Thursday, May 6, 2021

తెలుగు ‘దార’ – సంస్కృత ‘దార’ by డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

తెలుగు ‘దార’ – సంస్కృత ‘దార’

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ఒకే పదం ఒక భాషలో ఒక అర్థాన్ని చెపితే అదే పదం  మరో భాషలో మరో అర్థాన్ని చెపుతుంది . ఉదాహరణకి  తెలుగులో ‘దార’ అనే పదం దారము ( thread) అనే అర్థంలో కనిపిస్తే సంస్కృతంలో ‘దారా’ అనే పదం భార్య అనే అర్థంలో ప్రయోగి౦పబడుతో౦ది . సంస్కృతంలో లింగ నిర్ణయం శబ్దాన్ని ఆధారం చేసుకుని జరుగుతుంది , అర్థాన్ని బట్టికాదు. జర్మన్ భాషలో కూడ ఇలాగే శబ్దాన్ని అనుసరించే లింగం ఉంటుంది . ఇక సంస్కృతంలో    ఈ దారా శబ్దానికి ఏ శబ్దానికి లేని ఒక ప్రత్యేకత ఉంది . అదే౦టంటే ఇది పు౦లింగంలో ఉంటుంది, నిత్య బహువచనంలో ఉంటుంది . దారా: అనే ఉంటుంది . మనం ఏకపత్నీ వ్రతులమైనా భార్యను ఇతరులకు పరిచయం చేస్తున్నప్పుడు ఇమే మమ దారా: ( ఈమె నా భార్య ) అనాలి. భార్య అనే అర్థం చెప్పడానికి సంస్కృతంలో చాల పదాలున్నాయి ‘పత్నీ’  స్త్రీ లింగంలో ఉంటుంది .  ‘కళత్రం’ నపుంసక లింగంలో ఉంటుంది .     ఇక ‘దారా’ శబ్దం సరేసరి పుంలింగం , నిత్య బహువచనం

సరే ! ఈ విషయం ప్రక్కన పెడదా౦. ఒక సారి ఇంటర్ మీడియేట్ పేపర్లు దిద్దుతున్నాం  . నాకు ఒక bundle పూర్తయింది . అవన్నీ ఒక కట్టగా కట్టాలి . ఆ bundle కి అంతకు ముందు కట్టిన దారం జారి క్రింద పడి పోయింది. అది నాకు కనిపిస్తూనే ఉంది . కాని  దాన్ని తియ్యాలంటే కొంచెం వంగాలి .  నేను బద్ధకి౦చి ప్రక్కనున్న , మరొకరి,   విప్పిన బండిల్ దారాన్ని కడదామని తీయబోయాను . వెంటనే ఒకాయన అయ్యా ! మీరు పరదారాపహరణ చేస్తున్నారు . అని చమత్కారంగా మాట్లాడారు. సమయస్ఫూర్తితో కూడిన ఆయన మాటలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని,  ఆన౦దాన్ని కలిగించాయి . ఉక్కిరి బిక్కిరై పోయాను .  అది విన్న అందరు ఆనందించారు .

దార + అపహరణ =దారాపహరణ =భార్యను అపహరించడం

దార + అపహరణ =దారాన్ని అపహరించడం .

ఈ విధంగా పూర్వం కొంతమంది మాటల్లో స్వారస్యం, ఇతరుల్లో అది గ్రహించే చతురత రెండు ఉ౦డేవి. అవెందుకో క్రమక్రమంగా క్షీణిస్తున్నాయి . కారణం, మంచి సాహిత్యం చదవక పోవడమే అని నాకు అనిపిస్తుంది . మంచి సాహిత్యం చదవుదా౦ .

                                              <<<<<>>>>>        

1 comment:

Unknown said...

సందర్భోచితచమత్కారం బాగుంది.
గొప్ప హాస్యం పుట్టింది..