Sunday, May 25, 2014

రెoడూ నిజమే నాన్నా

రెoడూ నిజమే నాన్నా
డా|| చిలకమర్తి దుర్గా ప్రసాదరావు
సుబ్బారావు ఒక  గ్రామంలో మోతుబరి రైతు. తనకు చదువు రాకపోయినా తల్లిలేని తన కొడుకు రాఘవని బాగా చదివించాలనే కోరిక ఉంది. అందువల్ల పొరుగూరిలో మంచి స్కూల్లో సీటు సంపాదించాడు. అక్కడే హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు.  కాలం గడుస్తూ ఉంది. రాఘవ వాళ్ళ నాన్నకి ఉత్తరాలు వ్రాసే స్థాయికెదిగాడు. ఒకనాడు సుబ్బారావుకి రాఘవ దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. తనకు చదువు రాకపోవడం వల్ల ఎవర్నో అడిగి ఉత్తరం చదివిoచుకున్నాడు. ఉత్తరం చివర నేను చాల బాగా చదివిస్తున్నాను నాన్నా అని ఉంది. అది విని విస్తుపోయాడు సుబ్బారావు. ఇదేంటి! చదువుకుంటున్నాను అని వ్రాయడానికి చదివిస్తున్నాను అని వ్రాశాడు. సరేలే! ఎలా వ్రాయాలో సరిగ్గా తెలియక పోవడం  వల్ల  పొరపాటుగా వ్రాసి ఉంటాడని సరిపెట్టు కున్నాడు.
చాల  సంవత్సరాలు  గడిచి పోయాయి. రాఘవకి తాను చదివిన  స్కూల్లోనే టీచరుగా ఉద్యోగం వచ్చింది. సుబ్బారావు ఆనందానికి హద్దులు లేవు. త్వరలో పెళ్లి కూడ చేసేసి బాధ్యతల నుంచి బయటపడాలనుకున్నాడు . ఒక రోజు మళ్ళా కొడుకు దగ్గర నుoచి  ఉత్తరం వచ్చింది. ఉత్తరం చివర బాగా చదువు కుంటున్నాను నాన్న గారు అని వ్రాసుంది. ఈసారి సుబ్బారావుకు నిజంగా మతిపోయింది.   ఇదేంటి ! చదువుకుంటున్న రోజుల్లో బాగా చదివిస్తున్నానని వ్రాస్తే ఎలాగో సరిపెట్టుకున్నాను.  ఇప్పుడు చదువు చెప్పవలసిన రోజుల్లో బాగా చదువు కుoటున్నానని వ్రాస్తున్నాడు . చదివిస్తే ఉన్న మతి పోయిoదన్నట్లు వీడికేం మతి పోలేదు కదా! అసలే పెళ్లి చేసే ఉద్దేశంలో ఉన్నాo   అని ఆందోళన చెందాడు . కొడుకు దగ్గరికి చేరు కున్నాడు. ఏరా! అప్పుడల్లా వ్రాశావు ఇప్పు డిల్లా వ్రాశావు ఏంటి నీ ఉద్దేశం? అనడిగాడు. ఆ రెండు నిజమే నాన్న గారూ! మేము చదువుకుంటున్నప్పుడు నేను, నాతోటి విద్యార్థులు  అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం  కోసం మా గురువులు ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉండేవారు . అందువల్ల నేనప్పుడు వ్రాసింది నిజమే, వాళ్ళని బాగా చదివిoచే వాణ్ణి. ఇప్పుడా స్థితి నాకు దాపురించింది.   పిల్లడిగే ప్రశ్నలకు సమాధానాల కోసం ఇప్పుడు నేను రోజు పుస్తకాలు చదువు కుoటూనే  ఉన్నాను. అందుకే అల్లా వ్రాశాను అన్నాడు. అసలు విషయం  అర్థం చేసుకున్న సుబ్బారావు మనస్సు చల్లబడింది.
ఉపాధ్యాయుడు నిరంతరవిద్యార్థి