Thursday, September 10, 2015

ఎక్కడున్నావెక్కడున్నావెంకనబాబు ఎక్కడున్నా ఒక్క తూరి ఇలా రా సామి

ఎక్కడున్నావెక్కడున్నావెంకనబాబు
ఎక్కడున్నా ఒక్కతూరి ఇలా రా సామి
(అమాయకుడి ఆర్తగీత౦)
(కవిత)
చిలకమర్తి వేంకట సూర్యనారాయణ
          నరసాపురం

 ఎక్కడున్నా వెక్కడున్నావెంకనబాబు
ఎక్కడున్నా ఒక్కతూరి ఇలా రా సామి
ఎక్కడున్నా వెక్కడున్నావెంకనబాబు
ఎక్కడున్నా ఒక్కతూరి ఇలా రా సామి

1. ఏ దిక్కూ లేనోణ్ణి  నిన్నె మదిని నిలిపినోణ్ణి
   అమ్మ తోడు నీకాడ ఆబద్దం ఆడనయ్య
      మొక్కు లిచ్చు కుందారని ముందె  ఒచ్చి నిలబడ్డా
       ఎండతగులకుండ నన్ను ఏగంగా పంపుసామి        ||ఎక్కడున్నా||

2. నీదయతో వచ్చినావు నిన్నరేతిరీనింది
    పసందైన జున్ను వండి పట్టుకు నిలుచుంటినిచట
   అమ్మలతో దిగివచ్చి కమ్మగ విందారగించు
   నీవు ముందు తినకుండ నేనెవ్వరికెట్టనయ్య
   ఆ సంగతి నీకెరుక ఆలస్యం చెయ్య బోకు  ||ఎక్కడున్నా||

3.  కడుపుమాడుతున్న గాని కళ్లు తిరుగుతున్న గాని
     కదలకుండ  మెదలకుండ కనిపెట్టుకు కూకున్నా
    ఆలస్యం సేయబోకు ఆకలికేనాగలేను
    ఇప్పటికే కళ్ళుతిరిగి ఏమీ కనబడుటలేదు ||ఎక్కడున్నా||

4 . ఎనకెప్పుడొ ఏనుగొకటి ఎండ దెబ్బకాగలేక
    నీళ్లు తాగు దారని ఒక నదిలోదిగి  నిలబడితే
    దాగియున్న ఎదవ మొసలి దానికాలట్టుకుంటె
   బలముతోటి కొన్నాళ్లు పోరాడి అలసి పోయి
   తిండిలేక నీరసించి తేజముడిగి ఏడుస్తూ
   కంఠమెత్తి  కావుమనుచు  గట్టిగ  నిను  కేకేస్తే
  గబగబ పరుగెత్తుకెళ్లి  కాచినాడవంట మున్ను
  ఆ కతలే మున్ను నాకు మాతాతలు  చెబుతుంటే

  మురిసిపోయి నాడె నిన్ను మదిలో నిలిపేసుకున్న || ఎక్కడున్నా ||

No comments: