Saturday, May 1, 2021

పశువు – పశుపతి డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

                                            పశువు – పశుపతి

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. మనం గుడిచుట్టూ  ప్రదక్షిణలు చేసేటప్పుడు న౦దికి  శివునికి మధ్యగా వెళ్ళకూడదని కట్టడిచేస్తారు. దీని ఆంతర్యం ఏమిటా అని ఆలోచిస్తే ఒక విషయం మనకు తోస్తుంది. నంది పశువు, భక్తునికి ప్రతీక . శివుడు పశుపతి దేవునకు ప్రతీక . మొత్తం మీద న౦దికీ  శివునికీ మధ్య ఎవరు ప్రవేశించ కూడదు అoటే భక్తునికీ పరమేశ్వరునకు మధ్య ఎవరి ప్రమేయం ఉ౦డకూడదని అభిప్రాయం.  

ఈ విధంగా భక్తునికి దేవునికీ మధ్య ఇతరుల అనవసర  ప్రమేయం ఉండడం వల్లనే ఎన్నో మతాల్లో ఆయా మతాలకు సంబంధించిన మత పెద్దలు (మధ్యవర్తులు)  భక్తులకు ఎన్నో ఇబ్బందులు కలగ జేశారు. ఇది చారిత్రక మైన సత్యం . చేదు నిజం . దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడనే మాదిరిగా ఎంతో మంది అమాయకపు భక్తులు మత పెద్దల  మాయ మాటలకు లొంగి తమ అమూల్యమైన జీవిత౦,  జీవితపు  విలువల్ని కోల్పోయినవారే. అందుకే భారతీయ సంస్కృతిలో భక్తునికి భగవంతునికి ప్రత్యక్షసంబంధమే ఉంటుంది. ఆ విషయాన్ని వివరి౦చడానికే శివునకు నందికి మధ్య ఎవరు చొరబడకూడదని కట్టడి చేశారు. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి.  

అదే౦టంటే దంపతుల మధ్యగా నడవకూడదనే ఆచారం మన ప్రాచీన సంస్కృతిలో ఉంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే వారిద్దరి వ్యవహారాల మధ్య జోక్యం కలుగ జేసుకోకూడదని మాత్రమె . అంతే గాని ఇద్దరి మధ్యలో ఎవరైనా నడిస్తే కొంపలు ములిగిపోతాయని కాదు . నేడు సమాజంలో కొత్త దంపతుల ఎన్నో జీవితాలు సర్వనాశనం ఐపోడానికి కారణం పిల్ల తల్లిదండ్రులు ; పిల్లవాడి తల్లిదండ్రులు . వారి  చెత్త సలహాలకు, సుత్తి సలహాలకు కొత్త జంటలు బలికావడం మనం కళ్ళారా చూస్తున్నాం . అప్పుడే వివాహమై ఆనందంగా గడపవలసిన ఆ జంట వీరి ముదనష్టపు సలహాలకు ,  మాటలకూ  ఏమీ తెలియని , ఎదురు చెప్పలేని పరిస్తితుల్లో సతమత మౌతున్నారు.  అందువల్ల ఇరు పక్దాల తల్లి దండ్రులు కొత్త దంపతుల విషయంలో జోక్యం కలుగ జేసుకోకుoడా వారి ఇష్టానికనుగుణo వారిని వదిలెయ్యాలి . వారిని స్వతంత్రంగా ఎదగ నివ్వాలి. ఎప్పుడైనా వారడిగితే మంచిసలహాలు చెప్పాలి. అంతేగాని తగుదునమ్మా అని అన్ని విషయాల్లో తలదూరిస్తే మాడు పగులుతుంది, మన కున్న గౌరవం మoట గలిసి పోతుంది .  మనం మన ఉచిత సలహాలు కట్టబెట్టి వాళ్ళంతట వాళ్ళని ఆలో చించుకునే లాగ ప్రవర్తించాలి .  వారి ఆలోచనా సరళికి బంగారు బాటలు వెయ్యాలి. తల్లిదండ్రుల ప్రమేయం తక్కువగా ఉన్న కుటుంబాలు చాల వేగంగా, ఆరోగ్యవంతంగా అభివృద్ధి సాధిస్తాయి . ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మన భారతీయ సంస్కృతి దేవునికి భక్తునికీ మధ్య; భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయాన్ని నిషేధించింది . 

No comments: