హృద్యం-తెనుగుపద్యం -3
(నరుడే నారాయణుడు)
డాక్టర్ .చిలకమర్తి
దుర్గాప్రసాదరావు
గత తరానికి
చెందిన తెనుగు కవులలో శ్రీ గుర్రం జాషువ గారొకరు. కరుణ రసాన్ని ఆలంబనగా చేసుకొని తన కవితా శక్తిని లోకకళ్యాణానికి వెచ్చించి కృతకృత్యుడైన
మహాను భావుడాయన.
సాటి మనిషిని
మనిషిగా చూడలేని ఈ సాంఘిక వ్యవస్థను, మత దురాచారాలను ఆయన విశేషంగా దుయ్యబట్టారు. “నరుని
కష్ట పెట్టి నారాయణుభజించు ధర్మ శీలురున్న ధరణి మనది” అని ఆక్రోశించారు .
దేవుని పేరుతో,
భక్తి ముసుగులో మానవత్వం మంటగలిసి పోవడం
ఆయన సహిoచలేకపోయారు. నిజమే!
మానవత్వం మనిషితో పాటు పుట్టింది . మతం మనిషి పుట్టిన కొన్ని లక్షల సంవత్సరాల
తరువాత పుట్టింది . ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే రీతిలో మతం మానవత్వాన్నే మఱచిపోయేలా చేస్తోంది . ఇక జాషువ
గారిలో ఒక ప్రత్యేకత ఉంది. . తప్పు ఎవరు
చేసినా నిందించారు. మంచి ఎక్కడున్నా మెచ్చు కున్నారు.
ఇక ప్రస్తుత
విషయానికొద్దాం . మానవత్వాన్ని కాలరాచే మత మౌఢ్యాన్ని ఎంత తీవ్రంగా ఖండిం చారో
చూద్దాం . ముందుగా పద్యం .
ప్రతిమల పెండ్లి
సేయుటకు వందలు వేలు వ్యయి౦ త్రు గాని దు:
ఖితమతులైన పేదల
ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెదుకువిదల్పదీ భరతమేదిని
ముప్పది మూడు కోట్ల దే
వతలెగ బడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే
!
( గబ్బిలం - శ్రీ
గుర్రం జాషువ)
ఈ జనం విగ్రహాలపెళ్లిళ్లకు,
ఊరేగిo పులకు వేలాది, లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు గాని ఆకలితో
అలమటిస్తున్న పేదల , ఫకీరుల శూన్యమైన భిక్షాపాత్రల్లో ఒక్క మెదుకు కూడ విదల్పరు.
వీళ్ళ వంతు రావాలంటే ముప్పై మూడుకోట్ల దేవలల్ని
ముందుగా సంతృప్తి పరచాలి . అది జరిగే పని కాదని ,
వీళ్ళ ఆకలి కూడ త్వరలో తీరేదీ కాదని కవి తన ఆవేదనని వ్యక్తం చేశారు.
ఈ పద్యం మత ఛాందసవాదులకు ఒక కను విప్పు కావాలని
జాషువ గారు రచించారు. ఇది మతాన్ని విమర్శించడం కాదు, మనిషిని మనిషిగా గుర్తించలేని
కొంత మంది వ్యక్తుల పోకడలను నిరసి౦చడమే. ఇటువంటి వారు అన్ని మతాల్లోను ఉంటారు. వారికి మానవత్వపు విలువలు తెలియ జేయడానికే ఈ పద్యం .
ఇటువంటి మహాకవుల భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించవు .
No comments:
Post a Comment