Wednesday, May 5, 2021

చాదస్తం . డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

చాదస్తం

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

‘చాదస్తం మొగుడు చెపితే వినడు కొడితే ఏడుస్తాడు’ అనే మాట మనం తరచుగా వింటుంటాం . ఈ చాదస్తం అనే మాట ఎక్కణ్ణుంచి వచ్చిఉంటుంది అని ఆలోచిస్తే ఛాందసత్వమే చాదస్తంగా మారి ఉ౦ టు౦దని భావించొచ్చు . ఛందస్సు అంటే వేదం . ఛాందసత్వం అంటే వేదంలో చెప్పింది చెప్పిన విధంగా తు. చ. తప్పకుండా ఆచరించడం.    

వేద౦లో ఒక మాటుంది అదే౦టంటే  “ వేదం కృత్వా వేదిం కుర్యాత్” అని . వేద చేసిన వెంటనే వేదిని చెయ్యాలి అని ఆ వాక్యం చెపుతోంది . ఇంకో వాక్యం ఉంది అదే౦టంటే “క్షుతే చాssచమేత్” అని. దాని అర్థం ఏ౦టంటే తుమ్ము వస్తే ఆచమనం చెయ్యాలి . అని అర్థం. ఒక వ్యక్తి వేద  చేశాడు ఇక వెంటనే వేది చెయ్యవలసి ఉంది . కాని ఈ లోపుగా అతనికి తుమ్ము వచ్చింది  . ఇప్పుడు వేది చెయ్యాలా లేక తుమ్ము వచ్చింది కాబట్టి ఆచమనం చెయ్యాలా అనేది మీమాంస . మీమాంస అనే మాటకు విశేషంగా చర్చించడం అని అర్థం . ఇక్కడ ఇది తర్కశాస్త్రంలో లాగ బుద్ధిబలంతో చర్చించేది కాదు. వేదంలో ఇవన్నీ చర్చించడానికి మీమాంస అనే శాస్త్రం ఏర్పడింది . ఆద్యుడు జైమిని మహర్షి . ఆయన రచించిన మీమాంసా సూత్రాలతో బాటు మీమాంసాన్యాయప్రకాశిక మొదలైన ఎన్నో వందలాది గ్రంథాలున్నాయి.   ఈ మీమాంసలో శ్రుతి, లింగ , వాక్య , ప్రకరణ , స్థాన , సమాఖ్యలనే ఐదు అంశాలున్నాయి .  అవి ఒకదాని కంటే మరొకటి బలహీనమైనవి . శ్రుతి – లింగ-  వాక్య-  ప్రకరణ- స్థాన-  సమాఖ్యానాం పార దౌర్బల్యమర్థవిప్రకర్షాత్ అని మీమాంసా నియమం . శ్రుతికి లింగానికి మధ్య clash వస్తే శ్రుతి ప్రవర్తిస్తుంది . లింగానికి వాక్యానికి మధ్య వైరుధ్యం కలిగితే లింగం గొప్పదవుతు౦ది . వాక్యానికి , ప్రకరణానికి మధ్య భేదం వస్తే వాక్యం ప్రవర్తిస్తుంది . ప్రకరణానికి స్థానానికి  మధ్య విభేదం వస్తే ప్రకరణం ప్రవర్తిస్తుంది .  ఇక స్థానానికి సమాఖ్యకు మధ్య పోటీ ఏర్పడితే స్థానం గెలుస్తుంది. అన్నిటికంటే శ్రుతి బలవత్తమం , సమాఖ్య బలహీనతమం .

ఇక శ్రీ శంకరభగవత్పాదుల వారు కర్తుమకర్తు మన్యథా వా కర్తుం శక్యతే లౌకికం చ వైదికం చ కర్మ అనే వాక్యం ద్వారా లౌకిక కర్మలు ఒక విధంగా చెయ్యొచ్చు లేదా మరో విధంగా చెయ్యొచ్చు. లేదా అసలు చెయ్యకు౦డాను ఉండొచ్చు అన్నారు.   యథా అశ్వేన గచ్ఛ తి; పద్భ్యాం గచ్ఛతి ; న వా గచ్ఛతి (ఒకడు గుర్రం ఎక్కి వెళ్ళవచ్చు, నడిచి వెళ్ళ వచ్చు లేదా అసలు వెళ్ళక పోవచ్చు. ఇక వైదిక కర్మల మాటకొస్తే అతిరాత్రే షోడశినం గృహ్ణాతి , నాsతిరాత్రే షోడశినం గృహ్ణాతి ; ఉదితే జుహోతి ; అనుదితే  జుహోతి అని లౌకిక వైదిక కర్మలు ఏ విధంగా నైనా చెయ్య వచ్చని తేల్చారు. ఇక మీమాంసా శాస్త్రంలో అన్ని నియమాలు ఏర్పరచడానికి గల కారణం  ఒక వ్యక్తికి ఒక  పద్ధతిని discipline అనుసరించడం అలవాటు చెయ్యడానికే నని మనం గ్రహించాలి. మొత్తం మీద వేదంలో చెప్పింది హేతుబద్ధంగా ఉన్నా లేక పోయినా  చెప్పింది చెప్పినట్లుగా ఆచరి౦చె విధానాన్ని ఛాందసత్వం అంటారని అదే చాదస్తంగా మారిందని అనుకోవచ్చు.  

ఇక నేటి సమాజంలో  కొంత మంది స్వార్థ పరులు “ ఈ విధంగా కొలిస్తేనే పుణ్యం వస్తుంది మరో విధంగా కొలిస్తే రాదు. ఈ పువ్వులతో పూజ చేస్తేనే ఫలితం మరో పువ్వులతో పూజిస్తే ఫలితం ఉండదని . ఈ దేవుని కంటే ఆ దేవుడు గొప్పవాడని చెబుతూ వాళ్ళ అజ్ఞానాన్ని పదిమందికీ ఉచితంగా పంచి పెడుతున్నారు.  అవేమీ  ఎవరు నమ్మకూడదు . ఒక మనిషికి ఇద్దరు త౦డ్రులు౦డడం ఎంత హాస్యాస్పదమో , ప్రపంచంలో ఇద్దరు దేవు ళ్ళు౦డడం కూడ అంతే హాస్యాస్పదం . -కాబట్టి ప్రతి చెత్త మాట వినకండి. ఒకవేళ విన్నా అది సమంజసమా కాదా అని పరి పరి విధాల ఆలోచించండి . మన భారతీయ సంస్కృతి దేన్నీ గ్రుడ్డిగా నమ్మమని చెప్ప లేదు .  వేదం “ఆత్మా వా అరే ద్రష్టవ్య: శ్రోతవ్య: మంతవ్య: నిదిధ్యాసితవ్య:”  అంది . ఇక్కడ మంతవ్య: అంటే ఆలోచించమని అర్థం . అంతే గాని దున్నపోతు ఈనింది అనగానే ఐతే దూడను కట్టేయండి అన్న మాదిరిగా ప్రవర్తి౦చకూడదు.

మొత్తం మీద మనం తెలుసు కోవలసినదేమమిటంటే – పువ్వులు౦టే పూజ చేసుకోoడి . పువ్వుల్లేకపోతే మనస్సులో ధ్యానం చేసుకోండి . అదీ కుదరక పోతే ప్రశాంతంగా కూర్చో౦డి .

ఈ ప్రపంచంలో శ్రీ శంకర భగవత్పాదులు ఒక్కరే ఆత్మతత్త్వాన్ని దర్శించారు , మిగిలిన వాళ్ల౦దరూ ఉత్ప్రేక్షి౦చారు . వారు   బోధించిన పూజా విధానాన్ని మించింది మరొకటి ఏదీ లేదు.దాన్ని ఆచరి౦చండి . నేను చెప్పానని కాదు , మీకు నచ్చితేనే.

ఆత్మా త్వం గిరిజా మతి: సహచరా: ప్రాణా: శరీరం గృహం

పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధిస్థితి:

సంచార: పదయో: ప్రదక్షిణవిధి: స్తోత్రాణి సర్వాన్ గిరో

యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభో ! తవారాధనం

ఓ భగవంతుడా! నువ్వే ఆత్మవు . పార్వతియే బుద్ధి . ప్రాణాలే నా సహచరులు. ఈ శరీరమే ఇల్లు. నేను చేసే ప్రతి పని నీకు పూజ. నా నిద్ర సమాధి . నేను లోకయాత్ర నిర్వహించడానికి ఎక్కడ తిరిగినా అది నీకు ప్రదక్షిణమే. నా పలుకులన్నీ నీకు స్తోత్రాలే. ఇక నేను చేసే  ప్రతి కర్మాచరణ నీ ఆరాధనమే . ఈ భావనతో ప్రవర్తించేవాడు ఏ తప్పు చేయడు. కాబట్టి ఈ విధంగా ప్రతి వ్యక్తీ మీనమేషాలు లెక్క పెట్టకుండా భగవంతుని ఆరాధించడం తరణోపాయం, తరుణోపాయం కూడ.     

                                            <><><><><><><>

                         

No comments: