Tuesday, December 17, 2013

లోకం తీరు


లోకం తీరు
(చేట- జల్లెడ)
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.
/౧౦౬, ప్రేమనగర్, దయాల్ బాగ్, ఆగ్రా
చేట జల్లెడ ఈ రెండూ శుభ్రపరిచే సాధనాలే అయినా పని తీరులో తేడా ఉంది. చేట మంచి ఉంచుకుని చెడుని విడిచిపెట్టేస్తుంది. జల్లెడ డానికి విరుద్ధంగా చెడును ఉంచుకుని మంచిని విడిచి పెట్టేస్తుంది. సంఘం మంచిచెడుల మిశ్రమం . అందువల్ల సంఘంలో కూడ ఈ రెండు తరగతులకు చెందిన మనుషులుంటారు.
సజ్జనులు చేటవలె చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరిస్తారు. దుర్జనులు జల్లెడ వలె చెడును ఉంచుకుని మంచిని విడిచిపెట్టేస్తారు. ఈ సమాజంలో చేటల కంటే జల్లెళ్ల సంఖ్యే ఎక్కువని చెప్పవచ్చు. ఎవరినైన తప్పు పడతారు . ఏం చేసినా తప్పు పడతారు. ఒక విధంగా చెప్పాలంటే తప్పులు వెదకడమే వారి లక్ష్యం.
ఒకసారి శివపార్వతులిద్దఱు ఎద్దుమీద కూర్చుని దేశసంచారం చేస్తున్నారు. దారిలో కొంతమంది వారిని చూశారు. వాళ్లల్లో వాళ్లు 'చూశారా! ఎంతవిడ్డూరం. ఎద్దు చాల బక్కగా ఉంది. దాని మీద కూర్చుని ఇద్దఱూ ప్రయాణం చేస్తున్నారు. ఇద్దర్నీ అది ఎలా మోయగలదు. ఒకవేళ మోసినా ఎంతసేపు మోయగలదు? ఆమాత్రం తెలుసుకోవద్దా. దేవతలట దేవతలు వీళ్లేం దేవతలు' .అన్నారు.
ఆ మాటలు శివుని చెవిలో పడ్డాయి. భార్యతో పార్వతీ ! నువ్వు కాసేపు దిగి నడిచిరా అన్నాడు. ఆమె సరే అంది. దిగి నడుస్తోంది. మఱొక చోట మరో కొంతమంది ఎదురుపడ్డారు. వాళ్లల్లో కొందఱు 'ఎంత విడ్డూరమో చూశారా! మగవాడై ఉండి ఆడది, అందులోను కట్టుకున్న భార్య అన్న కనికరం కూడ లేకుండ ఆమెను నడిపిస్తూ దర్జాగా కూర్చున్నాడు. ఈయనేం దేవుడు?' అన్నారు. ఆ మాటలు శివుని చెవులకు ఈటెల్లా గుచ్చుకున్నాయి. 'పార్వతీ ! నువ్వు ఎక్కి కూర్చో నేనే నడుస్తాను' అన్నాడు. ఆమె మహాపతివ్రత అందుకని ఎదురు చెప్పలేక 'సరే' అంది. మరో కూడలిలో ఇంకొంతమంది ఎదురయ్యారు. వాళ్లల్లో కొందఱు 'చూశారా వింతల్లో వింత. మొగుణ్ణి నడిపిస్తూ తాను దర్జాగా కూర్చుని ఊరేగుతోంది. పతివ్రతట పతివ్రత. ఇదేం పాతివ్రత్యం. ఎవరైన నవ్వుతారని సిగ్గుకూడ లేదు . ఛీ ఛీ. స్త్రీ జాతికే తలవంపు, అన్నారు . పాపం! ఆ మాటలు ఆ మహా ఇల్లాలి చెవిలో పడ్డాయి. 'నాథా! నేను దిగుతాను . దయచేసి అనుమతించండి' అంది. 'సరే లే దిగు' అన్నాడు . ఇద్దఱూ మౌనంగా నడుస్తున్నారు. ఎద్దు వారి వెంట నడుస్తో వస్తోంది. మరొక చోట వేరొక గుంపు ఎదురయింది. 'అబ్బబ్బ ఏమి వింత. ప్రక్కన వాహనం ఉండి కూడ నడిచొస్తున్నారు. ఏమి తెలివితేటలు! దాన్ని ఊరికే ఎందుకు నడిపిస్తున్నట్లు . దానికి కాల్లు నొప్పి పుట్టవా. జాలి కూడ లేదు. దేవుళ్లట దేవుళ్లు' అన్నారు . ఈ మాటలు ఇద్దఱి చెవుల్లోను పడ్డాయి. గతుక్కుమన్నారు. ఇద్దఱు తమ రెండు చేతులతో ముందుకాళ్ల నొకరు వెనుకకాళ్లనొకరు ఎత్తి పట్తుకుని మోసుకొస్తున్నారు. అంతలోనే మరో గుంపు ఎదుర య్యింది. 'చూడండి చూడండి వింతల్లోకెల్ల పెద్దవింత . ఎద్దుపై కూర్చుని దర్జాగా రావలసింది పోయి వీళ్లే దాన్ని మోసుకొస్తున్నారు. వీళ్లకి బుర్ర మోకాల్లోకూడ లేదనిపిస్తోంది కదూ!' అన్నారు. ఈ మాటలకు ఇద్దఱూ తట్టుకోలేకపోయారు. వెంటనే మాయమయ్యారు . మఱు క్షణం కైలాసం చేరుకున్నారు. కాబట్టి లోకులు కాకులు . వాళ్లను లెక్కచెయ్యకూడదు.వాళ్లకి భయపడకూడదు. లోకంతీరు చాల చిత్రంగా ఉటుంది. భయపడితే భయపెడుతుంది భయపెడితే భయపడుతుంది. అందువల్ల ఎవరికీ భయపడకుండ ఎవరినీ భయపెట్టకుండ ఒక్క ధర్మానికే భయపడి జీవించాలి. మరి ధర్మం కూడ ఒక్కొక్కప్పుడు సమయాన్ని బట్టి అనేకవిధాలుగా మారుతో ఉంటుంది. అందువల్ల మహాత్ములు ఏమార్గంలో నడిచారో ఆ మార్గాన్ని అనుసరించి ప్రయాణం చెయ్యడమే మనకర్తవ్యం . ఇదే తరుణోపాయం తరణోపాయం కూడ.
మహాజనో యేన గత: స పంథా:

No comments: