Sunday, December 15, 2013

కందంలో సినిమాల చందం


కందంలో సినిమాల చందం
(నేటి సినిమాలు తీరుతెన్నులు)
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
/౧౦౬, ప్రేమనగర్, దయాల్ బాగ్ ,ఆగ్రా
నేడు సినీమా అనేది అతి సామాన్యుడికి కూడ అందుబాటులో ఉన్న వినోదసాధనాల్లో ఒకటి. లలితకళలు మానవ జీవితానికి ప్రతిబింబాలు . అవి సహజమైనవి. మనం నిత్యజీవితంలో రోజూ చూసే చెట్లే వసంతకాలంలో ఏవిధంగా నూతనంగా కంపించి ఆనందాన్ని కలగజేస్తాయో అదేవిధంగ జీవితంలో మనకు సహజంగా ఎదురయ్యే సంఘటనలే వెండితెరపై కెక్కి వినోదాన్ని చేకూరుస్తాయి. పూర్వం సినిమాలు సహజంగాను, సమాజానికి మార్గదర్శకంగాను ఉండేవి. ఒక్క సినిమా పెక్కుమంది జీవితాలను మలుపుతిప్పేదిగా ఉండేది. నేనొకసారి రైల్లో ప్రయాణం చేస్తుండగా ఒకాయన పరిచయం అయ్యారు. అనుకోకుండ ఇద్దరికి మాటకలిసింది. ఆయనన్నారు ఏవండి! మాది అనకాపల్లి నేను చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాణ్ణి. తండ్రిగారుపోయారు. ఇంటిలో పూట గడిచే దిక్కులేదు. నేనే పెద్దకొడుకుని. అయినా నేను నాపద్ధతి మార్చుకోలేదు. ఒకరోజున శభాష్ రాముడు సినిమాచూశానండి . దాంతో నాజీవితం మరోమలుపు తిరిగింది. పదింటి దాక ఒక షాపులో పనిచేసేవాణ్ణి .ఆ తరువాత స్కూలుకు వెళ్లే వాణ్ణి . డిగ్రీ పూర్తిచేశాను. నాతమ్ముణ్ణి ఇద్దరు చెల్లెళ్లను కూడ చదివించాను . వాళ్లు ఉద్యోగాలు సంపాదించుకున్నారు . ముగ్గుఱికి పెళ్లిళ్లు కూడ చేశాను. నేడు మా అమ్మ ఆనందానికి అంతు లేదు. ఈ మలుపంతా ఆ ఒక్క సినిమావల్లే జరిగింది సార్ అన్నాడు. అలాగే పాటలు కూడ యువతను ఉత్తేజపరిచే విధంగా ఉండేవి. దీనికి మరో సంఘటన. ఒక యువకుడు ఎంత చదువుకున్నా ఉద్యోగం రాక విసిగి వేసారిపోయి ఆత్మహత్యచేసుకోడానికి సిద్ధం అయ్యాడు. మెడకు ఉరి కూడ బిగించుకున్నాడు. అదే సమయంలో పక్కింటి నుంచి 'ఉందిలే మంచి కాలం ముందు ముందున' అనే పాట రేడియోలో వినిపిస్తోంది. ఎందుకో ఆ పాట అతనిలో జీవితంపై ఆశలు రేకెత్తించింది. వెంటనే ఆత్మహత్యాప్రయత్నం విరమించుకున్నాడు. కాకతాళీయంగా మంచి ఉద్యోగం కూడ వచ్చింది . ఆ వ్యక్తి ఆ పాట రచయితని మనసారా అభినందించడం రచయిత ( బహుశ శ్రీ శ్రీ గారు కావచ్చు) ఆ విషయాన్ని ఒక నిండుసభలో సగర్వంగా చెప్పడం చాల మందికి తెలిసిన విషయమే. కాని నేడు అటువంటి సినిమాలు మచ్చుకు కూడ రావడం లేదు, యువతను ఉద్రేకపరచి తద్వారా కలెక్షన్లు పెంచుకోడానికి హింస, సెక్సు , బూతుపదాలు మోతాదుమించి కనిపిస్తున్నాయి. నిర్మాతల లక్ష్యం కూడ నెరవేరుతోంది. పూర్వం సినిమాల్లో ఎన్నో అనుభూతులుందేవి కాని నేటి సినిమాల్లో ఎన్నెన్నో బూతులుంటున్నాయి . నేటి సినిమాల్లోని అశ్లీలతను గుఱించి ఒక ప్రముఖ కవి, పండితుడు, అవధాని శ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు ఒక కందంలో చాల అందంగ వర్ణించారు.
ఒక జంట. వాళ్లకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమె వాళ్ల నోముల పంట. ఆ గారాల బిడ్డ మెల్లమెల్లగా మాటలు నేర్చుకుంటోంది. ఒక రోజు ' నాన్న! బూతులు కావాలి నాకు బూతులు కావాలి' అని అడిగింది. తండ్రి పిల్ల కోరిక కాదనలేక పోయాడు ఏమీ ఆలోచించలేదు. వెంటనే సినిమాకు తీసుకు పోయాడు సినిమా మొదలయ్యాక 'ఇది కాదు నాన్నా! ఇది కాదు నాన్నా! ' అంది పిల్ల . అప్పుడు వాళ్లమ్మ పిల్ల మాటలు సరిగ్గా అర్థం చేసుకుని బూట్లు కొనిపెట్టిందట.
బూతులు కావలెనని యొక కూతురు తనతండ్రినడుగ కూతున్ సినిమా
చూతువురమ్మనె వినిసతి
బూతులనగ బూటులనియె మురిపెము తోడన్
నేటి సినిమాలు గురించి ఇంతకంటే ఎక్కువగా చెప్పలేమేమో. ఇక సమాజంలో ఒక తప్పుగాని, ఒప్పుగాని జరిగితే చేసినవాడు , చేయించినవాడు, ప్రేరేపించినవాడు ఆ మోదించినవాడు నలుగురూ బాధ్యులే ఔతారు. అలాగే ఇప్పుడు సినిమాలవల్ల జరిగే అనర్థాలకు తీసే దర్శకులు, తీయించే నిర్మాతలు, ప్రోత్సహించే సెన్సార్ సభ్యులు ,ఆమోదించే ప్రేక్షకులు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అందఱు బాధ్యులే ఔతారు.
విషం ఒక్కణ్ణే చంపుతుంది .అలాగే కత్తి కూడ ఒక్కణ్ణే చంపుతుంది. కాని చెడు భావజాలం సమస్తసమాజాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల ఈ సమాజం పూర్తిగా సర్వనాశనం కాకముందే కళ్లు తెరుద్దాం. మంచి నిర్మాతలను, దర్శకులను, ప్రేక్షకులను ప్రోత్సహిద్దాం . సమాజాభివృద్ధికి బంగారు బాటలు వేద్దాం.No comments: