Wednesday, December 11, 2013

అదీ మన మంచికే


అదీ మన మంచికే
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
దైన మనమంచికే అనేది ప్రాచీన కాలం నుండి వస్తున్న నానుడి. జీవిత సత్యం . దీనికి సంబంధించిన ఒక కథ మనం తరచుగా వింటూనే ఉంటాం.
పూర్వం ఒక మహారాజు ఉండేవాడు . ఆయన ఒక రోజు మంత్రితో కలసి వేటకు వెళ్లాడు. వేటలో ప్రమాదవశాత్తు ఆయనకు వ్రేలు తెగిపోయింది. మంత్రితో ఆ విషయం చెప్పాడు. దానికి మంత్రి " ఏదైన మన మంచికే మహారాజా! “ అన్నాడు. రాజుకు చాల కోపం వచ్చింది. వ్రేలు తెగి నేను బాధపడుతోంటే అంతా మన మంచికే అంటావా!అని మంత్రిని కారాగారంలో బంధించాడు. కొంతకాలం గడిచింది. మరల ఒకరోజు రాజు ఒంటరిగా వేటకు బయలు దేరాడు. ఒక ప్రదేశంలో కొంతమంది కిరాతకులు రాజును చుట్టుముట్టి బంధించారు. ఆయన్ని అమ్మవారికి బలివ్వడానికి కాళికాలయానికి తీసుకుని వెళ్లారు. శరీరమంతా కలయ జూశారు. రాజుకు ఒకవ్రేలు లేదు. శరీరంలో అన్ని అవయవాలు ఉన్న వాణ్ణే బలిస్తారు గాని ఏ ఒక్క అవయవం లేకపోయిన బలివ్వరు. అది వారి నియమం . అందుకని రాజును ప్రాణాలతో విడిచిపెట్టేశారు.
రాజు ఇంటికి చేరాడు. 'ఏదైన మన మంచి కోసమే' అన్న మంత్రి మాటలు గుర్తుకొచ్చాయి. వేలు లేకపోవడం వల్లనేకదా తనను ప్రాణాలతో వదిలేశారు అనుకున్నాడు. మంత్రిని కారాగారంలో బంధించినందుకు చాల బాధ పడ్డాడు. ఆయన్ని విడిపిస్తూ 'నిన్ను అనవసరంగా బంధించాను నా తొందరపాటుకు నన్ను క్షమించు అని వేడుకున్నాడు.
మంత్రి మహారాజుతో ఓ రాజా! అదీ నా మంచికే అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు అర్థం కాక. రాజా! మీరు నన్ను బంధించకపోతే నేను మీ వెంట వచ్చి ఉండేవాణ్ణి . కిరాతులు మిమ్మల్ని వదిలేసి నన్ను అమ్మవారికి బలిచ్చి ఉండేవారు. అదీ నా మంచికే జరిగింది అన్నాడు.

కాబట్టి ఏదైన మనంచికే అనుకోవడం.
ప్రస్తుతం కొంతమంది వికలాంగులు తమ అంగవైకల్యానికి బాధపడకుండ ఒకరికొకరు ఎలా ధైర్యాన్ని అందించుకుంటున్నారో గమనించండి. . ఒక చోట నలుగురు వ్యక్తులు కలుసుకున్నారు. ఆ నలుగురు వికలాంగులులే . వారిలో ఒకడు గ్రుడ్డివాడు . రెండోవాడు కుంటివాడు. మూడోవాడు చెవిటివాడు. ఇకనాలుగోవాడు మూగవాడు. నలుగురు మిత్రులే. గ్రుడ్ది వాడు కుంటివాడితో అంటున్నాడు. ఒరేయ్ నువ్వు చాల అదృష్ట వంతుడివిరా . నీకు ప్రతి అడ్డమైనవాడి ఇంటికి తిరగవలసిన పని లేదు. కుంటి వాడు గ్రుడ్డివాడితో ఒరేయ్ నువ్వు కూడ చాల అదృష్ట వంతుడివేరా ఎందుకంటే ధనమదంతో విర్రవీగే వాళ్ల మొగం చూడవలసిన పనిలేదు. అలాగే ఒక చెవిటివాడు మూగవాడితో 'నువ్వు చాల ధన్యుడివిరా ఎందుకంటే డబ్బు కోసం ప్రతి పిసినిగొట్టువాణ్ణి పొగడవలసిన దు:స్థితి నీకు లేదు. మూగవాడు సంజ్ఞ చేస్తూ చెవిటివాడితో ఇలా అంటున్నాడు చెవిటితనం నీకు వరంరా ఎందుకంటే నీకు ప్రతి అడ్డమైన వాడి మాటలు వినవలసిన పని లేదు .
(అంధ:)పంగో వంద్య:త్వమసి న గృహం యాసి యోSర్థీ పరేషాం
(పంగు:)ధన్యోంధస్త్వం ధనమదవతాం నేక్షసే యన్ముఖాని
(బధిర:) శ్ల్యాఘ్యో మూక: త్వమసి కృపణం స్తౌషి నాSర్థాశయా య:
(మూక:) స్తోతవ్యస్త్వం బధిర న వచో య: ఖలానాం శృణోషి

No comments: