Sunday, December 22, 2013

రమాకుమార


మాకుమా
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
/౧౦౬, ప్రేమ నగర్, దయాల్బాగ్ ,
ఆగ్రా ౨౮౨౦౦౫.
సంస్కృతభాష చాల విస్తృతమైనది. ఏ భావాన్నైనా వ్యక్తం చెయ్యగల చక్కని చిక్కని పదజాలం ఉంది. అపారమైన భావసంపద ఉంది. చిత్రవిచిత్రమైన కవితారీతులున్నాయి. కవితారీతులలో 'అనులోమవిలోమం' అనే ప్రక్రియ ఒకటి . అనులోమవిలోమమంటే ఎటు చదివినా ఒకే విధంగా ఉండడం . దీన్ని ఆంగ్లంలో palindrome అంటారు. ఉదాహరణకి 'did' , 'noon', ' Madam , 'kayak' , ' Malayalam ' వంటి పదాలు ' was it a car or a cat I saw' , 'Madam I'm Adam', 'Able was I ere I saw elba' మొదలైన వాక్యాలు పరిశీలిస్తే అవి ఎటు చదివినా ఒకలాగే ఉంటాయి. ఒకే అర్థాన్నిస్తాయి. భాషలో ఇటువంటి పదాలు సహజంగా ఉన్నా వాక్యాల కూర్పు మాత్రం చాల కష్టమైన పని. ఇటువంటి పదాలు వాక్యాలు వివిధభాషల్లో తరచుగా కన్పిస్తాయి. ఇక సంస్కృతసాహిత్యం మాటకొస్తే ఇటువంటివి ఎన్నో కావ్యాలే మనకు దర్శనమిస్తాయి.
ఉదాహరణకు వేంకటాధ్వరి రచించిన రాఘవయాదవీయం కావ్యమంతా అనులోమవిలోమంగానే నడుస్తుంది. రామాయణ భాగవతకథలను అందిస్తుంది. మచ్చుకు ఒకశ్లోకం :
" రామధామ సమానేన మాగోరోధన మాస తాం
నా మహా మక్షరరసం తారాభాస్తు న వేద యా "
అనే శ్లోకం రాముణ్ణి వర్ణిస్తే , ఇదే తిరగబడి
"యాదవేన స్తు భారాతా సంరరక్ష మహామనా:
తాంసమానధరో గోమా ననే మాస మధామరా:”
అని కృష్ణుణ్ణి వర్ణిస్తుంది. అలాగే దైవజ్ఞసూర్య కవి రచించిన రామకృష్ణఅనులోమవిలోమకావ్యం కూడ ఎటు చదివినా ఒకలాగే ఉండి రాముని కథను కృష్ణుని కథను వర్ణిస్తుంది.
తం భూసుతా ముక్తిముదారహాసం
వందే యతో లవ్యభవం దయాశ్రీ:
శ్రీయా దవం భవ్య లతో య దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం
ఇక తెలుగుకవుల్లో సంస్కృతపదాల వేడిని వాడిని రుచిచూపించిన మహామనీషి రామరాజభూషణుడు (భట్టుమూర్తి). ఏ పదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా శక్తివంతంగా ప్రయోగించాలో ఆయనకు తెలిసినట్లు మరొకరికి తెలియదని చెప్పవచ్చు. సమస్తపదాలు ఆయన కనుసన్నల్లో సంచరిస్తూ ఉంటాయి. అందుకే "పలుకులబేహారి భట్టుమూర్తి" అనే వారు మా గురుదేవులు కీ॥శే॥ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారు..
భట్టుమూర్తి తన వసుచరిత్రలో ఒకచోట మాకుమా అనే ఒక అద్భుతమైన అనులోమ విలోమ పదాన్ని ప్రయోగించారు. అది మిగిలిన పదాల్లాంటి సామాన్యమైనది కాదు. దానికో ప్రత్యేకత ఉంది. అదేమిటో పరిశీలిద్దాం.
వసుచరిత్రలో నాయకుడు వసురాజు. నాయిక గిరిక . వాళ్లిద్దఱూ పరస్పరం ఆకర్షితులౌతారు. ఆమె విరహావస్థలో ఉంటుంది. ఆమెకు ఎటుచూసినా మన్మథుడు దర్శనమిస్తున్నాడు. మన్మథునికి ఎన్నో పదాలున్నాయి. కాని ఆ సందర్భంలో కవి "రమాకుమార" అనే పదం ఉపయోగించారు. ఆ పదం ఎటు చూసినా ఒకలాగే ఉండి మన్మథుడనే అర్థాన్నే ఇస్తుంది. రమాయా: కుమార: రమాకుమార: . రమా అంటే లక్ష్మి కుమార: అంటే కొడుకు (మన్మథుడు). ఇక ఎలా చూసినా మన్మథుడు అనే అర్థం రావడం ఈ పదం విశిష్టత. ముందున్న అక్షరం '" తీసేసి చూస్తే ' మాకుమార' అవుతుంది. మాయా: కుమార: మాకుమార: . మా అంటే లక్ష్మి .మాయా: (లక్ష్మి యొక్క) కుమార: మాకుమార: (మన్మథుడు) . ఇపుడు 'మా' అనే అక్షరం తీసేసి చూద్దాం. కుమార అంటే మన్మథుడు. 'కు అనే అక్షరం కూడ తేసేసి చూద్దాం . మార అంటే మన్మథుడు. చివరికి మా అనే అక్షరం కూడ తీసేద్దాం . "" అంటే కూడ మన్మథుడే. రస్య ( మన్మథుని యొక్క) ఆజీవ: (వృత్తి / జీవనాధారము) రాజీవ: ( పద్మం). రమాకుమార పదంలో ఇంత సొగసు ఉందని సూచించడానికా అన్నట్లు కవి అఱిముఱి అనే పదం ఉపయోగించారు. అఱిముఱి అంటే తాఱుమాఱుగా అనే అర్థం కూడ ఉంది. బహుశ ఇటువంటి పదం ప్రపంచసాహిత్యంలో మఱెక్కడా కన్పించదు .
అఱమి రమాకుమారుడపుడగ్రతలంబున వచ్చినిల్చిన
ట్లఱిముఱి దోచినం గువలయాక్షి వడంకి కడంకదూలి
మైమఱచి సుగంధ గంధగిరిమారుతపాతితవల్లికాభయై
యొఱగిన, సంభ్రమించి చెలులుద్గత బాష్పతరంగితాక్షులై (/౧౭౯)
***

Tuesday, December 17, 2013

లోకం తీరు


లోకం తీరు
(చేట- జల్లెడ)
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.
/౧౦౬, ప్రేమనగర్, దయాల్ బాగ్, ఆగ్రా
చేట జల్లెడ ఈ రెండూ శుభ్రపరిచే సాధనాలే అయినా పని తీరులో తేడా ఉంది. చేట మంచి ఉంచుకుని చెడుని విడిచిపెట్టేస్తుంది. జల్లెడ డానికి విరుద్ధంగా చెడును ఉంచుకుని మంచిని విడిచి పెట్టేస్తుంది. సంఘం మంచిచెడుల మిశ్రమం . అందువల్ల సంఘంలో కూడ ఈ రెండు తరగతులకు చెందిన మనుషులుంటారు.
సజ్జనులు చేటవలె చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరిస్తారు. దుర్జనులు జల్లెడ వలె చెడును ఉంచుకుని మంచిని విడిచిపెట్టేస్తారు. ఈ సమాజంలో చేటల కంటే జల్లెళ్ల సంఖ్యే ఎక్కువని చెప్పవచ్చు. ఎవరినైన తప్పు పడతారు . ఏం చేసినా తప్పు పడతారు. ఒక విధంగా చెప్పాలంటే తప్పులు వెదకడమే వారి లక్ష్యం.
ఒకసారి శివపార్వతులిద్దఱు ఎద్దుమీద కూర్చుని దేశసంచారం చేస్తున్నారు. దారిలో కొంతమంది వారిని చూశారు. వాళ్లల్లో వాళ్లు 'చూశారా! ఎంతవిడ్డూరం. ఎద్దు చాల బక్కగా ఉంది. దాని మీద కూర్చుని ఇద్దఱూ ప్రయాణం చేస్తున్నారు. ఇద్దర్నీ అది ఎలా మోయగలదు. ఒకవేళ మోసినా ఎంతసేపు మోయగలదు? ఆమాత్రం తెలుసుకోవద్దా. దేవతలట దేవతలు వీళ్లేం దేవతలు' .అన్నారు.
ఆ మాటలు శివుని చెవిలో పడ్డాయి. భార్యతో పార్వతీ ! నువ్వు కాసేపు దిగి నడిచిరా అన్నాడు. ఆమె సరే అంది. దిగి నడుస్తోంది. మఱొక చోట మరో కొంతమంది ఎదురుపడ్డారు. వాళ్లల్లో కొందఱు 'ఎంత విడ్డూరమో చూశారా! మగవాడై ఉండి ఆడది, అందులోను కట్టుకున్న భార్య అన్న కనికరం కూడ లేకుండ ఆమెను నడిపిస్తూ దర్జాగా కూర్చున్నాడు. ఈయనేం దేవుడు?' అన్నారు. ఆ మాటలు శివుని చెవులకు ఈటెల్లా గుచ్చుకున్నాయి. 'పార్వతీ ! నువ్వు ఎక్కి కూర్చో నేనే నడుస్తాను' అన్నాడు. ఆమె మహాపతివ్రత అందుకని ఎదురు చెప్పలేక 'సరే' అంది. మరో కూడలిలో ఇంకొంతమంది ఎదురయ్యారు. వాళ్లల్లో కొందఱు 'చూశారా వింతల్లో వింత. మొగుణ్ణి నడిపిస్తూ తాను దర్జాగా కూర్చుని ఊరేగుతోంది. పతివ్రతట పతివ్రత. ఇదేం పాతివ్రత్యం. ఎవరైన నవ్వుతారని సిగ్గుకూడ లేదు . ఛీ ఛీ. స్త్రీ జాతికే తలవంపు, అన్నారు . పాపం! ఆ మాటలు ఆ మహా ఇల్లాలి చెవిలో పడ్డాయి. 'నాథా! నేను దిగుతాను . దయచేసి అనుమతించండి' అంది. 'సరే లే దిగు' అన్నాడు . ఇద్దఱూ మౌనంగా నడుస్తున్నారు. ఎద్దు వారి వెంట నడుస్తో వస్తోంది. మరొక చోట వేరొక గుంపు ఎదురయింది. 'అబ్బబ్బ ఏమి వింత. ప్రక్కన వాహనం ఉండి కూడ నడిచొస్తున్నారు. ఏమి తెలివితేటలు! దాన్ని ఊరికే ఎందుకు నడిపిస్తున్నట్లు . దానికి కాల్లు నొప్పి పుట్టవా. జాలి కూడ లేదు. దేవుళ్లట దేవుళ్లు' అన్నారు . ఈ మాటలు ఇద్దఱి చెవుల్లోను పడ్డాయి. గతుక్కుమన్నారు. ఇద్దఱు తమ రెండు చేతులతో ముందుకాళ్ల నొకరు వెనుకకాళ్లనొకరు ఎత్తి పట్తుకుని మోసుకొస్తున్నారు. అంతలోనే మరో గుంపు ఎదుర య్యింది. 'చూడండి చూడండి వింతల్లోకెల్ల పెద్దవింత . ఎద్దుపై కూర్చుని దర్జాగా రావలసింది పోయి వీళ్లే దాన్ని మోసుకొస్తున్నారు. వీళ్లకి బుర్ర మోకాల్లోకూడ లేదనిపిస్తోంది కదూ!' అన్నారు. ఈ మాటలకు ఇద్దఱూ తట్టుకోలేకపోయారు. వెంటనే మాయమయ్యారు . మఱు క్షణం కైలాసం చేరుకున్నారు. కాబట్టి లోకులు కాకులు . వాళ్లను లెక్కచెయ్యకూడదు.వాళ్లకి భయపడకూడదు. లోకంతీరు చాల చిత్రంగా ఉటుంది. భయపడితే భయపెడుతుంది భయపెడితే భయపడుతుంది. అందువల్ల ఎవరికీ భయపడకుండ ఎవరినీ భయపెట్టకుండ ఒక్క ధర్మానికే భయపడి జీవించాలి. మరి ధర్మం కూడ ఒక్కొక్కప్పుడు సమయాన్ని బట్టి అనేకవిధాలుగా మారుతో ఉంటుంది. అందువల్ల మహాత్ములు ఏమార్గంలో నడిచారో ఆ మార్గాన్ని అనుసరించి ప్రయాణం చెయ్యడమే మనకర్తవ్యం . ఇదే తరుణోపాయం తరణోపాయం కూడ.
మహాజనో యేన గత: స పంథా:

శ్రీరామలింగేశ్వరదశకం


శ్రీరామలింగేశ్వరదశకం
    చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
    . శ్రీకారంబును జుట్టినాడను వచశ్శ్రీలన్నుతుల్సేయగా
    సాకారుండవొ! నిర్గుణుండవొ! వెసన్ సాయుజ్యసంపత్తితో
    లోకంబుల్ దయ బ్రోవ వేడెద దయాళూ! సాంబ! సర్వేశ! యో
    శ్రీకంఠా! పరమర్షివంద్యసుగుణా! శ్రీరామలింగేశ్వరా!
. తలపై జాబిలియుండ పూజలకు పద్మశ్రేణి నీకేల? వె
    న్నెలవెల్గుండగ నీకు కప్పురముతో నీరాజనంబేల? గం
    గలన్మౌళితలాననుండ నభిషేకవ్రాతమేలయ్య ? నిం
    దిలకింపంగనె చాలు ముక్తి గలుగున్ శ్రీరామలింగేశ్వరా!

    . చుట్టుంగైదువు జోదుపట్టిని వెసన్ సొంపారగా బూదియౌ
    నట్టుల్ సేసిన పోటరంబు తగ మూడౌ తొల్లిజేజేగమిన్
    మట్టిం గల్పిన నీమగంటిమి తలంపన్నబ్బురంబౌ జగా
    జెట్టీ! నీకివె యేటికోల్లు గొనుమా శ్రీరామలింగేశ్వరా!

    . వరకైలాస నగంబొ ! భక్తజనహృత్పద్మంబొ ! శ్రీ పార్వతీ
    కరయుగ్మాంతరదేశమో ! ద్విరదరక్షస్సౌధకూటంబొ!
    శ్వర! నీ యున్కి ప్రశస్తి గాంచిన ప్రదేశంబెద్దియో గాని నీ
    చిరునామానెఱిగింప రావె కరుణన్ శ్రీరామలింగేశ్వరా

    .కవితాశక్తి హుళక్కి వ్యాకరణవాక్యన్యాయవేదాంతశా
    స్త్ర విశేషంబుల ప్రజ్ఞ శూన్యమఘనాశం బైన నీదివ్య రూ
    పవిశేషంబునుగాంచి ముగ్ధుడయి కైవల్యంబు గాంక్షించితిన్
    శివనామస్మరణన్ భజింతు నిరతిన్ శ్రీరామలింగేశ్వరా !

    . పురముల్ గాల్చి సురాళి కష్టదశలంబోకార్చుటల్ గల్ల సా
    గరమంథానభయప్రదోధ్ధృతమహాకాలాగ్ని కంఠస్థలిన్
    ధరియింపందలపోయుటన్నది యబద్ధంబయ్య నన్నిప్డుమె
    చ్చిరయంబుంగరుణింపనవ్వి నిజముల్ శ్రీరామలింగేశ్వరా!

    . హిమశైలాత్మజ నీకు నెచ్చెలి గణాధీశుండు నీకెప్డు కూ
    రిమి సేయంగలయట్టి పుత్రుడు ధరిత్రీజాతనాధుందు ని
    త్యము నిన్గోరి భజించువాడు దివిజాధ్యక్షుండు నీవంక పొ
    చ్చెము లేకుండు ననూహ్యమిట్టి మహిమల్ శ్రీ రామలింగేశ్వరా!

    . ఖల సంసర్గము దూఱి సాధుజనపుంగవ్రాతముంగోరి ని
    ర్మలవైరాగ్యఫలప్రసిద్ధములుగా రంజిల్లు నీదైన ని
    శ్చల సన్మంగళ మూర్తి జేరి దినముల్ సాగింతు నాయాత్మ రం
    జిల కైవల్య మొసంగి బ్రోవగదవే శ్రీ రామలింగేశ్వరా!

    . ఆరామంబులకెల్ల నెన్నదగు క్షీరారామమందుండి ని
    న్నారాధించుట చేసి నాకు హితవిద్యాసక్తిగల్గెన్నిజం
    బౌరా! నీమహిమల్ నుతించుటన శక్యంబౌనె నెవ్వారికిన్
    క్షీరారామపురీ విహారరసికా శ్రీరామలింగేశ్వరా
     
    ౧౦. 'నిజమే కొంపయు గోడు లేని యతడా నిన్నేలునా' యంచు ప
    ల్కుజనుల్ అచ్చెరువంది ముక్కుపయి వ్రేలుంజేర్చు చందాన న
    క్కజమౌ రీతిని నన్ను బ్రోచి పిదపంగైవల్యముంజూపి య
    ర్ధిజనత్రాణపరాయణుండవగుమా శ్రీరామలింగేశ్వరా!
    ___





























౧౬.

Sunday, December 15, 2013

బాబోయ్ ప్రబంధసుందరి


బాబోయ్ ప్రబంధసుందరి
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

మహాకావ్యాల్లో పద్దెనిమిది వర్ణనలుంటయి. వాటిలో స్త్రీ వర్ణన ఒకటి. ముఖ్యంగా ఆ కావ్యం లోని నాయిక వర్ణన అందులో చోటు చేసు కుంటుంది. ప్రాచీనకవులందఱు స్త్రీని చాల పవిత్రంగాను సహజంగాను వర్ణించారు. కాని రానురాను ప్రబంధకవుల వర్ణనలు వెర్రి తలలువేశాయి. వాళ్లు ఏ అవయవాన్నీ విడిచిపెట్టలేదు. ఎటువంటి ఔచిత్యం పాటించ లేదు. నిజంగా ఆ వర్ణనలు తలచుకున్నా బొమ్మ గీసి చూసుకున్నా చాల అసహ్యంగా అనిపిస్తాయి కనిపిస్తాయి .
ముఖ్యంగా కవులందరికి పద్మాలు చాల లోకువగా దొరికాయి. అన్ని అవయవాలను పద్మాలతోనే పోల్చి వర్ణించడం మొదలెట్టారు.
ఆమె ముఖం, కళ్లు , కాళ్లు , చేతులు అన్నీ పద్మాలతోనే పోల్చారు. అ వర్ణనలను ఆక్షేపిస్తూ ఒక ఆధునిక కవి చాల చక్కని పద్యం చెప్పేరు.
ఆమె మొగం తామరట , కన్ను తామరలో దూరిన మరో తామరట. కాళ్లు తామరలట, చేతులుకూడ తామరలే యట . ఇంతవిడ్డూరం ఎక్కడైన ఉంటుందా! మనం మొలతామర (గోక్కునే తామర) ఒక్కటే విన్నాం . ఈ విధంగా శరీరం అంతా తామరలున్న ఆ స్త్రీ నిజంగా దూలగొండే (forget me not) అవుతుంది . ఆటువంటిది వద్దు బాబోయ్ అసలొద్దు.

అటు పయి మోము తామరట అక్షియు తామరలోన తామరే
యట చరణంబు తామరయె యంట కరంబును తామరంట యిం
తటి విపరీతమున్నె మొలదామరవింటిమి గాని మేనియం
తటనిటు తామరల్గలుగు తన్వి నిజంబుగ దూలగొండియే








కందంలో సినిమాల చందం

-->
కందంలో సినిమాల చందం
(నేటి సినిమాలు తీరుతెన్నులు)
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
/౧౦౬, ప్రేమనగర్, దయాల్ బాగ్ ,ఆగ్రా
నేడు సినీమా అనేది అతి సామాన్యుడికి కూడ అందుబాటులో ఉన్న వినోదసాధనాల్లో ఒకటి. లలితకళలు మానవ జీవితానికి ప్రతిబింబాలు . అవి సహజమైనవి. మనం నిత్యజీవితంలో రోజూ చూసే చెట్లే వసంతకాలంలో ఏవిధంగా నూతనంగా కంపించి ఆనందాన్ని కలగజేస్తాయో అదేవిధంగ జీవితంలో మనకు సహజంగా ఎదురయ్యే సంఘటనలే వెండితెరపై కెక్కి వినోదాన్ని చేకూరుస్తాయి. పూర్వం సినిమాలు సహజంగాను, సమాజానికి మార్గదర్శకంగాను ఉండేవి. ఒక్క సినిమా పెక్కుమంది జీవితాలను మలుపుతిప్పేదిగా ఉండేది. నేనొకసారి రైల్లో ప్రయాణం చేస్తుండగా ఒకాయన పరిచయం అయ్యారు. అనుకోకుండ ఇద్దరికి మాటకలిసింది. ఆయనన్నారు ఏవండి! మాది అనకాపల్లి నేను చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాణ్ణి. తండ్రిగారుపోయారు. ఇంటిలో పూట గడిచే దిక్కులేదు. నేనే పెద్దకొడుకుని. అయినా నేను నాపద్ధతి మార్చుకోలేదు. ఒకరోజున శభాష్ రాముడు సినిమాచూశానండి . దాంతో నాజీవితం మరోమలుపు తిరిగింది. పదింటి దాక ఒక షాపులో పనిచేసేవాణ్ణి .ఆ తరువాత స్కూలుకు వెళ్లే వాణ్ణి . డిగ్రీ పూర్తిచేశాను. నాతమ్ముణ్ణి ఇద్దరు చెల్లెళ్లను కూడ చదివించాను . వాళ్లు ఉద్యోగాలు సంపాదించుకున్నారు . ముగ్గుఱికి పెళ్లిళ్లు కూడ చేశాను. నేడు మా అమ్మ ఆనందానికి అంతు లేదు. ఈ మలుపంతా ఆ ఒక్క సినిమావల్లే జరిగింది సార్ అన్నాడు. అలాగే పాటలు కూడ యువతను ఉత్తేజపరిచే విధంగా ఉండేవి. దీనికి మరో సంఘటన. ఒక యువకుడు ఎంత చదువుకున్నా ఉద్యోగం రాక విసిగి వేసారిపోయి ఆత్మహత్యచేసుకోడానికి సిద్ధం అయ్యాడు. మెడకు ఉరి కూడ బిగించుకున్నాడు. అదే సమయంలో పక్కింటి నుంచి 'ఉందిలే మంచి కాలం ముందు ముందున' అనే పాట రేడియోలో వినిపిస్తోంది. ఎందుకో ఆ పాట అతనిలో జీవితంపై ఆశలు రేకెత్తించింది. వెంటనే ఆత్మహత్యాప్రయత్నం విరమించుకున్నాడు. కాకతాళీయంగా మంచి ఉద్యోగం కూడ వచ్చింది . ఆ వ్యక్తి ఆ పాట రచయితని మనసారా అభినందించడం రచయిత ( బహుశ శ్రీ శ్రీ గారు కావచ్చు) ఆ విషయాన్ని ఒక నిండుసభలో సగర్వంగా చెప్పడం చాల మందికి తెలిసిన విషయమే. కాని నేడు అటువంటి సినిమాలు మచ్చుకు కూడ రావడం లేదు, యువతను ఉద్రేకపరచి తద్వారా కలెక్షన్లు పెంచుకోడానికి హింస, సెక్సు , బూతుపదాలు మోతాదుమించి కనిపిస్తున్నాయి. నిర్మాతల లక్ష్యం కూడ నెరవేరుతోంది. పూర్వం సినిమాల్లో ఎన్నో అనుభూతులుందేవి కాని నేటి సినిమాల్లో ఎన్నెన్నో బూతులుంటున్నాయి . నేటి సినిమాల్లోని అశ్లీలతను గుఱించి ఒక ప్రముఖ కవి, పండితుడు, అవధాని శ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు ఒక కందంలో చాల అందంగ వర్ణించారు.
ఒక జంట. వాళ్లకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమె వాళ్ల నోముల పంట. ఆ గారాల బిడ్డ మెల్లమెల్లగా మాటలు నేర్చుకుంటోంది. ఒక రోజు ' నాన్న! బూతులు కావాలి నాకు బూతులు కావాలి' అని అడిగింది. తండ్రి పిల్ల కోరిక కాదనలేక పోయాడు ఏమీ ఆలోచించలేదు. వెంటనే సినిమాకు తీసుకు పోయాడు సినిమా మొదలయ్యాక 'ఇది కాదు నాన్నా! ఇది కాదు నాన్నా! ' అంది పిల్ల . అప్పుడు వాళ్లమ్మ పిల్ల మాటలు సరిగ్గా అర్థం చేసుకుని బూట్లు కొనిపెట్టిందట.
బూతులు కావలెనని యొక 
 కూతురు తనతండ్రినడుగ కూతున్ సినిమా
చూతువురమ్మనె వినిసతి
బూతులనగ బూటులనియె మురిపెము తోడన్
నేటి సినిమాలు గురించి ఇంతకంటే ఎక్కువగా చెప్పలేమేమో. ఇక సమాజంలో ఒక తప్పుగాని, ఒప్పుగాని జరిగితే చేసినవాడు , చేయించినవాడు, ప్రేరేపించినవాడు ఆ మోదించినవాడు నలుగురూ బాధ్యులే ఔతారు. అలాగే ఇప్పుడు సినిమాలవల్ల జరిగే అనర్థాలకు తీసే దర్శకులు, తీయించే నిర్మాతలు, ప్రోత్సహించే సెన్సార్ సభ్యులు ,ఆమోదించే ప్రేక్షకులు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అందఱు బాధ్యులే ఔతారు.
విషం ఒక్కణ్ణే చంపుతుంది .అలాగే కత్తి కూడ ఒక్కణ్ణే చంపుతుంది. కాని చెడు భావజాలం సమస్తసమాజాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల ఈ సమాజం పూర్తిగా సర్వనాశనం కాకముందే కళ్లు తెరుద్దాం. మంచి నిర్మాతలను, దర్శకులను, ప్రేక్షకులను ప్రోత్సహిద్దాం . సమాజాభివృద్ధికి బంగారు బాటలు వేద్దాం.



गृहे समतला परन्तु पाठशालायां गॊळाकारा एव


गृहे समतला परन्तु पाठशालायां गॊळाकारा एव
डाक्टर् .चिलकमर्ति दुर्गाप्रसादरावु
/१०६, प्रॆम नगर्,
दयालबाग, आग्रा-२८२००५ उ.प्र
कश्चन छात्र: विद्यालये यत् पाठितम् तत् गृहे अपठत् 'भूमि: गॊळाकारा अस्ति' इति| विद्याहीन: तस्य पिता एतत् श्रुत्वा पुत्राय एकां चपेटिकां दत्वा अवदत् ' रे मूर्ख ! भूमि: समतला एव नतु गॊळाकारा| समतलत्वाभावे जना: भूमौ कथं वसॆयु: ? अत: भूमि: समतला एव इति |
पाठशालां गत: पुत्र: अध्यापकॆन पृष्ट: सन् अवदत् 'भूमि: समतला अस्ति' इति | एतत्
श्रुत्वा अध्यापक:नितराम् क्रुद्ध: सन् एकां चपॆटिकां दत्वा ' रे मूर्ख‌!ह्य: मया पाठितं किं विस्मृतं त्वया ? ' भूमि: गोळाकारा एव , न तु समतला' इति पुनरप्यबोधयत् | छात्र: गृहम् आगत्य पुन: पठति 'भूमि: गोळाकारा' इति| पिता पुन: चपेतिकां दत्वा उक्तवान् "भूमि: समतला इति यत् मया उक्तं तत् किं त्वया विस्मृतम् ? इति | छात्र: पाठशालां गत्वा पुन: पठति ' भूमि: समतला अस्ति इति | अध्यापक: पुन: एकवारं चपेटिकां दत्वा उक्तवान् भूमि: गोळकारा इति | तदा मुखस्य उभयपार्श्वत: जायमानां बाधाम् असहमान: छात्र: पठति " भूमि: गृहे समतला परन्तु पाठशालायां गोलाकारा एव इति|