Friday, April 30, 2021

శివుడు - మూడో కన్ను అర్థం -అంతరార్థం

 

                 శివుడు - మూడో కన్ను

                     అర్థం -అంతరార్థం

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

నేను  చిన్నప్పుడు మూడో తరగతి చదువుతున్నప్పుడు నాకో స్నేహితుడుoడే వాడు . వాడి పేరు సోమేశ్వరరావు. బాల శివ భక్తుడు. ఎప్పుడూ నాతో ఒరేయ్! శివుడు మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచం బూడిదై పోతుందిరా అనేవాడు. నాకపుడు అర్థం అ య్యేది కాదు. ఆయన మూడో కన్ను తెరవడమేoటి ? ప్రపంచం బూడిదవడo ఏమిటి?  అనుకుంటూ ఉండే వాణ్ణి . ఆ తరువాతనే దాని  అర్థం ఆ మాటల తాత్పర్యం తెలిసింది. మూడోకన్ను అంటే జ్ఞాన నేత్రం . అది తెరుచుకుంటే ప్రపంచం లేదు. ఉండదా అంటే ఉ౦ డదనికాదు. కాలిన గుడ్డ మాదిరిగా  ఉన్నట్టు లేనట్లుగా కనిపిస్తుంది. దీన్నే సంస్కృతంలో దగ్ధ పట న్యాయం అంటారు. ఉదాహరణకి ఒక చీరగాని చొక్కా గాని కాలిపోయి౦దనుకో౦డి . అది పైకి చీరగానే గుడ్డగానే కనిపిస్తో ఉంటుంది . కాని కట్టుకోడానికి పనికి రాదు. అలాగే జ్ఞానికి ప్రపంచం అంతా కనిపిస్తుంది కాని ఆ ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు .

పురాణాలు వేదాల యొక్క అర్థాలను సామాన్య జనానికి బోధించడం కోసం ఈ విధంగా వివరించేవి. కాబట్టి మనం అందులో ఉండే తాత్పర్యం గ్రహించి తదనుగుణంగా అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని జ్ఞాని చూస్తాడు , మనం చూస్తాం . ఆ చూపులో ఎంతో తేడా ఉంటుంది. ఆయన ఈ ప్రపంచాన్ని నిర్వికారంగా చూస్తాడు. మనం అలాకాదు. అన్నిటితో సంబంధం పెట్టుకుంటాం . ఇదే చర్మ చక్షువుకి జ్ఞాన చక్షువుకి ఉన్న తేడా.

అందుకే “ దివ్యం దదామి తే చక్షు: “  (నేను నీకు దివ్య నేత్రాన్నిస్తాను )  అన్నాడు  కృష్ణుడు అర్జునినితో. కాబట్టి విజ్ఞుడు పురాణాల్లో చెప్పే ప్రతి అంశాన్ని ఉన్నదున్నట్లుగా కాకుండా విమర్శించి తెలుసు కోవాలి.    

 

    

No comments: