Wednesday, December 11, 2013

ఎలా చూసినా ఆయనే


ఎలా చూసినా ఆయనే
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
కాళిదాసమహాకవి భారతీయకవుల్లోనే గాక ప్రపంచకవుల్లోనే అగ్రగణ్యుడు. ఆయన ఏ కాలానికి లేదా ఏ ప్రాంతానికి సంబంధించినవాడైన ఆయన తన కావ్యాల ద్వార వెలువరించిన భావాలు సార్వకాలికాలు, సార్వదేశికాలున్ను. ఇక కవులలో ఆయనకున్న స్థానాన్ని వివరించే ఒక చమత్కారశ్లోకం మనకొకటుంది .
పురా కవీనాం గణనాప్రసంగే
కనిష్ఠికాధిష్ఠితకాళిదాసా
అద్యాపితత్తుల్య కవేరభావా
దనామికా సార్థవతీ బభూవ
పూర్వం గొప్ప గొప్ప కవులెంతమంది ఉన్నారో తెలుసుకుందామని వ్రేళ్లతో లెక్కించడం మొదలు పెట్టారట . మనకైదు వ్రేళ్లుంటాయి. చిటికెన వ్రేలును( little finger) సంస్కృతంలో కనిష్ఠిక అంటాం. ఉంగరం వ్రేలును (ring finger) అనామికా అంటాం. మధ్యనున్న వ్రేలు( middle finger) మధ్యమ. చూపుడువ్రేలు (index finger) తర్జనీ. బ్రొటనవ్రేలు (thumb) అంగుష్ఠం. సరే చిటికెన వ్రేలుతో లెక్క మొదలయ్యింది. అది కాళిదాసు కైవశం చేసుకున్నాడు. ఇక ఆయనతో సమానులెవరా అని చూస్తే ఎవరూ కనబడలేదట . అందుచేత ఆ తరువాత వ్రేలుకు అనామిక (పేరులేనిది) అనే పేరు సార్థకం అయ్యిందట. ఎంత అద్భుతంగా ఉంది ఈ కల్పన!.
కాని కొంతమందికి లెక్కపెట్టేటప్పుడు చిటికెన వ్రేలునుంచి కాక బ్రొటనవ్రేలు నుంచి లెక్కపెట్టే అలవాటుంటుంది . మరి వాళ్ల సంగతేమిటి? వాళ్లకి కూడ సౌకర్యంగా ఉండడం కోసం మరో అద్భుతమైన శ్లోకం వ్రాశారు ఆంధ్రదేశీయులు, ప్రముఖ కవి, పండితులు కీ||శే|| శ్రీమాన్ అత్తిలి గోపాలకృష్ణమాచార్యులుగారు. అది కూడ ఎంత రమణీయంగ ఉందో చూడండి.
పురా కవీనాం గణనాప్రసంగే
త్వంగుష్ఠికాధిష్ఠితకాళిదాసా
తత్తౌల్యముధ్బావయితృన్ ప్రతర్జ్యా
భూత్తర్జనీ సార్థకనామధేయా
పూర్వం కవుల పేర్లు లెక్కపెట్టడం మొదలెట్టారట. బ్రొటనవ్రేలితో లెక్క మొదలయ్యింది. బ్రొటనవ్రేలు కాళిదాసుకు దక్కిందట. ఇక 'అతనితో నేను సమానం' అని ఎవరైన భావిస్తే వారిని భయపెట్టి చూపుడు వ్రేలు 'తర్జనీ' అని పేరు తెచ్చుకుందట. తర్జయతి అనయా ఇతి తర్జనీ (భయపెట్టేది కాబట్టి తర్జనీ). మనం ఎవరినైన భయపెట్టేటప్పుడు చూపుడు వ్రేలితోనే భయపెడతాం కదా!
కాబట్టి ఎటు చూసినా ఎలా చూసినా కాళిదాసే గొప్పవాడు. కాళిదాసా మజాకా!

No comments: