Tuesday, May 25, 2021

హృద్యం-తెనుగు పద్యం -1 బుసబుసలు–గుసగుసలు- రుసరుసలు

 

          హృద్యం-తెనుగు పద్యం -1


బుసబుసలు–గుసగుసలు- రుసరుసలు  

 

గత శతాబ్దానికి చెందిన తెనుగు కవులలో  శ్రీ మాధవపెద్ది బుచ్చి సు౦దరరామశాస్త్రి గారొకరు . ఆయన  గొప్ప శివభక్తులు . కాని ఆయన ఎంత ప్రార్థిoచినా ఆ మహానుభావుడు  పరమశివుడు తన ప్రార్థన వినడం లేదు . ఆయన తన ప్రార్థన శివుడు ఎందుకు వినలేక పోతున్నాడో ఎంత చమత్కారంగా చెప్పారో గమనిస్తే కవి గారి ప్రతిభ వ్యక్త మౌతుంది. ముందుగా పద్యం .

 

మెడ నాగయ్యకు నొక్కటే బుస బుసల్ , మేనన్ సగంబైన యా

బిడతో నీకిక నెప్పుడున్ గుసగుసల్, వీక్షించి మీ చంద మె

క్కడలేనంతగ నెత్తి పై రుసరుసల్ గంగమ్మకున్ నీ చెవి న్

బడుటేలాగునొ  మామొరల్ దెలియ దప్పా! మాకు మృత్యుంజయా  !

                                                       (మృత్యుం జయస్తవం )

   పరమశివా!  నువ్వు మెళ్ళో పాము ధరిoచావు. దానికి వేళాపాళ లేదు. ఎప్పుడు  బుసలు కొడుతూనే ఉంటుంది. ఇక మీ ఆవిడ సంగతి చూద్దాం . ఆవిడ దూరంగా ఉంటే అప్పుడప్పుడు నీకు విశ్రాంతి దొరికేది  . నీ కా అదృష్టం లేదు . ప్రక్కనే ఉంది . అందులోనూ సగం దేహమై ఉంది. ఎపుడు నీతో ఎదో గుసగుసలాడుతూనే ఉంటుంది. నువ్వు ఎదో సమాధానం చెప్పాలికదా! తప్పదు. ఇక గంగాదేవి  సరే సరి. నీభార్య  పార్వతికి  సవతి. నీ నెత్తెక్కి కూర్చున్న మహాపతివ్రత. మీరిద్దరూ నిరంతరం , అందులోనూ తనను పట్టించుకోకుoడా కబుర్లాడుకు౦టుoటే ఎలా సహిస్తుంది, ఎంత వరకు సహిస్తుంది . ఆ విడ పై నుంచి మీమీద రుసరుసలాడిపోతో౦ది .  ఒక ప్రక్క నెడ తెరిపిలేని పాము చేసే    బుసబుసలు, మరో ప్రక్క నిరంతరాయంగా సాగుతున్న మీ భార్యా భర్తల గుసగుసలు , ఇంకో ప్రక్క  అడ్డు అదుపులేని గంగమ్మ తల్లి రుసరుసలు ఇవన్ని ఉంటే నా ప్రార్థన నీకుఎలా వినిపిస్తుoదిలే అని కవి సరిపెట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన భావన !

ఇటువంటి మహాకవుల భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .  

 

No comments: