తస్మై శ్రీగురవే
నమ:
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
తాతే రుష్టే నృపస్త్రాతా
నృపే రుష్టే చ దైవతం
దైవే రుష్టే
గురుస్త్రాతా గురౌ రుష్టే న కశ్చన
ఒక తండ్రికి తన బిడ్డమీద
కోపం వచ్చి బయటకు పంపి౦చేస్తే అతన్ని రాజు చేరదీసి రక్షించగలుగుతాడు. ఒక వేళ రాజుకే ఆ వ్యక్తి పట్ల ఆగ్రహ౦ కలిగి శిక్షి౦చాలని ప్రయత్నిస్తే ఆ వ్యక్తిని దైవం రక్షిస్తాడు. సాక్షాత్తు దైవమే ఆ
వ్యక్తిపై కన్నెర్ర చేస్తే అతన్ని గురువు రక్షి౦చగలడు. ఇక స్వయంగా గురువుకే కోపం వస్తే
ఆ వ్యక్తిని రక్షించ గలిగిన వాడు ఈ ముల్లోకాల్లోనూ ఎవడు లేడు. భారతీయసంస్కృతిలో
గురువుకంతటి సమున్నతస్థానం ఉంది. గురువుకంటే గొప్పవారు మరెవరూ లేరు.
ఈ సందర్భంలో మనం ఒకసారి పోతనగార్ని తలుచుకుందాం. భాగవతంలో
రుక్మిణీ-కృష్ణుల మధ్య రాయబారం నడపడానికి
అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు రుక్మిణి కోరికపై కృష్ణుని దగ్గరకొస్తాడు. ఓ కృష్ణ ! ఆ రుక్మిణి నీకు తగిన వధువు. నువ్వు
కూడ నిజంగా ఆ రుక్మిణికి తగిన వరుడవు. మా గురువు గారిమీద ఒట్టేసి చెబుతున్నాను
అంటాడు. “ఆ యెలనాగ నీకు ( దగు
న౦గనకు౦దగుదీవు మా యుపా
ధ్యాయులయాన ”---
ఇక్కడ ఎదురుగా
ఉన్నది సాక్షాత్తు సర్వలోకేశ్వరుడైన కృష్ణపరమాత్మ. ఎవరూ ఆయన కంటే గొప్పవారు కాదు. ఆయనపై ఒట్టేసి చెప్పవచ్చు. కాని ఆయన అలా చెయ్య లేదు. మా గురువుల మీద ఒట్టు అన్నాడు.
దీన్ని బట్టి గురువు దైవం కంటే కూడ
ఉన్నతుడని తెలుస్తోంది. ఇక సమాజంలో ముఖ్యంగా మూడు రకాల గురువులుంటారు.
బహవో గురవ: సంతి
శిష్యవిత్తాపహారకా:
విరళా: గురవ: సంతి
శిష్యచిత్తాపహారకా:
1. శిష్య-విత్త-అపహారకా:
ఈ సమాజంలో శిష్యుల ధనాన్ని అపహరించే గురువులు చాల
ఎక్కువగానే కన్పిస్తారు. వాళ్ళు గురువులు కారు. సమాజానికి బరువులు మాత్రమే. ఒకవేళ వాళ్ళు గురువులుగా చెలామణి
అవుతున్నా వారు బోధగురువులు కాదు . కేవలం బాధగురువులు మాత్రమే.
2. శిష్య – చిత్త- అపహారకా: ఇక శిష్యుల
చిత్తాన్ని అపహ౦రించగల గురువులు చాల తక్కువగా ఉంటారు. ఇక్కడ చిత్తాపహారక: అన్న
చోట రెండు విధాలుగా అర్థం చెప్పుకోవాలి. ఒకటి
చిత్త అంటే చిత్తాన్ని (మనసుని) అపహారకా: అపహరి౦చే వాళ్ళు (ఆకర్షించే వాళ్ళు) అని
అర్థం. శిష్యుల మనస్సును ఆకర్షించే డాక్టర్. సర్వేపల్లి రాథాకృష్ణన్ వంటి మహనీయులు
ఇ౦దుకుదాహరణ.
3. శిష్య- చిత్+తాప-హారకా: శిష్య+చిత్+తాపహారకా: అంటే శిష్యులలో
దాగిన మనస్సు యొక్క తాపాన్ని అంటే
సంసారరూపమైన తాపాన్ని అపహరి౦చే వారు అని
అర్థం. వీరింకా తక్కువగా ఉంటారు.
శిష్యుల హృదయాలలోని సంసారతాపాన్ని రూపుమాపగల శ్రీరామకృష్ణపరమహంస వంటి గురువులు ఇటు
వంటి కోవకు ఉదాహరణ. వీరు చాల చాల తక్కువ సంఖ్యలో ఉంటారు.
ఉపాధ్యాయుడు దేశానికి వెన్నెముక అని డాక్టర్.
సర్వేపల్లి రాథాకృష్ణన్ అభిప్రాయ పడ్డారు.
నిజమే! ఒక ఇంజనీరు అసమర్థుడైతే ఒకటి రెండు
కట్టడాలు కూలిపోతాయి. ఆ తరువాత అతనికి ఏపని అప్పగించరు. దూరంగానే ఉంచుతారు. ఆ నష్టాన్ని ఎలాగో భర్తీ చేసుకోవచ్చు. అలాగే ఒక డాక్టరు అసమర్థుడైతే ఒకరిద్దరు చనిపోతారు. ఆ నష్టం
భర్తీ చేసుకోలేకపోయినా ఆపై జరక్కుండా చూసుకోవచ్చు. ఆ తరువాత ఆయన దగ్గరకెవరూ
వెళ్ళరు. M.D చేసినవాణ్ణైనా మృత్యుదేవతగానే పరిగణిస్తారు. ఇక ఉపాధ్యాయుడు అసమర్థుడైతే ఆ నష్టం వెంటనే కనిపించదు. కొన్ని
తరాలు అంతరిస్తే గాని బయటపడదు. సమాజం రాను రాను దిగజారిపోతుంది. అప్పుడిక
చేయగలిగిందేమీ ఉండదు. అందువల్ల ప్రతి ఉపాధ్యాయుడు రామకృష్ణుని వంటివాడు కాలేక పోయినా
రాథాకృష్ణుని వంటివాడు కాగలగడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రతివారూ అలా ప్రయత్నం
చేస్తే అంత వారు కాలేకపోయినా కొంత ప్రగతి సాధించి ఈ సమాజాన్ని ఉన్నతపథం వైపునకు
నడిపిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రపంచంలో
జ్ఞానం కంటే పవిత్రమైన గొప్పవస్తువేదీ లేదు. న హి జ్ఞానేన
సదృశం పవిత్రమిహ విద్యతే. అధ్యాపకుడు జ్ఞాననిధి, జ్ఞానప్రదాత, జ్ఞానాధిదేవత. అందువల్ల సమాజంలో ఏ సమస్యనైన అధ్యాపకుడు అవలీలగా
పరిష్కరి౦చగలుగుతాడు. రామాయణంలో విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తన వెంట పంపమని ఎంత కోరినా దశరథుడు ఒప్పుకోలేదు. చచ్చినా
పంపించేది లేదని ఖచ్చితంగా
చెప్పేశాడు. బిర్రబిగుసుకుని కూర్చున్నాడు.
అపుడు వసిష్టుడు ఒక్క కనుసైగ చెయ్యగానే కిక్కురుమనకుండా ఒక్క ఉదుటున పంపించేశాడు. అదే గురువులో ఉండే గురుత్వం. అటువంటి మహనీయులు
జాతిని శాసించగలిగిననాడే ఏ జాతికైన
ప్రగతి, పురోగతి కలుగుతాయి. ఎప్పటికైనా అధ్యాపకుడు ఆ స్థాయికి చేరుకోవాలని ఈ
పవిత్రమైన ఉపాధ్యాయదినోత్సవ సందర్భంగా ఆశిద్దాం.
No comments:
Post a Comment