Wednesday, May 26, 2021

 

          హృద్యం-తెనుగు పద్యం -2

   నాణ్యమైన ముక్తికి నాలుగే మార్గాలు

                                                  డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు .

గతతరానికి సంబంధించిన తెలుగు  కవులలో శ్రీచిలకమర్తి . లక్ష్మీనరసింహం పంతులుగారొకరు. వారు కేవలం కవి మాత్రమే కాదు చారిత్రక పరిశోధకులు  , నాటకకర్త  నిష్కళంక దేశభక్తులు , సంఘ సంస్కర్త  , ఆంగ్లేయుల నెదిరించిన తొలి తెలుగు కవి. ఆయన రచించిన గయోపాఖ్యానం ఆనాడే ఒక లక్ష ప్రతులు అమ్ముడయ్యాయంటే ఆయన కవిత్వం ఎంత ప్రజారంజకంగా ఉండేదో మనం ఊ హిoచుకోవచ్చు. ఆయన F.A చదువుతున్నప్పుడు ఆయనకు రెండు కళ్ళు పోయాయి . ఆయనను Andhra Milton అనికూడా కొంత మంది చెపుతారు.

శ్రీ చిలకమర్తి వారి పద్య రచనా సౌ౦ దర్యానికి “ కృపా౦భోనిధి” శతకం  ఒక పరాకాష్థ . ఇది మొట్టమొదటి సారిగా సంఘ సంస్కర్త రాజారామమోహన్ రాయ్ గారి నిర్యాణ శతాబ్ది సందర్భంగా 1933 లో తెలుగువారికి లభించింది .

  తరువాత ఎన్నో ఏళ్ళకు శ్రీయుతులు Y.S.నరసింహా రావు , Dy.E.o. s. సుబ్బరాజు, ప్రముఖ సాహితీ విమర్శకులు    అక్కిరాజు రామాపతిరావుగార్ల ప్రోత్సాహంతో శ్రీ యుతులు గంధం సుబ్రహ్మణ్యం , పురాణపండ శ్రీనివాసు గార్ల  సహకారంతో శ్రీ పెరుమాళ్ళ రఘునాథ్ గారు ఈ గ్రంథాన్ని మనకందించారు .

ఒక పద్యాన్ని పరిశీలిద్దాం .

వేదంబుల్ తలక్రిందుగా ( జదువనీ, విప్రాళికిన్ భక్తి గో

భూదానంబులు లొసంగనీ ,    బహు మఖంబుల్ సేయనీ  నిష్ఠమై

రాదమ్మోక్షము సత్ప్రవర్తనము , నైర్మల్యంబు , శాంతంబు నీ

పాదధ్యానము లేని వారలకు దేవా! శ్రీ కృపాoభోనిధీ |   

  

వేదాలు తలక్రిందుగా చదివినా మోక్షం లభించదు. బ్రాహ్మణులకు , భూదానం , గోదానం లాంటి ఎన్ని దానాలు చేసినా ముక్తి కలుగదు . ఎంతో నిష్ఠతో యజ్ఞాలు, యాగాలు చేసినా ముక్తి కలుగదు  .  సత్ప్రవర్తన, నిర్మలమైన మనస్సు , శాంతం , భగవంతుని పాదధ్యానం ఈ నాలుగే మార్గాలు .

ఈ నాలుగు అలవరచుకుo టే దాన ధర్మాలు , క్రతువులు చేయవలసిన పని లేదు , ఈ నాలుగు అలవడక పొతే దానధర్మాలవల , యజ్ఞాలవల్ల వీసమైనా ప్రయోజనం లేదు .

ఈ పద్యం నిజమైన ఆధ్యాత్మిక విలువలు గలది. నేటి మతమౌఢ్యానికి ఈ పద్యం ఒక ఔషధం. ఈ పద్యంలో ఉన్న అంశాలను ఆచరించి ప్రచారం చెయ్యాలి.     

ఇటువంటి మహాకవుల భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే  ఈతరం  రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  . 

 

No comments: