Wednesday, September 16, 2015

వృధా చెయ్యకు దేన్నీ (waste nothing)

వృధా చెయ్యకు దేన్నీ
waste nothing
శ్రీమతి. చిలకమర్తి లక్ష్మీకుమారి
ఎం.ఏ
   
నిషి తనకున్న వనరులు, కోరికలమధ్య జీవిస్తూ ఉంటాడు. ఎటొచ్చీ వనరులు పరిమితం, కోరికలు మాత్రం అనంతం. ఉన్న వనరులు  వృథా చేయకుండా ఉంటే ఆ వనరులే ఒక  నాటికి ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు డబ్బు,  బట్టలు మొ||  ఇలా మాట్లాడ్డంలో అసలు ఉద్దేశ్యమేoటంటే ఏ వస్తువులు  మనం వృధా చేస్తామో  అవి అవసరసమయాల్లో మనకి  దొరక్కుండా పోతాయి.  అవి నీరు, కాలం, శక్తి, ఆలోచన మొదలైనవి ఏవైనా కావచ్చు. ఆవి వృధా చెయ్యకపోతే  మనకు, మిగతా వారికి కూడ ఉపయోగపడతాయి. సాధారణoగా మనం ఏయే పదార్థాలు వ్యర్థం చేస్తున్నామో ఒక్క సారి ఆలోచిద్దాం.
1.     మొదటిది నీరు  
రోజు మనం లేచిన వెంటనే ఉపయోగించేది నీరు. మనలో చాలమంది నీటిని వృధా చేస్తూ ఉంటారు. పూర్వం నూతులున్న రోజుల్లో  నీరు తోడుకుని వాడుకునే  వారు.  శ్రమ విలువ తెలుసుకుని పొదుపుగా వాడకునే వారు   ఈ కాలంలో కుళాయిలు వచ్చాయి. మనం వాటిని వదిలేసి  ఎంతో నీటిని వృధా చేస్తున్నాం . అందువల్ల నీటి కొరత మనకు ఎదురౌతోoది.   అలాగే కొంతమంది కుళాయి దగ్గర  బకెట్టు పెట్టి  వెళ్లి పోతారు. కొంతమంది  అది నిండినా వెంటనే కట్టకుండా వదిలేస్తారు. ఒక్క చుక్కే కదా అనుకుంటే ఆ చుక్కలన్నీ కలిస్తే ప్రవాహం ఔతు౦ది
2.  రెండోది గ్యాసు
 అలాగే కొంతమంది గ్యాస్ ని  వృధా చేస్తూ ఉంటారు. ష్టవ్వు  మీద  పాలు  పెట్టి  మరిచిపోవడం వలన గ్యాసూ,  దాంతో పాటు పాలు కూడ వృధ అవడం అటుంచి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది.

3 మూడోది విద్యుచ్ఛక్తి    
ఇది కూడ మనం దుర్వినియోగం చేస్తున్నాం . కొంతమంది   బయటికి వెళ్లేటప్పుడు, ఫ్యాన్లు,  లైట్లు  కట్టకుండా వెళ్లిపోతూ ఉంటారు. అలాగే పొరుగూరు వెళ్లేటప్పుడు ఫ్రిజ్  కట్టకుండా వదిలివేయడం  జరుగుతూ ఉంటుంది. మనం  అవసరానికి వినియోగించుకోడం తప్పు కాదు,  కాని జాతీయ వనరులను వృధాచేయడం ఖచ్చితంగా  తప్పు.

4. నాల్గోది నిత్యావసర వస్తువులు
నిత్యావసరవస్తువుల  విషయానికొస్తే మహిళలు కొంతమంది కలసి బజారుకెళ్ళి వస్తువులు కొంటూ ఉంటారు. అక్కడ అందరితో కలసి వెళ్ళడం వల్ల  మిగిలిన వాళ్లని చూసి వాళ్ళు కొన్నారని వీళ్ళు వీళ్ళు కొన్నారని వాళ్ళు అవసరం లేని వస్తువులు కూడ కొనడం జరుగుతోంది. దీని వల్ల  ఒక్కొక్క ఇంట్లో రెండేసి  మిక్సీలు, నాలుగేసి  టి . వి. లు   అలా వస్తువులు పేరుకుపోతున్నాయి. దానివల్ల  ఉన్న ఇల్లు చాలక మరో పెద్ద  ఇల్లు మారవలసిన పరిస్థితులు  కూడ ఎదురౌతున్నాయి.
5. ఐదోది బట్టలు 
మనం బట్టలు కూడ అవసరానికి మించే కొంటున్నా౦. ఫ్యాషన్ల  పేరుతో కనబడిందల్లా కొంటున్నాం. ఫ్యాషన్లు క్షణక్షణం మారుతూనే ఉంటాయి. వాటికి లొంగిపోతే జీవితంలో క్రుంగిపోతాం.  ప్యారిస్ నగరంలో ఒకమ్మాయి చెవి జూకాలు కొనుక్కుని ఇంటికి వేగంగా పరిగెత్తుకుంటు పోతోంది. కొంతమంది ఆమెనాపి ఎ౦దుకంత తొ౦దరగా పరిగెడుతున్నావ్ ? అనడిగారు . ఆమె రొప్పుకుంటూ ఏంలేదు ఇప్పుడే జూకాలు కొనుక్కున్నాను. ఇంటికి వెళ్లేటప్పడికి ఫ్యాషన్ మారిపోతుందని భయంతో పరిగెడుతున్నాను అందట. ఇక బట్టల విషయానికొస్తే ఫ్యాషన్ పేరుతో మనం అవసరానికి మించి కొంటున్నాం . కొన్ని  కట్టుకోకుండానే పెట్టెల్లో పెట్టి బంధిస్తున్నాం. కొన్ని ఒక్కసారే కట్టి వదిలేస్తున్నాం .      
6.  ఆరోది స్టేషనరీ
       పిల్లలు నోట్సు  పుస్తకాలు చాల వాడతారు. ఆ పుస్తకాల్లో  1 లేదా 2 కాగితాలలో వ్రాసి వదిలివేస్తారు. చాల  కాగితాలు వృధా అవుతున్నాయి. అ౦దువల్ల ఒక పుస్తకాన్ని వాడే ముందు ఒక చెట్టును గుర్తుకు తెచ్చుకోవాలి. పొదుపుగా వాడుకోవాలి  ఇక పెన్నులు పెన్సిళ్ళు సంగతి చెప్పనక్కర లేదు .
 7. ఏడోది కాలం
ఇది అతి ముఖ్యమైంది. మిగిలినవి ఎలాగైనా సంపాది౦చుకోవచ్చు.  గడిచిన కాలాన్ని మాత్రం తిరిగి సంపాదించుకోలే౦. అ౦దుకని కాలం  చాల విలువైoదిగా భావించాలి.  అందరూ కలసి పని చేయడం వల్ల, చేయవలసిన పనులన్నీ ఒక చోట వ్రాసుకుని  క్రమబద్ధంగా పని చేయడం వల్ల  తక్కువకాలంలోనే ఎక్కువ పనులు పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది. 
    8. ఎనిమిదోది ఆహారపదార్థాలు
నేటి సమాజంలో ముఖ్యoగా ఆహారపదార్ధాలను వ్యర్ధం చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. ఏ పదార్థాన్నైనా వృథా చెయ్యడం పాపం. ఇక ఆహారపదార్థాలు వృధ చేయడం మహాపాపమే అవుతుంది .ఎందుకంటే అది పండించిన రైతును అవసరమున్న వ్యక్తిని ఇద్దరిని  దోచుకోడమే అవుతోంది.  ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైన  వినియోగించుకొనే హక్కు ఉంది కానీ వ్యర్ధపరిచే హక్కు లేదు. మనలో కొంతమంది ఫేషను పేరుతోనో, గొప్ప కోసమో, తినలేకో, వడ్డించిన వస్తువులను వదిలివేస్తారు.  రైతు ఎంతకష్టపడితే ఒక గింజ వస్తుందో గ్రహించాలి. అలాగే కొన్ని పెద్ద పెద్ద హోటళ్లల్లోవ్యర్దమయ్యే పదార్థాలతో ఒక గ్రామాన్ని పోషించొచ్చు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొన్ని  ఇతరదేశాల్లో ఆహారపదార్థాలు వ్యర్థం చేస్తే  జరిమానా వేస్తారు. అటువంటి చట్టాలు మన దేశంలో కూడ అమలు లోకి రావాలి.  కొన్ని దేశాల్లో ముందు రోజు తయారు  జేసిన, పాడైపోని  ఆహార పదార్థాలు కూడ అందుబాటులో ఉంచుతారట.
ఈ వ్యాసంలో కొన్ని అంశాలు మాత్రమే చెప్పడం జరిగింది . ఇవి గాక  పెట్రోలు మొ|| మరెన్నో అంశాలున్నాయి. ఇక నీరు మొ|| వాటిని  పొడుపు చెయ్యడం వల్ల  నీరు  డబ్బుతో  కొనుక్కునే దుస్థితిని నివారించ వచ్చు. డబ్బు ఆదా చేయడo  వల్ల అవసరానికి అవి ఉపయోగపడతాయి. ఇక చిన్న పిల్లలకి కూడ ఏది వృథా చేయ కుండ  పొడుపు చెయ్యడం  నేర్పాలి. simple living అలవాటు చయ్యాలి.  వ్యక్తి గతమైనపొదుపు, సమష్టి పొదుపు  వలన సంఘానికి లాభం కలుగుతుంది. కరెంటు, గ్యాసు, బట్టలు ఇతరవస్తువులు చివరికి ఆలోచనలు కూడ పొదుపు చెయ్యడం వల్ల జాతీయసంపదలు వృద్ది  చేసుకునే  అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వృధా  చెయ్యడం పాప౦ చెయ్యడమే అవుతుంది. వృధా చెయ్యడం అరికడదాం . దేశాభివృద్ధికి పాటుపడదాం.  



No comments: