Thursday, December 12, 2013

నీకు భుక్తి నాకు ముక్తి


నీకు భుక్తి నాకు ముక్తి
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

ఓసదాశివ! నువ్వు బిచ్చగాడివి. భిక్షాటన లేకుంటే నీకు రోజు గడవదు. ఇక వట్టి చేతులూపుకుంటూ చెయ్యి చాపితే ఎవ్వరూ ఏమీ పెట్టరు. ఇది లోక సహజం .ఒక వేళ ఎవరైన ఇంతముద్ద పడేసినా నీ కుటుంబం మొత్తానికి చాలదు. ఎందుకంటే నీ ఇల్లాలు అన్నపూర్ణ సంగతెలా ఉన్నా నీకు ఐదు నోళ్లు. మీరెండో అబ్బాయి కుమారస్వామికి ఆఱు నోళ్లు . ఇక మీపెద్దబ్బాయి సరే సరి. లంబోదరుడు. అందువల్ల ఏదో ఒక కళను ప్రదర్శిస్తేనే సరిపోయే ముద్ద దొరుకుతుంది. అందఱి పొట్ట నిండుతుంది .నీకొక ఉపాయం చెబుతాను. కొంతమంది కోతిని ఆడిస్తూ అందరిని వినోదపరిచి డబ్బు చేసుకుంటూ ఉంటారు. నువ్వు కోతిని వేరే ఎక్కడ నుంచో తీసుకు రావలసిన అవసరం లేదు నాదగ్గరుంది. ఒక పని చెయ్యి. నా 'మనస్సు' ఒక కోతిలాంటిది . దానికి స్థిరం తక్కువ. కోతి అడవుల్లో తిరిగితే నామనస్సనే ఈ కోతి ఎల్లప్పుడు మోహం అనే అడవుల్లో తిరుగుతో ఉంటుంది. ఆ కోతి కొండల్లో సంచరిస్తే నా మనస్సనే ఈ కోతి స్త్రీల పాలిండ్లు అనే కొండల్లోనే ఎప్పుడు సంచరిస్తో ఉంటుంది . ఇది చాల చంచమైనది. తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతో ఉంటుంది. నా స్వాధీనంలో లేదు. దాన్ని అదుపులో ఉంచుకోవడం నాకు సాధ్యం కావడం లేదు. నేను అశక్తుణ్ణి . కాబట్టి ఓ శివా! నువ్వు నా మనస్సు అనే కోతిని నీ భక్తి అనే పగ్గాలతో గట్టిగా బంధించి నీ అధీనంలో ఉంచుకో . ఉపయోగించుకో. నాకూ దాని గొడవ వదలిపోతుంది. నీకూ పని సజావుగా సాగిపోతుంది. నీకు భుక్తి నాకు ముక్తి రెండూ లభిస్తాయి.
సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభిత:
కపాలిన్! భిక్షో! మే హృదయకపిమత్యంతచపలం
దృఢం భక్త్యా బధ్వా భవ భవదధీనం కురు విభో !
( శ్రీ శంకరభగవత్పాదుల శివానందలహరి/ శ్లో. ౨౦)


No comments: