Tuesday, May 4, 2021

Superiority vs Inferiority డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు

 

                 Superiority vs Inferiority

                                         డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు

సృష్టిలో భిన్నత్వం ఉంటే ఉందేమో గాని ఎక్కువ తక్కువ అనే తారతమ్యం లేదు. ఎందుకంటే ఏ జీ వికి ఆ జీవే ప్రత్యేకమైనది . దానికంటే ఎదీ తక్కువ కాదు ఏదీ ఎక్కువ కాదు .   oతువులు చేసుకున్న అదృష్టమేమిటంటే వాటిలో ఈ Superiority, Inferiority భేదం లేదు అన్నీ కలిసే ఉంటాయి . ఏదైనా ఆహారం దొరికినప్పుడే తమ వంతుకోసం పోట్లాడుకుంటాయి, తరువాత అన్ని  కలిసి మెలిసి జీవిస్తాయి. మనిషికే ఈ మాయరోగం . ఒకడు అందరికంటే నేనే గొప్పవాణ్ణి అని గర్వంతో పొంగిపొతూ ఉంటే మరొకడు నేను ఎందుకు పనికి రానివాణ్ణి అని వేదనతో క్రుంగిపోతూ ఉంటాడు . అటు పొంగిపోవడం ఎంత తప్పో క్రుంగి పోవడం కూడ అంటే తప్పు. Superiority, inferiority ఈ రెండు ప్రమాదకరమే. కాని ఈ ఇద్దరిలో Superiority complex ఉన్నవాడు కొంతనయం , తన గొప్పదనం నిరూపి౦చుకోడానికి  అప్పుడప్పుడు కొన్ని మంచిపనులు చేస్తూ ఉంటాడు . ఇక    inferiority complex ఉన్న వాడు రోజు రోజుకీ క్రుంగి కృశి౦చి, నశించి  పోవడం కన్న ఏదీ సాధించలేదు . అందువల్ల తల్లి దండ్రులు ఈ రెండు దుర్గుణాలు పిల్లలకంట కుండ  పెంచాలి .

అందుకే అన్నారేమో శ్రీ జాషువా గారు

తలిదండ్రులెపుడు బిడ్డలకు( దెల్పగ రాదు

కులగోత్రములు వాని గొప్పదనము

చదివి౦పగా రాదు చాదువులయ్యలు పాఠ

శాలల లోన కులాల గొడవ” అని .

ఇక ఈ సృష్టిలో పనికి రానిదంటు ఏదీ లేదు పనికిరానివాడంటు ఎవరూ లేరు .

అమంత్రమక్షరో నాస్తి నాస్తి మూలమనౌషధం

అయోగ్య: పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ:

అన్నారు పెద్దలు .

అమంత్రమక్షరో నాస్తి

ఒక గురువుదగ్గర ఇద్దరు శిష్యులు న్నారు . గురువు ఒకడికి ‘శం’ ఒక అక్షరం మంత్రం గా ఉపదేశించాడు వాడు దాన్ని జపిస్తూ కొన్ని శక్తులు సాధించాడు తత్ఫలితంగా ఆకాశంలో ప్రయాణం చేసే శక్తి సంపాదించాడు . అలాగే మరోశిష్యుడికి ‘ఠ౦’ అని  మరొక అక్షరం మంత్రోపదేశం చేశాడు.  వాడు   ‘‘ఠ౦’’ ‘ఠ౦’ అని జపిస్తూ ముందు వాడిలాగానే  కొన్ని శక్తులు సాధించి ఆకాశంలో తేలిపోయే మహిమ సంపాదించాడు . ఒక రోజు ఇద్దరు ఆకాశంలో కలుసుకున్నారు . వాళ్లకు ఒకరి గురించి మరొకరికి తెలుసుకోవాలనే కోరిక పుట్టింది .  ఒరేయ్ ! గురువుగారు నీకేం చెప్పేర్రా? అన్నాడొకడు , నీకేం చెప్పేరో ముందు చెప్పరా!  అన్నాడు మరొక్కడు

నాకు ‘శం’ అని చెప్పార్రా అన్నాడొకడు . నాకు ‘ఠ౦’ అని చెప్పెర్రా అన్నాడు రెండోవాడు . రెండు కలిపితే ‘శంఠ౦’ఐంది. ఓసి మనిద్దరికీ చెప్పింది ఇదిట్రా అన్నారు ఇద్దరు ఒకేసారి ఆన్నారు వాళ్ళు అనడం ఆకాశం నుంచి పడిపోడం ముడ్డి పగలడం క్షణాల్లో జరిగిపోయింది . అంతవరకు వాళ్లకి ఆ మంత్రం పైన విశ్వాసం ఉంది ఆ విశ్వాసం వల్ల తాము  సాధించిన శక్తితో వారు ఆకాశంలో సంచరించే స్థాయికెదిగారు విశ్వాసం కోల్పోయిన వెంటనే నేలపై చతికిలపడ్డారు . 

నాస్తి మూలమనౌషధం :

పూర్వం ఒక రాజాస్థానంలో వైద్యనియామకం చేయ వలసిన అవసరం ఏర్పడింది . మంత్రి ఒక ప్రకటన చేస్తూ ఫలానా రోజున వైద్యనియామకం జరుగుతుంది, అభ్యర్థులు తమకు తెలిసిన పనికి రాని మొక్కలు తీసుకురమ్మని కోరాడు . రాజాస్థానంలో వైద్యుడు కావడమంటే ఎంతో పెట్టి పుట్టాలి అభ్యర్థులు కొంతమంది వందలాది మొక్కల్ని సేకరించి తెచ్చారు . కొంత మంది ఏభై , నలభై , ముప్పై , ఇరవై , పది ఇలా తెచ్చారు. ఇకడు మాత్ర౦ చేతులూపుకు౦టు వచ్చాడు. వాణ్ణి చూసి అందరు నవ్వేరు . మాంత్రికూడ ఆశ్చర్య పోయాడు . అక్కడున్న ఆస్థానవైద్యుడు వట్టి చేతులతో వచ్చిన వాడితో “ ఏమయ్యా ! ఇంత మంది ఎన్నో పనికి రాని  మొక్కలు తెస్తే, నువ్వు ఒక్కటి కూడ తేలేదు. నీకీమీ కనిపి౦చలేదా! లేక సోమరితనమా ! అని అడిగాడు . దానికి సమాధానంగా ఆవ్యక్తి రెండు చేతులు జోడిస్తూ “అయ్యా ! ఔషధంగా పనికిరాని  మొక్కంటు నాకేం కనిపించ లేదు, నన్ను మన్నించండి” అన్నాడు . ఆ వైద్యుడు    నిన్ను మన్ని౦చడం కాదయ్యా! ఆస్థానంలో ప్రధానవైద్యునిగా నియమిస్తున్నాం అని చెప్పి మిగిలిన వారిని వెనక్కి పంపించేశాడు . కాబట్టి మనం తెలుసుకోవడంలో లోపం గాని వైద్యానికి పనికి రాని  మొక్కంటు ఏదీ లేదు . మొక్కలలో ఉండే ఔషధ గుణాలు పిల్లలకు పరిచయం చెయ్యడానికే వినాయకచవితి మొదలైన వ్రతాల్లో ఏకవింశతిపత్రపూజ(21మొక్కలు) మొదలైనవి ప్రవేశపెట్టారు . ఆ మొక్కలు మనిషికి నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో వ్యాధులకు మందులుగా పని చేస్తాయి  కాని భక్తుల దృష్టి మనుషులకొచ్చే ఇడుముల మీద కన్నా  కుడుముల  మీదే ఉండడం శోచనీయం .  సరే !   ఆ విషయం అలా ఉంచుదాం .

అయోగ్య:  పురుషో నాస్తి :

ఈ సృష్టిలో ఎందుకు పనికిరాని వాడంటు ఎవరు లేరు . వాడెందుకు పనికొస్తాడో తెలుసుకోగలిగిన వాడు ఎవడు లేడు . ఈ సమాజంలో చాల గొప్పవారుగా పేరుపొందిన కొంతమంది మహనీయుల జీవితాలు పరిశీలిస్తే  బాల్యంలో చాల మంది అంతంత మాత్రంగా ఉన్న వారే. కాబట్టి ప్రతివ్యక్తిలో ఉండే అభిరుచులను జాగ్రత్తగా     గుర్తించి తదను గుణ౦గా వారిని తీర్చి దిద్దితే అందరు మహనీయులౌతారు .   మనిషిని మనిషిలా పెంచండి . ఎవరి అభిప్రాయాలు రుద్దకండి . స్వయంగా ఆలోచించుకో నివ్వండి . తానె స్వశక్తితో ,  స్వయంగా మహనీయు డౌతాడు .

                                                             <.><.><..<.>

 

No comments: