Monday, September 28, 2020

 

శ్రీ జాషువ గారి రచనలలో కృష్ణతత్త్వం

(The nature of Krishna consciousness as depicted in Sri Gurram Joshua’s works)

                                                Dr. DurgaprasadaRao Chilakamarthi

 ఆధునిక కాలానికి సంబంధించిన సుప్రసిద్ధ తెలుగుకవులలో శ్రీగుఱ్ఱ౦ జాషువ గారొకరు . ఆయన కరుణరసాన్ని ఆలంబనగా చేసుకొని కవిత్వాన్ని సృష్టించిన మహనీయులలో ఒకరు. వారెన్నో కావ్యాలు, ఖండకావ్యాలు, నాటకాలు, కవితాఖండికలు, కథలు కూడ రచించారు . కావ్యఖండికలలో ఎంతోమంది పురాణపురుషులను విశ్లేషించారు. ఇక వారు రచించిన రుక్మిణీకళ్యాణ నాటకం ఎంతో ప్రసిద్ధి పొ౦దింది .

 వారి పద్యరచన ఎంతోమంది ప్రాచీనకవుల ధోరణులను, పోకడలను, ఎత్తుగడలను తలపింప చేస్తాయి . వారు రుక్మిణీకళ్యాణ నాటకంలో శల్యసారధ్యం అనే కావ్య ఖండికలో కృష్ణతత్వాన్ని  అలాగే శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని చాల చక్కగా వర్ణి౦చారు . రుక్మిణీకల్యాణంలోని పద్యాలు పోతనగారి పద్యాలను తిక్కన గారి ఎత్తుగడలను మనకు గుర్తుకు తెస్తాయి. 

జాషువ గారి కావ్యాల్లో కృష్ణ తత్త్వాన్ని వర్ణించే పద్యాలు చాల ఉన్నాయి . స్థాలీ పులాకంగా ఒకటి రెండు ముచ్చటించు కుందాం .  రుక్మిణీకల్యాణంలో రుక్మిణి కోరికపై కృష్ణుని  చేరుకున్న అగ్నిద్యోతనుడు తిరిగి రుక్మిణిని చేరుకొని ఆమెకు శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని ఎంత చక్కగా వివరించాడో చూడండి .

 ఎవ్వాని కుక్షిలో నిమిడి యేపారుచు

నుండు నీ బ్రహ్మాండ భాండ మెల్ల

నెవ్వాని పదముల నింపుజనించెనా

గగన సంభూత గంగా భవాని

ఎవనిపొక్కిట జని యించి పెంపు వహించె

నిరుపమజ్ఞాని వాణీధవుండు

నెవడద్భుత స్థితి నెక్కిరింతగ దాల్చె

దళితోరగున్వినతాకుమారు

నెవ్వడవతార దశకంబునెత్తి భువన

సప్తకము నేలుచుండె ప్రాశస్తకీర్తి

నట్టి నారాయణునకర్ధాంగి వగుచు

నేలెదవుగాత మమ్ము శుండాలయాన!  

 ఈరేడు లోకాలు ఆయన కుక్షిలోనే ఇమిడి ఉన్నాయట. ఈరు అంటే రెండు . ఈ రేడు అంటే 2x7=14.  ఈ భువనభా౦డం లో మొత్తం పదునాలుగు లోకాలున్నాయి .  అవి అతల,వితల, సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అనే ఏడూ లోకాలు కింద ; భూలోక , భువర్లోక , స్వర్లోక ,మహర్లోక , జనోలోక తపోలోక , సత్యలోకములనే ఏడూ పై లోకాలు మొత్తం ఈ పదు నాలుగు ఆయన కుక్షిలోనే ఉన్నాయట .  

 పరమపావని గంగాభవాని ఆయన పాదాల నుంచి పుట్టిందట .

సాటిలేని  మేటి జ్ఞాని ,  సకలవిద్యా స౦పన్నుడైన బ్రహ్మ ఆయన   బొడ్డును౦చి  జన్మి౦చాడట .  పాములకు శత్రువైన గరుత్మ౦తుడు ఆయనకు ఎక్కిరి౦త (వాహనం )యట. ఆయన దశావతారములను ఎత్తి ఈ లోకాలను రక్షి౦చున్న మహాను భావుడు .

 మరికటి పరిశీలిద్దాం . ఇది శల్యసారథ్యమనే కావ్యఖండిక లోది. కర్ణునికి రథసారథిగా ఉన్న శల్యుడు అర్జునుని రథసారథియైన కృష్ణుని ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో చూడండి.

 అహి మస్తకముల కొయ్యారంబు నేర్పించు

వలపు పిల్లనగ్రోవి పాటగాడు

పసితనంబునయందె పాముపడగల మీద

చి౦దులాడెడు గొల్ల చిన్నవాడు

పదియారువేల గోపస్త్రీలతో గూడి

యపవాదు నెఱుగని య౦దగాడు

లోకా౦తమున మఱ్ఱియాకు తెప్పందేలి

తలదాల్చుకున్న చిత్రస్వరూపి

 భాసురములైన తన చారెడేసి కనుల

మత్తు జల్లెడు వేలుపుమా౦త్రికుండు

తొడరి యర్జును నరదంబు దోలుచుండె

కాంచి విల్లందుకొనుము భాస్కర కుమార!

 

అయన ఆహిమస్తాకములకు ఒయ్యారం నేర్పించే వలపుపిల్లనగ్రో వి పాటగాడట. పసికందుగా ఉన్నప్పుడే పాము పడగల మీద అందంగా నాట్యం చేసిన సుందరా౦గుడట. పదహారువేల మంది గోపికలతో తిరుగుతున్నా ఎటువంటి అపవాదు లేని యమలిన శృ౦గారమూర్తి . సమస్తప్రపంచం లయమయ్యాక తానొక్కడే మఱ్ఱియాకుపై పరుండి విహరించే చిత్రాతి చిత్రమైన మహనీయుడు . ముగ్ధ మోహనమైన తన చారెడేసి కళ్ళతో జనాల్ని మత్తెక్కించే మాంత్రికుడు . అటువంటి ఆ జగన్మోహనముర్తి అర్జునునికి  సారథి గా ఉన్నాడు . ఓ సూర్యపుత్రా !  బాగా ఆలోచించి యుద్ధానికి బయలుదేరు అన్నాడు.

చేస్తే ఉత్తర సారథ్యం చెయ్యాలి లేదా శల్య సారథ్యం చెయ్యాలి  అని పెద్దలు చెబుతారు . చరిత్రలో ఈ ఇద్దరు  చాల గొప్పవారు. ఎటొచ్చీ ఇద్దరిలోను ఒక ముఖ్యమైన తేడా ఉంది . అదే౦టంటే ఉత్తరుడు యజమానిని ఉత్సాహ పరిస్తే శల్యుడు నిరుత్సాహ పరుస్తాడు . ఆ విషయాలలా ఉంచితే ,ఈ రెండు పద్యాల్లోనూ శ్రీ జాషువ గారు శ్రీ కృష్ణుని తత్త్వాన్ని ఆధి భౌతిక , ఆధి దైవిక , ఆధ్యాత్మిక కోణాల్లో చక్కగా విశ్లేషించి వర్ణించడం మనకి కని పిస్తుంది .   ఈ పద్యాలు చదువుతున్నప్పుడు మనకు శ్రీ కృష్ణుని భౌతిక , దైవిక , ఆధ్యాత్మిక రూపాలు  మనోగోచరమై నిలుస్తాయి. ఈ రోజు జాషువ గారి జయంతి సందర్భంగా ఈ రెండు పద్యాలు మీకు అ౦దజేయ గలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను .