thursday, May 27, 2021

హృద్యం-తెనుగుపద్యం -3 (నరుడే నారాయణుడు)

 

హృద్యం-తెనుగుపద్యం -3

(నరుడే నారాయణుడు)


డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

గత తరానికి చెందిన తెనుగు కవులలో శ్రీ గుర్రం జాషువ గారొకరు. కరుణ రసాన్ని  ఆలంబనగా చేసుకొని తన  కవితా శక్తిని లోకకళ్యాణానికి వెచ్చించి కృతకృత్యుడైన మహాను భావుడాయన.

సాటి మనిషిని మనిషిగా చూడలేని ఈ సాంఘిక వ్యవస్థను, మత దురాచారాలను ఆయన విశేషంగా దుయ్యబట్టారు. “నరుని కష్ట పెట్టి నారాయణుభజించు ధర్మ శీలురున్న ధరణి మనది”  అని ఆక్రోశించారు .

దేవుని పేరుతో, భక్తి ముసుగులో మానవత్వం  మంటగలిసి పోవడం ఆయన  సహిoచలేకపోయారు. నిజమే! మానవత్వం మనిషితో పాటు పుట్టింది . మతం మనిషి పుట్టిన కొన్ని లక్షల సంవత్సరాల తరువాత పుట్టింది . ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే రీతిలో  మతం మానవత్వాన్నే మఱచిపోయేలా చేస్తోంది . ఇక జాషువ గారిలో ఒక ప్రత్యేకత ఉంది. .  తప్పు ఎవరు చేసినా నిందించారు. మంచి ఎక్కడున్నా మెచ్చు కున్నారు.

ఇక ప్రస్తుత విషయానికొద్దాం . మానవత్వాన్ని కాలరాచే మత మౌఢ్యాన్ని ఎంత తీవ్రంగా ఖండిం చారో చూద్దాం .  ముందుగా పద్యం .

 

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయి౦ త్రు గాని దు:

ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్

మెదుకువిదల్పదీ భరతమేదిని ముప్పది మూడు కోట్ల దే

 వతలెగ బడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే !

( గబ్బిలం - శ్రీ గుర్రం జాషువ)


ఈ జనం విగ్రహాలపెళ్లిళ్లకు, ఊరేగిo పులకు  వేలాది,  లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు గాని ఆకలితో అలమటిస్తున్న పేదల , ఫకీరుల శూన్యమైన భిక్షాపాత్రల్లో ఒక్క మెదుకు కూడ విదల్పరు. వీళ్ళ వంతు రావాలంటే ముప్పై మూడుకోట్ల  దేవలల్ని ముందుగా  సంతృప్తి పరచాలి . అది జరిగే పని  కాదని  , వీళ్ళ ఆకలి కూడ త్వరలో తీరేదీ కాదని కవి తన ఆవేదనని వ్యక్తం చేశారు.   

     ఈ పద్యం మత ఛాందసవాదులకు ఒక కను విప్పు కావాలని జాషువ గారు రచించారు. ఇది మతాన్ని విమర్శించడం కాదు, మనిషిని మనిషిగా గుర్తించలేని కొంత మంది వ్యక్తుల పోకడలను నిరసి౦చడమే. ఇటువంటి వారు అన్ని మతాల్లోను ఉంటారు.  వారికి  మానవత్వపు విలువలు తెలియ జేయడానికే  ఈ పద్యం .

ఇటువంటి మహాకవుల భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .        

 

Wednesday, May 26, 2021

 

          హృద్యం-తెనుగు పద్యం -2

   నాణ్యమైన ముక్తికి నాలుగే మార్గాలు

                                                  డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు .

గతతరానికి సంబంధించిన తెలుగు  కవులలో శ్రీచిలకమర్తి . లక్ష్మీనరసింహం పంతులుగారొకరు. వారు కేవలం కవి మాత్రమే కాదు చారిత్రక పరిశోధకులు  , నాటకకర్త  నిష్కళంక దేశభక్తులు , సంఘ సంస్కర్త  , ఆంగ్లేయుల నెదిరించిన తొలి తెలుగు కవి. ఆయన రచించిన గయోపాఖ్యానం ఆనాడే ఒక లక్ష ప్రతులు అమ్ముడయ్యాయంటే ఆయన కవిత్వం ఎంత ప్రజారంజకంగా ఉండేదో మనం ఊ హిoచుకోవచ్చు. ఆయన F.A చదువుతున్నప్పుడు ఆయనకు రెండు కళ్ళు పోయాయి . ఆయనను Andhra Milton అనికూడా కొంత మంది చెపుతారు.

శ్రీ చిలకమర్తి వారి పద్య రచనా సౌ౦ దర్యానికి “ కృపా౦భోనిధి” శతకం  ఒక పరాకాష్థ . ఇది మొట్టమొదటి సారిగా సంఘ సంస్కర్త రాజారామమోహన్ రాయ్ గారి నిర్యాణ శతాబ్ది సందర్భంగా 1933 లో తెలుగువారికి లభించింది .

  తరువాత ఎన్నో ఏళ్ళకు శ్రీయుతులు Y.S.నరసింహా రావు , Dy.E.o. s. సుబ్బరాజు, ప్రముఖ సాహితీ విమర్శకులు    అక్కిరాజు రామాపతిరావుగార్ల ప్రోత్సాహంతో శ్రీ యుతులు గంధం సుబ్రహ్మణ్యం , పురాణపండ శ్రీనివాసు గార్ల  సహకారంతో శ్రీ పెరుమాళ్ళ రఘునాథ్ గారు ఈ గ్రంథాన్ని మనకందించారు .

ఒక పద్యాన్ని పరిశీలిద్దాం .

వేదంబుల్ తలక్రిందుగా ( జదువనీ, విప్రాళికిన్ భక్తి గో

భూదానంబులు లొసంగనీ ,    బహు మఖంబుల్ సేయనీ  నిష్ఠమై

రాదమ్మోక్షము సత్ప్రవర్తనము , నైర్మల్యంబు , శాంతంబు నీ

పాదధ్యానము లేని వారలకు దేవా! శ్రీ కృపాoభోనిధీ |   

  

వేదాలు తలక్రిందుగా చదివినా మోక్షం లభించదు. బ్రాహ్మణులకు , భూదానం , గోదానం లాంటి ఎన్ని దానాలు చేసినా ముక్తి కలుగదు . ఎంతో నిష్ఠతో యజ్ఞాలు, యాగాలు చేసినా ముక్తి కలుగదు  .  సత్ప్రవర్తన, నిర్మలమైన మనస్సు , శాంతం , భగవంతుని పాదధ్యానం ఈ నాలుగే మార్గాలు .

ఈ నాలుగు అలవరచుకుo టే దాన ధర్మాలు , క్రతువులు చేయవలసిన పని లేదు , ఈ నాలుగు అలవడక పొతే దానధర్మాలవల , యజ్ఞాలవల్ల వీసమైనా ప్రయోజనం లేదు .

ఈ పద్యం నిజమైన ఆధ్యాత్మిక విలువలు గలది. నేటి మతమౌఢ్యానికి ఈ పద్యం ఒక ఔషధం. ఈ పద్యంలో ఉన్న అంశాలను ఆచరించి ప్రచారం చెయ్యాలి.     

ఇటువంటి మహాకవుల భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే  ఈతరం  రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  . 

 

Tuesday, May 25, 2021

హృద్యం-తెనుగు పద్యం -1 బుసబుసలు–గుసగుసలు- రుసరుసలు

 

          హృద్యం-తెనుగు పద్యం -1


బుసబుసలు–గుసగుసలు- రుసరుసలు  

 

గత శతాబ్దానికి చెందిన తెనుగు కవులలో  శ్రీ మాధవపెద్ది బుచ్చి సు౦దరరామశాస్త్రి గారొకరు . ఆయన  గొప్ప శివభక్తులు . కాని ఆయన ఎంత ప్రార్థిoచినా ఆ మహానుభావుడు  పరమశివుడు తన ప్రార్థన వినడం లేదు . ఆయన తన ప్రార్థన శివుడు ఎందుకు వినలేక పోతున్నాడో ఎంత చమత్కారంగా చెప్పారో గమనిస్తే కవి గారి ప్రతిభ వ్యక్త మౌతుంది. ముందుగా పద్యం .

 

మెడ నాగయ్యకు నొక్కటే బుస బుసల్ , మేనన్ సగంబైన యా

బిడతో నీకిక నెప్పుడున్ గుసగుసల్, వీక్షించి మీ చంద మె

క్కడలేనంతగ నెత్తి పై రుసరుసల్ గంగమ్మకున్ నీ చెవి న్

బడుటేలాగునొ  మామొరల్ దెలియ దప్పా! మాకు మృత్యుంజయా  !

                                                       (మృత్యుం జయస్తవం )

   పరమశివా!  నువ్వు మెళ్ళో పాము ధరిoచావు. దానికి వేళాపాళ లేదు. ఎప్పుడు  బుసలు కొడుతూనే ఉంటుంది. ఇక మీ ఆవిడ సంగతి చూద్దాం . ఆవిడ దూరంగా ఉంటే అప్పుడప్పుడు నీకు విశ్రాంతి దొరికేది  . నీ కా అదృష్టం లేదు . ప్రక్కనే ఉంది . అందులోనూ సగం దేహమై ఉంది. ఎపుడు నీతో ఎదో గుసగుసలాడుతూనే ఉంటుంది. నువ్వు ఎదో సమాధానం చెప్పాలికదా! తప్పదు. ఇక గంగాదేవి  సరే సరి. నీభార్య  పార్వతికి  సవతి. నీ నెత్తెక్కి కూర్చున్న మహాపతివ్రత. మీరిద్దరూ నిరంతరం , అందులోనూ తనను పట్టించుకోకుoడా కబుర్లాడుకు౦టుoటే ఎలా సహిస్తుంది, ఎంత వరకు సహిస్తుంది . ఆ విడ పై నుంచి మీమీద రుసరుసలాడిపోతో౦ది .  ఒక ప్రక్క నెడ తెరిపిలేని పాము చేసే    బుసబుసలు, మరో ప్రక్క నిరంతరాయంగా సాగుతున్న మీ భార్యా భర్తల గుసగుసలు , ఇంకో ప్రక్క  అడ్డు అదుపులేని గంగమ్మ తల్లి రుసరుసలు ఇవన్ని ఉంటే నా ప్రార్థన నీకుఎలా వినిపిస్తుoదిలే అని కవి సరిపెట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన భావన !

ఇటువంటి మహాకవుల భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .  

 

Friday, May 21, 2021

పదిలమైన కాపురానికి పన్నెండు సూత్రాలు.

 

పదిలమైన కాపురానికి పన్నెండు సూత్రాలు.

                      శ్రీమతి . చిలకమర్తి లక్ష్మీకుమారి M.A

 

మానవనాగరికతలో వివాహవ్యవస్థ ఒక పెద్ద మలుపు. సమాజంలో వ్యక్తి శాశ్వతం కాదు కాబట్టి, సమాజం శాశ్వతంగా ఉండాలి కాబట్టి సమాజానికి ఉత్తమపౌరులను అందించాలనే  సదుద్దేశంతో ఈ వివాహవ్యవస్థ ఏర్పాటైంది. ఇది సమాజంలో స్త్రీ పురుషులకొక గుర్తింపుని, గౌరవాన్ని ఇస్తుంది. అందుకే నాటి ఆటవికసమాజం మొదలుకొని నేటి ఆధునికసమాజం వరకు ఈ వివాహవ్యవస్థ 

ఎంతో ప్రాధాన్యం పొ౦దిది . కాని ఆధునిక నాగరికత పెరుగుతున్న కొద్దీ ఈ వివాహవ్యవస్థ బలహీనమౌతోoది.  అసలు విలువ, గౌరవం లేకుండా పోతోంది. అందువల్ల దీన్ని బలోపేతం చెయ్యడానికి సదవగాహన ఎంతైనా అవసరం. ఇప్పుడు కొన్ని నియమాలు తెలుసుకుందాం

1. కుటుంబవ్యవస్థ పటిష్ఠ౦గా ఉ౦డాలంటే  భార్యాభర్తల మధ్య ఒక సదవగాహన చాల  అవసరం. స్త్రీ తన కుటుంబ పరివారాన్ని , పుట్టి పెరిగిన పరిసరాల్ని  విడిచిపెట్టి శాశ్వతంగా తన ఇంటికి వస్తోందని  మగవాడు అనుకోవాలి. అలాగే తాను  ఒక గౌరవ ప్రదమైన మరో  ఇంట్లో అడుగు పెడుతున్నానని ఆ ఇంటి గౌరవం, మానమర్యాదలు తాను రక్షించాలని , తన గౌరవం  కూడ దక్కించుకోవాలని  స్త్రీ  అనుకోవాలి.  

2. దాంపత్యం అంటే ఒక సదవగాహన . అవసరమైతే ఒకరు మరొకరికోసం కొన్ని అలవాట్లను , అభిరుచులను వదులు కోవాలి . భర్త కోసం  భార్య,  భార్యకోసం భర్త తమ  వ్యక్తి గత అభిరుచులను కొన్ని వదులుకుని అందరితో  కలిసికట్టుగా ఉండడం నేర్చుకోవాలి. అలాగని తమ వ్యక్తిత్వాన్ని చంపుకొమ్మని కాదు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకు౦టూనే కొన్ని అభిరుచులను త్యాగం చేయాలి .

3. స్త్రీ పురుషులు వారి కుంటుంబ గౌరవాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు. అలాగే ఎదుటి వారి కుటుంబాన్ని ఎన్నడు కి౦చపరచ కూడదు.

4. వధువు అమ్మానాన్నలు గాని, వరుని అమ్మానాన్నలు గాని  దంపతుల వైవాహికజీవితంలో ఎన్నడు జోక్యo  కలగజేసుకోకాడదు. వారిని వారిగా ఉ౦డనివ్వాలి అడిగినప్పుడే  తమకు తోచిన మంచి సలహాలు చెప్పాలి. నేడు కాపురాలు నిట్ట నిలువుగా కుప్ప కూలి పోవాడానికి  కారణం వీరి అనవసర  ప్రమేయమే .       

5. ఇంకో ముఖ్యమైన విషయ మేoటంటే  స్త్రీకి భర్త ఎంత ముఖ్యమో ఆయన కుటుంబ సభ్యులు  కూడ అంతే ముఖ్యం . వారిని భర్తతో సమానంగానే  గౌరవి౦చాలి. అలాగే మగవాడు  కూడ భార్యకిచ్చే గౌరవం   ఆమె పరివారానికి  కూడ  ఇవ్వాలి .

6. స్త్రీపురుషు లిద్దరు సమానమని ఈ ప్రపంచం ఎంత మొత్తుకుంటున్నా శారీరకంగా స్త్రీకి కొన్ని పరిమితులున్నాయి ఉదాహరాణకి ఒక పురుషుడు తన ఆఫీసులో ఇంటి తాళాలు మరిచిపోతే ఆ పూటకి ఇంటి అరుగుమీద పడుక్కుని కాలక్షేపం చెయ్యగలడు. అదే పరిస్థితి స్త్రీకి ఎదురైతే ఆమె అలా చేయలేదు. ఆడదానికి కొన్ని పరిమితులున్నాయి . ఇవి ప్రకృతి విధించిన biological limitations . అందువలన  ఆమె తన  పరిమితులకు లోబడి నడుచుకోవాలి. తగుదునమ్మా అని మగాడిలా ప్రవర్తించకూడదు.

7.                కుటుంబంలో దంపతుల మధ్య దాపరికం ఉండకూడదు . ఏ పనైనా చెప్పిచెయ్యడం,   ఒప్పించి చెయ్యడం, లేదా చేసిన తరువాత చెప్పడం  చాల అవసరం.

8.                దాంపత్యం 63 లా ఉండాలి . మగాడు ఆరైతే స్త్రీ ఆరులో సగం మూడు . భార్య అర్థాంగి  కాబట్టి ఆరులో సగం మూడు లాగానే ఉంటే దాంపత్యం 63 లా హాయినా , ఆనందంగా , ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు. అంతే  గాని ఆడది తగుదునమ్మ అని ముందుకొస్తే దంపతులు  36 లా  ఎడమొహం పెడమొహం  ఔతారు . ఆరు పెద్దది కనుక దాని గౌరవం దానికివ్వాలి  . అంతేగాని నామాటే చెల్లాలని  3 ముందుకొస్తే 36 అవుతుంది. ఇది ప్రమాద కరం.

9.               దంపతులెవరైనా తమకంటే వయస్సులో పెద్ద వారిని లేదా సమానమైన వారిని చిన్నవారిని కూడ ఏనాడు కి౦చపరచకూడదు. విభేది౦చవచ్చు కాని విరోధించకూడదు. ఇతరుల  అభిప్రాయాన్ని అంగీకారింపక పోవచ్చు. అంత మాత్రం చేత మీకే౦ తెలీదు . మీకంటే నేనెక్కువ చదువుకున్నాను అని గర్వంగా మాట్లాడకూడదు . చదువు వేరు అనుభవం వేరు. పది  సంవత్సరాల చదువు లేదా జ్ఞానం  ఐదు సంవత్సరాల్లో  సంపాది౦చొచ్చు. కాని పది  సంవత్సరాల అనుభవానికి పదేళ్ళూ పడుతుంది. అందువల్ల మనకున్న మిడి మిడి జ్ఞానంతో పెద్దల్ని తక్కువ చెయ్యకూడదు.   వారి  అభిప్రాయం తప్పని త్రోసిపుచ్చ కూడదు.       Your opinion is your opinion only. అనే పెద్దల మాటను ఎవరు, ఏనాడూ మర్చిపోకూడదు. సామరస్యంతో అన్ని చర్చించుకోవాలి . మంచి చిన్న వారు చెప్పినా అంగీకరి౦ చాలి చెడు పెద్దవారు చెప్పినా తిరస్క రి౦చాలి. నేడు కొత్త కాపురాలు కూలి పోడానికి కారణం అవగాహన లేకుండా మూర్ఖత్వంతో ప్రవర్తించడమే .

10.         ఒక ఇంటిలో కూతురే మరో ఇంటికొస్తే కోడలౌతు౦ది . అలాగే ఒక ఇంటిలో  కొడుకే మరో ఇంటి అల్లుడౌతాడు . కాబట్టి తన కొడుకుని చూసినట్లు అల్లుణ్ణి; తన కూతుర్ని చూసినట్లు కోడల్ని చూడగలిగితే కుటుంబం స్వర్గ తుల్యం ఔ తుoది. అలాగే ఆడది తన తల్లి ని చూసినట్లు అత్తను , తండ్రిని చూసినట్లు మామను చూస్తే సమస్యలే ఉండవు .

 

11.         భార్యాభర్తలు ఎట్టి  పరిస్థితిలోను మూడవ వ్యక్తి చొరబడకుండా తమ సమస్యలు తామే సామరస్యంతో పరిష్కరించు కోవాలి .  ఇద్దరు పరిష్కరి౦ చుకుంటే ఇంపు,  మూడో వ్యక్తి చొరబడి తే కంపు .

12.         ఆఖరిది అతిముఖ్యమైనది ఒకటుంది. ఈ సృష్టిలో ఎవరి  ప్రత్యేకత వారిదే . అందువల్ల మనల్ని మన స్థితిగతుల్ని  ఎవరితోనూ పోల్చుకోకూడదు . మన ప్రత్యేకత మనది. పోలిక ప్రమాదం .

             మరికొన్ని సూచనలు మరోసారి ....