Sunday, February 26, 2023

అద్వైతసిద్ధాంతం అనగా ఏమి?

 

2.             అద్వైతసిద్ధాంతం అనగా ఏమి?

మూలం :- శ్రీ శంకరకింకరులు

అనువాదం :-చిలకమర్తి దుర్గాప్రసాదరావు  

ఈ వ్యాసం  ఉపనిషత్తులు , మహాభారతం , స్మృతులు పురాణాల యొక్క సారం కేవలం అద్వైతమే అని వివరిస్తుంది.  శ్రీ శంకరభగవత్పాదులు ఒకచోట “ఇష్యతే(దృశ్యతే) హి సర్వోపనిషదాం సర్వాత్మైక్య ప్రతిపాదకత్వం” అని స్పష్టంగా చెపుతూ  అద్వైతమే అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశంగా భావించారు . ఆయా గ్రంథాల్లో  అక్కడక్కడ  కొన్ని ద్వైతసంబంధమైన వాక్యాలు అనివార్యంగా కనిపిస్తున్నప్పటికీ   గ్రంథతాత్పర్యం మాత్రం అద్వైతప్రతిపాదనమే అని భావించాలి . శ్రీ శంకరులు , మిగిలిన ఆచార్యులు ప్రతిపాదించిన ద్వైతవాక్యాలు అద్వైతబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోడానికి సాధనాలైన  కర్మానుష్ఠానానికి, ఉపాసనకూ, చతుర్విధసాధనలకు సహాయకారులుగా భావించాలని  పేర్కొన్నారు .    అలా కాని పక్షంలో అద్వైత బోధకవాక్యాలు ద్వైత సిద్దాంతంలో పొసగవని, అవి  సమంజసం కావని భావించాలి.

అద్వైత సిద్ధాంటానికి  ప్రధానలక్షణాలు ఈ విధంగా ఉన్నాయి.

1.     బ్రహ్మమే ఆత్మ. అదే సమస్తము , సర్వవ్యాపి . ఆత్మభిన్నమైనదేదీ లేదు.

2.     ప్రపంచమంతా మిథ్య. ఇక్కడ మిధ్య అనగా యథార్థ జ్ఞానం కలిగేవరకు మాత్రమె  ఉండేది, యథార్థజ్ఞానం కలుగగానే తొలగిపోయేదని అర్థం.

3.     మోక్షం జ్ఞానం వల్లనే సిద్ధిస్తుంది.

4.     జీవుడు మరియు బ్రహ్మ ఇరువురు ఒక్కటే . ఒకరికంటే మరొకరు వేఱు కాదు.

5.     బ్రహ్మ నిర్గుణం .

6.     జీవన్ముక్తి అనగా జీవించి యుండగానే ముక్తి పొందగలడం సాధ్యం .

7.     అద్వైతసిద్ధాంతం ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం ,  పారమార్థిక సత్యం అనే మూడు విధాలైన సత్యాన్ని అంగీకరిస్తుంది. పాము త్రాడుగా  కనిపించడం ప్రాతిభాసికసత్యం . పాము పాముగా కనిపించడం వ్యావహారిక సత్యం . పాము చైతన్యంగా దర్శనమివ్వడం పారమార్థిక సత్యం .

8.     హరిహరులకు మధ్య ఎటువంటి భేదం లేదు. ఈ సిదాంతాలు ఏ గ్రంథంలో సంపూర్ణంగా కనిపించినా అది అద్వైతగ్రంథమే.            

                               <><><><>

భగవత్పాద సిద్దాంతంలో శివ విష్ణువుల అభేదం

 

1.                  భగవత్పాద సిద్దాంతంలో శివ విష్ణువుల అభేదం

మూలం :- శ్రీ శంకరకింకరులు

అనువాదం :- చిలకమర్తి .దుర్గాప్రదసాదరావు  

శివనామని భావితేoతరంగే

మహతి జ్యోతిషి మానినీమయార్ధే

దురితాన్యపయాంతి దూరదూరే

ముహురాయాంతి మహంతి మంగళాని

స్మృతే సకలకళ్యాణభాజనం యత్ర జాయతే

పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం  

   శ్రీ శంకరభగవత్పాదులు శివుని, విష్ణువును ఒకే పరమ సర్వేశ్వరునిగా భావించారు . వారిద్దరి  మధ్య ఎటువంటి భేదాన్ని  ఆయన చూపించ లేదు. ఆయన రచించిన సూత్రభాష్యం అలాగే మిగిలిన లఘుగ్రంథాలు  పరిశీలిస్తే  ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. బ్రహ్మసూత్ర భాష్యంలోని   ప్రకృత్యధికరణంలో “ప్రకృతిశ్చప్రతిష్ఠా దృష్టాంతానుపరోధాత్” (1-4-23)   అని  శివుని  ప్రపంచానికి సమవాయకారణంగాను,    నిమిత్త కారణంగాను  వర్ణించడం గమనిస్తాం. అలాగే పాంచరాత్ర అధికరణలో నారాయణుని పరమాత్మునిగా అభివర్ణించారు . 

<><><>